మోక్షమెప్పుడో?
- బందరు పోర్టు
- ఆరు నెలల్లో పనులు ప్రారంభిస్తామంటూ మంత్రుల హామీలు
- భూసేకరణకే 8 నెలలు
- నెలరోజులైనా అడుగు ముందుకు పడని వైనం
- రాష్ట్ర విభజన నేపథ్యంలో నిర్మాణం అనివార్యమే
నవ్యాంధ్రప్రదేశ్ నిర్మాణంలో బందరు పోర్టు నిర్మాణం కూడా కీలకం. ఉన్న వనరులను వినియోగించుకుని దేశ, విదేశీ మారక ద్రవ్యాన్ని ఆర్జించేందుకు పోర్టు దోహదం చేస్తుందనడంలో సందేహం లేదు. కానీ పోర్టు నిర్మించి తీరుతామంటూ మంత్రులు చేస్తున్న ప్రకటనలు మాత్రం ఆచరణలోకి రావడం లేదు. ప్రభుత్వం ఏర్పడి సరిగ్గా నెలరోజులవుతున్నా పోర్టు అంశం ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు.
మచిలీపట్నం : జిల్లా ప్రజల ఆకాంక్షగా ఉన్న బందరు పోర్టు నిర్మాణం ఇప్పుడు ప్రధాన అంశంగా మారింది. పాలకులు చిత్తశుద్ధి చూపి పోర్టు నిర్మిస్తే నవ్యాంధ్రప్రదేశ్ నిర్మాణంలో ప్రధాన పాత్ర పోషిస్తుందనడంలో సందేహం లేదు. పోర్టు నిర్మించి తీరుతామంటూ జిల్లా మంత్రులు పదేపదే చేస్తున్న ప్రకటనలు మాత్రం ఆచరణలోకి రావడం లేదు. పోర్టు అభివృద్ధి జరగాలంటే భూ సేకరణ కీలక అంశంగా మారింది. 2012 మే నెలలో అప్పటి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి జారీ చేసిన జీవో నంబర్ 11 ప్రకారం 5,324 ఎకరాల భూమిని సేకరించాలి.
ఇంత పెద్ద మొత్తంలో భూసేకరణ చేయాలంటే సాంకేతికంగా అనేక అవరోధాలు ఎదురవడంతో పాటు, అందరూ సహకరిస్తే కనీసంగా ఏడెనిమిది నెలల సమయం పడుతుందని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. మంత్రులు చెప్పే మాటలకు, రెవెన్యూ అధికారుల వాదనకు మధ్య పొంతన కుదరడం లేదు. ఇంకోఅంశమేమంటే పోర్టు పనులు దక్కించుకున్న నవయుగ కన్సార్టియంతో ప్రభుత్వం నేటివరకు ఎలాంటి సంప్రదింపులూ జరపలేదని, ఇందుకు మరికొన్ని రోజులు సమయం పట్టే అవకాశం ఉందని ఆ సంస్థ ప్రతినిధులే చెబుతున్నారు.
అవరోధాలు అధిగమించాలి...
రూ.5 వేల కోట్లతో 5,324 ఎకరాల విస్తీర్ణంలో పోర్టు నిర్మాణం జర గాల్సి ఉంది. పోర్టు నిర్మాణానికి అవసరమైన భూ సేకరణకు అవసరమైన నిధులను తామే సమకూరుస్తామని నవయుగ సంస్థ గతంలోనే ప్రభుత్వానికి లేఖ రాసింది. జిల్లా కలెక్టర్ భూసేకరణకు రూ.451.42 కోట్లు, 563 కుటుంబాలకు పునరావాసం కల్పించేందుకు రూ.43.58 కోట్లు అవసరమవుతాయని 2011 జూలైలో ప్రభుత్వానికి నివేదిక పంపారు.
పోర్టు భూసేకరణ జరగాలంటే అనేక అవరోధాలను అధిగమించాల్సి ఉంది. తొలుత కలెక్టర్ భూ సేకరణకు డ్రాఫ్ట్ నోటిఫికేషన్ విడుదల చేయాలి. అనంతరం డిక్లరేషన్ ఇవ్వాలి. ఈ తతంగం ముగిసిన అనంతరం 5-ఏ విచారణ చేయాలి. ఈ విచారణలో రైతులు తాము భూములను ఇస్తున్నట్లు అంగీకార పత్రాలు ఇవ్వాలి. పోర్టుకు అవసరమైన భూసేకరణకు కలెక్టర్ అవార్డు పాస్ చేయాలి.
ఈ వ్యవహారం మొత్తం కొలిక్కి రావాలంటే ఎనిమిది నెలల సమయం పడుతుందని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. భూములు కోల్పోయే రైతులు ఎవరైనా అంగీకార పత్రం ఇవ్వకుంటే కోర్టు ద్వారా సంబంధిత భూములను సేకరించాల్సి ఉంటుంది. ఈ వ్యవహారం కోర్టు వరకు వెళితే భూ సేకరణ ప్రక్రియలో మరింత జాప్యం జరిగే అవకాశం ఉంది. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకోకుండా మంత్రులు ఆరు నెలల్లో పోర్టు పనులు ప్రారంభిస్తామని చెప్పడం గమనార్హం.
పారిశ్రామిక అభివృద్ధికి దోహదం...
బందరు పోర్టు నిర్మాణం జరిగితే విదేశాలకు సరకుల ఎగుమతులు, దిగుమతులు జరగటంతో పాటు జిల్లా పారిశ్రామికంగా అభివృద్ధి చెందే అవకాశం ఉంది. పోర్టుకు అనుబంధంగా జిల్లాలో 27 రకాల పరిశ్రమలు స్థాపించేందుకు అవకాశం ఉంటుందని సాంకేతిక నిపుణులు చెబుతున్నారు. తెలంగాణ రాజధాని హైదరాబాదుకు అత్యంత సమీపంలో బందరు పోర్టు ఉంది.
చెన్నై నుంచి కోల్‌కతా వరకు కంప్యూటర్‌లు, ఇతర సాఫ్ట్‌వేర్ పరికరాలు సముద్ర మార్గం ద్వారా బందరు పోర్టు మీదుగానే రవాణా అవుతూ ఉంటాయి. ఈ పరికరాలు విశాఖపట్నం, లేదా కాకినాడ పోర్టులలో దించి అక్కడినుంచి హైదరాబాదుకు విజయవాడ మీదుగా రోడ్డు మార్గం ద్వారా తరలిస్తున్నారు. దీంతో సమయం వృథా కావడంతో పాటు, రోడ్డు మార్గాన రవాణా ఖర్చులు తడిసిమోపెడవుతున్నాయి.
బందరు పోర్టులోనే ఈ పరికరాలను దించి హైదరాబాద్ తదితర ప్రాంతాలకు తక్కువ ఖర్చుతో రవాణా చేయొచ్చని సాంకేతిక నిపుణులు చెబుతున్నారు. దీంతో పాటు బందరు-విజయవాడ మధ్య 65 కిలోమీటర్ల మేర ఉన్న జాతీయ రహదారిని రూ.750 కోట్లతో నాలుగు లేన్లుగా అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం రెండేళ్ల క్రితమే అనుమతులు ఇచ్చింది. పోర్టు నిర్మాణం ఆలస్యం కావడంతో ఈ రోడ్డు నిర్మాణం దాదాపు నిలిచిపోయింది. పోర్టు నిర్మిస్తే మచిలీపట్నం నుంచి సరకుల రవాణా పెరిగే అవకాశం ఉండటంతో ఈ జాతీయ రహదారి నిర్మాణం తప్పనిసరిగా చేయాల్సి ఉంటుంది.
విజయవాడ - గుంటూరు మధ్య నూతనంగా నిర్మించబోయే రాజధానికి అత్యంత సమీపంలో బందరు పోర్టు ఉంటుంది. దీంతో పాటు విజయవాడలోని వీటీపీఎస్‌కు ఒరిస్సా నుంచి బొగ్గును ఓడల ద్వారా విశాఖపట్నం వరకు తీసుకువచ్చి అక్కడినుంచి వ్యాగన్ల ద్వారా విజయవాడకు తరలిస్తున్నారు. బందరు పోర్టు నిర్మిస్తే అతి తక్కువ దూరం నుంచే బొగ్గు రవాణాకు అవకాశముంటుంది. కృష్ణా, గుంటూరు, నల్లగొండ తదితర జిల్లాల్లో ఉత్పత్తి అవుతున్న సిమెంటు, ధాన్యం, బియ్యం, వస్త్రాలు, మత్స్య సంపదను అతి తక్కువ ఖర్చుతో విదేశాలకు ఎగుమతి చేసే వెసులుబాటు కలుగుతుంది.
బ్రిటీష్, ఫ్రెంచి, డచ్ పాలకులు సాంకేతి పరిజ్ఞానం అంతగా అందుబాటులో లేని 300 సంవత్సరాల క్రితమే బందరు పోర్టునుంచి వేలాది టన్నుల సరకులను ఎగుమతి, దిగుమతి చేసుకున్నారు. నేడు సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చినా బందరు పోర్టు ఇంకా పాలకుల నిర్లక్ష్యానికి గురికావడం శోచనీయం. రాష్ట్ర విభజన నేపథ్యంలో అయినా అభివృద్ధిలో కీలకంగా మారనున్న పోర్టు నిర్మాణంపై దృష్టి సారించాలని జిల్లా వాసులు కోరుతున్నారు.
పదకొండేళ్లుగా ఉద్యమం...
బందరు పోర్టును నిర్మించాలని 2003 నుంచి ఉద్యమాలు ప్రారంభమయ్యాయి. 2004లో 100 రోజులపాటు రిలే దీక్షలు, 10 రోజుల పాటు ఆమరణ దీక్షలు అన్ని రాజకీయ పక్షాల నాయకులు చేశారు. దీంతో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి బందరు పోర్టును నిర్మిస్తామని హామీ ఇచ్చారు. 2008 ఏప్రిల్ 23న బందరు పోర్టు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. 2009లో ఎన్నికల నేపథ్యంలో పోర్టు పనులకు బ్రేక్ పడింది. 2009 సెప్టెంబర్ రెండో తేదీన వైఎస్ మరణంతో పోర్టు అంశాన్ని పట్టించుకునేవారే కరువయ్యారు. ప్రస్తుత టీడీపీ పాలకులు పోర్టు నిర్మిస్తారో, లేక కాలయాపన చేస్తారో వేచిచూడాల్సిందే.