చాక్లెట్లు కాదు.. రాకెట్లు | America, China, Europe and India are competing in space startups | Sakshi
Sakshi News home page

చాక్లెట్లు కాదు.. రాకెట్లు

Published Tue, Apr 11 2023 5:09 AM | Last Updated on Tue, Apr 11 2023 2:40 PM

America, China, Europe and India are competing in space startups - Sakshi

కె.జి.రాఘవేంద్రారెడ్డి (సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం) :  రండి బాబూ రండి.. కోరుకున్న డిజైన్‌లో రాకెట్‌ తయారు చేయబడును! వినటానికి ఇది వింతగానే అనిపించినా నిజమే మరి! స్పేస్‌ స్టార్టప్స్‌లో అగ్రదేశాలు పోటీ పడుతున్నాయి. స్కాట్లాండ్‌కు చెందిన స్కైరోరా సంస్థ కావాల్సిన రీతిలో రాకెట్లు తయారు చేస్తోంది. ప్రైవేట్‌ సంస్థలు స మాచారాన్ని పొందేందుకు శ్రమ పడాల్సిన అవసరం లే కుండా తాము చేసి పెడతామని చెబుతోంది. వన్‌స్టాప్‌ సొల్యూషన్‌ తరహాలో సేవలందిస్తామని భరోసా ఇస్తోంది.    

రాకెట్లండీ.. రాకెట్లు! 
ప్రైవేట్‌ కంపెనీలు తమ కమ్యూనికేషన్స్, పర్యవేక్షణల సామర్థ్యాలు పెంచుకునేందుకు సొంతంగా రాకెట్లను అంతరిక్ష కక్ష్యలోకి పంపిస్తున్నాయి. గతంలో కేవలం ప్రభుత్వ రంగంలోనే అనుమతించిన మనదేశం ప్రైవేట్‌ రాకెట్ల ప్రయోగానికి కూడా అవకాశం కల్పిస్తూ ముందుకు వెళుతోంది.

స్పేస్‌ ఎక్స్‌తో ప్రైవేట్‌ రాకెట్ల రేసును ఎలన్‌ మస్క్‌ ప్రారంభించారు. ఆయనకు చెందిన ఉపగ్రహ ఇంటర్నెట్‌ నెట్‌వర్క్‌ 42 వేల శాటిలైట్స్‌తో, జెఫ్‌ బెజోస్‌కు చెందిన కూపర్‌ నెట్‌వర్క్‌ 3,200 శాటిలైట్స్‌తో, యూకే ప్రభుత్వానికి చెందిన వన్‌వెబ్‌ నెట్‌వర్క్‌ 650 శాటిలైట్స్‌తో ఏర్పాటు చేసేలా పనులు సాగుతున్నాయి.  

పెద్ద ఎత్తున స్పేస్‌ స్టార్టప్స్‌ 
ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున స్పేస్‌ స్టార్టప్స్‌ పుట్టుకొస్తున్నాయి. అమెరికా, చైనా, భారత్‌తోపాటు ఐరోపా అంతరిక్ష అంకుర పరిశ్రమల్ని ప్రోత్సహిస్తున్నాయి. 2030 నా టికి గ్లోబల్‌ స్పేస్‌ మార్కెట్‌లో 10 శాతం వాటాను సొంతం చేసుకునేలా బ్రిటన్‌ సిద్ధమైంది. దీనికి సంబంధించి యూకే మార్కెట్‌ విలువ 483 బిలియన్‌ డాలర్లుగా అంచ నా వేస్తున్నారు.

స్కాట్లాండ్‌కు చెందిన అంతరిక్ష శాస్త్రవేత్త వోలోడిమిర్‌ లెవికిన్‌ 2017లో స్కైరోరాని ప్రారంభించా రు. లానార్క్‌షైర్‌ కంబర్‌నాల్డ్‌లోని ఫ్యాక్టరీలో స్కైరో రా తన రాకెట్లని డిజైన్‌ చేస్తోంది. ఎడిన్‌బర్గ్‌ శివార్లలోని టెస్ట్‌బ్లాస్ట్‌ ఏరియాలో వాటిని ఉంచుతోంది. ప్యాసింజర్‌ రాకె ట్స్‌ కాకుండా పేలోడ్‌ రాకెట్లను తయారు చేస్తోందీ సంస్థ.

స్కైరోరా ఫ్లాగ్‌షిప్‌ రాకెట్‌  
తొమ్మిది ఇంజన్లు, 50 వేల లీటర్ల ఇంధన సామర్థ్యం, 7 మెట్రిక్‌ టన్నుల్ని మోసుకెళ్లే సత్తాతో సెకనుకు 8 కి.మీ. వేగంతో దూసుకెళ్లగల ఫ్లాగ్‌షిప్‌ రాకెట్‌ని స్కైరోరా సిద్ధం చేసింది. స్కైరోరా ఎక్స్‌ఎల్‌ పేరుతో 315 కిలోగ్రాముల పేలోడ్‌ తీసుకెళ్లగల ఫ్లాగ్‌షిప్‌ రాకెట్‌ని ఈ ఏడాది షెట్‌ల్యాండ్‌ దీవుల నుంచి ప్రయోగించేందుకు సిద్ధమైంది.

వ్యవసాయ పరిశ్రమలు, ట్రాఫిక్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్, బీమా సంస్థలు.. ఇలా భిన్న రంగాలకు సంబంధించి అంతరిక్షం నుంచి ఆప్టికల్, టెంపరేచర్‌ సెన్సార్స్‌ లాంటి వాటితో సమాచారం సేకరించి రియల్‌టైమ్‌లో డేటా రూపొందించేందుకు రాకెట్లను తయారు చేస్తామని ప్రకటించింది. ఇప్పటికే మొదటి దశ ప్రాజెక్టును పూర్తి చేసింది. 22.7 మీటర్ల పొడవైన రాకెట్‌ మొదటి దశ ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించింది. 

స్పేస్‌ ఎక్స్‌కు భిన్నంగా స్కైరోరా.. 
రాకెట్ల తయారీలో ఎలన్‌మస్‌్కకు చెందిన స్పేస్‌ఎక్స్‌ సంస్థకు, స్కైరోరాకు గట్టి పోటీ నడుస్తోంది. స్పేస్‌ఎక్స్‌ అనేది బస్సు ప్రయాణంలాంటిదని, ఇతర ప్రయాణికులతో కలసి నిర్దేశించిన ప్రాంతం నుంచే వినియోగించుకునే అవకాశం ఉందని స్కైరోరా సీఈవో లెవికిన్‌ చెబుతున్నారు. స్కైరో రా మాత్రం ట్యాక్సీ ప్రయాణం లాంటిదని, ప్ర యాణికులు నచ్చిన ప్రాంతానికి ఎప్పుడు కావాలంటే అప్పుడు బయలుదేరేలా రూపొందించా మని తెలిపారు.

స్పేస్‌ఎక్స్‌లో రాకెట్‌ కోసం రెండేళ్ల పాటు నిరీక్షించాల్సి ఉండగా స్కైరోరాలో మా త్రం ఆర్నెల్లు చాలని స్పష్టం చేస్తున్నారు. యూకే అంతరిక్ష పరిశ్రమలో స్కైరోరా సరికొత్త విప్లవాన్ని సృష్టించేందుకు సిద్ధమవుతోంది. ఇదే తరహాలో భారత్, చైనా సొంత రాకెట్లను తయారు చేసే స్పేస్‌ స్టార్టప్స్‌ని ప్రోత్సహిస్తూ అంతరిక్ష రంగంలో దూసుకెళ్లే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement