నేను.. నా స్టేటస్! | Expressing feelings in WhatsApp status | Sakshi
Sakshi News home page

WhatsApp status: వాట్సాప్‌ స్టేటస్‌లో మనోభావాలు వ్యక్తీకరణ

Published Mon, Dec 30 2024 4:35 AM | Last Updated on Mon, Dec 30 2024 1:40 PM

Expressing feelings in WhatsApp status

అక్కడే సూక్తులు, పరోక్షంగా విమర్శనాస్త్రాలు  

అధిక శాతం భక్తి సంబంధిత  విషయాలు పోస్టు 

వ్యాపార ప్రకటనలకు అదే మార్గం  

వ్యక్తిగత ప్రతిభ చాటి చెప్పేందుకు సైతం  

స్టేటస్‌ను విస్తృతంగా వాడుతున్న ప్రజలు

మాట.. పాట.. ఆట..  ఆనందం.. ఆశ్చర్యం.. విషాదం వార్తలు.. విశేషాలు.. వింతలు శుభాకాంక్షలు.. విమర్శలు.. సూచనలు విద్య, ఉద్యోగం.. వ్యాపారం.. పుట్టుక.. పెళ్లి.. చావు.. ఆధ్యాతి్మకం..విహారం.. ఆరోగ్యం.. ఇలా.. అన్నీ ఒకే వేదికపై అందరితో స్మార్ట్‌గా పంచుకుంటున్నారు.  ‘నా స్టేటస్‌.. నా ఇష్టం’.. అంటూరోజూ అందరినీ పలకరిస్తూ సాగిపోతున్నారు. 

కర్నూలు(హాస్పిటల్‌): సమాచారాన్ని ఇచ్చి పుచ్చుకోవడానికి సోషల్‌ మీడియా ఇప్పుడొక వేదికగా మారింది. అందులో ఇటీవల కాలంలో వాట్సాప్‌ యాప్‌లోని ఫీచర్‌ అయిన ‘స్టేటస్‌’ను ఉపయోగించుకుంటున్న వారి సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. ఆధునిక టెక్నాలజీకి అలవాటుపడ్డ ఈ తరుణంలో ‘స్టేటస్‌’లో పోస్టు పెట్టడమనేది ఒక స్టేటస్‌లా భావిస్తున్న వారూ ఉన్నారు. 

ఫేస్‌బుక్, (Facebook) యూ ట్యూబ్, ఎక్స్‌ తదితర మాధ్యమాలు ఉన్నప్పటికీ ఎక్కువగా వాట్సాప్‌ స్టేటస్‌ (WhatsApp status) వేదికగా వాడుకుంటున్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో జనాభా దాదాపు 50 లక్షల వరకు ఉంటుంది. అందులో పిల్లలు మినహాయిస్తే 40 లక్షల వరకు యుక్త వయస్సు నుంచి వృద్ధుల వరకు ఉంటారు. వీరిలో కనీసం 50 శాతం మందికి అంటే 20 లక్షల మందికి స్మార్ట్‌ఫోన్లు అందుబాటులోకి వచ్చాయి. 

దాదాపుగా స్మార్ట్‌ఫోన్‌ (Smart Phone) ఉన్న ప్రతి ఒక్కరూ వాట్సాప్‌ ఉపయోగిస్తున్నారు. వాట్సాప్‌ను ఉపయోగించే వారందరూ స్టేటస్‌లో వారికి నచ్చిన అంశాలను పోస్టు చేస్తూ ఉండటం లేదా చూస్తూ ఉండటం చేస్తున్నారు. ఐదేళ్ల క్రితం వరకు వాట్సాప్‌ యాప్‌ను ఉపయోగించే వారిలో 10 నుంచి 20 శాతం మాత్రమే స్టేటస్‌ ఫీచర్‌ను ఉపయోగించేవారు. ఇప్పుడు 80 శాతం మంది ఈ ఫీచర్‌ను చూస్తున్నట్లు తెలుస్తోంది. కొందరు రోజులో నాలుగైదు సార్లైనా స్టేటస్‌ చూడంది నిద్రపోవడం లేదని సమాచారం. 

వారు పెట్టిన పోస్టును ఎవరు? ఎంత మంది చూశారు? ఎవ్వరైనా ప్రతి స్పందించారా? అని ఆతృతగా వెతికేవారూ ఉన్నారు. ఇలా వారు పెట్టిన పోస్టుకు ఎవరూ స్పందించకపోతే తీవ్ర అసంతృప్తికి గురయ్యే వారూ ఉన్నారు. ఈ క్రమంలో అందుకు అనుగుణమైన సందేశాన్ని కోట్‌ చేస్తూ పోస్టు చేస్తున్నారు. మొత్తంగా  వాట్సాప్‌ స్టేటస్‌లో వారు పోస్టు చేసే దాన్ని బట్టి వారు ఎలాంటి వారు, వారి మనస్తత్వమేమిటో ఇట్టే చెప్పేయవచ్చని మేధావులు అభిప్రాయపడుతున్నారు.  

వ్యక్తిగత ప్రతిభ చాటడానికి...! 
చాలా మంది తమ వ్యక్తిగత ప్రతిభ చాటడానికి స్టేటస్‌ను ఉపయోగించుకుంటున్నారు. ఎందులోనైనా వారు ప్రతిభ సాధించి ఉంటే అప్పటికప్పుడు స్టేటస్‌లో పోస్టు చేస్తున్నారు. లేదా వారి కుటుంబసభ్యుల్లో ఎవరు ప్రతిభ సాధించినా పోస్టు చేస్తున్నారు. 

ఈ పోస్టును చూసిన వారు తప్పక అభినందనలతో ముంచెత్తుతున్నారు. దీనివల్ల మానసికానందం పొందుతున్నారు. ముఖ్యంగా వివాహాది శుభకార్యాలు, వ్యాపారాభివృద్ధి, విద్య, ఉద్యోగాల్లో ప్రతిభ చాటడం, క్రీడల్లో సత్తా చాటడం వంటి అంశాలను స్టేటస్‌లో పోస్టు చేసి వాటిని చూసిన వారి నుంచి ప్రశంసలు పొందుతున్నారు.  

బిజినెస్‌కు వేదికగా..  
వ్యాపారాభివృద్ధికి సోషల్‌ మీడియా కూడా ప్రచార వేదికగా మారింది. అందు­లో అందరూ ఎక్కువగా చూసే వాట్సాప్‌ స్టేటస్‌ను చాలా మంది వ్యాపారు­లు తమ వ్యాపారాభివృద్ధి కోసం ఉపయోగించుకుంటున్నారు. వ్యాపారం గురించి బ్రోచర్లు ముద్రించి స్టేటస్‌లో పోస్ట్‌ చేస్తున్నారు. 

ఆయా వస్తువుల వివరాలు, వాటిలోని ఫీచర్లు, ధర గురించి అందులోనే పోస్టు చేస్తుండటంతో చూసిన చాలా మంది వెంటనే సంబంధిత వ్యక్తికి ఫోన్‌ చేసి వస్తువును కొనుగోలు చేస్తున్నారు.  చాలా మంది అన్ని రకాల వ్యాపారులు వారి వ్యాపార వస్తువులను వాట్సాప్‌ స్టేటస్‌లో పోస్టు చేస్తూ వ్యాపారాభివృద్ధి చేసుకుంటున్నారు.  

దేవుళ్లు.. దేవతలు..  
వాట్సాప్‌ స్టేటస్‌తో చాలా ఉపయోగాలు ఉన్నప్పటికీ 50 శాతం మంది ఏ రోజుకు ఆ రోజు సంబంధిత దేవుళ్ల ఫొటోలు, పాటల వీడియోలు పోస్టు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. వీటిని చూసిన అదే రకమైన వారు ప్రతిస్పందిస్తూ లైక్‌లు, కామెంట్‌లు పెడుతున్నారు. 

మరికొందరు ప్రతిస్పందిస్తూ  సంజ్ఞలు తెలిపే చిత్రాలను పోస్టు చేస్తున్నారు. హిందువులు ఆయా రోజు ప్రత్యేకతను బట్టి దేవుళ్ల గురించి పోస్టు పెడుతున్నారు. ముస్లింలు, క్రిస్టియన్లు అయితే రోజుతో సంబంధం లేకుండా ప్రతిరోజూ వారి మత సంబంధ  కోట్స్‌  పోస్టు చేస్తున్నారు.  

మనోభావాలు వ్యక్తం చేస్తూ..
కొందరు వారి మనోభావాలను తెలియజేసే విషయాలు ఎంపిక చేసుకుని స్టేటస్‌లో పోస్టు చేస్తూ ఆనందిస్తున్నారు. ఇవి వారికి నచ్చిన వారికి మంచిగా, నచ్చని వారికి చెడుగా స్పృశించవచ్చు. ఆ కోట్స్‌ను పోస్టు చేసిన వ్యక్తిని బట్టి ఎవరు ఎలా రిసీవ్‌ చేసుకుంటే అలా కనిపిస్తాయి. 

ఒక విధంగా పోస్టు చేసిన వ్యక్తి మనోభావాలు ఇలా స్టేటస్‌ రూపంలో ప్రతి స్పందిస్తాయనడంలో సందేహం లేదు. చాలా మంది వారికి జరిగిన మంచి, చెడును ఇతరులకు చెప్పేందుకు స్టేటస్‌ను ఆశ్రయిస్తున్నారు. ఇందుకు సంబంధించిన చిత్రాలను పోస్టు చేస్తున్నారు. 

ఇట్లు.. మేము బాగున్నాం..  
ఇప్పుడున్న బిజీ లైఫ్‌లో బంధువులు, స్నేహితులకు కనీసం ఫోన్లు చేసి యోగక్షేమాలు తెలుసుకునే సమయం ఉండటం లేదు. ఏదైనా కార్యక్రమంలో కలిసినప్పుడు హాయ్‌.. బాయ్‌ అన్నట్లుగా ఉంటుంది. కనీసం పిల్లలు, కుటుంబ పరిస్థితుల గుర్తించి అడిగేవారు.. చెప్పేవారు లేరు. ఈ క్రమంలో వాట్సాప్‌ స్టేటస్‌ను ప్రతి ఒక్కరూ చక్కగా ఉపయోగించుకుంటున్నారు. స్టేటస్‌ ఒక లేఖలా మారిపోయింది. 

ఉదాహరణకు ఏదైనా విహార, శుభకార్యాలు, తీర్థయాత్రకు వెళ్లారంటే అందుకు సంబంధించిన ఏ రోజుకు ఆ రోజు ఫొటోలు సమయంతో సహా కుటుంబసభ్యులంతా ఉండే ఫొటోలు పోస్టు చేసి ఆనందిస్తున్నారు. ఆ పోస్టులను చూసిన వారు ఫలానా వారు ఫలానా ఊరికి యాత్రకు వెళ్లినట్లు ఉన్నారని వెంటనే గ్రహిస్తారు. 

మరికొందరు వారికి ఏదైనా చెడు జరిగిందంటే ఉదాహరణకు రోడ్డు ప్రమాదమో లేదా ఇతర ప్రమాదాలు, ఆరోగ్యం బాగాలేకపోయినా వారి స్థితిని తెలియజేస్తే ఇతరుల సానుభూతిని పొందేందుకు పోస్టు చేస్తూ ఉంటారు. ఆ పోస్టు చూసిన వారు అయ్యో వారికి ఆరోగ్యం బాగాలేదా అని తెలుసుకుని స్వయంగా వెళ్లడమో లేదా ఫోన్‌ చేసి పరామర్శించడమో చేస్తున్నారు.  

ఏది పడితే అది పోస్టు చేయకూడదు 
నేను పెట్టే పోస్టులను నా గ్రూపులో ఉన్న 60 నుంచి 70 శాతం మంది చూస్తున్నారు. ఇటీవల వరల్డ్‌ డయాబెటిస్‌ గురించి పోస్టు పెట్టాను. నాకు ఫోన్‌ చేసి షుగర్‌ గురించి వారికున్న సందేహాలను అడిగి నివృత్తి చేసుకున్నారు. అలాగే గంటలకు పైగా సైక్లింగ్‌ చేసిన తర్వాత కలిగిన అనుభవం గురించి పోస్టు చేశాను.

సైక్లింగ్‌ వల్ల లాభాల గురించి ఎంతో ఆసక్తిగా అడిగి తెలుసుకున్నారు. చూస్తున్నారు కదా అని ఏది పడితే అది పోస్టు చేయకూడదు. అవగాహనతో చాలా జాగ్రత్తగా ఎంపిక చేసుకుని పోస్టు చేయాలి.    
– డాక్టర్‌ ఎం. శ్రీకాంత్‌రెడ్డి, డయాబెటాలజిస్టు, కర్నూలు

ప్రజల్లో అవగాహన పెంచడానికే.. 
ఇటీవల కాలంలో యూట్యూబ్, ఫేస్‌బుక్, ఇన్‌స్ట్రాగామ్‌ లాంటి సోషల్‌ మీడియాల్లో కొందరు వ్యక్తులు వారికి అర్హత లేకపోయినా ఆరోగ్యం గురించి పలు రకాల పోస్టులు పెట్టి ప్రజలను గందరగోళానికి గురిచేస్తున్నారు. ఇలాంటి వారికి ఆరోగ్యం పట్ల అవగాహన కల్పించేందుకు గాను ఒక డాక్టర్‌గా బాధ్యత తీసుకుని నిజమైన సమాచారాన్ని ప్రజలకు అందించేందుకు ‘స్టేటస్‌’లో పోస్టులు పెడుతున్నాను. 

నేను నూతన విధానాల్లో చేసిన సర్జరీలు, విదేశాల్లో ఉన్న ఆధునిక వైద్య విధానాలు, మన దేశాల్లో రావాల్సిన ఆవశ్యకత, వివిధ రకాల జబ్బుల గురించి వివరిస్తూ పోస్టులు పెడుతున్నాను.    
– డాక్టర్‌ వసీం హసన్‌ రాజా, సర్జికల్‌ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్టు, కర్నూలు 

వ్యాపార ప్రచారానికి ఉపయోగపడుతోంది 
నేను వ్యాపారవేత్తను. వాట్సాప్‌ స్టేటస్‌లోనూ పోస్టులు పెడుతున్నా­ను. దీనికి మంచి స్పందన వస్తోంది. నేను చేస్తున్న స్కూళ్లు, కాలే­జీలు, కోచింగ్‌ సెంటర్లు, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారాల గురించి పోస్టు­లు పెట్టాను. ఇటీవల రియల్‌ ఎస్టేట్‌ పోస్టులు స్టేటస్‌లో చూసి కొందరు క్లయింట్‌లు మావద్దకు వచ్చి కొనుగోలు చేశారు. 
– పి. గోవర్దన్‌రెడ్డి, వ్యాపారి, కర్నూలు  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement