
కడప : ఎవరికైనా ఉద్యోగంతో పాటు వ్యక్తిగత జీవితం ముఖ్యమే. వ్యక్తిగత కుటుంబ అవసరాలకు కూడా ఉద్యోగి తగినంత సమయం వెచ్చించాల్సి ఉంటుంది. అందుకోసమే ఉద్యోగులకు సెలవుల విధానాన్ని అమలు చేస్తున్నారు. ఆంధ్ర ప్రదేశ్ ఫాప్స్ అండ్ ఎస్టాబ్లిష్‌మెంట్ యాక్ట్ 1988 ప్రకారం ప్రైవేట్ సంస్థల్లో కొన్ని రకాల సెలవులను అమలు చేయాల్సి ఉంటుంది. కనీసం ఏడాదిలో ఏడు రోజులను జాతీయ దినాలు, పర్వదినాలు కింద సెలవులు ఇవ్వాలని చట్టం చెబుతోంది. వాటిలో గణతంత్ర దినోత్సవం, స్వాతంత్య్ర దినోత్సవం, గాంధీ జయంతికి తప్పని సరిగా సెలవులు ఇవ్వాలి.
జాతీయ దినాలు జనవరి26, ఆగష్ట్ 15, అక్టోబర్ 2
వారాంతపు సెలవులు: వారంలో ఏడు రోజులకు గాను ఒకటి లేదా రెండు రోజులు సెలవుగా ఇస్తుంటారు. కంపెనీ పాలసీని బట్టి ఒకటా, రెండా అన్నది ఆధారపడి ఉంటుంది. ఎక్కువ శాతం ఒక్క రోజే సెలవుగా ఉంటుంది.
పండుగ దినాలు: వివిధ మతాలకు సంబంధించి ముఖ్యమైన పండగ రోజులోనూ సెలవులు ఉంటాయి.
ఎర్న్‌డ్ లీవ్స్–ప్రివిలేజ్ లీవ్స్: ప్రతి ఉద్యోగికి ఏడాదిలో ఇన్ని రోజులు అంటూ ఈఎల్స్ అంటూ ఉంటాయి. గడిచిన ఏడాదిలో ఎన్ని పని దినాలు ఉద్యోగి పని చేశాడన్న దానిపై ఆధారపడి ఈ సెలవులు ఉంటాయి. ఈఎల్స్‌ను వాడుకోనట్టయితే దాని కింద అదనపు వేతనాన్ని పొందవచ్చు. ఈ సెలవులు వాడుకుంటే ఆ రోజుల్లో వేతనాన్ని ( మూలవేతనం ప్రకారం ) యథావిధిగా పొందవచ్చు. అయితే సెలవు తీసుకోవాలా, లేక పని చేసి వేతనాన్ని పొందాలా అన్నది కంపెనీ అవసరాలపై ఆధారపడి ఉంటుంది.
క్యాజువల్ లీవ్: ఏడాదిలో 12 రోజులు సెలవు ఇవ్వాల్సి ఉంటుంది. నెలలో ఇన్ని రోజుల పాటు క్యాజువల్ లీవ్ అని ఇస్తుంటారు. గరిష్టంగా మూడు రోజుల వరకు ఉంటుంది. కొన్ని సంస్థల్లో నెలకు ఒక్కటే క్యాజువల్ లీవ్ ఆప్లయి అవుతుంది.
సిక్‌లీవ్ , మెడికల్ లీవ్: కార్యాలయానికి రాలేని అనారోగ్యానికి గురైన పరిస్థితుల్లో వాడుకునేందుకు నెలకు ఒక్క రోజైనా సిక్ లీవ్ ఉంటుంది. ఒక్క నెలలో వాడుకోకపోతే అవసరం వచ్చినప్పుడు ఒకటికి మించి వాడుకోవచ్చు, ఈ లీవ్ కింద ఎన్ని రోజులు సెలవులు ఇవ్వాలన్న విషయాన్ని వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు చట్టాలు నిర్దేశిస్తున్నాయి.
కాంపెన్సేటరీ ఆఫ్ (సీఆఫ్): సెలవు రోజుల్లో కూడా వచ్చి పని చేసినట్టయితే అందుకుగాను వేతనం చెల్లిస్తారు. లేదా ఒక రోజు సెలవు ఇస్తారు. ఈ సెలవునే ఆఫ్ లీవ్ అంటారు.
మెటర్నిటీ లీవ్: మహిళా ఉద్యోగుల సంతాన అవసరం కోసం (గర్బధారణ నుంచి డెలివరీ వరకు లేదా మరికొంత కాలం మెటర్నిటీ లీవ్ ఇస్తారు. కాకపోతే తక్కువ రోజుల పాటు ఉంటుంది. 1988 ఏపీ యాక్ట్ ప్రకారం కనీస డెలివరీకి ముందు ఆరువారాలు డెలివరీ తర్వాత ఆరువారాలు మెటర్నిటీ లీవ్ ఇవ్వాలి.
పేటర్నిటీ లీవ్: పైన చెప్పుకున్న తరహాలో ఉద్యోగి భార్య డెలివరీ అయిన సందర్భంలో వారి అవసరాలు చూసుకునేందుకు వీలుగా కొన్ని రోజుల పాటు ఉద్యోగులకు ఈ సెలవులు ఇస్తుంటారు.
క్యారంటైన్ లీవ్: ఇన్‌ఫెక్షన్ సంబంధిత వ్యాధికి లోనైన ఉద్యోగి వల్ల ఆ వ్యాధి కంపెనీలో ఇతర ఉద్యోగులకు కూడా వచ్చే ప్రమాదం ఉన్న పరిస్థితుల్లో సదరు ఉద్యోగికి ఈ సెలవు ఇస్తారు.
స్టడీ లీవ్: ఉద్యోగి ఉన్నత చదువులు , వృత్తిపరమైన నాలెడ్జ్ పెంచుకునేందుకు గాను ఈ సెలవు ఇస్తారు. ఈ సెలవులో వేతనం ఉండదు. అంటే ఉద్యోగం విడిచి పెట్టకుండా కొంతకాలం పాటు సెలవు తీసుకొని చదవుకోవచ్చు. ఇవే కాకుండా వివిధ రంగాలు కంపెనీలను బట్టి చైల్డ్‌కేర్ లీవ్, హాస్పిటల్ లీవ్, స్పెషల్ డిజెబిలిటీ లీవ్, లాస్‌ఆఫ్ పే (వేతనం లేకుండా తీసుకునే సెలవు) ఇలా భిన్న రకాలు సెలవులు కూడా ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment