సాక్షి, హైదరాబాద్: డ్రైవింగ్ లైసెన్సులు ఇక ప్రైవేట్ సంస్థల చేతుల్లోకి వెళ్లనున్నాయి. అధికారిక ధ్రువీకరణకు మాత్రమే ఆర్టీఏ పరిమితం కానుంది. ప్రస్తుతం వాహనాల రిజిస్ట్రేషన్‌లలో ఆటోమొబైల్ సంస్థల భాగస్వామ్యం పెరిగినట్లుగానే డ్రైవింగ్‌లో శిక్షణ, నైపుణ్య పరీక్షలు సైతం ప్రైవేట్ సంస్థలే నిర్వహించనున్నాయి. ఈ దిశగా రవాణాశాఖ సన్నాహాలు చేపట్టింది. కేంద్రం కొత్తగా రూపొందించిన ‘అక్రెడిటెడ్ డ్రైవింగ్ ట్రైనింగ్ సెంటర్’పథకం అమలుకు రవాణాశాఖ సన్నాహాలు చేపట్టింది.
డ్రైవింగ్ పరీక్షా కేంద్రం ఏర్పాటుకు అవసరమైన రెండెకరాల భూమి, అధునాతన శిక్షణా కేంద్రం, తేలికపాటి, భారీ వాహనాలు తదితర మౌలిక సదుపాయాలు కలిగిన సంస్థలు లేదా వ్యక్తులు కొత్త అక్రిడేటెడ్ ట్రైనింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసుకోవచ్చు. ఈ సంస్థలిచ్చే శిక్షణను ఆర్టీఏ అధికారులు ప్రామాణికంగా భావించి డ్రైవింగ్ లైసెన్సులను జారీ చేస్తారు. అంటే ఒకసారి అక్రెడిటెడ్ డ్రైవింగ్ స్కూల్లో శిక్షణ కోసం చేరితే నెల రోజులపాటు శిక్షణ ఇవ్వడంతోపాటు ఈ స్కూళ్లే ఫారమ్–5 ధ్రువీకరణ పత్రాన్ని ఇస్తాయి. దీని ఆధారంగా రవాణా అధికారులు డ్రైవింగ్ లెసెన్సులు ఇస్తారు. ఇదంతా డ్రైవింగ్ కేంద్రాల నుంచి ఆర్టీఏ కార్యాలయాలకు డేటా రూపంలో ఆన్‌లైన్‌లో చేరిపోతుంది. వీలైనంత వరకు అభ్యర్థులు ఆర్టీఏకు వెళ్లాల్సిన అవసరం లేకుండానే లైసెన్సులు చేతికొచ్చేస్తాయి.
కొరవడిన నాణ్యత...
►ప్రస్తుతం భారీ వాహనాలు నడిపేందుకు, కార్లు వంటి తేలికపాటి వాహనాలు నడిపేందుకు డ్రైవింగ్ స్కూళ్లు శిక్షణ ఇస్తున్నాయి. కొన్ని స్కూళ్లు మాత్రమే సిమ్యులేటర్‌లను ఏర్పాటు చేసుకొని నాణ్యమైన శిక్షణ ఇస్తుండగా వందలాది స్కూళ్లు ఎలాంటి శిక్షణ ఇవ్వకుండానే అభ్యర్థుల నుంచి వేల రూపాయలు వసూలు చేస్తున్నారు.
►అరకొర శిక్షణ పొందిన వ్యక్తులు దళారులు, ఏజెంట్ల సహాయంతో డ్రైవింగ్ లైసెన్సులు తీసుకొని వాహనాలు నడుపుతున్నారు. ఇలాంటివారు ఇష్టారాజ్యంగా వాహనాలు నడుపుతూ తరచుగా ప్రమాదాలకు కారణమవుతున్నారు.
►ప్రస్తుతం ఉన్న స్కూళ్లలో శిక్షణ పొందినప్పటికీ ఆర్టీఏ డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్‌లలో అధికారులు మరోసారి అభ్యర్థుల నైపుణ్యాన్ని పరీక్షించిన అనంతరమే లైసెన్సులు ఇస్తున్నారు.
నైపుణ్యానికి మెరుగులు...
►కొత్తగా ఏర్పాటయ్యే శిక్షణా కేంద్రాల్లో రెండెకరాల విశాలమైన స్థలంలో టెస్ట్ ట్రాక్ ఉంటుంది. దాంతోపాటు నెల రోజులు సిద్ధాంతపరమైన అంశాల్లో శిక్షణనిస్తారు.
►అభ్యర్థులకు మొదట సిమ్యులేటర్ శిక్షణనిచ్చి ఆ తరువాత వాహనాలను అప్పగిస్తారు. ఏ రోజుకారోజు అభ్యర్థుల హాజరు, శిక్షణ తీరు, నైపుణ్యం తదితర అంశాలను పరిశీలించి చివరకు ఫారమ్–5 ధ్రువీకరణతోపాటు శిక్షణ పొందిన వారి వివరాలను ఆర్టీఏకు అందజేస్తారు.
►ప్రాంతీయ రవాణా అధికారిస్థాయిలో అభ్యర్థులు పొందిన శిక్షణను పరిశీలించి డ్రైవింగ్ లైసెన్సులు జారీచేస్తారు.
ఆర్టీఏ డ్రైవింగ్ కేంద్రాలు అలంకారప్రాయమే..
–ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్‌లో నాగోల్, మేడ్చల్, ఉప్పల్, కొండాపూర్, ఇబ్రహీంపట్నంలలో డ్రైవింగ్ టెస్ట్ కేంద్రాలు ఉన్నాయి.
–ప్రతిరోజు సుమారు 300 మందికి పైగా అభ్యర్థులు ఈ కేంద్రాల్లో మోటారు వాహన తనిఖీ అధికారుల సమక్షంలో డ్రైవింగ్ పరీక్షలకు హాజరవుతారు.
–అక్రిడేటెడ్ డ్రైవింగ్ టెస్ట్ కేంద్రాలు అందుబాటులోకి వస్తే భవిష్యత్తులో వీటి అవసరం ఉండకపోవచ్చు.
ఆహ్వానించదగ్గ పరిణామమే: పాండురంగ్ నాయక్, జేటీసీ, హైదరాబాద్
డ్రైవింగ్‌లో నాణ్యత, నైపుణ్యం పెరిగేందుకు ఈ శిక్షణ కేంద్రాలు దోహదపడతాయి. నిరుద్యోగులకు డ్రైవింగ్‌లో శిక్షణ ఇవ్వడం వల్ల ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. ప్రభుత్వం స్వయంగా ఇలాంటి శిక్షణ ఇచ్చేందుకు అవకాశం తక్కువ. అందుకే ప్రైవేట్ సంస్థలను ఆహ్వానిస్తున్నాం.
Comments
Please login to add a commentAdd a comment