సాక్షి, చిత్తూరు: జిల్లాలో తిరుపతి, చిత్తూరు రెండు కార్పొరేషన్లు. వీటిలో పాతికేళ్ల కిందట నుంచే తిరుపతి అభివృద్ధి చెందుతోంది. అప్పటికే శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం, రుయా ఆస్పత్రి, ఎస్వీ మెడికల్ కాలేజీతో పాటు పలు రంగాల్లో అభివృద్ధి బాటలో పయనించింది. ఏడుకొండలవాడి సన్నిధి కావడంతో తిరుపతి అభివృద్ధి వేగంగా జరుగుతోంది. పాతికేళ్లకు...ఇప్పటికీ తిరుపతిలో ఎంతో తేడా ఉంది ! కానీ జిల్లా కేంద్రమైన చిత్తూరు మాత్రం అప్పటికి ఇప్పటికీ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అనే చందంగా అభివృద్ధిలో చాలా వెనుకబడి ఉంది. చిత్తూరుకు కార్పొరేషన్ హోదా దక్కడం మినహా పరిశ్రమలు, విద్యాసంస్థల ఏర్పాటుకు ప్రభుత్వాలు ఊతం ఇవ్వలేకపోయాయి. దశాబ్దాలుగా చిత్తూరు నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న ప్రజాప్రజాప్రతినిధులూ నగర మంచినీటి సమస్య తీర్చలేకపోయారు.
కొత్తరాష్ట్రంలో కూడా పాత ఆలోచనలే
నవ్యాంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈ జిల్లా నుంచే ప్రాతి నిథ్యం వహిస్తున్నారు. ఇటీవల రాజధాని ప్రకటన నేపథ్యంలో 13జిల్లాల అభివృద్ధికి సమగ్ర ప్రణాళిక ప్రకటించారు. అందులో చిత్తూరు జిల్లాకు సంబంధించి తిరుపతి ఎయిర్‌పోర్టును అంతర్జాతీయ విమానాశ్రయంగా అభివృద్ధి చేస్తామని తెలిపారు. కుప్పంలో కొత్తగా ఏయిర్‌పోర్టు స్థాపిస్తామన్నారు. ఏర్పేడులో ఎన్‌ఐఎంజెడ్, ఐఐటీ, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్(ఐఐఎస్), తిరుపతికి మెట్రోరైలు, తిరుపతి మెగా సిటీ, ఐటీ హబ్‌గా తిరుపతి, మెగా ఫుడ్‌పార్క్, హార్టికల్చర్ జోన్, ఆధ్యాత్మిక టూరిజం సర్క్యూట్ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. తిరుపతి, దాని చుట్టపక్కల ప్రాంతాల్లోనే అభివృద్ధి కేంద్రీకృతమయ్యేలా ప్రభుత్వం పరిశ్రమలు, విద్యా సంస్థల ఏర్పాటుకు ఉపక్రమించారనేది స్పష్టంగా తెలుస్తోంది.
చిత్తూరు అభివృద్ధికి ఊతం ఇచ్చేందుకు ఒక్కటైనా..?
వ్యవసాయంపై ఆధారపడి జీవించే రైతు కుటుంబాలు ఎక్కువగా ఉన్నప్పటికీ అందు కు అనువైన పరిస్థితులు ఇక్కడ లేవు. తాగునీటితోపాటు సాగునీటికి తీవ్రంగా ఇబ్బందు లు పడుతున్నారు. ఈ క్రమంలో చిత్తూరు కేంద్రంగా విద్యాసంస్థలు, పరిశ్రమల ఏర్పాటు జరగాలని ఇక్కడి వాసులు కాంక్షిస్తున్నారు. ముఖ్యమంత్రి ప్రకటించిన అభివృద్ధి ప్రణాళికలో చిత్తూరు కేంద్రంగా ఒక్కటి కూడా లేకపోవడం ఇక్కడి వారిని తీవ్రంగా బాధిస్తోంది. పోనీ స్థల సమస్య ఏదైనా ఉందా అంటే అదీ లేదు... చుట్టుపక్కల ప్రభుత్వ భూములు అధికంగా ఉన్నాయి.
ప్రజాప్రతినిధుల నిర్లిప్తత ప్రధాన కారణం!
చిత్తూరు అభివృద్ధి కోసం చిత్తూరు, చుట్టు పక్కల నియోజకవర్గాల ప్రజాప్రతినిధులు కూడా గట్టిగా వాణి వినిపించలేకపోయారు. పరిశ్రమలు, విద్యాసంస్థల ఏర్పాటుకు ప్రభుత్వంతో పోరాడలేకపోయారు. ఆ ప్రయత్నం కూడా చేయలేకపోయారు. ఎంపీ శివప్రసాద్ ఏదైనా ప్రభుత్వం కార్యక్రమం ఉంటే ప్రోటోకాల్ ప్రకారం కనిపించాలి కాబట్టి రావడం మినహా చిత్తూరు అభివృద్ధికి ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. తన పార్లమెంట్ పరిధిలో ఒక్క పరిశ్రమ, విద్యాసంస్థను కేంద్రం నుంచి రాబట్టలేకపోయారు. జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ గీర్వాణి, మేయర్ కఠారి అనురాధ, ఎమ్మెల్యే డీఏ సత్యప్రభ కూడా ఈ విషయంలో చొరవ చూపలేకపోయారు. అయితే చిత్తూరుకు మెడికల్ కాలేజీ కావాలని సత్యప్రభ గట్టిగా సీఎంతో పోరాడారు. దీంతోనే ప్రైవేటుగా అపోలో మెడికల్ కాలేజీ ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఇది మినహా అభివృద్ధిలో అందరూ విఫలమయ్యారనే స్పష్టమవుతోంది.
చిత్తూరుపై శీతకన్ను!
Published Thu, Oct 2 2014 3:38 AM | Last Updated on Sat, Sep 2 2017 2:14 PM
Advertisement
Advertisement