
నిలువెత్తు అన్యాయం
– రైతుల పొలాల్లో ఇష్టారాజ్యంగా విద్యుత్ టవర్ల నిర్మాణం
– బ్రిటిష్ కాలం నాటి చట్టాల పేరుతో స్థల సేకరణ
– విద్యుత్ సంస్థల తీరుతో భారీగా నష్టపోతున్న రైతులు
– ఇతర జిల్లాల్లో పరిహారం.. ‘అనంత’లో మాత్రం అన్యాయం
(సాక్షి ప్రతినిధి, అనంతపురం)
విద్యుత్ టవర్ల ఏర్పాటులో రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతోంది. బ్రిటీష్‌కాలం నాటి చట్టాలను సాకుగా చూపి పవర్‌గ్రిడ్ సంస్థలు రైతుల నోట్లో మట్టికొడుతున్నాయి. రైతుల నుంచి ఎలాంటి అనుమతి తీసుకోకుండానే ఇష్టానుసారంగా టవర్ల నిర్మాణానికి ఉపక్రమిస్తున్నాయి. ఒక్కో టవర్ నిర్మాణంతో ప్రతి రైతు రూ.3.50 లక్షల నుంచి రూ.4.50 లక్షల వరకు నష్టపోతున్నారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2013 నాటికే దాదాపు తొమ్మిది లక్షల కిలోమీటర్ల్ల దూరం ఉండే విద్యుత్‌తీగల కోసం స్తంభాలు, టవర్లు ఏర్పాటు చేశారు. ఇవికాక దేశ వ్యాప్తంగా కేంద్ర పవర్‌గ్రిడ్ సంస్థ ఏటా వేలాది టవర్లను నిర్మిస్తోంది. ఎక్కడా రైతులకు సరైన పరిహారం ఇవ్వడం లేదు. ప్రస్తుతం అనంతపురం జిల్లాలో 620, 400 కేవీ విద్యుత్ టవర్లను పవర్‌గ్రిడ్ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తోంది. వీటి కారణంగా ఎంతోమంది రైతులు భూములు కోల్పోతున్నారు. జిల్లాలో మూడేళ్లుగా టవర్ల నిర్మాణం సాగుతున్నా.. ఎవరికీ పరిహారం ఇవ్వకపోవడం గమనార్హం.
నోటీసుల్లేవు.. అనుమతులూ లేవు
కేంద్ర ఎలక్ట్రిసిటీ యాక్టు–2003 రూల్ 31(ఏ) కింద ట్రాన్స్‌మిషన్ కంపెనీ టవర్ నిర్మించాల్సి వస్తే మొదట కలెక్టరును కలవాలి. మార్కెట్‌రేటు, రైతు సాగు చేసిన పంట, నష్టం వాటిల్లే వివరాలను పరిగణనలోకి తీసుకుని కలెక్టర్ పరిహారం మొత్తాన్ని నిర్ణయిస్తారు. ఆ మేరకు రైతుకు చెల్లించి టవర్ నిర్మాణానికి ఉపక్రమించాలి. కానీ పవర్‌గ్రిడ్ కార్పొరేషన్ ఈ నిబంధనలను తుంగలో తొక్కుతూ పొలాల్లో ఇష్టారాజ్యంగా టవర్ల నిర్మాణం చేపడుతోంది. జిల్లాలో 2003 నుంచి భూములకు నష్టపరిహారం పొందనివారు, తక్కువ పరిహారంతో నష్టపోయిన వారు ఎంతోమంది ఉన్నారు.
ప్రస్తుతం ఏపీ ట్రాన్స్‌మిషన్ కార్పొరేషన్‌తో పాటు నేషనల్ పవర్ గ్రిడ్ కార్పొరేషన్ తాడిపత్రి, పెద్దపప్పూరు, పెద్దవడుగూరు, పామిడి, వజ్రకరూర్, ఉరవకొండ మండలాల్లో 620, 420 కేవీ టవర్ల నిర్మాణం చేపడుతున్నాయి. దీంతో రైతులు 8, 200 ఎకరాలు నష్టపోయే ప్రమాదముంది. పంట నష్టం జరిగితే రూ.25 వేల చొప్పున పరిహారం ఇచ్చి.. చేతులు దులిపేసుకోవడం మినహా చట్టం ప్రకారం రైతులకు దక్కాల్సిన పరిహారాన్ని అందజేయడం లేదు.
నిబంధనల ప్రకారం పరిహారం ఇలా..
ప్రధాన రహదారి పక్కనున్న పొలాలైతే గజానికి వెయ్యి , రోడ్డుకు దూరంగా ఉంటే గజానికి రూ.100 చొప్పున పరిహారం చెల్లించాలని పాత నిబంధనలున్నాయి. అలాగే ఒక టవర్ నుంచి మరో టవర్ వరకూ విద్యుత్ తీగలు వెళ్లే స్థలానికి కూడా మీటరుకు రూ.65 చొప్పున చెల్లించాలని ఉంది. అయితే.. ఇది చాలా తక్కువని 2009లో తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా రైతులు కోర్టును ఆశ్రయించారు. దీంతో హైవేకు అర కిలోమీటరు దూరంలో ఉంటే ఒక్కో టవర్ ఏర్పాటుకు రూ.3.50 లక్షల (350 చదరపు అడుగులు) నుంచి రూ.4.50 లక్షల (350 చదరపు అడుగుల కంటే ఎక్కువ) వరకు ఇవ్వాలని కోర్టు తీర్పు ఇచ్చింది.
అలాగే ఇతర పొలాలు, స్థలాల్లో టవర్ ఏర్పాటుకు రూ.2.45 లక్షల నుంచి రూ.3.15 లక్షల వరకు ఇవ్వాలని ఆదేశించింది. ఈ మేరకు పరిహారాన్ని కృష్ణా, గుంటూరు, నెల్లూరు జిల్లాల్లో ఇస్తున్నారు. తెలంగాణలోని వరంగల్, నల్గొండ జిల్లాల్లోనూ ఇచ్చారు. ఒక్కో టవర్ నిర్మాణానికి 20 టన్నుల ఇనుము వినియోగిస్తారు. నిర్మాణప్రాంతంలో పండ్లతోటలు, ఇతర పంటలు ఉంటే టవర్ సామగ్రి తీసుకెళ్లే సమయంలో వాటికి నష్టం వాటిల్లుతుంది. ఈ పరిహారాన్ని అదనంగా చెల్లించాలి. అలాగే టవర్ చుట్టూ వెయ్యి చదరపు అడుగులు పంట సాగుకు అనుకూలంగా ఉండదు. దీన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలి. టవర్ నిర్మాణం తర్వాత చుట్టూ కిలోమీటర్ మేర పొలాల విలువ గణనీయంగా తగ్గుతుంది. లైన్‌సౌండ్, ఎలక్ట్రికల్ షాక్‌తో పాటు ప్రమాదాలకు భయపడి గోదాములు, పరిశ్రమల స్థాపనకు ఎవ్వరూ ముందుకు రారు. దీంతో పరిహారం పంపిణీలో రైతులకు కచ్చితంగా మేలు జరిగేలా కలెక్టర్ చర్యలు తీసుకోవాలని 2003 యాక్టులో ఉంది.
బ్రిటీష్ చట్టం చాటున అన్యాయం
టవర్ల నిర్మాణం కోసం స్థలాల స్వాధీనానికి బ్రిటీష్ పాలకులు 1885లో తెచ్చిన ‘భారతీయ టెలిగ్రాఫ్ చట్టం’ ప్రకారం తమకు అధికారాలున్నాయని విద్యుత్ సంస్థలు ప్రకటనలు జారీ చేస్తున్నాయి. పాత నిబంధనల ప్రకారమే టవర్ల నిర్మాణానికి ఉపక్రమిస్తున్నాయి. 1885 టెలిగ్రాఫ్ చట్టం సెక‌్షన్–35లో ఎలక్ట్రిసిటీ యాక్టు–164 ప్రకారం పోల్స్ నిర్మించాలి. ఇవి టవర్లు కావు. రైల్వేలైను పోల్స్ తరహాలో ఉంటాయి. వీటికి గట్ల మధ్యలో ఒకే పోల్ ఉంటుంది. పోల్ పైభాగంలో 10 అడుగుల వెడల్పుతో కమ్మీలు అమర్చి తీగలను లాగుతారు. కానీ ఈ తరహా విధానాన్ని పాటించడం లేదు. అయినా పరిహారం విషయంలో మాత్రం ఈ చట్టాన్ని పరిగణనలోకి తీసుకుంటున్నారు. నిజానికి రైతు సంఘాలు కూడా టవర్ల స్థానంలో టెలిగ్రాఫ్ పోల్స్ నిర్మించాలని ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నాయి. అయినా ప్రభుత్వాలు దృష్టి సారించడం లేదు.
పరిహారంపై ధర్నాకు సిద్ధం - తరిమెల శరత్‌చంద్రారెడ్డి, రైతు సంఘాల సమాఖ్య అధ్యక్షుడు
టవర్ల నిర్మాణంలో రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతోంది. పరిహారం కోసం కోర్టులను ఆశ్రయిస్తున్నాం. కొంతమేర పరిహారం దక్కింది. అయితే నేషనల్ పవర్‌గ్రిడ్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో చేపట్టే వాటికి పరిహారం ఇవ్వడం లేదు. దీనిపై రైతులు, రైతు సంఘాలతో చర్చించి ధర్నా చేపడతాం.