
‘ప్రైవేట్’ రాజధాని
* రైతుల భూములు 99 ఏళ్లు ప్రైవేట్ పరం
* రాజధానిలో ప్రభుత్వం మాయ.. జీవోను వెబ్‌సైట్‌లో ఉంచని వైనం
* భూములపై నిధులు సమకూర్చుకునే వెసులుబాటు
* సీసీడీఎంసీ ద్వారా ప్రైవేట్ సంస్థలకు భూములు.. లీజు వసూలు బాధ్యత వాటిదే
* లీజు ఒప్పందాలు చేసుకుని యూజర్ చార్జీలు, పట్టణ నిర్వహణ చార్జీల వసూలు
* రాజధాని ప్రాంత సమగ్ర అభివృద్ధి ప్రణాళికను రూపొందిస్తుంది
సాక్షి, హైదరాబాద్: రాజధాని కోసం రైతుల నుంచి సమీకరించిన వేలాది ఎకరాల భూములను ప్రైవేట్ కంపెనీలకు జీవిత కాలంపాటు లీజుకు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాజధాని కోసం ఇటీవలే కేపిటల్ సిటీ డెవలప్‌మెంట్ అండ్ మేనేజ్‌మెంట్ కంపెనీ (సీసీడీఎంసీ)ని ఏర్పాటు చేసిన ప్రభుత్వం.. దాని ద్వారా అమరావతిలో ప్రైవేటు కంపెనీలకు ద్వారాలు తెరిచింది. సీసీడీఎంసీ ద్వారా అమరావతిలో చేపట్టబోయే ప్రాజెక్టుల విషయంలో ప్రభుత్వం మార్గదర్శకాలను ఖరారు చేసింది. రాజధానిలో చేపట్టే ప్రాజెక్టుల్లో పెట్టుబడి భాగస్వామికి లేదా ప్రైవేటు పార్టీలకు భూములను 99 సంవత్సరాల పాటు లీజుకు ఇచ్చేందుకు అవకాశం కల్పించారు. మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ ఈ నెల 2న దీనికి సంబంధించి ఉత్తర్వులు (జీవోఎంస్ నంబర్ 110) జారీ చేసింది.
అయితే ప్రైవేటు సంస్థలకు పెద్దపీట వేసిన విషయం బయటపడకుండా, ఆ జీవోను వెబ్‌సైట్‌లో పెట్టకుండా రహస్యంగా ఉంచారు. 2 వ తేదీన జీవో నంబర్ మాత్రమే పెట్టి వివరాలను ఖాళీగా (బ్లాంక్) ఉంచారు. అయితే ఇందులో పొందుపరిచిన విషయాలు పరిశీలిస్తే.. రాజధానిలో చేపట్టబోయే వివిధ ప్రాజెక్టుల విషయంలో ప్రైవేటు సంస్థలకు లీజు పద్ధతిలో భూములు అప్పగించడానికి ప్రభుత్వం మార్గం సుగమం చేసింది. ఈ ఉత్తర్వుల ప్రకారం రాజధానిలో అభివృద్ధి చేసిన ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్ (ఎఫ్‌ఎస్‌ఐ), లేదా భూమిని లేదా ఉపాధి కల్పన పెట్టుబడి భాగస్వామికి లేదా ప్రైవేట్ పార్టీలకు 99 సంవత్సరాల పాటు లీజుకు ఇచ్చేందుకు అవకాశం కల్పించారు.
జీవోలో ఏముంది..
భూమిని 99 సంవత్సరాల పాటు లీజుకివ్వడం అంటే దాదాపు రెండు తరాల పాటు ప్రైవేట్ పార్టీలకు స్వాధీనం చేయడమేనని స్పష్టమవుతోంది. లీజు పొందిన పార్టీలు ఆ భూమి విలువ ఆధారంగా మార్కెట్ నుంచి ఆర్థిక వనరులను సమీకరించుకునే వెసులుబాటు కల్పించారు. 2013 కంపెనీల చట్టం కింద ఏర్పాటు చేసిన సీసీడీఎంసీ విధులు, అధికారాలను జీవో నిర్ధారించారు. ఏడాది వారీగా లీజును వసూలు చేసి ప్రభుత్వానికి జమ చేస్తుంది. 99 సంవత్సరాలకు లీజుకు ఇస్తూ ఒప్పందాలు చేసుకుంటుంది. నూతన రాజధానిలో రవాణా, విద్యుత్, మంచినీటి సరఫరా, వ్యర్థ పదార్థాల నిర్వహణ, సమాచార పరిజ్ఞానంతో పాటు ఉమ్మడి ప్రాంతంలో ఇతర మౌలిక వసతుల పనులను నేరుగాగానీ పీపీపీ విధానంలోగానీ అప్పగించవచ్చునని జీవోలో స్పష్టం చేశారు.
అది కూడా ‘వయబులిటీ స్మార్ట్ సిటీ ప్రిన్సిపల్స్’ మేరకు అప్పగించనున్నట్లు పేర్కొన్నారు. అంటే నామినేషన్ విధానంలో ఈ మౌలిక వసతుల పనులను అప్పగిస్తారని స్పష్టమవుతోంది. అలాగే నూతన రాజధానిలో వైద్య సేవలు, స్పోర్ట్స్, విద్య, వినోదం వంటి సామాజిక మౌలిక సదుపాయాలను వివిధ భాగస్వాముల ద్వారా చేపట్టనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. సీఆర్‌డీఏ ఆమోదం పొందిన రాజధాని మాస్టర్ ప్లాన్ ఆధారంగా సీసీడీఎంసీ ఈ ప్రాంత సమగ్ర అభివృద్ధి ప్రణాళికను రూపొందిస్తుంది. తిరిగి ప్రణాళికను సీఆర్‌డీఏ ద్వారా ఆమోదం తీసుకుని కార్యాచరణను ప్రారంభిస్తుంది. నూతన రాజధానిలో అన్ని రకాల సేవలకు సంబంధించి డిజైన్, అభివృద్ధి, అమలు నిర్వహణ పనులను సీసీడీఎంసీ చేపడుతుంది.
భవన నిర్మాణాల ప్రణాళికలను ఇతర మౌలిక వసతుల కల్పనలను పరిశీలించి సిఫార్సు చేసే అధికారం సీసీడీఎంసీకి ఇచ్చారు. ప్రైవేట్ డెవలపర్స్ నుంచి డెవలప్‌మెంట్ చార్జీలను సీసీడీఎంసీ వసూలు చేస్తుంది. సీఆర్‌డీఏ నిర్ధారించిన మేరకు వినియోగదారుల నుంచి యూజర్ చార్జీలు, టారిఫ్‌ను సీసీడీఎంసీ వసూలు చేయనుంది. అలాగే రాజధాని పట్టణ నిర్వహణ చార్జీలను కూడా వసూలు చేస్తారు. రాజధాని సిటీ అభివృద్ధిలో భాగంగా ఉపాధి కల్పన పెట్టుబడి భాగస్వామితో పాటు ఇతర ప్రైవేట్ ఏజెన్సీలను సీసీడీఎంసీ ఎంపిక చేయనుంది. ఇక కీలకమైన జీవితకాల లీజు విషయాన్ని జీవో పాయింట్లలో కింద ఉదహరించడం కొసమెరుపు..
జీవో 110
రాజధాని కోసం రైతుల నుంచి సేకరించిన వేల ఎకరాలు ప్రైవేట్ కంపెనీలకు 99 ఏళ్లు లీజుపై ధారాదత్తం
ఏమవుతుంది?
99 ఏళ్ల పాటు భూములు లీజుకిస్తే రెండు తరాల పాటు ప్రైవేట్ కంపెనీలకు హక్కులు కల్పించటమే. భూములు పొందిన సంస్థలు తనఖా పెట్టుకుని ఆర్థిక వనరులు సమీకరించుకోవచ్చు. రాజధానిలో మౌలిక వసతుల కల్పనను నామినేషన్‌పై అప్పగించనుంది.
అంతా గోప్యం..
ఈనెల 2న ఇచ్చిన ఈ జీవోను వెబ్‌సైట్‌లో ఉంచకుండా రహస్యంగా వ్యవహరించింది. జీవో నంబర్ మాత్రమే పేర్కొంటూ వివరాలను ఖాళీగా వదిలేసింది. ప్రైవేట్ సంస్థలకు భూములు కట్టబెట్టేందుకు దారులు తెరిచింది.
యూజర్ చార్జీలు కట్టాల్సిందే
- రవాణా విద్యుత్, మంచినీటి సరఫరా ఇతర మౌళిక వసతుల పనులను నేరుగా గానీ, పీపీపీ విధానం ద్వారా గానీ అప్పగించవచ్చు
- వినియోగదారుల నుంచి యూజర్ చార్జీలను అలాగే పట్టణ నిర్వహణ చార్జీలను సీసీడీఎంసీ వసూలు చేయనుంది.