కూతలా.. కోతలా!? | Delivery of the Railway Budget | Sakshi
Sakshi News home page

కూతలా.. కోతలా!?

Published Tue, Jul 8 2014 1:09 AM | Last Updated on Sat, Sep 2 2017 9:57 AM

కూతలా.. కోతలా!?

కూతలా.. కోతలా!?

  •  రైల్వే బడ్జెట్‌పై కోటి ఆశలు
  •  విజయవాడకు ప్రత్యేక కేటాయింపులు కావాలి
  •  ‘స్పెషల్’ రైళ్లు సకాలంలో నడిచేలా చూడాలి
  •  ప్లాట్‌ఫారాలపై నిలువ నీడ కల్పించండి
  • ఏటా రైల్వే బడ్జెట్‌లో నిర్లక్ష్యానికి గురవుతున్న విజయవాడ డివిజన్‌కు రాష్ట్ర విభజన నేపథ్యంలో ఈసారైనా కేటాయింపులు ఘనంగా ఉంటాయని ప్రయాణికులు ఆశగా ఎదురుచూస్తున్నారు. రైల్వే మంత్రి సదానందగౌడ మంగళవారం పార్లమెంట్‌లో బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నారు. నవ్యాంధ్రప్రదేశ్‌లో విజయవాడ కీలకం కావడంతో ఈ డివిజన్‌కు కురిపించే వరాలపై రైల్వే వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఎప్పటిలా ఈసారీ కోతలు పెడతారా.. లేక కొత్త రైళ్లను మంజూరు చేస్తారా అన్నది మరికొన్ని గంటల్లో తేలనుంది.
     
    కూతలా.. కోతలా!?
    సాక్షి, విజయవాడ : ప్రత్యేక రైల్వే డివిజన్, చుట్టుపక్కల ప్రాంతాల్లో కొత్త రాజధాని ఏర్పాటు కావచ్చన్న వార్తల నేపథ్యంలో విజయవాడ డివిజన్ ప్రత్యేకత సంతరించుకుంది. ఇక్కడినుంచి దేశం నలుమూలలకు కొత్త రైళ్లు వేయాలని, కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని ముఖ్యమైన రైల్వేస్టేషన్లను ఏ-కేటగిరీగా అభివృద్ధి చేయాలంటూ ఇప్పటికే మన ఎంపీలు రైల్వే మంత్రికి విజ్ఞాపన పత్రాలు అందజేశారు. ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే అనేక సౌకర్యాలు రైల్వే బడ్జెట్‌లో మంజూరు కావాలని ప్రయాణికులు, రైల్వే అధికారులు అభిప్రాయపడుతున్నారు.
     
    ప్రధాన డిమాండ్లు ఇవే..
    విజయవాడ, మచిలీపట్నం నుంచి దేశంలోని అన్ని ప్రాంతాలకు కొత్త రైళ్లు ప్రారంభించాలి.
     
    విజయవాడ మీదుగా దూర ప్రాంతాలకు వెళుతున్న ప్రశాంతి, శేషాద్రి, యశ్వంత్‌పూర్, ఫలక్‌నుమా, నాగర్‌సోల్, మన్మాడ్, పాట్నా, కేరళ, జీటీ తదితర ఎక్స్‌ప్రెస్ రైళ్లల్లో విజయవాడ ప్రయాణికుల కోసం స్లీపర్ క్లాస్‌లో 100 బెర్త్‌లు, ఏసీలో 50 బెర్త్‌లు ప్రత్యేకంగా  కేటాయించాలి.
     
    ప్రయాణికుల రద్దీ ఉన్నప్పుడల్లా విజయవాడ నుంచి ప్రత్యేక రైళ్లు ఏర్పాటుచేస్తున్నారు. ఇవి సకాలంలో నడిచేందుకు, రైళ్లలో మంచినీరు, మరుగుదొడ్లు సరిగా ఉండే  విధంగా బడ్జెట్‌లో తగిన చర్యలు తీసుకోవాలి.
     
    విజయవాడ జంక్షన్‌లో 8, 9, 10 ప్లాట్‌ఫారాలపై పూర్తిగా షెడ్లు లేకపోవడం వల్ల ప్రయాణికులు ఎండావానలకు ఇబ్బంది పడుతున్నారు. వీటి ఏర్పాటుకు బడ్జెట్‌లో నిధులు మంజూరుచేయాలి.
     
    గుడివాడ, మచిలీపట్నం స్టేషన్ల ఆధునికీకరణకు నిధులు కేటాయించాలి.
     
    విజయవాడ రైల్వే జంక్షన్‌ను అంతర్జాతీయ రైల్వేస్టేషన్ స్థాయికి పెంచాలి.
     
    విజయవాడ-మచిలీపట్నం మార్గం డబ్లింగ్ పనులు వేగంగా పూర్తిచేయాలి.
     
    కోటిపల్లి-నర్సాపురం మార్గానికి నిధులు కేటాయించాలి.
     
    రైల్వేస్టేషన్‌లో నాణ్యమైన ఆహారం లభ్యమయ్యేలా చూడాలి. మంచినీటి సౌకర్యం కల్పించాలి.
     
    రైల్వే ప్రయాణికుల భద్రత బాధ్యతల్ని ఆర్పీఎఫ్‌కు అప్పగించాలి. రైల్వే ఆస్తులను కాపాడేందుకు ప్రత్యేక పోలీసులను ఏర్పాటు చేయాలి.
     
    తెనాలి-రేపల్లి-మచిలీపట్నం-విజయవాడ-గుంటూరులను కలుపుతూ సర్క్యులర్  ట్రైన్ ఏర్పాటు చేయాలి.
     
    రైతులు తమ ఉత్పత్తులను ఎగుమతి చేసుకోవడానికి దూర ప్రాం తాలకు వెళ్లే రైళ్లలో ఒక పార్సిల్ వ్యాన్‌ను ఏర్పాటుచేసుకోవాలి.
     
    రైల్వే ఇంజిన్లు మరమ్మతుకు గురైతే తమిళనాడు వెళ్లాల్సి వస్తోంది. విజయవాడలోనే ఇంజిన్ మరమ్మతు ప్లాంట్ నెలకొల్పాలి.
     
    రైల్వే కోచ్‌లు మరమ్మతు చేసే లోకో షెడ్‌ను ఇక్కడే ఏర్పాటు చేయాలి.
     
    ఆశలు నెరవేరేనా..
    ప్రతి ఏడాది రైల్వే బడ్జెట్ వచ్చే ముందు ఈ ప్రాంత ప్రయాణికులు కోటి ఆశలతో ఎదురుచూస్తున్నారు. యూపీఏ సర్కారు అరకొర నిధులే మంజూరుచేసింది తప్ప ఈ ప్రాంత అభివృద్ధిపై పూర్తిస్థాయి దృష్టి పెట్టలేదు. కనీసం ఎన్డీఏ ప్రభుత్వమైనా దక్షిణ మధ్య రైల్వేకు, విజయవాడ డివిజన్‌కు పెద్దపీట వేస్తుందో లేదో వేచిచూడాల్సిందే.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement