
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనకు సంబంధించి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ తదితరులు దాఖలు చేసిన పిటిషన్‌ను ఏప్రిల్ 11న విచారిస్తామని సుప్రీంకోర్టు పేర్కొంది. 2014లో రాష్ట్ర విభజన అనంతరం రెండు రాష్ట్రాల్లో రెండుసార్లు ఎన్నికలు జరగడంతో ఉండవల్లి అరుణ్‌కుమార్ తన పిటిషన్‌లో అభ్యర్థనను మార్చారు.
రాష్ట్రాలకు సంబంధించి ఆస్తులు, అప్పుల వ్యవహారాలను త్వరగా తేల్చాలని, ఆంధ్రప్రదేశ్‌కు లబ్ధి చేకూరేలా కేంద్రానికి ఆదేశాలివ్వాలని కోరారు. దీనిపై గతేడాది నవంబరు 28న విచారణకు రాగా ఫిబ్రవరి 22న విచారిస్తామని సుప్రీంకోర్టు పేర్కొంది. ఇదిలా ఉంటే ఈ నెల14న సుప్రీంకోర్టు ఓసర్క్యులర్ జారీ చేసింది.
ఓసారి నోటీసు అయిన అంశాలను బుధ, గురువారాల్లో విచారించబోమని అందులో స్పష్టంచేసింది. దీంతో బుధవారంనాటి విచారణ జాబితా నుంచి ఈ కేసును రిజిస్ట్రీ తొలగించారు. దీంతో ఉండవల్లి తరఫు న్యాయవాది అల్లంకి రమేశ్ మంగళవారం సాయంత్రం కోర్టు పనివేళల ముగింపు అనంతరం జస్టిస్ కేఎం జోసెఫ్ ధర్మాసనం ముందు ఈ అంశాన్ని ప్రస్తావించారు.
ఈ పిటిషన్‌ను కనీసం పది, పదిహేను రోజులు విచారించాల్సి ఉంటుందని, మూడు నెలల్లో తన పదవీ విరమణ ఉందని జస్టిస్ జోసెఫ్ గుర్తుచేశారు. అన్ని రోజులు అవసరంలేదని రమేశ్ వివరించారు. దీంతో ఏప్రిల్ 11న విచారణ చేపడతామని, ఆ రోజు జాబితాలో చేర్చాలని ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. మంగళవారం అర్ధరాత్రి సుప్రీంకోర్టు వెబ్‌సైట్‌లో ఈ ఆదేశాలు ఉంచింది.
Comments
Please login to add a commentAdd a comment