
న్యూఢిల్లీ: భారత ప్రభుత్వం మరో నాలుగు ప్రభుత్వ రంగ సంస్థలకు నవరత్న హోదా ప్రకటించింది. ప్రభుత్వ రంగ విద్యుదుత్పత్తి సంస్థలైన నేషనల్ హైడ్రాలిక్ పవర్ కార్పొరేషన్ (ఎన్‌హెచ్‌పీసీ), ఎస్‌జేవీఎన్ (సట్లజ్ జల విద్యుత్ నిగమ్)లకు నవరత్న హోదా దక్కింది. అలాగే, సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎస్‌ఈసీఐ), రైల్‌టెల్‌కు సైతం నవరత్న హోదా లభించింది.
‘‘ప్రభుత్వరంగ సంస్థల విభాగం ఆగస్ట్ 30న ఎన్‌హెచ్‌పీసీని నవరత్న కంపెనీగా ప్రకటించింది. ఇది నిర్వహణ, ఆర్థిక పరంగా స్వయంప్రతిపత్తిని తీసుకొస్తుంది’’అని ఎన్‌హెచ్‌పీసీ తెలిపింది. కంపెనీకి ఇది చరిత్రాత్మకమని ఎన్‌హెచ్‌పీసీ సీఎండీ ఆర్‌కే చౌదరి అభివర్ణించారు.
కంపెనీ ఆర్థిక, నిర్వహణ సామర్థ్యాలకు గుర్తింపు అని పేర్కొన్నారు. ఈ హోదాతో వేగంగా నిర్ణయాలు తీసుకునే అవకాశం లభిస్తుందన్నారు. ఇప్పటి వరకు ఎన్‌హెచ్‌పీసీ మినీరత్న కేటగిరీ–1 కంపెనీగా ఉంది. ఎస్‌జేవీఎన్ సైతం మినీతర్న కేటగిరీ –1గా ఉండడం గమనార్హం.