‘కొలువు’ పొందువరకూ అలుపు లేదు మాకు | District youth showing the passionate on the sports | Sakshi
Sakshi News home page

‘కొలువు’ పొందువరకూ అలుపు లేదు మాకు

Published Sat, Nov 15 2014 4:25 AM | Last Updated on Sat, Sep 2 2017 4:28 PM

District youth showing the passionate on the sports

ఇంటికి చెప్పకుండా బ్యాటు పట్టుకుని దొంగచాటుగా గ్రౌండుకు వెళ్లే రోజులు పోయాయి. నాన్న ఏమంటారో అని భయపడుతూ రన్నింగ్ షూష్ ఇంటి వద్దే తొడుక్కుని పెరటి గోడ దూకి మైదానం వైపు పరిగెత్తే రోజులూ పోయాయి. దెబ్బ తగిలిన చేతిని అమ్మకు చూపించకుండా నక్కినక్కి పడుకునే రోజులు కూడా సెలవు తీసుకున్నాయి.

ఇప్పుడు ఆడడానికి, ఆడుతున్నామని చెప్పడానికి ఎవరూ సందేహించడం లేదు, భయపడడం లేదు. చదువుతో పాటు క్రీడలకు యువత పెద్దపీట వేస్తోంది.  ప్రభుత్వ కొలువులు ఆటల ద్వారా సాధ్యమవుతున్న వేళ  ఆటలను  తారకమంత్రంగా ఎంచుకుంది. అమ్మానాన్నలను ఒప్పించి, అనుకున్న లక్ష్యాన్ని అందుకునే వరకూ అలుపెరగని పోరుసాగిస్తోంది. జిల్లా యువతా ఆ దారిలోనే ఉపాధికి బాటలు వేసుకుంటోంది...

 
* క్రీడలపై మక్కువ చూపిస్తున్న జిల్లా యువత
* పేరు ప్రఖ్యాతులతో పాటు, ఉన్నత కొలువుల సాధనకు సరైన మార్గం
* ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగావకాశాలకు 2శాతం కోటా
* ప్రతిభ గల క్రీడాకారులకు ఆఫర్లు కురిపిస్తున్న ప్రైవేటు కంపెనీలు

 విజయనగరం మున్సిపాలిటీ: రోహిత్ శర్మ డబుల్ సెంచరీ... ఎక్కడ చూసినా అదే చర్చ. అంతకుముందు రాయుడు కళాత్మక శతకం. అప్పుడు కూడా ఎక్కడ చూసినా రాయుడు టాపిక్కే. ఇంకొంచెం ముందు కామన్‌వెల్త్‌లో పతకం కొల్లగొట్టిన మత్స సంతోషి. ఆ సమయంలో జిల్లాలో సంతోషి పేరు వినబడని ఊరు, వీధి లేవంటే అతిశయోక్తి కాదు.

జనాలను సమ్మోహితులను చేసే ఏదో శక్తి ఆటల్లో ఉంది. అందుకే జిల్లా యువత ఇప్పుడు ఆటల బాటలో నడుస్తోంది. సెలబ్రిటీగా వెలుగొందడంతో పాటు క్రీడల కోటాలో ఉద్యోగాలు కూడా లభిస్తుండడంతో ఈ దారిలో పయనించడానికి యువతరం  ఆసక్తి చూపుతోంది. అంతేకాదు నిరుపేద కుటుంబాల వారు కూడా క్రీడల మార్గంలో పయనించడానికి భయపడడం లేదు. జిల్లాలో ప్రధానంగా ఖోఖో, రెజ్లింగ్ (కుస్తీ) కబడ్డీ, వాలీబాల్ క్రీడలకు ఆదరణ ఉండేది. కానీ ఇప్పుడు ఆ లిస్ట్ పెద్దదైంది. షటిల్ బ్యాడ్మింటన్, బ్యాడ్మింటన్, తైక్వాండో, అథ్లెటిక్స్, ఫుట్‌బాల్, ఆర్చరీ, బాక్సింగ్ క్రీడాంశాల్లో జిల్లా క్రీడాకారులు మంచి ప్రతిభ చూపిస్తున్నారు. తద్వారా వారు ఏర్పర్చుకున్న ల క్ష్యాన్ని చేరుకుంటున్నారు.   జిల్లాలో ఇప్పటి వరకు   కబడ్డీలో రాణించిన 30 మంది వరకు క్రీడాకారులు వివిధ రంగాల్లో స్థిరపడటంతో పాటు ఉన్నత చదువులను క్రీడల కోటాలోనే అభ్యసించారు.
 
* ఖోఖోలో 40 మంది  , వాలీబాల్‌లో 20 మంది, వ్యాయామ ఉపాధ్యాయుల రంగంలో 50 మంది వరకు స్థిరపడ్డారు.
* ఇటీవల అంతర్జాతీయ వెయిట్‌లిఫ్టింగ్ పోటీల్లో పాల్గొని దేశ కీర్తిని చాటి చెప్పిన కొండవెలగాడ గ్రామానికి చెందిన మత్స సంతోషిని ఇందుకు ఉదాహరణగా పేర్కొనవచ్చు.

క్రీడలతో ప్రయోజనాలు ఎన్నో...
* క్రీడల్లో రాణించటం ద్వారా బహుళ ప్రయోజనాలు దక్కుతున్నాయి.  ఈ రంగంలో రాణించేవారికి ప్రభుత్వ శాఖలైన బ్యాంకింగ్, రైల్వే, పోలీస్, ఉపాధ్యాయ, పోస్టల్ విభాగాల్లో  ప్రభుత్వమే నేరుగా ఉద్యోగావకాశాలు కల్పిస్తోంది. పలు ప్రైవేటు సంస్థలైతే ప్రతిభ గల క్రీడాకారుల కోసం వెతుక్కుంటూ వచ్చి మంచి ప్రోత్సాహాకాలతో ఉద్యోగాలు కల్పిస్తున్నాయి.
 
చదువుతో పాటు క్రీడలూ ముఖ్యమే..
విద్యార్థులకు చదువుతో పాటు క్రీడలూ ముఖ్యమే. కేవలం చదువులోనే కాకుండా క్రీడల్లో రాణించటం ద్వారా అనతి కాలంలోనే మంచి పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. అంతేకాకుండా ఉన్నత అవకాశాలు అందిపుచ్చుకోవచ్చు. గ్రామీణ ప్రాంతంలో పుట్టిన నేను అంతర్జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొంటానని అనుకోలేదు. పట్టుదలతో శిక్షణ తీసుకున్నా తల్లిదండ్రులు, దేశ ప్రజలంతా గర్వించే విధంగా అంతర్జాతీయ పోటీల్లో పతకం సాధించాం. క్రీడల్లో కనబరుస్తున్న ప్రతిభను గుర్తించిన రైల్వే అధికారులు విజయనగరం రైల్వే  స్టేషన్‌లో టీసీగా ఉద్యోగం ఇచ్చారు. చదువుతో పాటు క్రీడల్లో పట్టుదలతో రాణిస్తే సాధించలేనిదంటూ ఉండదు.
 -మత్స.సంతోషి, అంతర్జాతీయ వెయిట్‌లిఫ్టర్, కొండగుంపాం.
 
పట్టుదలతో రాణిస్తే ప్రయోజనం...
ఏ రంగంలోనైనా పట్టుదలతో రాణిస్తే తప్పక ప్రయోజనం ఉంటుంది. నేను ఎనిమిదేళ్లుగా ఖోఖో ఆడుతున్నాను. మాది  నిరుపేద కుటుంబం. చిన్నతనంలో నాన్న చనిపోయారు. మావయ్య గోపాల్ ప్రోత్సాహంతో చదువుకుంటూనే క్రీడల్లో అడుగుపెట్టాను. ఇప్పటి వరకు 10 జాతీయ పోటీల్లో పాల్గొన్నా ఒక సారి జాతీయ గోల్డ్ మెడల్ దక్కించుకున్నా.  2010లో క్రీడలో రైల్వేలో  క్లర్క్ ఉద్యోగం  సాధించాను. ప్రస్తుతం బిలాస్‌పూర్‌లో ఉంటున్నా. నాకు ఉపాధి కల్పించిన  ఖోఖో క్రీడను రైల్వే శాఖ తరఫున , ఆంధ్రరాష్ట్రం తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్నా.
 - నమ్మి నరేష్, దాసన్నపేట, విజయనగరం.
 
రైల్వేలో ఉద్యోగం
చిన్నతనం నుంచి క్రీడలంటే నాకు ఇష్టం. కస్పా హైస్కూల్‌లో చదువుతున్న రోజుల్లో  ఖోఖో నేర్చుకున్నాను. అప్పటి వ్యాయామ ఉపాధ్యాయులు చిన్నంనాయుడు, గోపాల్ మాస్టార్లు అన్ని విధాలుగా ప్రోత్సహించారు. వారి ఆశీర్వాద బలం, నా నిరంతర శిక్షణతో పలు జాతీయ, రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొన్నాను. సౌత్ ఆసియా అంతర్జాతీయ స్థాయిలో జరిగిన పోటీల్లో  దేశం తరఫున ఆడాను. 2009లో చేసిన మొదటి ప్రయత్నంలోనే రైల్వే శాఖలో ఉద్యోగం లభించింది. ఇప్పటికీ ఆ క్రీడను కొనసాగిస్తున్నా.
-కరగాన.మురళీకృష్ణ, దాసన్నపేట, విజయనగరం.
 
జిల్లాకు పేరు ప్రఖ్యాతలు తెస్తా...
మాది నిరుపేద కుటుంబం. కేవలం కూలి చేసుకుంటూ జీవన ం సాగిస్తాం. తల్లిదండ్రులు నన్ను పెంచి, చదివించేందుకు ఎంతో కష్టపడుతున్నారు. వారిని ఎప్పటికైనా మంచి స్థానంలో ఉంచాలన్నదే నా ధ్యేయం. ఓ వైపు చదువుతూ మరో వైపు వాలీబాల్ క్రీడను నేర్చుకున్నాను. ఇప్పటి వరకు పలు జాతీయ, రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొన్నా. పతకాలు దక్కించుకున్నాను. డిగ్రీ పూర్తియ్యే సరికి జాతీయ స్థాయిలో  ఉత్తమ క్రీడాకారుడిగా ఎదిగి జిల్లామంచి పేరు ప్రఖ్యాతలు తేవటంతో పాటు క్రీడల కోటాలో ఉద్యోగం సంపాదిస్తా. నా ఆశయాన్ని నెరవేర్చుకుంటా.
  - నరేష్, బలిజిపేట, విజయనగరం
 
క్రీడల కోటాలో ఇంజినీరింగ్ సీటు...
మాది సాధారణ కుటుంబం. మా ఊరిలో స్కూలుకు వెళ్లే ప్రతి విద్యార్థి ఏదో ఒక ఆటలో రాణిస్తుంటాడు. ఎక్కువ మంది కబడ్డీ అంటే ఇష్టపడతారు. నేనూ అదే క్రీడలో శిక్షణ పొందాను. ఇంటర్ తర్వాత క్రీడల కోటా కలిసిరావటంతో ఉచితంగా కళాశాల యాజమాన్యం సీటిచ్చింది. ఇంజినీరింగ్ విద్యను పూర్తి చేసి ప్రైవేటు  కంపెనీలో  ఉద్యోగం చేస్తున్నా.
 - టి.భాస్కరరావు, సారిపల్లి, విజయనగరం.
 
ఇప్పటికీ  ఖోఖో అడుతున్నా...
మాది నిరుపేద కుటుంబం. తల్లిదండ్రులు కష్టపడి పని చేసి చదివించారు. ఎలాగైనా ప్రభుత్వ శాఖలో ఉద్యోగం సాధించాలన్నది నా చిన్ననాటి నుంచి సంకల్పం.   క్రీడల్లో రాణించటం ద్వారా ఆ నా కలను నిజం చేసుకోవాలని అనుకున్నాం. మున్సిపల్ కస్పా ఉన్నత పాఠశాలలో చదువుతున్న  సమయంలో చిన్నంనాయుడు (పీఈటీ), గోపాల్ (పిఈటీ)లు నాలో ఉత్సుకతను గమనించి ఖోఖోలో ప్రోత్సహించారు. ఇప్పటి వరకు ఆరువరకు జాతీయ స్థాయి టోర్నీలు పాల్గొన్నా.

క్రీడలో కోటాలో 2011 సంవత్సరంలో పోలీస్ శాఖలో సివిల్ కానిస్టేబుల్‌గా ఉద్యోగం లభించింది. ప్రస్తుతం విజయనగరం వన్‌టౌన్‌లో విధులు నిర్వహిసున్నా.  ఇప్పటికీ  ఖోఖో ఆడుతూ పలువురు విద్యార్ధులకు నేర్పిస్తున్నా. ఈ ఏడాది డిసెంబర్‌లో బెంగళూరులో జరగనున్న సీనియర్స్ జాతీయ ఖోఖో పోటీల్లో రాష్ట్రం తరఫున ఆడతాను.        - పొంతపల్లి.హరీష్, కొత్తపేట, విజయగనరం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement