కంటితుడుపే..!
- విభజనకు ముందే రాజధానిని ఎంపిక చేస్తే బాగుండేది
- రాజధానిని నిర్ణయించాక
- కమిటీ నివేదికకు విలువేముంటుంది?
- శివరామకృష్ణన్ కమిటీ పర్యటనపై మేధావుల పెదవి విరుపు!
సాక్షి ప్రతినిధి, తిరుపతి: నవ్యాంధ్రప్రదేశ్‌కు రాజధాని ఎంపికలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై మేధావులు, విద్యావేత్తలు, ప్రజాసంఘాల నేతలు, స్వచ్ఛంద సంస్థల ప్రతి నిధులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర విభజనకు ముందే రాజధానిని ఎంపిక చేసి ఉంటే బాగుండేదనే అభిప్రాయం బలంగా వ్యక్తమవుతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాజధానిపై ఓ నిర్ణయానికి వచ్చాక.. రాజధాని ఎంపికపై శివరామకృష్ణన్ కమిటీ ఇచ్చే నివేదికకు విలువేముంటుందనే అనుమానాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.
కేవలం రాజధానిపై ప్రజల్లో ఆశలు రేకెత్తించడానికే శివరామకృష్ణ కమిటీ పర్యటన చేస్తోందని.. ఇది కంటితుడుపు చర్య అనే భావన బలపడుతోంది. ఇదీ.. శివరామకృష్ణన్ కమిటీ బుధవారం తిరుపతిలో శ్రీవెంకటేశ్వర విశ్వవిద్యాలయంలోని సెనేట్ హాల్‌లో నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణలో వ్యక్తమైన భావన..! వివరాల్లోకి వెళితే..
రాష్ట్ర విభజన నేపథ్యంలో నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని ఎంపికకు ప్రొఫెసర్ శివరామకృష్ణన్ నేతృత్వంలో ఐదుగురు సభ్యులతో కేంద్రం ఓ కమిటీని నియమించింది. శివరామకృష్ణన్ కమిటీ తొలివిడతగా కోస్తాం ధ్రలో పర్యటించింది. ఆ తర్వాత సీఎం చంద్రబాబుకు.. కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడుకు రాజధాని ఎంపికపై తాము సేకరించిన ప్రజాభిప్రాయాలను ప్రాథమికంగా వివరించింది. రాయలసీమ, ఉత్తరాంధ్రలో మలి విడత పర్యటన చేసి.. ప్రజాభిప్రాయాలను సేకరించి ఆగస్టు ఆఖరు నాటికి నివేదిక ఇస్తామని శివరామకృష్ణన్ కమిటీ స్పష్టం చేసింది.
ఇవేవీ పట్టించుకోకుండా కేంద్ర మంత్రి ఎం.వెంకయ్యనాయుడు, సీఎం చంద్రబాబు గుంటూరు-విజయవాడ మధ్య ప్రాంతంలో రాజధానిని ఏర్పాటుచేస్తామని సూత్రప్రాయంగా ప్రకటించారు. ఇదే అదునుగా తీసుకున్న రియల్టర్లు ఆ ప్రాంతంలో భారీ ఎత్తున భూములు కొనుగోలు చేశారు. భూముల ధరలు ఒక్కసారిగా పెరిగిపోవడంతో ఆ ప్రాంతంలో భూముల క్రయవిక్రయాలను ఆపేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. అంటే.. అదే ప్రాంతంలోనే రాజధానిని ఏర్పాటుచేస్తామనే భావనను ప్రభుత్వం పరోక్షంగా వ్యక్తం చేసింది.
ఇదే అంశాన్ని బుధవారం శివరామకృష్ణన్ కమిటీ ముందు మేధావులు, విద్యావేత్తలు, ప్రజాసంఘాల నేతలు లేవనెత్తారు. సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు రాజధాని ఎంపికపై లీకులు ఇస్తోన్న నేపథ్యంలో శివరామకృష్ణ కమిటీ నివేదికకు విలువ ఏముంటుందని నిల దీశారు. కేవలం రాయలసీమ ప్రజల ఆగ్రహాన్ని చల్లార్చడానికి మాత్రమే కమిటీ పర్యటిస్తోందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. విద్య, వైద్య, పారిశ్రామిక, వినోదం వంటి రంగాల్లో హైదరాబాద్‌ను అభివృద్ధి చేయడం వల్లే విభజనోద్యమం పుట్టుకొచ్చిందని.. ఇప్పుడు నవ్యాంధ్రప్రదేశ్‌లో అదే రీతిలో అభివృద్ధిని ఒక్కచోటే కేంద్రీకరిస్తే మళ్లీ విభజనవాదం తలెత్తే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
శ్రీబాగ్ ఓడంబడిక మేరకు రాయలసీమలోనే.. తిరుపతి కేం ద్రంగా రాజధానిని ఏర్పాటుచేయాలని డిమాండ్ చేశారు. తిరుపతికి సమీపంలో విమానాశ్రయం ఉందని.. దేశం నలుమూలకు వెళ్లగలిగే రైల్వే మార్గాలు, రోడ్డు మార్గాలు అందుబాటులో ఉన్నాయని.. తెలుగుగంగ ద్వారా నీటిని తీసుకోవచ్చునని రాజధాని ఏర్పాటుకు అన్ని సౌకర్యాలు ఉన్న నేపథ్యంలో తిరుపతినే రాజధానిగా ఎంపిక చేయాలని కోరారు.
నవ్యాంధ్రప్రదేశ్‌లో 13 జిల్లాల కేంద్రాలను రాజధాని స్థాయిలో అభివృద్ధి చేయాలని కోరారు. అధికారాన్ని, ప్రగతిని వికేంద్రీకరించి, అన్ని ప్రాంతాలను సమాంతరంగా అభివృద్ధి చేస్తేనే నవ్యాంధ్రప్రదేశ్ సుస్థిరంగా మనుగడ సాధించగలుగుతుందనే అభిప్రాయం బలంగా వ్యక్తమైంది. మేధావులు, విద్యావేత్తల అభిప్రాయాలతో ఏకీభవించిన శివరామకృష్ణ కమిటీ సభ్యులు ప్రజాభిప్రాయాలను ప్రతిబింబించేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నివేదిక ఇస్తామని చెప్పడం గమనార్హం.