సాక్షి ప్రతినిధి, కర్నూలు : పంద్రాగస్టు వేడుకలకు కర్నూలు నగరం వేగంగా ముస్తాబవుతోంది. నవ్యాంధ్రప్రదేశ్‌లో మొట్ట మొదటిసారిగా స్వాతంత్య్ర వేడుకలను నిర్వహిస్తుండటంతో అధికార యంత్రాంగంప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అదే విధంగా పోలీసులకు ఈ వేడుకలు పెను సవాల్‌గా మారాయి. రాష్ట్ర విభజన తరువాత కొత్త రాజధాని కర్నూలును చేయాలనే డిమాండ్ ఊపందుకోవటం, జిల్లా వ్యాప్తంగా ఉద్యమాలు జోరందుకోవటంతో బందోబస్తు పెంచారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ఉండేందుకు ఏడు జిల్లాలకు చెందిన పోలీసు బలగాలను కర్నూలుకు రప్పించారు.
మంగళవారం సాయంత్రానికి వీరు నగరానికి చేరుకుని ఏపీఎస్పీ పటాలంతో పాటు నగరాన్ని గుప్పిట్లో తీసుకున్నారు. నగరంతో పాటు చుట్టుపక్కల గ్రామాలు, నల్లమల అటవీ ప్రాంతంలో విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. రాష్ట్ర డీజీపీ జేవీ రాముడు కర్నూలులో తిష్టవేసి ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. గవర్నర్, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు కర్నూలుకు విచ్చేస్తుండటంతో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.
శకటాలు సిద్ధం..: స్వాతంత్య్ర వేడుకలకు వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన 15 శకటాలను ప్రదర్శించనున్నారు. కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డులోని జంబోషెడ్‌లో వీటి తయారీ ముమ్మరంగా సాగుతోంది. ప్లానింగ్, ఇరిగేషన్, పురపాలక శాఖ, ఎన్‌ఆర్‌ఈజీఎస్, పారిశ్రామిక మౌలిక సదుపాయాలు, పరిశ్రమల శాఖ, సమాచార, సాంకేతిక శాఖ, వైద్యారోగ్య శాఖ, హౌసింగ్, ఆర్‌డబ్ల్యూఎస్, టూరిజం, డ్వాక్రా, పోలీస్, ట్రాన్స్ కో, అటవీశాఖల శకటాలను సిద్ధం చేస్తున్నారు.
ఏపీఎస్పీ క్యాంప్‌లో వేదికను హైదరాబాద్‌కు చెందిన వారు ఏర్పాటు చేస్తున్నారు. అదే విధంగా వీవీఐపీలు, వీఐపీ గ్యాలరీలను నిర్మిస్తున్నారు. పరేడ్ మైదానంలోని ఏపీఎస్పీ పోర్ట్‌గేట్ ఎదుట ఆంధ్రప్రదేశ్ చిహ్నమైన తెలుగుతల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు. నగరంలోని కూడళ్ల అలంకరణ, రహదారులకు మెరుగులు ముమ్మరంగా సాగుతున్నాయి. మైదానంలో లైటింగ్, స్టేజ్ మైక్‌సెట్ ఇతర అవసరాల కోసం విద్యుత్‌శాఖ రూ.13 లక్షలు వెచ్చించి పనులు పూర్తి చేశారు. మూడు 160 కేవీఏ ట్రాన్స్‌ఫార్మర్లు, మూడు 125 కేవీఏ జనరేటర్లు, అర కి.మీ మేర 15 విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేసి తీగలు లాగారు.
15నే గవర్నర్, ముఖ్యమంత్రి రాక?
గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈనెల 15న ఉదయం కర్నూలుకు చేరుకోనున్నారు. డిప్యూటీ సీఎం, హైకోర్టు జడ్జిలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రభుత్వ ఉన్నతాధికారులు, స్వాతంత్య్ర సమరయోధులు, పద్మ అవార్డు గ్రహీతలు ఓ రోజు ముందుగానే కర్నూలుకు చేరుకుంటారు. వీరికి ఏపీఎస్పీ పటాలంలో ప్రత్యేకంగా షామియానాలు ఏర్పాటు చేస్తున్నారు. గవర్నర్, సీఎం, డిప్యూటీ సీఎంలు, మంత్రులు, ఎమ్మెల్యేలు తదితరులు ఏ, బీ షామీయానాల కింద కూర్చొంటారు.
సీ-షామియానా కింద ఏపీఎస్పీ సిబ్బంది, కుటుంబ సభ్యులు, పోలీసు, రెవెన్యూ అధికారుల కుటుంబ సభ్యులు కూర్చొంటారు. డీ-షామియానా కింద విద్యార్థులు, ప్రజలు ఉంటారు. జెండా వందన కార్యక్రమం అనంతరం అవార్డులు ప్రదానం చేస్తారు. ఆ తర్వాత ఓ పది నిమిషాలపాటు ఆంధ్రప్రదేశ్‌లోని రెసిడెన్సియల్ పాఠశాలల విద్యార్థులతో భారతీయం అనే కార్యక్రమం నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో మొత్తం 14 కంటింజెంట్లు పాల్గొంటాయి. వాటిలో ఎనిమిది ఆర్మ్, మరో ఆరు నాన్ ఆర్మ్ కంటింజెంట్లు ఉంటారు. ఒక్కో కంటింజెంట్లో 36 మంది ఉంటారు. అదే విధంగా 1953-56 మధ్య కర్నూలు రాజధానిగా ఉన్న సమయంలోని చారిత్రిక ఘటనలు, వివిధ అంశాలను అందరూ తెలుసుకునేలా ఓ ప్రదర్శనను ఏర్పాటు చేయనున్నారు.
బందో‘మస్తు’: స్వాతంత్య్ర దినోత్సవం ముందు రోజు ఏపీఎస్పీ బెటాలియన్ ప్రాంతంలో పోలీసు శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించే అవకాశం ఉంది. ఇప్పటికే ఆ ప్రాంతంలో రాకపోకలు సాగించే ప్రయాణికులతో పాటు సందర్శకులుగా వచ్చి వెళ్లేవారిపై పోలీసులు డేగకన్ను సారించారు. ఏపీఎస్పీ బెటాలియన్‌లో ప్రధాన ద్వారం వద్దే క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. పటాలంతో పాటు చుట్టుపక్కల ఉన్న కాలనీలపై నిఘా పెట్టారు. ఇప్పటికే అనుమానితులను అదుపులోకి తీసుకుని పూర్తి స్థాయిలో స్కాన్ చేస్తున్నారు.
కర్నూలు నగరంలో వాహనాల రాకపోకలకు సంబంధించి జిల్లా ఎస్పీ ఇప్పటికే ప్రణాళిక సిద్ధం చేసి.. పటిష్ట భద్రత ఏర్పాట్లపై కసరత్తు చేస్తున్నారు. చిత్తూరు, కడప, అనంతపురం, గుంటూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు సంబంధించిన 2,500 మంది పోలీసు సిబ్బంది బందోబస్తులో ఉన్నారు. స్వాతంత్య్ర వేడుకలకు సంబంధించి బుధవారం నుంచి రిహార్సల్స్ నిర్వహించనున్నారు. వేడుకలను కలెక్టర్ విజయమోహన్, ఎస్పీ రవికృష్ణ, జేసీ కన్నబాబు తదితరులు పర్యవేక్షిస్తున్నారు.
పోలీసు గుప్పిట్లో..
Published Wed, Aug 13 2014 1:26 AM | Last Updated on Sat, Sep 2 2017 11:47 AM
Advertisement