community leaders
-
మూడు రాజధానులతోనే అన్ని ప్రాంతాల అభివృద్ధి
కడప కార్పొరేషన్: మూడు రాజధానులతోనే అన్ని ప్రాంతాల అభివృద్ధి సాధ్యపడుతుందని వివిధ ప్రజాసంఘాల నాయకులు స్పష్టం చేశారు. రాష్ట్రమంతా సమానంగా అభివృద్ధి చెందాలంటే పాలన వికేంద్రీకరణ కావడం ఒక్కటే మార్గమని పేర్కొన్నారు. ఇందుకోసం కార్యాచరణ రూపొందించి పోరాడాలని ఏకగ్రీవంగా తీర్మానించారు. మూడు రాజధానులకు మద్దతుగా కడపలోని సప్తగిరి కల్యాణ మండపంలో బుధవారం రౌండ్‌టేబుల్ సమావేశం జరిగింది. కార్యక్రమానికి బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు జీవీ రాఘవరెడ్డి, ఏపీ ఎన్జీవో జిల్లా శాఖ అధ్యక్షుడు శ్రీనివాసులు, ఏపీ బీసీ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ యానాదయ్య, ఎస్సీ సఫాయి కర్మచారీస్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ అధ్యక్షుడు గుండ్లపల్లి గరుడాద్రి, నవ్యాంధ్ర ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు పరిశపోగు శ్రీనివాసరావు మాదిగ, రెడ్డి సేవా సంఘం జిల్లా అధ్యక్షుడు లెక్కల కొండారెడ్డి, బీసీ, బెస్త, బలిజ సంక్షేమ సంఘాల నాయకులు హాజరై ప్రసంగించారు. రాయలసీమ ఏపీలో భాగమే.. సమావేశంలో వివిధ సంఘాల నాయకులు మాట్లాడుతూ.. ఏపీలో రాయలసీమ ఒక భాగమనే విషయాన్ని ఉమ్మడి రాష్ట్రంలోను, రాష్ట్ర విభజన తర్వాత కూడా పాలకులు మర్చిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీబాగ్ ఒడంబడికను పక్కన పెట్టారన్నారు. టీడీపీ హయాంలో అసెంబ్లీ తీర్మానం ప్రకారమే అమరావతిని రాజధానిగా ప్రకటించారని, ఇప్పుడు కూడా అసెంబ్లీలో చర్చించిన తర్వాతే మూడు రాజధానుల నిర్ణయం చేశారన్నారు. బిల్లు పాసైన తర్వాత కూడా దానిని అమల్లోకి తెచ్చుకోలేకపోతే భవిష్యత్ అంధకారమవుతుందని హెచ్చరించారు. రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేయాలని గత ప్రభుత్వంలో న్యాయవాదులు ఎన్ని ఉద్యమాలు చేసినా, సీజేలకు వినతిపత్రాలు ఇచ్చినా పట్టించుకోలేదన్నారు. ప్రస్తుతం మూడు రాజధానుల ఏర్పాటుపై న్యాయమూర్తుల వ్యాఖ్యలు దురదృష్టకరమని, వీటిని తాము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. వెనుకబడిన ప్రాంత ప్రజల మనోభావాలు దెబ్బతినేలా సీజే వ్యాఖ్యలు చేశారన్నారు. కొందరు న్యాయమూర్తులకు రాజధానిలో భూములు ఉన్నాయని, ఆ కేసు వారి వద్దకు వచ్చినప్పుడు నాట్ బిఫోర్ అని చెప్పకుండా, ఇంకో బెంచ్‌కు బదిలీ చేయకుండా తామే విచారణ చేస్తామనడం సహజ న్యాయసూత్రాలకు విరుద్ధమని తెలిపారు. రాయలసీమ ప్రజలు ఈ ప్రాంతానికి జరుగుతున్న అన్యాయంపై ప్రశ్నించి పోరాడాలన్నారు. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు తన సామాజిక వర్గానికి చెందిన వారికి భూములిప్పించి తన సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నారన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల ఆస్తులు దోచుకుని ఏర్పాటు చేసిన అమరావతి ఎట్టిపరిస్థితుల్లో ప్రజా రాజధాని అనిపించుకోదని స్పష్టం చేశారు. అక్కడ అణగారిన వర్గాలకు ఇళ్ల స్థలాలిస్తే వారు తమతో సమానమా అంటూ కోర్టులకు వెళ్లి అడ్డుకున్న వారు, అదే ప్రాంతం రాజధానిగా ఉంటే ఇతరులను అక్కడ కాలు మోపనిస్తారా అని ప్రశ్నించారు. అమరావతికి వ్యతిరేకంగా 2019 ఎన్నికల్లో ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చినా కోర్టుల ద్వారా అడ్డుకుని, పెయిడ్ ఆర్టిస్టులతో పోరాటం చేయిస్తున్నారని తెలిపారు. రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేయాలని చెప్పిన బీజేపీ ఇప్పుడు మాటమార్చి అమరావతి రైతుల పాదయాత్రకు మద్దతు పలకడం దారుణమన్నారు. మూడు రాజధానుల ఏర్పాటు కోసం కార్యాచరణ సిద్ధం చేసి పోరాడాలని సమావేశం ఏకగ్రీవంగా తీర్మానించింది. -
కంటితుడుపే..!
విభజనకు ముందే రాజధానిని ఎంపిక చేస్తే బాగుండేది రాజధానిని నిర్ణయించాక కమిటీ నివేదికకు విలువేముంటుంది? శివరామకృష్ణన్ కమిటీ పర్యటనపై మేధావుల పెదవి విరుపు! సాక్షి ప్రతినిధి, తిరుపతి: నవ్యాంధ్రప్రదేశ్‌కు రాజధాని ఎంపికలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై మేధావులు, విద్యావేత్తలు, ప్రజాసంఘాల నేతలు, స్వచ్ఛంద సంస్థల ప్రతి నిధులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర విభజనకు ముందే రాజధానిని ఎంపిక చేసి ఉంటే బాగుండేదనే అభిప్రాయం బలంగా వ్యక్తమవుతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాజధానిపై ఓ నిర్ణయానికి వచ్చాక.. రాజధాని ఎంపికపై శివరామకృష్ణన్ కమిటీ ఇచ్చే నివేదికకు విలువేముంటుందనే అనుమానాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. కేవలం రాజధానిపై ప్రజల్లో ఆశలు రేకెత్తించడానికే శివరామకృష్ణ కమిటీ పర్యటన చేస్తోందని.. ఇది కంటితుడుపు చర్య అనే భావన బలపడుతోంది. ఇదీ.. శివరామకృష్ణన్ కమిటీ బుధవారం తిరుపతిలో శ్రీవెంకటేశ్వర విశ్వవిద్యాలయంలోని సెనేట్ హాల్లో నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణలో వ్యక్తమైన భావన..! వివరాల్లోకి వెళితే.. రాష్ట్ర విభజన నేపథ్యంలో నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని ఎంపికకు ప్రొఫెసర్ శివరామకృష్ణన్ నేతృత్వంలో ఐదుగురు సభ్యులతో కేంద్రం ఓ కమిటీని నియమించింది. శివరామకృష్ణన్ కమిటీ తొలివిడతగా కోస్తాం ధ్రలో పర్యటించింది. ఆ తర్వాత సీఎం చంద్రబాబుకు.. కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడుకు రాజధాని ఎంపికపై తాము సేకరించిన ప్రజాభిప్రాయాలను ప్రాథమికంగా వివరించింది. రాయలసీమ, ఉత్తరాంధ్రలో మలి విడత పర్యటన చేసి.. ప్రజాభిప్రాయాలను సేకరించి ఆగస్టు ఆఖరు నాటికి నివేదిక ఇస్తామని శివరామకృష్ణన్ కమిటీ స్పష్టం చేసింది. ఇవేవీ పట్టించుకోకుండా కేంద్ర మంత్రి ఎం.వెంకయ్యనాయుడు, సీఎం చంద్రబాబు గుంటూరు-విజయవాడ మధ్య ప్రాంతంలో రాజధానిని ఏర్పాటుచేస్తామని సూత్రప్రాయంగా ప్రకటించారు. ఇదే అదునుగా తీసుకున్న రియల్టర్లు ఆ ప్రాంతంలో భారీ ఎత్తున భూములు కొనుగోలు చేశారు. భూముల ధరలు ఒక్కసారిగా పెరిగిపోవడంతో ఆ ప్రాంతంలో భూముల క్రయవిక్రయాలను ఆపేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. అంటే.. అదే ప్రాంతంలోనే రాజధానిని ఏర్పాటుచేస్తామనే భావనను ప్రభుత్వం పరోక్షంగా వ్యక్తం చేసింది. ఇదే అంశాన్ని బుధవారం శివరామకృష్ణన్ కమిటీ ముందు మేధావులు, విద్యావేత్తలు, ప్రజాసంఘాల నేతలు లేవనెత్తారు. సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు రాజధాని ఎంపికపై లీకులు ఇస్తోన్న నేపథ్యంలో శివరామకృష్ణ కమిటీ నివేదికకు విలువ ఏముంటుందని నిల దీశారు. కేవలం రాయలసీమ ప్రజల ఆగ్రహాన్ని చల్లార్చడానికి మాత్రమే కమిటీ పర్యటిస్తోందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. విద్య, వైద్య, పారిశ్రామిక, వినోదం వంటి రంగాల్లో హైదరాబాద్‌ను అభివృద్ధి చేయడం వల్లే విభజనోద్యమం పుట్టుకొచ్చిందని.. ఇప్పుడు నవ్యాంధ్రప్రదేశ్‌లో అదే రీతిలో అభివృద్ధిని ఒక్కచోటే కేంద్రీకరిస్తే మళ్లీ విభజనవాదం తలెత్తే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. శ్రీబాగ్ ఓడంబడిక మేరకు రాయలసీమలోనే.. తిరుపతి కేం ద్రంగా రాజధానిని ఏర్పాటుచేయాలని డిమాండ్ చేశారు. తిరుపతికి సమీపంలో విమానాశ్రయం ఉందని.. దేశం నలుమూలకు వెళ్లగలిగే రైల్వే మార్గాలు, రోడ్డు మార్గాలు అందుబాటులో ఉన్నాయని.. తెలుగుగంగ ద్వారా నీటిని తీసుకోవచ్చునని రాజధాని ఏర్పాటుకు అన్ని సౌకర్యాలు ఉన్న నేపథ్యంలో తిరుపతినే రాజధానిగా ఎంపిక చేయాలని కోరారు. నవ్యాంధ్రప్రదేశ్‌లో 13 జిల్లాల కేంద్రాలను రాజధాని స్థాయిలో అభివృద్ధి చేయాలని కోరారు. అధికారాన్ని, ప్రగతిని వికేంద్రీకరించి, అన్ని ప్రాంతాలను సమాంతరంగా అభివృద్ధి చేస్తేనే నవ్యాంధ్రప్రదేశ్ సుస్థిరంగా మనుగడ సాధించగలుగుతుందనే అభిప్రాయం బలంగా వ్యక్తమైంది. మేధావులు, విద్యావేత్తల అభిప్రాయాలతో ఏకీభవించిన శివరామకృష్ణ కమిటీ సభ్యులు ప్రజాభిప్రాయాలను ప్రతిబింబించేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నివేదిక ఇస్తామని చెప్పడం గమనార్హం. -
‘ఎన్నికల’ బదిలీలు
మొదటి సారిగా ఎంపీడీఓలకు వర్తింపు మార్గదర్శకాలు జారీచేసిన జీఏడీ జిల్లా పరిషత్, న్యూస్‌లైన్ : రానున్న లోక్‌సభ ఎన్నికల విధులు నిర్వహించనున్న అధికారులు జిల్లాలో మూడేళ్లపాటు సర్వీసు పూర్తి చేస్తే తప్పనిసరిగా ఇతర జిల్లాలకు బదిలీ చేయాలని ప్రభుత్వ ఎన్నికల విభాగం స్థానిక ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేసింది. సాధారణంగా ఎన్నికల విధుల్లో రెవెన్యూ అధికారులకు ప్రత్యక్షంగా ప్రమేయం ఉంటున్నందున వారిని మాత్రమే బదిలీ చేసే వారు. గడిచిన లోక్‌సభ ఎన్నికల సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారులు, సహాయ జిల్లా ఎన్నికల అధికారులు, ఆర్వోలు, ఏఆర్వోలు, అదనపు డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్లు, డిప్యూటీ కలెక్టర్లు, ఆర్డీఓలు, బ్లాక్ డెవలప్మెంట్ అధికారులను బదిలీ చేయాలని కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఎంపీడీఓల సంఘం నాయకులు తమకు ఎన్నికల విధులకు ప్రత్యక్ష సంబంధాలు ఉండవని, బదిలీల్లో మినహాయించాలని కోరడంతో మినహాయింపు లభించింది. ఈసారి ఎన్నికల విధుల్లో ప్రత్యక్షంగా, పరోక్షంగా విధుల్లోకి తీసుకుంటామని రిజర్వులో పెట్టుకున్న అధికారులను సైతం బదిలీ చేయాల్సిందేనని ఈనెల 20న సాధారణ పరిపాలన విభాగం(జీఏడీ) జారీ చేసిన మార్గదర్శకాల్లో పేర్కొంది. ఇందులో ఆంధ్రప్రదేశ్‌లో బ్లాక్ డెవలప్మెంట్ అధికారులు లేనందున మండల పరిషత్ అభివృద్ధి అధికారుల పేరును చేర్చడంతో బదిలీలు తప్పవని తెలుస్తోంది. ఇతర జిల్లాల నుంచి వచ్చిన ఎంపీడీఓలు ఉంటే మూడేళ్ల సర్వీసు దాటితే బదిలీ చేయాలని నిబంధనల్లో పేర్కొన్నారు. ఇదిలా ఉండగా... జిల్లాలోని 50 మండలాలకు ఆరు మండలాల్లో ఎంపీడీఓలు లేరు. మిగతా 44 మండలాల్లో సుమారు 22 మంది ఎంపీడీఓలు మూడేళ్ల నుంచి ఆరేళ్ల వరకు ఒకే చోట పనిచేస్తున్నారు. జనవరి 31న ఆత్మకూరు ఎంపీడీఓ పదవీ విరమణ పొందుతుండడంతో ఖాళీ కానుంది. ఖాళీగా ఉన్న ఆరు మండలాల్లో మూడింటికి సూపరింటెండెంట్లు ఇన్‌చార్జ్‌లుగా వ్యవహరిస్తుండగా మిగతా మూడింటికి పక్క మండలాల ఎంపీడీఓలు బాధ్యతలు చూసుకుంటున్నారు. ఈ బదిలీ ప్రక్రియను ఫిబ్రవరి 10 వరకు పూర్తి చేసి 15వ తేదీలోగా కమిషన్‌కు సమాచారం అందించాలని సూచించారు. బదిలీ జరిగే తేదీకి కాకుండా 2014 మే 31 వరకు మూడేళ్లు పూర్తయినా సరే బదిలీ చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. చిట్యాల, రాయపర్తి, నర్సింహులపేట, నెల్లికుదురు మండలాలకు ఇతర జిల్లాల నుంచి ఎంపీడీఓలుగా ఇటీవలే జాయిన్ అయ్యారు. వీరు మినహా మిగిలిన 40 మంది బదిలీలు అవుతాయని తెలిసింది. ఈ ప్రక్రియ పీఆర్ కమిషనర్ కార్యాలయంలో ఇప్పటికే ప్రారంభమైనట్లు తెలుస్తోంది.