Division of state
-
ఏప్రిల్ 11న రాష్ట్ర విభజన కేసు విచారణ
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనకు సంబంధించి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ తదితరులు దాఖలు చేసిన పిటిషన్‌ను ఏప్రిల్ 11న విచారిస్తామని సుప్రీంకోర్టు పేర్కొంది. 2014లో రాష్ట్ర విభజన అనంతరం రెండు రాష్ట్రాల్లో రెండుసార్లు ఎన్నికలు జరగడంతో ఉండవల్లి అరుణ్‌కుమార్ తన పిటిషన్లో అభ్యర్థనను మార్చారు. రాష్ట్రాలకు సంబంధించి ఆస్తులు, అప్పుల వ్యవహారాలను త్వరగా తేల్చాలని, ఆంధ్రప్రదేశ్‌కు లబ్ధి చేకూరేలా కేంద్రానికి ఆదేశాలివ్వాలని కోరారు. దీనిపై గతేడాది నవంబరు 28న విచారణకు రాగా ఫిబ్రవరి 22న విచారిస్తామని సుప్రీంకోర్టు పేర్కొంది. ఇదిలా ఉంటే ఈ నెల14న సుప్రీంకోర్టు ఓసర్క్యులర్ జారీ చేసింది. ఓసారి నోటీసు అయిన అంశాలను బుధ, గురువారాల్లో విచారించబోమని అందులో స్పష్టంచేసింది. దీంతో బుధవారంనాటి విచారణ జాబితా నుంచి ఈ కేసును రిజిస్ట్రీ తొలగించారు. దీంతో ఉండవల్లి తరఫు న్యాయవాది అల్లంకి రమేశ్ మంగళవారం సాయంత్రం కోర్టు పనివేళల ముగింపు అనంతరం జస్టిస్ కేఎం జోసెఫ్ ధర్మాసనం ముందు ఈ అంశాన్ని ప్రస్తావించారు. ఈ పిటిషన్‌ను కనీసం పది, పదిహేను రోజులు విచారించాల్సి ఉంటుందని, మూడు నెలల్లో తన పదవీ విరమణ ఉందని జస్టిస్ జోసెఫ్ గుర్తుచేశారు. అన్ని రోజులు అవసరంలేదని రమేశ్ వివరించారు. దీంతో ఏప్రిల్ 11న విచారణ చేపడతామని, ఆ రోజు జాబితాలో చేర్చాలని ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. మంగళవారం అర్ధరాత్రి సుప్రీంకోర్టు వెబ్సైట్లో ఈ ఆదేశాలు ఉంచింది. -
తెలంగాణ నుంచి ఏపీకి వచ్చిన వారికి గుడ్‌న్యూస్
సాక్షి, అమరావతి: రాష్ట్ర విభజన నేపథ్యంలో తెలంగాణ నుంచి తరలివచ్చి ఏపీలో స్థిర నివాసముంటున్న వారికి విద్య, ఉద్యోగాలకు సంబంధించి మరో మూడేళ్ల పాటు స్థానికత కల్పించేందుకు గత ఉత్తర్వుల్లో సవరణలు చేస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆదేశాలు జారీచేశారు. రాష్ట్ర విభజన అనతరం తెలంగాణ నుంచి ఏపీకి తరలి వచి్చన వారికి విద్య, ఉద్యోగాలకు సంబంధించి ఏడేళ్ల పాటు స్థానికత కల్పిస్తూ 2014లో రాష్ట్రపతి ఆదేశాలు జారీ చేశారు. ఆ ఏడేళ్ల గడువు ముగియడంతో రాష్ట్ర ప్రభుత్వం మరో మూడేళ్లు పొడిగించాల్సిందిగా విజ్ఞప్తి చేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి ఉత్తర్వుల్లో ఏడేళ్లకు బదులు పదేళ్లుగా సవరణలు చేస్తూ శనివారం ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. విద్యా సంస్థల్లో ప్రవేశాలకు 1974 నాటి రాష్ట్రపతి ఉత్తర్వుల్లో సవరణ చేయగా.. ఉద్యోగుల స్థానికతకు సంబంధించి 1975నాటి రాష్ట్రపతి ఉత్తర్వుల్లో సవరణలు చేశారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ఎంప్లాయిమెంట్(ఆర్గనైజేషన్ ఆఫ్ లోకల్ కేడర్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ డైరెక్ట్ రిక్రూట్మెంట్)లో సవరణలు చేస్తూ తెలంగాణ నుంచి ఏపీకి వచ్చి స్థిరపడిన వారికి డైరెక్ట్ రిక్రూట్మెంట్లలో మరో మూడేళ్ల పాటు స్థానికత కల్పించారు. ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్(రెగ్యులేషన్ ఆఫ్ అడ్మిషన్లు)లో సవరణలు చేస్తూ.. విద్యా సంస్థల ప్రవేశాల్లో మరో మూడేళ్ల పాటు స్థానికత కల్పించారు. చదవండి: (కర్నూలులో రాష్ట్రస్థాయి క్యాన్సర్ ఆస్పత్రి) -
‘పెండింగ్’పై 23న భేటీ
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి వివిధ మంత్రిత్వ శాఖల వద్ద పెండింగ్‌లో ఉన్న అంశాల పరిష్కారానికి ఏర్పాటైన కేంద్ర, రాష్ట్ర సమన్వయ కమిటీ ఈ నెల 23వ తేదీన సమావేశమై సమీక్ష నిర్వహించనుంది. కేంద్ర కేబినెట్ సెక్రటేరియట్ (సమన్వయ) కార్యదర్శి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. ఈ మేరకు కేంద్ర కేబినెట్ సెక్రటేరియట్ డైరెక్టర్ ఎం.చక్రవర్తి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సమాచారం పంపారు. ఈ–సమీక్ష పోర్టల్‌లో పొందుపరిచిన ఏపీకి చెందిన అంశాలపై సమీక్షించనున్నట్లు పేర్కొన్నారు. రెవెన్యూ లోటు, హోదా.. సమన్వయ కమిటీ వద్ద పెండింగ్‌లో ఉన్న 34 అంశాలతో పాటు వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖల వద్ద అపరిష్కృతంగా ఉన్న 15 అంశాలను సమీక్ష అజెండాలో చేర్చారు. రాజధానిలో మౌలిక వసతుల కల్పనకు అవసరమైన ఆర్థిక సాయం అందించడంతో పాటు రాష్ట్ర విభజన జరిగిన ఏడాది రెవెన్యూ లోటు భర్తీతో సహా ప్రత్యేక హోదా అంశాన్ని కూడా అజెండాలో పొందుపరిచారు. జాతీయ రహదారులు, రైల్వే లైన్లకు సంబంధించి పెండింగ్ అంశాలను అజెండాలో చేర్చారు. అజెండాలో ముఖ్యాంశాలు ఇవీ... ► విభజన చట్టం 13వ షెడ్యూల్లో పేర్కొన్న మేరకు ఆరు నెలల్లోగా కొత్త రైల్వే జోన్ ఏర్పాటు. ► కొత్త రాజధాని నుంచి హైదరాబాద్‌తో పాటు తెలంగాణలోని ముఖ్యమైన నగరాలకు ర్యాపిడ్ రైలుతోపాటు రోడ్డు కనెక్టివిటీ కల్పించడం. ► విభజన చట్టం 13వ షెడ్యూల్ ప్రకారం వైఎస్సార్ జిల్లాలో ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు. ► 2014–15 ఆర్థిక ఏడాదిలో రెవెన్యూ లోటు భర్తీకి నిధులు అందించడం. ► 2016లో ప్రధాని ప్రకటన మేరకు విశాఖలో జాతీయ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ ఇనిస్టిట్యూషన్ ఏర్పాటు. ► కొత్త రాజధానిలో అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు ఆర్థిక సాయం అందించడం. ► పోలవరంలో ఆర్ అండ్ ఆర్తో సహా ప్రాజెక్టుకయ్యే పూర్తి వ్యయాన్ని కేంద్రమే భరించడం. ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించిన ఇతర అంశాలతో పాటు ఒడిశా, చత్తీస్‌గడ్‌లో ప్రజాభిప్రాయ సేకరణకు చర్యలు తీసుకోవడం. ► విశాఖలో ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ ఏర్పాటు చేయడం. ► విశాఖలో మెట్రో రైలు ఏర్పాటుకు చర్యలు చేపట్టడం. ► వెనుకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాలకు ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీ అందించడం. ► ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పించడం. ► విభజన చట్టంలో పేర్కొన్న మేరకు పారిశ్రామిక ఆర్థిక ప్రగతికి పన్ను రాయితీలు ఇవ్వడం. హైదరాబాద్‌లో ఉన్న వివిధ శిక్షణ సంస్థలను ఆంధ్రప్రదేశ్‌లో నెలకొల్పడం. ► కాకినాడ పోర్టు సమీపంలో ఎలక్ట్రానిక్ (హార్డ్‌వేర్) ఉపకరణాల తయారీ కేంద్రం ఏర్పాటు. 16న పీపీఏ సర్వసభ్య సమావేశం పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ (పీపీఏ) సర్వసభ్య సమావేశాన్ని ఈ నెల 16న హైదరాబాద్‌లో జరగనుంది. సమావేశంలో ఈ సీజన్లో చేపట్టాల్సిన పనులు, సవరించిన అంచనా వ్యయం రూ.55,656.87 కోట్లకు ఇన్వెస్ట్మెంట్ క్లియరెన్స్..ఆ మేరకు నిధుల మంజూరుపై చర్చించనున్నారు. పీపీఏ సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించాలని 4 నెలల క్రితం పీపీఏ సీఈవోకు జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ లేఖ రాశారు. పీపీఏ నుంచి స్పందన లేకపోవడంతో ఇటీవల అదే అంశాన్ని గుర్తు చేస్తూ మరో లేఖ రాశారు. దీనిపై స్పందించిన పీపీఏ సీఈవో చంద్రశేఖర్ అయ్యర్ 16న సమావేశాన్ని నిర్వహిస్తామని ఏపీకి సమాచారమిచ్చారు. కాగా, ఏడాది క్రితం పీపీఏ సర్వ సభ్య సమావేశాన్ని నిర్వహించారు. -
అరుణ కిరణాలు
- సీపీఎం జాతీయ మహాసభలకు సర్వం సిద్దం - విశాఖకు చేరుకున్న పార్టీ అగ్రనేతలు - వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రతినిధులు రాక - కళావాణి వేదికగా నేడు ప్రారంభం సాక్షి, విశాఖపట్నం: సీపీఎం 21వ అఖిలభారత జాతీయ మహాసభలకు తొలిసారిగా విశాఖనగరం ఆతిథ్యమిస్తోంది. ఈ మహాసభలు మంగళవారం నుంచి ఆదివారం వరకు స్థానిక పోర్టు కళావాణి ఆడిటోరియంలో జరుగనున్నాయి. మహాసభల సందర్భంగా విశాఖ నగరంతో పాటు గ్రామీణమంతా ఎర్రజెండాల రెపరెపలతో ఎరుపెక్కింది. రాష్ర్ట విభజన జరిగిన తర్వాత నవ్యాంధ్రలో ఓ రాజకీయ పార్టీ అఖిలభారత మహాసభలు జరగడం ఇదే ప్రధమం. ప్రతినిధుల సభ జరుగనున్న పోర్టు కళా వాణి ఆడిటోరియాన్ని గ్రామీణ,గిరిజన ప్రాంత నివాసాలు, వృత్తులు, సాంస్కృతిక, సంప్ర దాయాలు ఉట్టిపడేలా తీర్చిదిద్దారు. మహాసభలు పోర్టు కళావాణి ఆడిటోరియంలో ఉదయం 10 గంటలకు పతాకావిష్కరణతో ప్రారంభం కానున్నాయి. ఉదయం 10.30 గంటలకు ప్రతినిధుల సభ ప్రారంభం కానుంది. మహాసభలో వివిధ పోరాటాలు, ఉద్యమానుభవం కల్గిన 900 మంది ప్రతినిధులు వివిధ రాష్ట్రాల నుంచి హాజరుకానున్నారు. మంగళవారం నుంచి ప్రారంభం కానున్న ఈ సభలు శనివారం వరకూ జరుగనున్నాయి. చివరి రోజైన ఆదివారం మధ్యాహ్నం రెండు గంటలకు విశాఖ ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి బహిరంగసభ జరుగనున్న ఆర్కే బీచ్ వరకు భారీ ప్రదర్శన చేరుకుంటుంది. అనంతరం అక్కడ భారీ బహిరంగసభ జరుగనుంది. సంస్కృతి సంప్రదాయాలకు ప్రతిబింబింగా మహాసభల ప్రాంగణం పల్లె సంస్కృతిని ప్రతిబింబించేలా తీర్చిదిద్దారు. సహజ వనరులు, ప్రకృతిలో లభించే వస్తువులతో నయానందకరంగా రూపొందిం చారు. పర్యావరణానికి ఎటువంటి నష్టంలేకుండా వివిధ ఆకృతులు తయారు చేశారు. ప్రతినిధుల మహాసభ ప్రవేశద్వారాన్ని గిరిజనులు నివసించేఆవాసాలను తలపించేలా ముస్తాబు చేసారు. మేదరు, జనపనార,కొబ్బరి పీచును ఉపయోగించే అనేక రూపాలతో మనస్సును కట్టిపడేలా రూపాలను ఏర్పాటు చేశారు. వేదికను అత్యంత ఆకర్షణీయంగా ముస్తాబు చేశారు. ప్రతినిధులు భోజనం చేసే మూడు భోజన శాలలకు శారద,నాగావళి, వంశధార నదుల పేర్లు పెట్టారు.ప్రాంగణంలో గ్రామీణ వాతావరణం ఉండేలా ఎండ్లబండ్లు, కోళ్ల గూళ్లు, తాటాకులతో ప్రత్యేకంగా పాకలు ఏర్పాటు చేశారు.ఆడిటోరియంలోని చెట్లను కొబ్బరి పీచు,కాగితపు తోరణాలతో అలంకరించారు. మహాసభల్లో చర్చించనున్న అంశాలివే ఈ మహాసభల్లో కాంగ్రెస్, ప్రాంతీయ పార్టీలతో ఎలా వ్యవహరించాలి. అందుకు అనుసరించాల్సిన వ్యూహంపై చర్చకు రానుంది.అంతకంటే ముఖ్యంగా సీపీఐ(ఎం) తనస ఒంత బలాన్ని పెంచుకోవడంపైనే మహాసభ దృష్టి కేంద్రీకరించ నుంది. నిర్మాణ పరమైన లోపాలు, బలహీనతలువంటి అంశాలపే ఈ ఏడాది ఏర్పాటు చేయనున్న ప్లీనంలో చర్చించాలని కేంద్ర కమిటీ గతంలోనే నిర్ణయించింది. వామపక్ష ఐక్యత మరింత బలపడేలా చొరవ తీసుకునేందుకు మహాసభ చర్చించనుంది. కేంద్రంలో మోడి, రాష్ర్టంలోని చంద్రబాబు, ఇతర రాష్ట్రాల్లోని పాలకపార్టీలు అనుసరిస్తున్న నయా ఉదారవాద విధానాలకు వ్యతిరేకంగా ప్రజా పోరాటాలను బలోపేతం చేసే అంశాలపై ఈ మహాసభలో చర్చించనున్నారు. -
కూతలా.. కోతలా!?
రైల్వే బడ్జెట్‌పై కోటి ఆశలు విజయవాడకు ప్రత్యేక కేటాయింపులు కావాలి ‘స్పెషల్’ రైళ్లు సకాలంలో నడిచేలా చూడాలి ప్లాట్‌ఫారాలపై నిలువ నీడ కల్పించండి ఏటా రైల్వే బడ్జెట్లో నిర్లక్ష్యానికి గురవుతున్న విజయవాడ డివిజన్‌కు రాష్ట్ర విభజన నేపథ్యంలో ఈసారైనా కేటాయింపులు ఘనంగా ఉంటాయని ప్రయాణికులు ఆశగా ఎదురుచూస్తున్నారు. రైల్వే మంత్రి సదానందగౌడ మంగళవారం పార్లమెంట్లో బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నారు. నవ్యాంధ్రప్రదేశ్‌లో విజయవాడ కీలకం కావడంతో ఈ డివిజన్‌కు కురిపించే వరాలపై రైల్వే వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఎప్పటిలా ఈసారీ కోతలు పెడతారా.. లేక కొత్త రైళ్లను మంజూరు చేస్తారా అన్నది మరికొన్ని గంటల్లో తేలనుంది. కూతలా.. కోతలా!? సాక్షి, విజయవాడ : ప్రత్యేక రైల్వే డివిజన్, చుట్టుపక్కల ప్రాంతాల్లో కొత్త రాజధాని ఏర్పాటు కావచ్చన్న వార్తల నేపథ్యంలో విజయవాడ డివిజన్ ప్రత్యేకత సంతరించుకుంది. ఇక్కడినుంచి దేశం నలుమూలలకు కొత్త రైళ్లు వేయాలని, కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని ముఖ్యమైన రైల్వేస్టేషన్లను ఏ-కేటగిరీగా అభివృద్ధి చేయాలంటూ ఇప్పటికే మన ఎంపీలు రైల్వే మంత్రికి విజ్ఞాపన పత్రాలు అందజేశారు. ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే అనేక సౌకర్యాలు రైల్వే బడ్జెట్లో మంజూరు కావాలని ప్రయాణికులు, రైల్వే అధికారులు అభిప్రాయపడుతున్నారు. ప్రధాన డిమాండ్లు ఇవే.. విజయవాడ, మచిలీపట్నం నుంచి దేశంలోని అన్ని ప్రాంతాలకు కొత్త రైళ్లు ప్రారంభించాలి. విజయవాడ మీదుగా దూర ప్రాంతాలకు వెళుతున్న ప్రశాంతి, శేషాద్రి, యశ్వంత్‌పూర్, ఫలక్‌నుమా, నాగర్సోల్, మన్మాడ్, పాట్నా, కేరళ, జీటీ తదితర ఎక్స్‌ప్రెస్ రైళ్లల్లో విజయవాడ ప్రయాణికుల కోసం స్లీపర్ క్లాస్‌లో 100 బెర్త్‌లు, ఏసీలో 50 బెర్త్‌లు ప్రత్యేకంగా కేటాయించాలి. ప్రయాణికుల రద్దీ ఉన్నప్పుడల్లా విజయవాడ నుంచి ప్రత్యేక రైళ్లు ఏర్పాటుచేస్తున్నారు. ఇవి సకాలంలో నడిచేందుకు, రైళ్లలో మంచినీరు, మరుగుదొడ్లు సరిగా ఉండే విధంగా బడ్జెట్లో తగిన చర్యలు తీసుకోవాలి. విజయవాడ జంక్షన్లో 8, 9, 10 ప్లాట్‌ఫారాలపై పూర్తిగా షెడ్లు లేకపోవడం వల్ల ప్రయాణికులు ఎండావానలకు ఇబ్బంది పడుతున్నారు. వీటి ఏర్పాటుకు బడ్జెట్లో నిధులు మంజూరుచేయాలి. గుడివాడ, మచిలీపట్నం స్టేషన్ల ఆధునికీకరణకు నిధులు కేటాయించాలి. విజయవాడ రైల్వే జంక్షన్‌ను అంతర్జాతీయ రైల్వేస్టేషన్ స్థాయికి పెంచాలి. విజయవాడ-మచిలీపట్నం మార్గం డబ్లింగ్ పనులు వేగంగా పూర్తిచేయాలి. కోటిపల్లి-నర్సాపురం మార్గానికి నిధులు కేటాయించాలి. రైల్వేస్టేషన్లో నాణ్యమైన ఆహారం లభ్యమయ్యేలా చూడాలి. మంచినీటి సౌకర్యం కల్పించాలి. రైల్వే ప్రయాణికుల భద్రత బాధ్యతల్ని ఆర్పీఎఫ్కు అప్పగించాలి. రైల్వే ఆస్తులను కాపాడేందుకు ప్రత్యేక పోలీసులను ఏర్పాటు చేయాలి. తెనాలి-రేపల్లి-మచిలీపట్నం-విజయవాడ-గుంటూరులను కలుపుతూ సర్క్యులర్ ట్రైన్ ఏర్పాటు చేయాలి. రైతులు తమ ఉత్పత్తులను ఎగుమతి చేసుకోవడానికి దూర ప్రాం తాలకు వెళ్లే రైళ్లలో ఒక పార్సిల్ వ్యాన్‌ను ఏర్పాటుచేసుకోవాలి. రైల్వే ఇంజిన్లు మరమ్మతుకు గురైతే తమిళనాడు వెళ్లాల్సి వస్తోంది. విజయవాడలోనే ఇంజిన్ మరమ్మతు ప్లాంట్ నెలకొల్పాలి. రైల్వే కోచ్‌లు మరమ్మతు చేసే లోకో షెడ్‌ను ఇక్కడే ఏర్పాటు చేయాలి. ఆశలు నెరవేరేనా.. ప్రతి ఏడాది రైల్వే బడ్జెట్ వచ్చే ముందు ఈ ప్రాంత ప్రయాణికులు కోటి ఆశలతో ఎదురుచూస్తున్నారు. యూపీఏ సర్కారు అరకొర నిధులే మంజూరుచేసింది తప్ప ఈ ప్రాంత అభివృద్ధిపై పూర్తిస్థాయి దృష్టి పెట్టలేదు. కనీసం ఎన్డీఏ ప్రభుత్వమైనా దక్షిణ మధ్య రైల్వేకు, విజయవాడ డివిజన్‌కు పెద్దపీట వేస్తుందో లేదో వేచిచూడాల్సిందే. -
ఆర్టీసీ ఆస్తుల పంపక వ్యవహారం వీడని పీటముడి
హైదరాబాద్‌లోని ఆస్తుల పంపకంపై వివాదం సీమాంధ్రలో కొత్తగా నిర్మించుకోవడం వ్యయభరితమంటున్న ఆర్టీసీ కార్మికులు హక్కు కల్పిస్తే ఊరుకునేది లేదంటున్న తెలంగాణ ఉద్యోగులు రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆర్టీసీ ఆస్తుల పంపకం వ్యవహారం చిక్కుముడిగా మారింది. హైదరాబాదులోని కేంద్ర కార్యాలయాల ఆస్తుల పంపిణీపై ఇరువర్గాల మధ్య సమన్వయం కుదరటం లేదు. సీమాంధ్రకు హక్కు కల్పిస్తే ఊరుకునేది లేదని తెలంగాణ ఉద్యోగులు, ఉమ్మడిగా ఉన్నప్పుడే అభివృద్ధి జరిగింది కాబట్టి తమకూ హక్కు కావాలని సీమాంధ్ర ఉద్యోగులు వాదిస్తున్నారు. సాక్షి, విజయవాడ : ఆర్టీసీ ఆస్తుల పంపకం విషయంలో పీటముడి వీడడం లేదు. ప్రభుత్వ రంగ సంస్థలపై నిర్లక్ష్యం కారణంగా తమ అంశాన్ని పట్టించుకోవడం లేదని సీమాంధ్ర ఆర్టీసీ కార్మిక సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ వివాదం కొత్త ప్రభుత్వం వచ్చే వరకు తేలే సూచనలు కనబడడం లేదు. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, రవాణా శాఖ మంత్రులు కూర్చుని పరిష్కరించుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఇప్పటికే అక్కడ గెలిచిన తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె.చంద్రశేఖరరావు చేస్తున్న విద్వేషపూరిత వ్యాఖ్యల నేపథ్యంలో ఈ ప్రాంతానికి న్యాయం జరిగే అవకాశాలు కనపడడం లేదని కార్మిక సంఘాల నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్‌లోని కేంద్ర కార్యాలయాల ఆస్తుల పంపిణీపై ఇరువర్గాల మధ్య సమన్వయం కుదరలేదు. ఈ ప్రాంతంలోని ఆస్తులపై సీమాంధ్రకు హక్కు కల్పిస్తే ఊరుకునేది లేదని తెలంగాణా ఉద్యోగులు హెచ్చరిస్తున్నారు. ఉమ్మడిగా ఉన్న సమయంలోనే వీటన్నింటి అభివృద్ధి జరిగింది కాబట్టి తమకు హక్కు కావాలని ఇక్కడి ఉద్యోగులు వాదిస్తున్నారు. జనాభా ప్రాతిపదికన ఆస్తుల పంపకం కోసం నిర్థారించిన 58ః42 నిష్పత్తి ప్రకారం ఆర్టీసీ ప్రధాన కార్యాలయమైన బస్‌భవన్, ఎంజీబీఎస్ ఆర్టీసీ కల్యాణమండపం, ఆర్టీసీ ఆస్పత్రి, ఇతర డిపోలపై సీమాంధ్రకు హక్కు ఉండాలని కార్మికులు వాదిస్తున్నారు. వీటన్నింటినీ సీమాంధ్రలో ఏర్పాటు చేసుకోవడం చాలా ఖర్చుతో కూడుకున్న పని కావడంతో వీటిని ఉమ్మడి ఆస్తులుగా పరిగణించి తమకు వాటా ఇవ్వాలనేది కార్మికుల డిమాండ్. 1973-78 మధ్య ప్రతి కార్మికుడి వద్ద నుంచి జీతంలో కొంత మొత్తాన్ని వసూలు చేసి తార్నాకలో ప్రభుత్వం ఇచ్చిన భూమిలో ఆర్టీసీ ఉద్యోగుల కోసం ఆస్పత్రిని ఏర్పాటు చేశారు. దీనిలో తమకు హక్కు ఉందని సీమాంధ్ర ఉద్యోగులు స్పష్టం చేస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న అన్ని సదుపాయాలు పదేళ్లపాటు తెలంగాణలో కూడా కొనసాగించాలని, బస్సుల పర్మిట్ల విషయంలో తెలంగాణలో మినహాయింపు ఇవ్వాలని వీరు డిమాండ్ చేస్తున్నారు. ప్రత్యేకంగా తెలంగాణకు పర్మిట్లు తీసుకుంటే అది ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీపై పెనుభారం పడుతుందని కార్మికులు చెబుతున్నారు. ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉన్నందున అక్కడికి వెళ్లే బస్సులపై పర్మిట్ మినహాయించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ప్రాంతం నుంచి హైదరాబాద్ వెళ్లే బస్సులకు పార్కింగ్ కోసం ఎంజీబీఎస్, బీహెచ్ఈఎల్, ఈసీఐఎల్ మూడు ప్రాంతాల్లో స్థలాలు కేటాయించాలని, దానికి ప్రత్యామ్నాయంగా ఈ ప్రాంతంలో కూడా మూడుచోట్ల వారికి స్థలాలు కేటాయిస్తామని సీమాంధ్ర కార్మికులు చెబుతున్నారు. ఈ ప్రతిపాదనను తెలంగాణ ఉద్యోగులు అంగీకరించడం లేదు. బస్సులు తిరిగే భూభాగం పరిధి ఏ ప్రాంతానికి ఎంత అనే అంశం ఆధారంగా పరిశీలిస్తే దాదాపు సగం బస్సులపై తమకు హక్కు ఉంటుందని తెలంగాణవారు వాదిస్తున్నారు. సీమాంధ్ర నుంచి తెలంగాణకు తిరుగుతున్న బస్సులను ఈ ప్రాంతానికే కేటాయించాలని, లేనిపక్షంలో రెండువేల మంది వరకు మిగులు కార్మికులుగా మారిపోయే ప్రమాదం ఉంది. దీంతో సీమాంద్ర ఉద్యోగులు అంగీకరించడం లేదు సీమాంధ్ర నుంచి వచ్చే బస్సులకు పార్కింగ్ మరమ్మతులకు అవసరమైన గ్యారేజి, సిబ్బందికి విశ్రాంతి గదుల నిర్మాణం కోసం ఖాళీస్థలాలు కేటాయించాలని ఇక్కడి వారు డిమాండ్ చేస్తుండగా, తెలంగాణ ఉద్యోగులు అంగీకరించడం లేదు. ఈ అంశాలపై పీటముడి వీడకపోవడంతో ఆస్తుల పంపకంపై వేసిన కమిటీ గవర్నర్‌కు తన నివేదిక ఇచ్చింది. అయితే గవర్నర్ కూడా దీనిపై ఇప్పటివరకు నిర్ణయం తీసుకోలేదు. రాష్ట్ర విభజనకు మరో వారం మాత్రమే సమయం ఉండటంతో ఈలోగా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపించడంలేదు. విద్యుత్ కార్మికులు తమ డిమాండ్ల కోసం మూడు రోజులు సమ్మె చేసినా సానుకూల స్పందన లేకపోవడం చూస్తుంటే తమకు న్యాయం జరుగుతుందన్న నమ్మకం లేదని కార్మికసంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఆస్తుల పంపకంలో అన్యాయం జరిగితే తీవ్రస్థాయిలో ఉద్యమిస్తామని గుర్తింపు కార్మిక సంఘం నేత వై.వి.రావు హెచ్చరించారు.