Navyandhraprades
-
ప్యాకేజీలు కాదు.. ప్రత్యేక హోదా కావాలి
నవ్యాంధ్రప్రదేశ్‌కు ప్యాకేజీలు వద్దని, ప్రత్యేక హోదా కావాలని పలువురు వక్తలు డిమాండ్ చేశారు. సీపీఐ నగర సమితి ఆధ్వర్యంలో గాంధీనగర్‌లోని చాంబర్ ఆఫ్ కామర్స్ కార్యాలయంలో శనివారం జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో ప్రత్యేక హోదాపై గళమెత్తారు. - హామీల సాధన కమిటీ ఎన్నిక మధురానగర్ : నవ్యాంధ్రప్రదేశ్‌కు ప్యాకేజీలు వద్దని ప్రత్యేక హోదా కావాలని వైఎస్సార్సీపీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ పి. గౌతమ్‌రెడ్డి డిమాండ్ చేశారు. గాంధీనగర్‌లోని చాంబర్ ఆప్ కామర్స్ హాలులో సీపీఐ నగర సమితి ఆధ్వర్యంలో రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలని దోనేపూడి శంకర్ అధ్యక్షతన రౌండ్‌టేబుల్ సమావేశం జరిగింది. గౌతమ్‌రెడ్డి మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిద్ర నటిస్తున్నాయని నిద్రపోయేవారిని లేపవచ్చని నటిస్తున్నవారిని లేపలేమన్నారు. ప్రత్యేక హోదావస్తే పన్నుల్లో భారీగా రాయితీలు లభిస్తాయన్నారు. నెలకు మూడు వేలు సంపాదించేవారు సైతం ప్రశాంతంగా జీవించే అవకాశం ఉంటుందన్నారు. కేంద్రం వెనుకబడిన ప్రాంతాలకు కేటాయించిన 500 కోట్లను చంద్రబాబు ప్రభుత్వం పట్టిసీమ ఎత్తిపోతల పథకానికి మళ్లించడం సిగ్గుచేటన్నారు. టీడీపీ కేంద్రమంత్రులు వెంటనే రాజీనామా చేసి తెలుగువారి ఆత్మగౌరవాన్ని కాపాడాలని డిమాండ్ చేశారు. అనంతరం మాజీ మంత్రి దేవినేని నెహ్రూ, లోక్‌సత్తా నగర అధ్యక్షుడు అశోక్‌కుమార్, విజయవాడ చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు వక్కలగడ్డ భాస్కరరావు, చాంబర్ ప్రతినిధి పొట్లూరి భాస్కరరావు, లారీ ఓనర్స్ అసోసియేషన్ నేతలు కోనేరు రమేష్, ఈశ్వరరావు, పెనుమత్స సత్యనారాయణ రాజు, ఓల్గా ఆర్చరీ అకాడమీ అధినేత చెరుకూరి సత్యనారాయణ, డెల్టా పరిరక్షణ సమితి కన్వీనర్ కొలనుకొండ శివాజీ, సీపీఐ నగర సహాయ కార్యదర్శి జి. కోటేశ్వరరావు, పోతిన రాము, ఎస్వీ గ్రిటన్ వివిధ సంఘాల ప్రతినిధులు ప్రసంగించారు. అనంతరం ప్రత్యేక హోదా విభజన బిల్లులోని హామీల సాధనకమిటీను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కమిటీ గౌరవాధ్యక్షుడిగా వక్కలగడ్డ భాస్కరరావు, అధ్యక్షుడిగా ఎంసీ దాస్, ప్రధాన కార్యదర్శిగా దోనేపూడి శంకర్ ఎన్నికయ్యారు. -
చిత్తూరుపై శీతకన్ను!
సాక్షి, చిత్తూరు: జిల్లాలో తిరుపతి, చిత్తూరు రెండు కార్పొరేషన్లు. వీటిలో పాతికేళ్ల కిందట నుంచే తిరుపతి అభివృద్ధి చెందుతోంది. అప్పటికే శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం, రుయా ఆస్పత్రి, ఎస్వీ మెడికల్ కాలేజీతో పాటు పలు రంగాల్లో అభివృద్ధి బాటలో పయనించింది. ఏడుకొండలవాడి సన్నిధి కావడంతో తిరుపతి అభివృద్ధి వేగంగా జరుగుతోంది. పాతికేళ్లకు...ఇప్పటికీ తిరుపతిలో ఎంతో తేడా ఉంది ! కానీ జిల్లా కేంద్రమైన చిత్తూరు మాత్రం అప్పటికి ఇప్పటికీ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అనే చందంగా అభివృద్ధిలో చాలా వెనుకబడి ఉంది. చిత్తూరుకు కార్పొరేషన్ హోదా దక్కడం మినహా పరిశ్రమలు, విద్యాసంస్థల ఏర్పాటుకు ప్రభుత్వాలు ఊతం ఇవ్వలేకపోయాయి. దశాబ్దాలుగా చిత్తూరు నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న ప్రజాప్రజాప్రతినిధులూ నగర మంచినీటి సమస్య తీర్చలేకపోయారు. కొత్తరాష్ట్రంలో కూడా పాత ఆలోచనలే నవ్యాంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈ జిల్లా నుంచే ప్రాతి నిథ్యం వహిస్తున్నారు. ఇటీవల రాజధాని ప్రకటన నేపథ్యంలో 13జిల్లాల అభివృద్ధికి సమగ్ర ప్రణాళిక ప్రకటించారు. అందులో చిత్తూరు జిల్లాకు సంబంధించి తిరుపతి ఎయిర్‌పోర్టును అంతర్జాతీయ విమానాశ్రయంగా అభివృద్ధి చేస్తామని తెలిపారు. కుప్పంలో కొత్తగా ఏయిర్పోర్టు స్థాపిస్తామన్నారు. ఏర్పేడులో ఎన్ఐఎంజెడ్, ఐఐటీ, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్(ఐఐఎస్), తిరుపతికి మెట్రోరైలు, తిరుపతి మెగా సిటీ, ఐటీ హబ్‌గా తిరుపతి, మెగా ఫుడ్‌పార్క్, హార్టికల్చర్ జోన్, ఆధ్యాత్మిక టూరిజం సర్క్యూట్ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. తిరుపతి, దాని చుట్టపక్కల ప్రాంతాల్లోనే అభివృద్ధి కేంద్రీకృతమయ్యేలా ప్రభుత్వం పరిశ్రమలు, విద్యా సంస్థల ఏర్పాటుకు ఉపక్రమించారనేది స్పష్టంగా తెలుస్తోంది. చిత్తూరు అభివృద్ధికి ఊతం ఇచ్చేందుకు ఒక్కటైనా..? వ్యవసాయంపై ఆధారపడి జీవించే రైతు కుటుంబాలు ఎక్కువగా ఉన్నప్పటికీ అందు కు అనువైన పరిస్థితులు ఇక్కడ లేవు. తాగునీటితోపాటు సాగునీటికి తీవ్రంగా ఇబ్బందు లు పడుతున్నారు. ఈ క్రమంలో చిత్తూరు కేంద్రంగా విద్యాసంస్థలు, పరిశ్రమల ఏర్పాటు జరగాలని ఇక్కడి వాసులు కాంక్షిస్తున్నారు. ముఖ్యమంత్రి ప్రకటించిన అభివృద్ధి ప్రణాళికలో చిత్తూరు కేంద్రంగా ఒక్కటి కూడా లేకపోవడం ఇక్కడి వారిని తీవ్రంగా బాధిస్తోంది. పోనీ స్థల సమస్య ఏదైనా ఉందా అంటే అదీ లేదు... చుట్టుపక్కల ప్రభుత్వ భూములు అధికంగా ఉన్నాయి. ప్రజాప్రతినిధుల నిర్లిప్తత ప్రధాన కారణం! చిత్తూరు అభివృద్ధి కోసం చిత్తూరు, చుట్టు పక్కల నియోజకవర్గాల ప్రజాప్రతినిధులు కూడా గట్టిగా వాణి వినిపించలేకపోయారు. పరిశ్రమలు, విద్యాసంస్థల ఏర్పాటుకు ప్రభుత్వంతో పోరాడలేకపోయారు. ఆ ప్రయత్నం కూడా చేయలేకపోయారు. ఎంపీ శివప్రసాద్ ఏదైనా ప్రభుత్వం కార్యక్రమం ఉంటే ప్రోటోకాల్ ప్రకారం కనిపించాలి కాబట్టి రావడం మినహా చిత్తూరు అభివృద్ధికి ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. తన పార్లమెంట్ పరిధిలో ఒక్క పరిశ్రమ, విద్యాసంస్థను కేంద్రం నుంచి రాబట్టలేకపోయారు. జిల్లా పరిషత్ చైర్పర్సన్ గీర్వాణి, మేయర్ కఠారి అనురాధ, ఎమ్మెల్యే డీఏ సత్యప్రభ కూడా ఈ విషయంలో చొరవ చూపలేకపోయారు. అయితే చిత్తూరుకు మెడికల్ కాలేజీ కావాలని సత్యప్రభ గట్టిగా సీఎంతో పోరాడారు. దీంతోనే ప్రైవేటుగా అపోలో మెడికల్ కాలేజీ ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఇది మినహా అభివృద్ధిలో అందరూ విఫలమయ్యారనే స్పష్టమవుతోంది. -
సీమలో రాజధాని లేకుంటే మరో ఉద్యమం
తిరుపతి: నవ్యాంధ్రప్రదేశ్ రాజధానిగా విజయవాడను ప్రభుత్వం ప్రకటించడాన్ని నిరసిస్తూ ఎస్వీయూ విద్యార్థులు గురువారం బంద్ పాటించారు. తరగతులు బహిష్కరించి క్యాంపస్‌లో భారీ ర్యాలీ నిర్వహించారు. యూనివర్సిటీ గోల్డెన్ జూబ్లీ ఆర్చ్ ముందు బైఠాయించి ధర్నా చేశారు. రాయలసీమలోనే రాజధానిని నిర్మించాలని నినాదాలు చేశారు. రాయలసీమ ఐక్య కార్యాచరణ సమితి(ఆర్‌ఎస్‌జేఏసీ) ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు జరిగాయి. ఎస్వీయూ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలల విద్యార్థులు తరగతులు బిహష్కరించి బంద్‌లో పాల్గొన్నారు. జేఏసీ కన్వీనర్ ఏజే సూరి, కార్యదర్శి ఓబుల్‌రెడ్డి, ఎస్వీయూ కన్వీనర్ విష్ణువర్ధన్‌రెడ్డి తదితరులు ప్రసంగించారు. ఎస్వీయూ విద్యార్థి నాయకులు ఎస్.మణి, శ్రీనురాయల్, మహేంద్రనాయక్, సాయికృష్ణ, చైతన్యయాదవ్ తదితరులు పాల్గొన్నారు. మదనపల్లెలో.. మదనపల్లె క్రైం: రాయలసీమలోనే రాజధాని ఏర్పాటు చేయాలని రాయలసీమ విద్యార్థి వేదిక ఆధ్వర్యంలో గురువారం స్థానిక మల్లికార్జున సర్కిల్లో విద్యార్థులు మానవహారం ఏర్పాటు చేశారు. ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు ఉత్తన్న డివిజన్ నాయకులు రాజు, మణి, రామకృష్ణ, నాగార్జున, హరీష్, విద్యార్థులు పాల్గొన్నారు. -
ఖాళీ చేయండి!
ప్రైవేట్ బిల్డింగ్‌లలోని ప్రభుత్వ కార్యాలయాలకు యజమానుల నోటీసులు ఎక్కువ అద్దెలు చెల్లిస్తున్న ప్రైవేట్ సంస్థలు దిక్కుతోచని స్థితిలో అధికారులు విజయవాడ: నవ్యాంధ్రప్రదేశ్‌కు తాత్కాలిక రాజధానిగా విజయవాడను ప్రకటించిన ప్రభుత్వం ఒకవైపు అన్ని శాఖల కార్యాలయాలను తరలించేందుకు ప్రయత్నిస్తోంది. మరోవైపు ఇక్కడ ప్రైవేటు భవనాల్లో ఉన్న ప్రభుత్వ కార్యాలయాలను ఖాళీ చేయించే పనిలో యజమానులు నిమగ్నమయ్యారు. ఉన్నవాటినే ఎక్కడ పెట్టాలో తెలియడం లేదని, ఇక కొత్త కార్యాలయాల సంగతి సరేసరి అని అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు. విజయవాడ కేంద్రంగా రాజధాని ఉంటుందని దాదాపు ఖరారు కావడంతో ఎక్కువ అద్దెలు ఇచ్చే కార్పొరేట్ సంస్థలకు తమ భవనాలను లీజుకు ఇచ్చేందుకు యజమానులు ముందుకొస్తున్నారు. ఈ క్రమంలో తక్కువ అద్దెలు చెల్లించే ప్రభుత్వ కార్యాలయాలను ఆరు నెలల్లో ఖాళీ చేయాలని నోటీసులు జారీ చేస్తున్నారు. దీంతో విజయవాడతోపాటు అన్ని మున్సిపాలిటీల్లో పలు ప్రభుత్వ కార్యాలయాలు రోడ్డునపడే పరిస్థితి నెలకొంది. విభజన తర్వాత డిమాండ్ రాష్ట్ర విభజన తర్వాత విజయవాడలో అద్దెలకు ఇచ్చే ఇళ్లకు డిమాండ్ భారీగా పెరిగింది. గతంలో సగటున అద్దెకు ఇచ్చేవారు. ఇప్పుడు ప్రభుత్వ కార్యాలయాలకు అడుగుల చొప్పున అద్దెలు చెల్లించాలని కోరుతున్నారు. ప్రభుత్వ కార్యాలయాలకు విజయవాడలో చదరపు అడుగుకు రూ.7 అద్దె చెల్లిస్తున్నారు. మచిలీపట్నం, గుడివాడ, గన్నవరం, నూజివీడు, నందిగామ, జగ్గయ్యపేట, ఇబ్రహీంపట్నం, ఉయ్యూరు తదితర ప్రాంతాల్లో రూ.5 నుంచి రూ.7 వరకు చెల్లిస్తున్నారు. ప్రైవేటు కార్యాలయాలు మాత్రం రూ.30 నుంచి రూ.50 వరకు ఇస్తున్నాయి. ఈ క్రమంలో ప్రభుత్వ కార్యాలయాల అద్దెను కూడా చదరపు అడుగుకు రూ.30కి పెంచాలని భవన యజమానులు డిమాండ్ చేస్తున్నారు. కానీ, ప్రభుత్వ నిబంధనల ప్రకారం రూ.7కు మించి చెల్లించే పరిస్థితి లేదు. దీంతో జిల్లావ్యాప్తంగా అద్దె భవనాల్లో ఉన్న కార్యాలయాలను ఖాళీ చేయాలని యజమానులు ఒత్తిడి చేస్తున్నారు. ఈ మేరకు విజయవాడలోని పలు కార్యాలయాలకు నోటీసులు కూడా అందాయి. గురునానక్ కాలనీలో ఉన్న స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ శాఖ కార్యాలయం, డీఆర్ కార్యాలయాలకు ఖాళీ చేయాలని నోటీసులు అందాయి. అద్దె భవనాల్లోనే 52 శాఖల కార్యాలయాలు! నగరంలో 52 ప్రభుత్వ శాఖలకు సంబంధించిన 500 నుంచి 600 వరకు కార్యాలయాలు అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయి. సబ్-రిజిస్ట్రార్, వాణిజ్య పన్నుల శాఖ, సాంఘిక సంక్షేమ శాఖ వసతి గృహాలు, దేవాదాయ శాఖ కార్యాలయాలు, రెవెన్యూ, ఇరిగేషన్, రవాణా, ఆర్ అండ్ బీ, పంచాయతీరాజ్, జాతీయ రహదారుల శాఖలకు సంబంధించిన కార్యాలయాలు అద్దె భవనాల్లోనే నిర్వహిస్తున్నారు. కొన్ని కార్యాలయాలకు రూ.3లక్షల వరకు అద్దె చెల్లిస్తున్నారు. వాణిజ్య పన్నుల శాఖ-1, 2వ డివిజన్ల కార్యాలయాలకు రూ.3లక్షలకు పైగా అద్దె చెల్లిస్తున్నారు. వాణిజ్య పన్నుల శాఖ బెంజిసర్కిల్, సీతారామపురం, కృష్ణలంక, భవానీపురం కార్యాలయాలకు రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు అద్దె ఇస్తున్నారు. ఆయా శాఖల కార్యాలయాలు మచిలీపట్నం, గుడివాడ, ఉయ్యూరు, నందిగామలలో కూడా అద్దె భవనాల్లోనే నిర్వహిస్తున్నారు. ఎక్కువ శాతం ప్రభుత్వ కార్యాలయాలు నిర్వహిస్తున్న భవనాలు రాజకీయ నాయకులవే కావడంతో ఖాళీ చేయించేందుకు ఒత్తిడి చేస్తున్నట్లు తెలుస్తోంది. అద్దె భవనాల కోసం తిరుగుతున్న అధికారులు తమ కార్యాలయాలకు భవనాల కోసం విజయవాడతోపాటు అన్ని మున్సిపల్ కేంద్రాల్లో అధికారులు వెదుకులాట ప్రారంభించారు. హాస్టళ్లకు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. కాస్త పెద్ద ఇళ్లు, భవనాలు కనిపిస్తే అద్దెకు ఇస్తారా.. అంటూ ఆరా తీస్తున్నారు. అయితే యజమానులు మాత్రం ప్రభుత్వ కార్యాలయాలకు అద్దెకు ఇచ్చేందుకు ముందుకురావటం లేదు. -
నిధులు పారేనా.. ‘పంట’ పండేనా!
కర్నూలు(రూరల్): రాష్ట్ర విభజనానంతరం నవ్యాంధ్రప్రదేశ్‌లో ప్రవేశపెడుతున్న తొలి బడ్జెట్‌పై జిల్లా ఆయకట్టు రైతులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా జిల్లాకు చెందిన పత్తికొండ శాసనసభ్యుడు కె.ఈ.కృష్ణమూర్తి ప్రాతినిధ్యం వహిస్తుండటంతో న్యాయం చేకూరుతుందనే నమ్మకం రెట్టింపవుతోంది. ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు బుధవారం అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. జిల్లాలో అసంపూర్తి సాగునీటి ప్రాజెక్టుల పనులకు నీటిపారుదల శాఖ అధికారులు రూ.399.65 కోట్లతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ఏటా వర్షాభావ పరిస్థితులతో రైతుల ఇక్కట్లు వర్ణనాతీతంగా ఉంటున్నాయి. జిల్లాలో హగరి, తుంగభద్ర, కృష్ణా, హంద్రీ, కుందూ నదులు ప్రవహిస్తున్నా బీడు భూములను సాగులోకి తీసుకొచ్చేందుకు నిర్మితమవుతున్న ప్రాజెక్టుల్లో పురోగతి లోపించింది. రాయలసీమలోని కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో 6.25 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీటితో పాటు ఆయా ప్రాంతాల ప్రజలకు తాగునీటిని అందించేందుకు హంద్రీనీవా సుజల స్రవంతి పథకం నిర్మితమైంది. గత ఏడాది కర్నూలు, అనంతపురం జిల్లాల్లో సుమారు 30 వేల ఎకరాలకు సాగునీటిని అందించారు. అయితే కాల్వ లైనింగ్, పెండింగ్ పనులు, డిస్ట్రిబ్యూటరీ కాలువల మరమ్మతులకు 2014-15 బడ్జెట్లో రూ.900 కోట్లు కేటాయించాలని ప్రతిపాదించారు. కర్నూలులో నిర్వహించిన రాష్ట్ర స్థాయి స్వాతంత్య్ర వేడుకల్లో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పాత హామీలకు కొత్త రంగు పూసి హడావుడి చేసినా తొలి బడ్జెట్లో నిధులు కేటాయించే అవకాశం లేదని తెలుస్తోంది. తుంగభద్ర నదిపై సుంకేసుల బ్యారేజీకి ఎగువన గుండ్రేవుల వద్ద 20 టీఎంసీల సామర్థ్యంలో సాగునీటి ప్రాజెక్టు నిర్మాణానికి సర్వే పూర్తి కావచ్చింది. ప్రాజెక్టు నిర్మాణం చేపడతామని బాబు హామీ ఇచ్చినా బడ్జెట్‌కు అధికారులు ప్రతిపాదించని పరిస్థితి. ప్రభుత్వం కోరనందున తాము ముందడుగు వేయలేదని అధికారులు చెబుతుండటం గమనార్హం. ఇక పశ్చిమ ప్రాంతాలను సస్యశ్యామలం చేసేందుకు హగరి నదిపై ఎత్తిపోతల పథకం నిర్మిస్తామని ప్రకటించినా నిధుల ఊసెత్తకపోవడం అనుమానాలకు తావిస్తోంది. అధికారులు పంపిన ప్రతిపాదనల్లోనూ ఎన్నింటికి నిధులు కేటాయిస్తారో.. వేటికి కోత విధిస్తారో తెలియని పరిస్థితి నెలకొంది. మరికొన్ని ప్రతిపాదనలు ఇలా... శ్రీశైలం ప్రాజెక్టు నిర్వహణ, మరమ్మతులు, సిబ్బంది ఇతరత్రా ఖర్చులకు మొత్తం 48.30 కోట్లు. ఎస్ఆర్బీసీ సర్కిల్ 1, 2 పరిధిలో ప్యాకేజీ 24 నుంచి 30 వరకున్న గాలేరు నగరి సుజల స్రవంతి పథకం పెండింగ్ పనులకు 41.70 కోట్లు. ఎస్ఆర్బీసీ సర్కిల్-1 పెండింగ్ పనులు, అటవీ భూముల సేకరణకు రూ.87 కోట్లు. ఎస్ఆర్బీసీ సర్కిల్-2 పరిధిలోని పనులకు రూ.123 కోట్లు. కర్నూలు-కడప కాలువ లైనింగ్, మరమ్మతులు, డిస్ట్రిబ్యూటరీల పనులకు రూ.18.87 కోట్లు. తెలుగుగంగ కాలువ లైనింగ్, వెలుగోడు రిజర్వాయర్ పెండింగ్ పనులు, బ్లాక్‌ల డిస్ట్రిబ్యూటరీ పనులుకు రూ.31 కోట్లు. తుంగభద్ర దిగువ కాలువ ఆధునికీకరణ పెండింగ్ పనులకు రూ.11.16 కోట్లు. కర్నూలులో వరద రక్షణ గోడ నిర్మాణంలో భాగంగా అత్యవసర పనులకు రూ.35 కోట్లు. గాజులదిన్నె ప్రాజెక్టు గేట్లు.. కుడి, ఎడమ కాల్వల పెండింగ్ పనులు, బండ్ బలోపేతానికి రూ.1.12 కోట్లు వరదరాజుల స్వామి ప్రాజెక్టు పనులకు రూ.2.50 కోట్లు. -
పోలీసు గుప్పిట్లో..
సాక్షి ప్రతినిధి, కర్నూలు : పంద్రాగస్టు వేడుకలకు కర్నూలు నగరం వేగంగా ముస్తాబవుతోంది. నవ్యాంధ్రప్రదేశ్‌లో మొట్ట మొదటిసారిగా స్వాతంత్య్ర వేడుకలను నిర్వహిస్తుండటంతో అధికార యంత్రాంగంప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అదే విధంగా పోలీసులకు ఈ వేడుకలు పెను సవాల్‌గా మారాయి. రాష్ట్ర విభజన తరువాత కొత్త రాజధాని కర్నూలును చేయాలనే డిమాండ్ ఊపందుకోవటం, జిల్లా వ్యాప్తంగా ఉద్యమాలు జోరందుకోవటంతో బందోబస్తు పెంచారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ఉండేందుకు ఏడు జిల్లాలకు చెందిన పోలీసు బలగాలను కర్నూలుకు రప్పించారు. మంగళవారం సాయంత్రానికి వీరు నగరానికి చేరుకుని ఏపీఎస్పీ పటాలంతో పాటు నగరాన్ని గుప్పిట్లో తీసుకున్నారు. నగరంతో పాటు చుట్టుపక్కల గ్రామాలు, నల్లమల అటవీ ప్రాంతంలో విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. రాష్ట్ర డీజీపీ జేవీ రాముడు కర్నూలులో తిష్టవేసి ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. గవర్నర్, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు కర్నూలుకు విచ్చేస్తుండటంతో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. శకటాలు సిద్ధం..: స్వాతంత్య్ర వేడుకలకు వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన 15 శకటాలను ప్రదర్శించనున్నారు. కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డులోని జంబోషెడ్‌లో వీటి తయారీ ముమ్మరంగా సాగుతోంది. ప్లానింగ్, ఇరిగేషన్, పురపాలక శాఖ, ఎన్ఆర్ఈజీఎస్, పారిశ్రామిక మౌలిక సదుపాయాలు, పరిశ్రమల శాఖ, సమాచార, సాంకేతిక శాఖ, వైద్యారోగ్య శాఖ, హౌసింగ్, ఆర్డబ్ల్యూఎస్, టూరిజం, డ్వాక్రా, పోలీస్, ట్రాన్స్ కో, అటవీశాఖల శకటాలను సిద్ధం చేస్తున్నారు. ఏపీఎస్పీ క్యాంప్‌లో వేదికను హైదరాబాద్‌కు చెందిన వారు ఏర్పాటు చేస్తున్నారు. అదే విధంగా వీవీఐపీలు, వీఐపీ గ్యాలరీలను నిర్మిస్తున్నారు. పరేడ్ మైదానంలోని ఏపీఎస్పీ పోర్ట్గేట్ ఎదుట ఆంధ్రప్రదేశ్ చిహ్నమైన తెలుగుతల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు. నగరంలోని కూడళ్ల అలంకరణ, రహదారులకు మెరుగులు ముమ్మరంగా సాగుతున్నాయి. మైదానంలో లైటింగ్, స్టేజ్ మైక్‌సెట్ ఇతర అవసరాల కోసం విద్యుత్‌శాఖ రూ.13 లక్షలు వెచ్చించి పనులు పూర్తి చేశారు. మూడు 160 కేవీఏ ట్రాన్స్ఫార్మర్లు, మూడు 125 కేవీఏ జనరేటర్లు, అర కి.మీ మేర 15 విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేసి తీగలు లాగారు. 15నే గవర్నర్, ముఖ్యమంత్రి రాక? గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈనెల 15న ఉదయం కర్నూలుకు చేరుకోనున్నారు. డిప్యూటీ సీఎం, హైకోర్టు జడ్జిలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రభుత్వ ఉన్నతాధికారులు, స్వాతంత్య్ర సమరయోధులు, పద్మ అవార్డు గ్రహీతలు ఓ రోజు ముందుగానే కర్నూలుకు చేరుకుంటారు. వీరికి ఏపీఎస్పీ పటాలంలో ప్రత్యేకంగా షామియానాలు ఏర్పాటు చేస్తున్నారు. గవర్నర్, సీఎం, డిప్యూటీ సీఎంలు, మంత్రులు, ఎమ్మెల్యేలు తదితరులు ఏ, బీ షామీయానాల కింద కూర్చొంటారు. సీ-షామియానా కింద ఏపీఎస్పీ సిబ్బంది, కుటుంబ సభ్యులు, పోలీసు, రెవెన్యూ అధికారుల కుటుంబ సభ్యులు కూర్చొంటారు. డీ-షామియానా కింద విద్యార్థులు, ప్రజలు ఉంటారు. జెండా వందన కార్యక్రమం అనంతరం అవార్డులు ప్రదానం చేస్తారు. ఆ తర్వాత ఓ పది నిమిషాలపాటు ఆంధ్రప్రదేశ్‌లోని రెసిడెన్సియల్ పాఠశాలల విద్యార్థులతో భారతీయం అనే కార్యక్రమం నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో మొత్తం 14 కంటింజెంట్లు పాల్గొంటాయి. వాటిలో ఎనిమిది ఆర్మ్, మరో ఆరు నాన్ ఆర్మ్ కంటింజెంట్లు ఉంటారు. ఒక్కో కంటింజెంట్లో 36 మంది ఉంటారు. అదే విధంగా 1953-56 మధ్య కర్నూలు రాజధానిగా ఉన్న సమయంలోని చారిత్రిక ఘటనలు, వివిధ అంశాలను అందరూ తెలుసుకునేలా ఓ ప్రదర్శనను ఏర్పాటు చేయనున్నారు. బందో‘మస్తు’: స్వాతంత్య్ర దినోత్సవం ముందు రోజు ఏపీఎస్పీ బెటాలియన్ ప్రాంతంలో పోలీసు శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించే అవకాశం ఉంది. ఇప్పటికే ఆ ప్రాంతంలో రాకపోకలు సాగించే ప్రయాణికులతో పాటు సందర్శకులుగా వచ్చి వెళ్లేవారిపై పోలీసులు డేగకన్ను సారించారు. ఏపీఎస్పీ బెటాలియన్‌లో ప్రధాన ద్వారం వద్దే క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. పటాలంతో పాటు చుట్టుపక్కల ఉన్న కాలనీలపై నిఘా పెట్టారు. ఇప్పటికే అనుమానితులను అదుపులోకి తీసుకుని పూర్తి స్థాయిలో స్కాన్ చేస్తున్నారు. కర్నూలు నగరంలో వాహనాల రాకపోకలకు సంబంధించి జిల్లా ఎస్పీ ఇప్పటికే ప్రణాళిక సిద్ధం చేసి.. పటిష్ట భద్రత ఏర్పాట్లపై కసరత్తు చేస్తున్నారు. చిత్తూరు, కడప, అనంతపురం, గుంటూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు సంబంధించిన 2,500 మంది పోలీసు సిబ్బంది బందోబస్తులో ఉన్నారు. స్వాతంత్య్ర వేడుకలకు సంబంధించి బుధవారం నుంచి రిహార్సల్స్ నిర్వహించనున్నారు. వేడుకలను కలెక్టర్ విజయమోహన్, ఎస్పీ రవికృష్ణ, జేసీ కన్నబాబు తదితరులు పర్యవేక్షిస్తున్నారు. -
కంటితుడుపే..!
విభజనకు ముందే రాజధానిని ఎంపిక చేస్తే బాగుండేది రాజధానిని నిర్ణయించాక కమిటీ నివేదికకు విలువేముంటుంది? శివరామకృష్ణన్ కమిటీ పర్యటనపై మేధావుల పెదవి విరుపు! సాక్షి ప్రతినిధి, తిరుపతి: నవ్యాంధ్రప్రదేశ్‌కు రాజధాని ఎంపికలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై మేధావులు, విద్యావేత్తలు, ప్రజాసంఘాల నేతలు, స్వచ్ఛంద సంస్థల ప్రతి నిధులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర విభజనకు ముందే రాజధానిని ఎంపిక చేసి ఉంటే బాగుండేదనే అభిప్రాయం బలంగా వ్యక్తమవుతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాజధానిపై ఓ నిర్ణయానికి వచ్చాక.. రాజధాని ఎంపికపై శివరామకృష్ణన్ కమిటీ ఇచ్చే నివేదికకు విలువేముంటుందనే అనుమానాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. కేవలం రాజధానిపై ప్రజల్లో ఆశలు రేకెత్తించడానికే శివరామకృష్ణ కమిటీ పర్యటన చేస్తోందని.. ఇది కంటితుడుపు చర్య అనే భావన బలపడుతోంది. ఇదీ.. శివరామకృష్ణన్ కమిటీ బుధవారం తిరుపతిలో శ్రీవెంకటేశ్వర విశ్వవిద్యాలయంలోని సెనేట్ హాల్లో నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణలో వ్యక్తమైన భావన..! వివరాల్లోకి వెళితే.. రాష్ట్ర విభజన నేపథ్యంలో నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని ఎంపికకు ప్రొఫెసర్ శివరామకృష్ణన్ నేతృత్వంలో ఐదుగురు సభ్యులతో కేంద్రం ఓ కమిటీని నియమించింది. శివరామకృష్ణన్ కమిటీ తొలివిడతగా కోస్తాం ధ్రలో పర్యటించింది. ఆ తర్వాత సీఎం చంద్రబాబుకు.. కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడుకు రాజధాని ఎంపికపై తాము సేకరించిన ప్రజాభిప్రాయాలను ప్రాథమికంగా వివరించింది. రాయలసీమ, ఉత్తరాంధ్రలో మలి విడత పర్యటన చేసి.. ప్రజాభిప్రాయాలను సేకరించి ఆగస్టు ఆఖరు నాటికి నివేదిక ఇస్తామని శివరామకృష్ణన్ కమిటీ స్పష్టం చేసింది. ఇవేవీ పట్టించుకోకుండా కేంద్ర మంత్రి ఎం.వెంకయ్యనాయుడు, సీఎం చంద్రబాబు గుంటూరు-విజయవాడ మధ్య ప్రాంతంలో రాజధానిని ఏర్పాటుచేస్తామని సూత్రప్రాయంగా ప్రకటించారు. ఇదే అదునుగా తీసుకున్న రియల్టర్లు ఆ ప్రాంతంలో భారీ ఎత్తున భూములు కొనుగోలు చేశారు. భూముల ధరలు ఒక్కసారిగా పెరిగిపోవడంతో ఆ ప్రాంతంలో భూముల క్రయవిక్రయాలను ఆపేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. అంటే.. అదే ప్రాంతంలోనే రాజధానిని ఏర్పాటుచేస్తామనే భావనను ప్రభుత్వం పరోక్షంగా వ్యక్తం చేసింది. ఇదే అంశాన్ని బుధవారం శివరామకృష్ణన్ కమిటీ ముందు మేధావులు, విద్యావేత్తలు, ప్రజాసంఘాల నేతలు లేవనెత్తారు. సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు రాజధాని ఎంపికపై లీకులు ఇస్తోన్న నేపథ్యంలో శివరామకృష్ణ కమిటీ నివేదికకు విలువ ఏముంటుందని నిల దీశారు. కేవలం రాయలసీమ ప్రజల ఆగ్రహాన్ని చల్లార్చడానికి మాత్రమే కమిటీ పర్యటిస్తోందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. విద్య, వైద్య, పారిశ్రామిక, వినోదం వంటి రంగాల్లో హైదరాబాద్‌ను అభివృద్ధి చేయడం వల్లే విభజనోద్యమం పుట్టుకొచ్చిందని.. ఇప్పుడు నవ్యాంధ్రప్రదేశ్‌లో అదే రీతిలో అభివృద్ధిని ఒక్కచోటే కేంద్రీకరిస్తే మళ్లీ విభజనవాదం తలెత్తే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. శ్రీబాగ్ ఓడంబడిక మేరకు రాయలసీమలోనే.. తిరుపతి కేం ద్రంగా రాజధానిని ఏర్పాటుచేయాలని డిమాండ్ చేశారు. తిరుపతికి సమీపంలో విమానాశ్రయం ఉందని.. దేశం నలుమూలకు వెళ్లగలిగే రైల్వే మార్గాలు, రోడ్డు మార్గాలు అందుబాటులో ఉన్నాయని.. తెలుగుగంగ ద్వారా నీటిని తీసుకోవచ్చునని రాజధాని ఏర్పాటుకు అన్ని సౌకర్యాలు ఉన్న నేపథ్యంలో తిరుపతినే రాజధానిగా ఎంపిక చేయాలని కోరారు. నవ్యాంధ్రప్రదేశ్‌లో 13 జిల్లాల కేంద్రాలను రాజధాని స్థాయిలో అభివృద్ధి చేయాలని కోరారు. అధికారాన్ని, ప్రగతిని వికేంద్రీకరించి, అన్ని ప్రాంతాలను సమాంతరంగా అభివృద్ధి చేస్తేనే నవ్యాంధ్రప్రదేశ్ సుస్థిరంగా మనుగడ సాధించగలుగుతుందనే అభిప్రాయం బలంగా వ్యక్తమైంది. మేధావులు, విద్యావేత్తల అభిప్రాయాలతో ఏకీభవించిన శివరామకృష్ణ కమిటీ సభ్యులు ప్రజాభిప్రాయాలను ప్రతిబింబించేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నివేదిక ఇస్తామని చెప్పడం గమనార్హం. -
మోక్షమెప్పుడో?
బందరు పోర్టు ఆరు నెలల్లో పనులు ప్రారంభిస్తామంటూ మంత్రుల హామీలు భూసేకరణకే 8 నెలలు నెలరోజులైనా అడుగు ముందుకు పడని వైనం రాష్ట్ర విభజన నేపథ్యంలో నిర్మాణం అనివార్యమే నవ్యాంధ్రప్రదేశ్ నిర్మాణంలో బందరు పోర్టు నిర్మాణం కూడా కీలకం. ఉన్న వనరులను వినియోగించుకుని దేశ, విదేశీ మారక ద్రవ్యాన్ని ఆర్జించేందుకు పోర్టు దోహదం చేస్తుందనడంలో సందేహం లేదు. కానీ పోర్టు నిర్మించి తీరుతామంటూ మంత్రులు చేస్తున్న ప్రకటనలు మాత్రం ఆచరణలోకి రావడం లేదు. ప్రభుత్వం ఏర్పడి సరిగ్గా నెలరోజులవుతున్నా పోర్టు అంశం ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. మచిలీపట్నం : జిల్లా ప్రజల ఆకాంక్షగా ఉన్న బందరు పోర్టు నిర్మాణం ఇప్పుడు ప్రధాన అంశంగా మారింది. పాలకులు చిత్తశుద్ధి చూపి పోర్టు నిర్మిస్తే నవ్యాంధ్రప్రదేశ్ నిర్మాణంలో ప్రధాన పాత్ర పోషిస్తుందనడంలో సందేహం లేదు. పోర్టు నిర్మించి తీరుతామంటూ జిల్లా మంత్రులు పదేపదే చేస్తున్న ప్రకటనలు మాత్రం ఆచరణలోకి రావడం లేదు. పోర్టు అభివృద్ధి జరగాలంటే భూ సేకరణ కీలక అంశంగా మారింది. 2012 మే నెలలో అప్పటి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి జారీ చేసిన జీవో నంబర్ 11 ప్రకారం 5,324 ఎకరాల భూమిని సేకరించాలి. ఇంత పెద్ద మొత్తంలో భూసేకరణ చేయాలంటే సాంకేతికంగా అనేక అవరోధాలు ఎదురవడంతో పాటు, అందరూ సహకరిస్తే కనీసంగా ఏడెనిమిది నెలల సమయం పడుతుందని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. మంత్రులు చెప్పే మాటలకు, రెవెన్యూ అధికారుల వాదనకు మధ్య పొంతన కుదరడం లేదు. ఇంకోఅంశమేమంటే పోర్టు పనులు దక్కించుకున్న నవయుగ కన్సార్టియంతో ప్రభుత్వం నేటివరకు ఎలాంటి సంప్రదింపులూ జరపలేదని, ఇందుకు మరికొన్ని రోజులు సమయం పట్టే అవకాశం ఉందని ఆ సంస్థ ప్రతినిధులే చెబుతున్నారు. అవరోధాలు అధిగమించాలి... రూ.5 వేల కోట్లతో 5,324 ఎకరాల విస్తీర్ణంలో పోర్టు నిర్మాణం జర గాల్సి ఉంది. పోర్టు నిర్మాణానికి అవసరమైన భూ సేకరణకు అవసరమైన నిధులను తామే సమకూరుస్తామని నవయుగ సంస్థ గతంలోనే ప్రభుత్వానికి లేఖ రాసింది. జిల్లా కలెక్టర్ భూసేకరణకు రూ.451.42 కోట్లు, 563 కుటుంబాలకు పునరావాసం కల్పించేందుకు రూ.43.58 కోట్లు అవసరమవుతాయని 2011 జూలైలో ప్రభుత్వానికి నివేదిక పంపారు. పోర్టు భూసేకరణ జరగాలంటే అనేక అవరోధాలను అధిగమించాల్సి ఉంది. తొలుత కలెక్టర్ భూ సేకరణకు డ్రాఫ్ట్ నోటిఫికేషన్ విడుదల చేయాలి. అనంతరం డిక్లరేషన్ ఇవ్వాలి. ఈ తతంగం ముగిసిన అనంతరం 5-ఏ విచారణ చేయాలి. ఈ విచారణలో రైతులు తాము భూములను ఇస్తున్నట్లు అంగీకార పత్రాలు ఇవ్వాలి. పోర్టుకు అవసరమైన భూసేకరణకు కలెక్టర్ అవార్డు పాస్ చేయాలి. ఈ వ్యవహారం మొత్తం కొలిక్కి రావాలంటే ఎనిమిది నెలల సమయం పడుతుందని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. భూములు కోల్పోయే రైతులు ఎవరైనా అంగీకార పత్రం ఇవ్వకుంటే కోర్టు ద్వారా సంబంధిత భూములను సేకరించాల్సి ఉంటుంది. ఈ వ్యవహారం కోర్టు వరకు వెళితే భూ సేకరణ ప్రక్రియలో మరింత జాప్యం జరిగే అవకాశం ఉంది. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకోకుండా మంత్రులు ఆరు నెలల్లో పోర్టు పనులు ప్రారంభిస్తామని చెప్పడం గమనార్హం. పారిశ్రామిక అభివృద్ధికి దోహదం... బందరు పోర్టు నిర్మాణం జరిగితే విదేశాలకు సరకుల ఎగుమతులు, దిగుమతులు జరగటంతో పాటు జిల్లా పారిశ్రామికంగా అభివృద్ధి చెందే అవకాశం ఉంది. పోర్టుకు అనుబంధంగా జిల్లాలో 27 రకాల పరిశ్రమలు స్థాపించేందుకు అవకాశం ఉంటుందని సాంకేతిక నిపుణులు చెబుతున్నారు. తెలంగాణ రాజధాని హైదరాబాదుకు అత్యంత సమీపంలో బందరు పోర్టు ఉంది. చెన్నై నుంచి కోల్‌కతా వరకు కంప్యూటర్లు, ఇతర సాఫ్ట్వేర్ పరికరాలు సముద్ర మార్గం ద్వారా బందరు పోర్టు మీదుగానే రవాణా అవుతూ ఉంటాయి. ఈ పరికరాలు విశాఖపట్నం, లేదా కాకినాడ పోర్టులలో దించి అక్కడినుంచి హైదరాబాదుకు విజయవాడ మీదుగా రోడ్డు మార్గం ద్వారా తరలిస్తున్నారు. దీంతో సమయం వృథా కావడంతో పాటు, రోడ్డు మార్గాన రవాణా ఖర్చులు తడిసిమోపెడవుతున్నాయి. బందరు పోర్టులోనే ఈ పరికరాలను దించి హైదరాబాద్ తదితర ప్రాంతాలకు తక్కువ ఖర్చుతో రవాణా చేయొచ్చని సాంకేతిక నిపుణులు చెబుతున్నారు. దీంతో పాటు బందరు-విజయవాడ మధ్య 65 కిలోమీటర్ల మేర ఉన్న జాతీయ రహదారిని రూ.750 కోట్లతో నాలుగు లేన్లుగా అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం రెండేళ్ల క్రితమే అనుమతులు ఇచ్చింది. పోర్టు నిర్మాణం ఆలస్యం కావడంతో ఈ రోడ్డు నిర్మాణం దాదాపు నిలిచిపోయింది. పోర్టు నిర్మిస్తే మచిలీపట్నం నుంచి సరకుల రవాణా పెరిగే అవకాశం ఉండటంతో ఈ జాతీయ రహదారి నిర్మాణం తప్పనిసరిగా చేయాల్సి ఉంటుంది. విజయవాడ - గుంటూరు మధ్య నూతనంగా నిర్మించబోయే రాజధానికి అత్యంత సమీపంలో బందరు పోర్టు ఉంటుంది. దీంతో పాటు విజయవాడలోని వీటీపీఎస్‌కు ఒరిస్సా నుంచి బొగ్గును ఓడల ద్వారా విశాఖపట్నం వరకు తీసుకువచ్చి అక్కడినుంచి వ్యాగన్ల ద్వారా విజయవాడకు తరలిస్తున్నారు. బందరు పోర్టు నిర్మిస్తే అతి తక్కువ దూరం నుంచే బొగ్గు రవాణాకు అవకాశముంటుంది. కృష్ణా, గుంటూరు, నల్లగొండ తదితర జిల్లాల్లో ఉత్పత్తి అవుతున్న సిమెంటు, ధాన్యం, బియ్యం, వస్త్రాలు, మత్స్య సంపదను అతి తక్కువ ఖర్చుతో విదేశాలకు ఎగుమతి చేసే వెసులుబాటు కలుగుతుంది. బ్రిటీష్, ఫ్రెంచి, డచ్ పాలకులు సాంకేతి పరిజ్ఞానం అంతగా అందుబాటులో లేని 300 సంవత్సరాల క్రితమే బందరు పోర్టునుంచి వేలాది టన్నుల సరకులను ఎగుమతి, దిగుమతి చేసుకున్నారు. నేడు సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చినా బందరు పోర్టు ఇంకా పాలకుల నిర్లక్ష్యానికి గురికావడం శోచనీయం. రాష్ట్ర విభజన నేపథ్యంలో అయినా అభివృద్ధిలో కీలకంగా మారనున్న పోర్టు నిర్మాణంపై దృష్టి సారించాలని జిల్లా వాసులు కోరుతున్నారు. పదకొండేళ్లుగా ఉద్యమం... బందరు పోర్టును నిర్మించాలని 2003 నుంచి ఉద్యమాలు ప్రారంభమయ్యాయి. 2004లో 100 రోజులపాటు రిలే దీక్షలు, 10 రోజుల పాటు ఆమరణ దీక్షలు అన్ని రాజకీయ పక్షాల నాయకులు చేశారు. దీంతో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి బందరు పోర్టును నిర్మిస్తామని హామీ ఇచ్చారు. 2008 ఏప్రిల్ 23న బందరు పోర్టు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. 2009లో ఎన్నికల నేపథ్యంలో పోర్టు పనులకు బ్రేక్ పడింది. 2009 సెప్టెంబర్ రెండో తేదీన వైఎస్ మరణంతో పోర్టు అంశాన్ని పట్టించుకునేవారే కరువయ్యారు. ప్రస్తుత టీడీపీ పాలకులు పోర్టు నిర్మిస్తారో, లేక కాలయాపన చేస్తారో వేచిచూడాల్సిందే. -
కూతలా.. కోతలా!?
రైల్వే బడ్జెట్‌పై కోటి ఆశలు విజయవాడకు ప్రత్యేక కేటాయింపులు కావాలి ‘స్పెషల్’ రైళ్లు సకాలంలో నడిచేలా చూడాలి ప్లాట్‌ఫారాలపై నిలువ నీడ కల్పించండి ఏటా రైల్వే బడ్జెట్లో నిర్లక్ష్యానికి గురవుతున్న విజయవాడ డివిజన్‌కు రాష్ట్ర విభజన నేపథ్యంలో ఈసారైనా కేటాయింపులు ఘనంగా ఉంటాయని ప్రయాణికులు ఆశగా ఎదురుచూస్తున్నారు. రైల్వే మంత్రి సదానందగౌడ మంగళవారం పార్లమెంట్లో బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నారు. నవ్యాంధ్రప్రదేశ్‌లో విజయవాడ కీలకం కావడంతో ఈ డివిజన్‌కు కురిపించే వరాలపై రైల్వే వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఎప్పటిలా ఈసారీ కోతలు పెడతారా.. లేక కొత్త రైళ్లను మంజూరు చేస్తారా అన్నది మరికొన్ని గంటల్లో తేలనుంది. కూతలా.. కోతలా!? సాక్షి, విజయవాడ : ప్రత్యేక రైల్వే డివిజన్, చుట్టుపక్కల ప్రాంతాల్లో కొత్త రాజధాని ఏర్పాటు కావచ్చన్న వార్తల నేపథ్యంలో విజయవాడ డివిజన్ ప్రత్యేకత సంతరించుకుంది. ఇక్కడినుంచి దేశం నలుమూలలకు కొత్త రైళ్లు వేయాలని, కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని ముఖ్యమైన రైల్వేస్టేషన్లను ఏ-కేటగిరీగా అభివృద్ధి చేయాలంటూ ఇప్పటికే మన ఎంపీలు రైల్వే మంత్రికి విజ్ఞాపన పత్రాలు అందజేశారు. ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే అనేక సౌకర్యాలు రైల్వే బడ్జెట్లో మంజూరు కావాలని ప్రయాణికులు, రైల్వే అధికారులు అభిప్రాయపడుతున్నారు. ప్రధాన డిమాండ్లు ఇవే.. విజయవాడ, మచిలీపట్నం నుంచి దేశంలోని అన్ని ప్రాంతాలకు కొత్త రైళ్లు ప్రారంభించాలి. విజయవాడ మీదుగా దూర ప్రాంతాలకు వెళుతున్న ప్రశాంతి, శేషాద్రి, యశ్వంత్‌పూర్, ఫలక్‌నుమా, నాగర్సోల్, మన్మాడ్, పాట్నా, కేరళ, జీటీ తదితర ఎక్స్‌ప్రెస్ రైళ్లల్లో విజయవాడ ప్రయాణికుల కోసం స్లీపర్ క్లాస్‌లో 100 బెర్త్‌లు, ఏసీలో 50 బెర్త్‌లు ప్రత్యేకంగా కేటాయించాలి. ప్రయాణికుల రద్దీ ఉన్నప్పుడల్లా విజయవాడ నుంచి ప్రత్యేక రైళ్లు ఏర్పాటుచేస్తున్నారు. ఇవి సకాలంలో నడిచేందుకు, రైళ్లలో మంచినీరు, మరుగుదొడ్లు సరిగా ఉండే విధంగా బడ్జెట్లో తగిన చర్యలు తీసుకోవాలి. విజయవాడ జంక్షన్లో 8, 9, 10 ప్లాట్‌ఫారాలపై పూర్తిగా షెడ్లు లేకపోవడం వల్ల ప్రయాణికులు ఎండావానలకు ఇబ్బంది పడుతున్నారు. వీటి ఏర్పాటుకు బడ్జెట్లో నిధులు మంజూరుచేయాలి. గుడివాడ, మచిలీపట్నం స్టేషన్ల ఆధునికీకరణకు నిధులు కేటాయించాలి. విజయవాడ రైల్వే జంక్షన్‌ను అంతర్జాతీయ రైల్వేస్టేషన్ స్థాయికి పెంచాలి. విజయవాడ-మచిలీపట్నం మార్గం డబ్లింగ్ పనులు వేగంగా పూర్తిచేయాలి. కోటిపల్లి-నర్సాపురం మార్గానికి నిధులు కేటాయించాలి. రైల్వేస్టేషన్లో నాణ్యమైన ఆహారం లభ్యమయ్యేలా చూడాలి. మంచినీటి సౌకర్యం కల్పించాలి. రైల్వే ప్రయాణికుల భద్రత బాధ్యతల్ని ఆర్పీఎఫ్కు అప్పగించాలి. రైల్వే ఆస్తులను కాపాడేందుకు ప్రత్యేక పోలీసులను ఏర్పాటు చేయాలి. తెనాలి-రేపల్లి-మచిలీపట్నం-విజయవాడ-గుంటూరులను కలుపుతూ సర్క్యులర్ ట్రైన్ ఏర్పాటు చేయాలి. రైతులు తమ ఉత్పత్తులను ఎగుమతి చేసుకోవడానికి దూర ప్రాం తాలకు వెళ్లే రైళ్లలో ఒక పార్సిల్ వ్యాన్‌ను ఏర్పాటుచేసుకోవాలి. రైల్వే ఇంజిన్లు మరమ్మతుకు గురైతే తమిళనాడు వెళ్లాల్సి వస్తోంది. విజయవాడలోనే ఇంజిన్ మరమ్మతు ప్లాంట్ నెలకొల్పాలి. రైల్వే కోచ్‌లు మరమ్మతు చేసే లోకో షెడ్‌ను ఇక్కడే ఏర్పాటు చేయాలి. ఆశలు నెరవేరేనా.. ప్రతి ఏడాది రైల్వే బడ్జెట్ వచ్చే ముందు ఈ ప్రాంత ప్రయాణికులు కోటి ఆశలతో ఎదురుచూస్తున్నారు. యూపీఏ సర్కారు అరకొర నిధులే మంజూరుచేసింది తప్ప ఈ ప్రాంత అభివృద్ధిపై పూర్తిస్థాయి దృష్టి పెట్టలేదు. కనీసం ఎన్డీఏ ప్రభుత్వమైనా దక్షిణ మధ్య రైల్వేకు, విజయవాడ డివిజన్‌కు పెద్దపీట వేస్తుందో లేదో వేచిచూడాల్సిందే.