ఆర్టీసీ ఆస్తుల పంపక వ్యవహారం వీడని పీటముడి | Dealing with the problem the research underway is the share of assets | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ ఆస్తుల పంపక వ్యవహారం వీడని పీటముడి

Published Fri, May 30 2014 1:54 AM | Last Updated on Sat, Sep 2 2017 8:02 AM

ఆర్టీసీ ఆస్తుల పంపక వ్యవహారం వీడని పీటముడి

ఆర్టీసీ ఆస్తుల పంపక వ్యవహారం వీడని పీటముడి

  •   హైదరాబాద్‌లోని ఆస్తుల పంపకంపై వివాదం
  •   సీమాంధ్రలో కొత్తగా నిర్మించుకోవడం వ్యయభరితమంటున్న ఆర్టీసీ కార్మికులు
  •   హక్కు కల్పిస్తే ఊరుకునేది లేదంటున్న తెలంగాణ ఉద్యోగులు
  •  రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆర్టీసీ ఆస్తుల పంపకం వ్యవహారం చిక్కుముడిగా మారింది. హైదరాబాదులోని కేంద్ర కార్యాలయాల ఆస్తుల పంపిణీపై ఇరువర్గాల మధ్య సమన్వయం కుదరటం లేదు. సీమాంధ్రకు హక్కు కల్పిస్తే ఊరుకునేది లేదని తెలంగాణ ఉద్యోగులు, ఉమ్మడిగా ఉన్నప్పుడే అభివృద్ధి జరిగింది కాబట్టి తమకూ హక్కు కావాలని సీమాంధ్ర ఉద్యోగులు వాదిస్తున్నారు.
     
    సాక్షి, విజయవాడ : ఆర్టీసీ ఆస్తుల పంపకం విషయంలో పీటముడి వీడడం లేదు. ప్రభుత్వ రంగ సంస్థలపై నిర్లక్ష్యం కారణంగా  తమ అంశాన్ని పట్టించుకోవడం లేదని సీమాంధ్ర ఆర్టీసీ కార్మిక సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ వివాదం కొత్త ప్రభుత్వం వచ్చే  వరకు తేలే సూచనలు కనబడడం లేదు. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, రవాణా శాఖ మంత్రులు కూర్చుని పరిష్కరించుకోవాల్సిన పరిస్థితి ఉంది.  

    ఇప్పటికే అక్కడ గెలిచిన తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె.చంద్రశేఖరరావు చేస్తున్న విద్వేషపూరిత వ్యాఖ్యల నేపథ్యంలో ఈ ప్రాంతానికి న్యాయం జరిగే అవకాశాలు కనపడడం లేదని కార్మిక సంఘాల నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్‌లోని కేంద్ర కార్యాలయాల ఆస్తుల పంపిణీపై ఇరువర్గాల మధ్య సమన్వయం కుదరలేదు. ఈ ప్రాంతంలోని ఆస్తులపై సీమాంధ్రకు హక్కు కల్పిస్తే ఊరుకునేది లేదని తెలంగాణా ఉద్యోగులు హెచ్చరిస్తున్నారు. ఉమ్మడిగా ఉన్న సమయంలోనే వీటన్నింటి అభివృద్ధి జరిగింది కాబట్టి తమకు హక్కు కావాలని ఇక్కడి ఉద్యోగులు వాదిస్తున్నారు.

    జనాభా ప్రాతిపదికన ఆస్తుల పంపకం కోసం నిర్థారించిన 58ః42 నిష్పత్తి ప్రకారం ఆర్టీసీ ప్రధాన కార్యాలయమైన బస్‌భవన్, ఎంజీబీఎస్ ఆర్టీసీ కల్యాణమండపం, ఆర్టీసీ ఆస్పత్రి, ఇతర డిపోలపై సీమాంధ్రకు హక్కు ఉండాలని కార్మికులు వాదిస్తున్నారు. వీటన్నింటినీ సీమాంధ్రలో ఏర్పాటు చేసుకోవడం చాలా ఖర్చుతో కూడుకున్న పని కావడంతో వీటిని ఉమ్మడి ఆస్తులుగా పరిగణించి తమకు వాటా ఇవ్వాలనేది కార్మికుల డిమాండ్.

    1973-78 మధ్య ప్రతి కార్మికుడి వద్ద నుంచి జీతంలో కొంత మొత్తాన్ని వసూలు చేసి తార్నాకలో ప్రభుత్వం ఇచ్చిన భూమిలో ఆర్టీసీ ఉద్యోగుల కోసం ఆస్పత్రిని ఏర్పాటు చేశారు. దీనిలో తమకు హక్కు ఉందని సీమాంధ్ర ఉద్యోగులు స్పష్టం చేస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న అన్ని సదుపాయాలు పదేళ్లపాటు తెలంగాణలో కూడా కొనసాగించాలని, బస్సుల పర్మిట్ల విషయంలో తెలంగాణలో మినహాయింపు ఇవ్వాలని వీరు డిమాండ్ చేస్తున్నారు.
     
    ప్రత్యేకంగా తెలంగాణకు పర్మిట్లు తీసుకుంటే అది ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీపై పెనుభారం పడుతుందని కార్మికులు చెబుతున్నారు. ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉన్నందున అక్కడికి వెళ్లే బస్సులపై పర్మిట్ మినహాయించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ప్రాంతం నుంచి హైదరాబాద్ వెళ్లే బస్సులకు పార్కింగ్ కోసం ఎంజీబీఎస్, బీహెచ్‌ఈఎల్, ఈసీఐఎల్ మూడు ప్రాంతాల్లో స్థలాలు కేటాయించాలని, దానికి ప్రత్యామ్నాయంగా ఈ ప్రాంతంలో కూడా మూడుచోట్ల వారికి స్థలాలు కేటాయిస్తామని సీమాంధ్ర కార్మికులు చెబుతున్నారు.
     
    ఈ ప్రతిపాదనను తెలంగాణ ఉద్యోగులు అంగీకరించడం లేదు. బస్సులు తిరిగే భూభాగం పరిధి ఏ ప్రాంతానికి ఎంత అనే అంశం ఆధారంగా పరిశీలిస్తే దాదాపు సగం బస్సులపై తమకు హక్కు ఉంటుందని తెలంగాణవారు వాదిస్తున్నారు. సీమాంధ్ర నుంచి తెలంగాణకు తిరుగుతున్న బస్సులను ఈ ప్రాంతానికే కేటాయించాలని, లేనిపక్షంలో రెండువేల మంది వరకు మిగులు కార్మికులుగా మారిపోయే ప్రమాదం ఉంది.

    దీంతో సీమాంద్ర ఉద్యోగులు అంగీకరించడం లేదు  సీమాంధ్ర నుంచి వచ్చే బస్సులకు పార్కింగ్ మరమ్మతులకు అవసరమైన గ్యారేజి, సిబ్బందికి విశ్రాంతి గదుల నిర్మాణం కోసం ఖాళీస్థలాలు కేటాయించాలని  ఇక్కడి వారు డిమాండ్ చేస్తుండగా, తెలంగాణ ఉద్యోగులు అంగీకరించడం లేదు. ఈ అంశాలపై పీటముడి వీడకపోవడంతో ఆస్తుల పంపకంపై వేసిన కమిటీ గవర్నర్‌కు తన నివేదిక ఇచ్చింది. అయితే గవర్నర్ కూడా దీనిపై ఇప్పటివరకు నిర్ణయం తీసుకోలేదు.

    రాష్ట్ర విభజనకు మరో వారం మాత్రమే సమయం ఉండటంతో ఈలోగా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపించడంలేదు. విద్యుత్ కార్మికులు తమ డిమాండ్ల కోసం మూడు రోజులు సమ్మె చేసినా సానుకూల స్పందన లేకపోవడం చూస్తుంటే తమకు న్యాయం జరుగుతుందన్న నమ్మకం లేదని కార్మికసంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఆస్తుల పంపకంలో అన్యాయం జరిగితే తీవ్రస్థాయిలో ఉద్యమిస్తామని గుర్తింపు కార్మిక సంఘం నేత వై.వి.రావు హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement