న్యూఢిల్లీ: బీమా రంగ పీఎస్‌యూ దిగ్గజం ఎల్‌ఐసీ పబ్లిక్ ఇష్యూకి మార్గం సుగమమైంది. క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ ఇందుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈ ఏడాది ఫిబ్రవరి 13న ఎల్‌ఐసీ దాఖలు చేసిన ముసాయిదా ప్రాస్పెక్టస్‌కు సెబీ తాజాగా ఓకే చెప్పింది. వెరసి దరఖాస్తు చేసిన నెల రోజుల్లోగా ఒక కంపెనీ ఐపీవోకు అనుమతించి రికార్డు సృష్టించింది. దీంతో బీమా దిగ్గజంలో 5 శాతం వాటా విక్రయానికి ప్రభుత్వానికి వీలు చిక్కనుంది. ఎల్‌ఐసీ లిస్టింగ్ ద్వారా ప్రభుత్వం రూ. 63,000 కోట్లకుపైగా సమీకరించే ప్రణాళికల్లో ఉన్న సంగతి తెలిసిందే. తద్వారా ఈ ఆర్థిక సంవత్సరానికి(2021–22) నిర్దేశించుకున్న డిజిన్వెస్ట్‌మెంట్ లక్ష్యం రూ. 78,000 కోట్లను సాధించేందుకు అవకాశమేర్పడింది. అయితే ఉక్రెయిన్‌పై రష్యా దాడుల నేపథ్యంలో ఐపీవో చేపట్టడంపై ప్రభుత్వం పునరాలోచనలో పడినట్లు అధికారిక వర్గాలు ఇప్పటికే తెలియజేశాయి.
పూర్తి వాటా...
ఎల్‌ఐసీలో ప్రభుత్వానికి 100 శాతం(దాదాపు 632.5 కోట్ల షేర్లు) వాటా ఉంది. ఐపీవోలో భాగంగా 5 శాతం వాటా(31.6 కోట్ల షేర్లు)ను విక్రయానికి ఉంచనుంది. ఎల్‌ఐసీ ఉద్యోగులకు, పాలసీదారులకు ఐపీవో ధరలో డిస్కౌంటును ఆఫర్ చేయనుంది. గతేడాది సెప్టెంబర్‌లో కంపెనీ అంతర్గత విలువను మిల్లిమన్ అడ్వయిజర్స్ రూ. 5.4 లక్షల కోట్లుగా మదింపు చేసింది. దీంతో రూ. 16 లక్షల కోట్ల మార్కెట్ విలువను పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. స్టాక్ ఎక్సే్ఛంజీలలో ఎల్‌ఐసీ లిస్టయితే అతిపెద్ద ఐపీవోగా రికార్డు నెలకొల్పనుంది. 2021లో రూ. 18,300 కోట్ల సమీకరణకు వచ్చిన పేటీఎమ్ ప్రస్తుతం అతిపెద్ద ఇష్యూగా నమోదైన విషయం విదితమే. అంతక్రితం 2010లో కోల్ ఇండియా రూ. 15,500 కోట్లు, 2008లో రిలయన్స్ పవర్ రూ. 11,700 కోట్లు సమీకరించడం ద్వారా భారీ ఐపీవోలుగా నిలిచాయి.
ఎల్‌ఐసీ ఐపీవోకు సెబీ ఓకే
Published Thu, Mar 10 2022 4:41 AM | Last Updated on Thu, Mar 10 2022 4:41 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment