ఖాళీ చేయండి!
- ప్రైవేట్ బిల్డింగ్‌లలోని ప్రభుత్వ కార్యాలయాలకు యజమానుల నోటీసులు
- ఎక్కువ అద్దెలు చెల్లిస్తున్న ప్రైవేట్ సంస్థలు
- దిక్కుతోచని స్థితిలో అధికారులు
విజయవాడ: నవ్యాంధ్రప్రదేశ్‌కు తాత్కాలిక రాజధానిగా విజయవాడను ప్రకటించిన ప్రభుత్వం ఒకవైపు అన్ని శాఖల కార్యాలయాలను తరలించేందుకు ప్రయత్నిస్తోంది. మరోవైపు ఇక్కడ ప్రైవేటు భవనాల్లో ఉన్న ప్రభుత్వ కార్యాలయాలను ఖాళీ చేయించే పనిలో యజమానులు నిమగ్నమయ్యారు. ఉన్నవాటినే ఎక్కడ పెట్టాలో తెలియడం లేదని, ఇక కొత్త కార్యాలయాల సంగతి సరేసరి అని అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు.
విజయవాడ కేంద్రంగా రాజధాని ఉంటుందని దాదాపు ఖరారు కావడంతో ఎక్కువ అద్దెలు ఇచ్చే కార్పొరేట్ సంస్థలకు తమ భవనాలను లీజుకు ఇచ్చేందుకు యజమానులు ముందుకొస్తున్నారు. ఈ క్రమంలో తక్కువ అద్దెలు చెల్లించే ప్రభుత్వ కార్యాలయాలను ఆరు నెలల్లో ఖాళీ చేయాలని నోటీసులు జారీ చేస్తున్నారు. దీంతో విజయవాడతోపాటు అన్ని మున్సిపాలిటీల్లో పలు ప్రభుత్వ కార్యాలయాలు రోడ్డునపడే పరిస్థితి నెలకొంది.
విభజన తర్వాత డిమాండ్
రాష్ట్ర విభజన తర్వాత విజయవాడలో అద్దెలకు ఇచ్చే ఇళ్లకు డిమాండ్ భారీగా పెరిగింది. గతంలో సగటున అద్దెకు ఇచ్చేవారు. ఇప్పుడు ప్రభుత్వ కార్యాలయాలకు అడుగుల చొప్పున అద్దెలు చెల్లించాలని కోరుతున్నారు. ప్రభుత్వ కార్యాలయాలకు విజయవాడలో చదరపు అడుగుకు రూ.7 అద్దె చెల్లిస్తున్నారు. మచిలీపట్నం, గుడివాడ, గన్నవరం, నూజివీడు, నందిగామ, జగ్గయ్యపేట, ఇబ్రహీంపట్నం, ఉయ్యూరు తదితర ప్రాంతాల్లో రూ.5 నుంచి రూ.7 వరకు చెల్లిస్తున్నారు. ప్రైవేటు కార్యాలయాలు మాత్రం రూ.30 నుంచి రూ.50 వరకు ఇస్తున్నాయి.
ఈ క్రమంలో ప్రభుత్వ కార్యాలయాల అద్దెను కూడా చదరపు అడుగుకు రూ.30కి పెంచాలని భవన యజమానులు డిమాండ్ చేస్తున్నారు. కానీ, ప్రభుత్వ నిబంధనల ప్రకారం రూ.7కు మించి చెల్లించే పరిస్థితి లేదు. దీంతో జిల్లావ్యాప్తంగా అద్దె భవనాల్లో ఉన్న కార్యాలయాలను ఖాళీ చేయాలని యజమానులు ఒత్తిడి చేస్తున్నారు. ఈ మేరకు విజయవాడలోని పలు కార్యాలయాలకు నోటీసులు కూడా అందాయి. గురునానక్ కాలనీలో ఉన్న స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ శాఖ కార్యాలయం, డీఆర్ కార్యాలయాలకు ఖాళీ చేయాలని నోటీసులు అందాయి.
అద్దె భవనాల్లోనే 52 శాఖల కార్యాలయాలు!
నగరంలో 52 ప్రభుత్వ శాఖలకు సంబంధించిన 500 నుంచి 600 వరకు కార్యాలయాలు అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయి. సబ్-రిజిస్ట్రార్, వాణిజ్య పన్నుల శాఖ, సాంఘిక సంక్షేమ శాఖ వసతి గృహాలు, దేవాదాయ శాఖ కార్యాలయాలు, రెవెన్యూ, ఇరిగేషన్, రవాణా, ఆర్ అండ్ బీ, పంచాయతీరాజ్, జాతీయ రహదారుల శాఖలకు సంబంధించిన కార్యాలయాలు అద్దె భవనాల్లోనే నిర్వహిస్తున్నారు. కొన్ని కార్యాలయాలకు రూ.3లక్షల వరకు అద్దె చెల్లిస్తున్నారు.
వాణిజ్య పన్నుల శాఖ-1, 2వ డివిజన్‌ల కార్యాలయాలకు రూ.3లక్షలకు పైగా అద్దె చెల్లిస్తున్నారు. వాణిజ్య పన్నుల శాఖ బెంజిసర్కిల్, సీతారామపురం, కృష్ణలంక, భవానీపురం కార్యాలయాలకు రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు అద్దె ఇస్తున్నారు. ఆయా శాఖల కార్యాలయాలు మచిలీపట్నం, గుడివాడ, ఉయ్యూరు, నందిగామలలో కూడా అద్దె భవనాల్లోనే నిర్వహిస్తున్నారు. ఎక్కువ శాతం ప్రభుత్వ కార్యాలయాలు నిర్వహిస్తున్న భవనాలు రాజకీయ నాయకులవే కావడంతో ఖాళీ చేయించేందుకు ఒత్తిడి చేస్తున్నట్లు తెలుస్తోంది.
అద్దె భవనాల కోసం తిరుగుతున్న అధికారులు
తమ కార్యాలయాలకు భవనాల కోసం విజయవాడతోపాటు అన్ని మున్సిపల్ కేంద్రాల్లో అధికారులు వెదుకులాట ప్రారంభించారు. హాస్టళ్లకు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. కాస్త పెద్ద ఇళ్లు, భవనాలు కనిపిస్తే అద్దెకు ఇస్తారా.. అంటూ ఆరా తీస్తున్నారు. అయితే యజమానులు మాత్రం ప్రభుత్వ కార్యాలయాలకు అద్దెకు ఇచ్చేందుకు ముందుకురావటం లేదు.