Driving Licences
-
Afghanistan: తాలిబన్ల షాకింగ్ నిర్ణయం
కాబూల్: అప్ఘానిస్తాన్‌లో తాలిబన్ల పాలన కొనసాగుతోంది. అక్కడ తాలిబన్లు అధికారం చేపట్టిన నాటి నుంచి మహిళలపై ఆంక్షలపర్వం కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే అప్ఘన్లో మహిళల ఉన్నత విద్యపై ఆంక్షలు విధించిన తాలిబన్లు తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. తాజాగా అఫ్ఘన్ మహిళలకు డ్రైవింగ్ లైసెన్స్ జారీ చేయడాన్ని తాలిబాన్ ప్రభుత్వం నిలిపివేసింది. కాబూల్, ఇతర ప్రావిన్సులలో ఉన్న మహిళలకు డ్రైవింగ్ లైసెన్స్‌ల జారీని నిలిపివేసినట్లు అక్కడి మీడియా ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ మేరకు డ్రైవింగ్ టీచర్లకు ఆదేశాలు కూడా జారీ అయినట్టు మీడియా తెలిపింది. ముఖ్యంగా తాలిబన్లు.. మహిళలపై ఉద్యోగాలు, పాఠశాలలతో పాటు ఇతర అంశాల్లో కఠిన నిబంధనలను అమలు చేస్తున్నారు. అంతకుముందు కూడా బాలికలకు ఉన్నత విద్య అభ్యసించేందుకు అనుమతించలేదు. పాఠశాలలు ఓపెన్ చేసిన వెంటనే అమ్మాయిలను ఆరో తరగతి వరకే పరిమితం చేస్తున్నట్లు తాలిబన్ల ప్రభుత్వం ప్రకటించింది. దీంతో ఉన్నత విద్యకు అక్కడి యువతులు దూరమయ్యారు. ఇది కూడా చదవండి: ఉక్రెయిన్‌లో రష్యాకు షాకులు.. పుతిన్ ఏం చేస్తారోనన్న టెన్షన్..? -
డ్రైవింగ్ లైసెన్సులు ఇక ప్రైవేటు చేతుల్లోకి..
సాక్షి, హైదరాబాద్: డ్రైవింగ్ లైసెన్సులు ఇక ప్రైవేట్ సంస్థల చేతుల్లోకి వెళ్లనున్నాయి. అధికారిక ధ్రువీకరణకు మాత్రమే ఆర్టీఏ పరిమితం కానుంది. ప్రస్తుతం వాహనాల రిజిస్ట్రేషన్లలో ఆటోమొబైల్ సంస్థల భాగస్వామ్యం పెరిగినట్లుగానే డ్రైవింగ్‌లో శిక్షణ, నైపుణ్య పరీక్షలు సైతం ప్రైవేట్ సంస్థలే నిర్వహించనున్నాయి. ఈ దిశగా రవాణాశాఖ సన్నాహాలు చేపట్టింది. కేంద్రం కొత్తగా రూపొందించిన ‘అక్రెడిటెడ్ డ్రైవింగ్ ట్రైనింగ్ సెంటర్’పథకం అమలుకు రవాణాశాఖ సన్నాహాలు చేపట్టింది. డ్రైవింగ్ పరీక్షా కేంద్రం ఏర్పాటుకు అవసరమైన రెండెకరాల భూమి, అధునాతన శిక్షణా కేంద్రం, తేలికపాటి, భారీ వాహనాలు తదితర మౌలిక సదుపాయాలు కలిగిన సంస్థలు లేదా వ్యక్తులు కొత్త అక్రిడేటెడ్ ట్రైనింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసుకోవచ్చు. ఈ సంస్థలిచ్చే శిక్షణను ఆర్టీఏ అధికారులు ప్రామాణికంగా భావించి డ్రైవింగ్ లైసెన్సులను జారీ చేస్తారు. అంటే ఒకసారి అక్రెడిటెడ్ డ్రైవింగ్ స్కూల్లో శిక్షణ కోసం చేరితే నెల రోజులపాటు శిక్షణ ఇవ్వడంతోపాటు ఈ స్కూళ్లే ఫారమ్–5 ధ్రువీకరణ పత్రాన్ని ఇస్తాయి. దీని ఆధారంగా రవాణా అధికారులు డ్రైవింగ్ లెసెన్సులు ఇస్తారు. ఇదంతా డ్రైవింగ్ కేంద్రాల నుంచి ఆర్టీఏ కార్యాలయాలకు డేటా రూపంలో ఆన్లైన్లో చేరిపోతుంది. వీలైనంత వరకు అభ్యర్థులు ఆర్టీఏకు వెళ్లాల్సిన అవసరం లేకుండానే లైసెన్సులు చేతికొచ్చేస్తాయి. కొరవడిన నాణ్యత... ►ప్రస్తుతం భారీ వాహనాలు నడిపేందుకు, కార్లు వంటి తేలికపాటి వాహనాలు నడిపేందుకు డ్రైవింగ్ స్కూళ్లు శిక్షణ ఇస్తున్నాయి. కొన్ని స్కూళ్లు మాత్రమే సిమ్యులేటర్లను ఏర్పాటు చేసుకొని నాణ్యమైన శిక్షణ ఇస్తుండగా వందలాది స్కూళ్లు ఎలాంటి శిక్షణ ఇవ్వకుండానే అభ్యర్థుల నుంచి వేల రూపాయలు వసూలు చేస్తున్నారు. ►అరకొర శిక్షణ పొందిన వ్యక్తులు దళారులు, ఏజెంట్ల సహాయంతో డ్రైవింగ్ లైసెన్సులు తీసుకొని వాహనాలు నడుపుతున్నారు. ఇలాంటివారు ఇష్టారాజ్యంగా వాహనాలు నడుపుతూ తరచుగా ప్రమాదాలకు కారణమవుతున్నారు. ►ప్రస్తుతం ఉన్న స్కూళ్లలో శిక్షణ పొందినప్పటికీ ఆర్టీఏ డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్‌లలో అధికారులు మరోసారి అభ్యర్థుల నైపుణ్యాన్ని పరీక్షించిన అనంతరమే లైసెన్సులు ఇస్తున్నారు. నైపుణ్యానికి మెరుగులు... ►కొత్తగా ఏర్పాటయ్యే శిక్షణా కేంద్రాల్లో రెండెకరాల విశాలమైన స్థలంలో టెస్ట్ ట్రాక్ ఉంటుంది. దాంతోపాటు నెల రోజులు సిద్ధాంతపరమైన అంశాల్లో శిక్షణనిస్తారు. ►అభ్యర్థులకు మొదట సిమ్యులేటర్ శిక్షణనిచ్చి ఆ తరువాత వాహనాలను అప్పగిస్తారు. ఏ రోజుకారోజు అభ్యర్థుల హాజరు, శిక్షణ తీరు, నైపుణ్యం తదితర అంశాలను పరిశీలించి చివరకు ఫారమ్–5 ధ్రువీకరణతోపాటు శిక్షణ పొందిన వారి వివరాలను ఆర్టీఏకు అందజేస్తారు. ►ప్రాంతీయ రవాణా అధికారిస్థాయిలో అభ్యర్థులు పొందిన శిక్షణను పరిశీలించి డ్రైవింగ్ లైసెన్సులు జారీచేస్తారు. ఆర్టీఏ డ్రైవింగ్ కేంద్రాలు అలంకారప్రాయమే.. –ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్‌లో నాగోల్, మేడ్చల్, ఉప్పల్, కొండాపూర్, ఇబ్రహీంపట్నంలలో డ్రైవింగ్ టెస్ట్ కేంద్రాలు ఉన్నాయి. –ప్రతిరోజు సుమారు 300 మందికి పైగా అభ్యర్థులు ఈ కేంద్రాల్లో మోటారు వాహన తనిఖీ అధికారుల సమక్షంలో డ్రైవింగ్ పరీక్షలకు హాజరవుతారు. –అక్రిడేటెడ్ డ్రైవింగ్ టెస్ట్ కేంద్రాలు అందుబాటులోకి వస్తే భవిష్యత్తులో వీటి అవసరం ఉండకపోవచ్చు. ఆహ్వానించదగ్గ పరిణామమే: పాండురంగ్ నాయక్, జేటీసీ, హైదరాబాద్ డ్రైవింగ్‌లో నాణ్యత, నైపుణ్యం పెరిగేందుకు ఈ శిక్షణ కేంద్రాలు దోహదపడతాయి. నిరుద్యోగులకు డ్రైవింగ్‌లో శిక్షణ ఇవ్వడం వల్ల ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. ప్రభుత్వం స్వయంగా ఇలాంటి శిక్షణ ఇచ్చేందుకు అవకాశం తక్కువ. అందుకే ప్రైవేట్ సంస్థలను ఆహ్వానిస్తున్నాం. -
లక్షా 30 వేల లైసెన్సుల రద్దు
సాక్షి, చెన్నై: నగరంలో ఈ ఏడాది ట్రాఫిక్ నిబంధనల్ని పదేపదే ఉల్లంఘించడం, ప్రమాదాలకు కారకులైన వాహనచోదకుల లక్షా 30 వేల మంది డ్రైవింగ్ లైసెన్సులు రద్దయ్యాయి. ఈ ఒక్క ఏడాదిలో మద్యం తాగి వాహనాలు నడిపే వారి సంఖ్య రెట్టింపు అయింది. చెన్నైలో ట్రాఫిక్ నిబంధనల్ని ఉల్లంఘించే వారి సంఖ్య ఎక్కువే. ఇలాంటి వారి భరతం పట్టే రీతిలో ట్రాఫిక్ పోలీసులు దూకుడుగానే ముందుకు సాగుతున్నారు. హెల్మెట్, సీట్ బెల్ట్‌లు ధరించకుండా వాహనాలు నడిపే వారు కొందరు అయితే, ట్రిపుల్ రైటింగ్‌తో దూసుకెళ్లే ద్విచక్ర వాహన చోదకులు మరెందరో. సిగ్నల్స్‌లో నిబంధనల్ని అనుసరించకుండా దూసుకెళ్లే కుర్ర కారు మరీ ఎక్కువే. అలాగే, రాత్రుల్లో మద్యం తాగి నడిపే వారు మరెందరో. అలాగే, బైక్ రేసింగ్ జోరు ఇంకా ఎక్కువే. నిబంధనల్ని ఉల్లంఘించి తమ చేతికి చిక్కితే చాలు జరిమానాల మోతతో నడ్డి విరిచే విధంగా ట్రాఫిక్ పోలీసులు ముందుకు సాగుతున్నారు. తాజాగా మోటార్ వెహికల్ చట్టం అమల్లోకి రావడంతో జరిమానాల వడ్డనే కాదు, నిబంధనల అమలు మరింత కఠినం అయ్యాయి. ఇందుకు తగ్గట్టుగా చెన్నైలో అనేక మార్గాల్లో నిఘా నేత్రాల ఏర్పాటు చేశారు. నేరగాళ్లను, ట్రాఫిక్‌ను, నిబంధనల్ని ఉల్లంఘించే వారిని పసిగట్టే రీతిలో ఈ నిఘా నేత్రాలు దోహదపడుతున్నాయి. కొన్ని మార్గాల్లో సేకరించిన సీసీ కెమెరాల దృశ్యాల మేరకు ట్రాఫిక్ నిబంధనల్ని పాటించకుండా ముందుకు సాగిన వారి భరతం కూడా పట్టారు. లైసెన్సులు రద్దు..జరిమానా జోరు... 2019 జనవరి నుంచి డిసెంబరు నెలాఖరు వరకు ఒక్క చెన్నైలోనే ట్రాఫిక్ నిబంధనల్ని పదే పదే ఉల్లంఘించడం, ప్రమాదాలకు కారకులుగా ఉన్న వాహన చోదకులు, మందుబాబులు, జరిమానాల వడ్డన గురించిన వివరాలను చెన్నై ట్రాఫిక్ విభాగం మంగళవారం ప్రకటించింది. ఆ మేరకు పదే పదే నిబంధనల్ని ఉల్లంఘించిన లక్షా 30 వేల 559 మంది లైసెన్సులు రద్దు చేశారు. ఇందులో అతి వేగంగా వాహనాలు నడిపినందుకుగాను 73 వేల మంది లైసెన్సులు రద్దు అయ్యాయి. గతంతో పోల్చితే తాజాగా ప్రమాదాల సంఖ్య కొంత మేరకు తగ్గాయి. 2018లో 7549 ప్రమాదాలు చెన్నైలో జరగ్గా 1,260 మంది మరణించారు. తాజాగా 6,832 ప్రమాదాలు జరగ్గా 1,224 మంది మరణించారు. 2017తో పోల్చితే తాజాగా, మద్యం తాగి వాహనాలు నడిపే వారి సంఖ్య రెట్టింపు కావడం గమనార్హం. 2017లో మద్యం తాగి వాహనాలు నడిపి 25వేల మంది వరకు పట్టుబడ్డారు. 2018లో 40వేల మంది పట్టుబడగా, ప్రస్తుతం 51,900 మంది మద్యం తాగి వాహనం నడుపుతూ ట్రాఫిక్ పోలీసులకు చిక్కారు. నిబంధనల్ని ఉల్లంఘించిన వారి నుంచి రూ.29 కోట్ల 80 లక్షలు జరిమానాల రూపంలో వసూళ్లు చేశారు. -
డ్రైవింగ్ లైసెన్స్‌పై కేంద్రం కీలక నిర్ణయం
సాక్షి: ఇప్పటివరకు డ్రైవింగ్ లైసెన్స్ కావాలంటే కనీసం 8వ తరగతి వరకు చదివుండాలనే నిబంధన ఉంది. దీనివల్ల డ్రైవింగ్‌లో పూర్తి నైపుణ్యం ఉండి చదువు అంతంత మాత్రంగా వచ్చిన వాళ్లు లైసెన్స్ తీసుకోవాలంటే కుదిరేది కాదు. అయితే ఇప్పుడు పరిస్థితులు మారబోతున్నాయి. అలాంటివారి ఇబ్బందులను గమనించిన కేంద్ర ప్రభుత్వం ఇక నుంచి చదువుకోకపోయినా లైసెన్స్ ఇవ్వాలనే నిర్ణయానికి వచ్చింది. దీనికోసం అడ్డుగా ఉన్న మోటార్ వెహికల్ చట్టం 1989లోని 8వ నిబంధనను తొలగించబోతున్నారు. ఈ నిర్ణయం వల్ల దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న నిరుద్యోగులకు ఉపాధి దొరకడంతో పాటు, రవాణా రంగం ఎదుర్కొంటున్న డ్రైవర్ల సమస్య కూడా తీరనుంది. దేశంలో వేగంగా విస్తరిస్తున్న రవాణా, లాజిస్టిక్ రంగాల్లో దాదాపు 22 లక్షల డ్రైవర్ల అవసరం ఉందని అంచనా. ఈ విషయం గురించి కేంద్ర రవాణాశాఖ ఉన్నతాధికారి మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో చాలామంది యువతకు డ్రైవింగ్‌లో నైపుణ్యంతో పాటు అనుభవం ఉన్నాకూడా చదువులేదనే నిబంధనతో లైసెన్స్‌కి అనర్హులయ్యేవారు. వారు చదువుకోకపోయినా నిరక్షరాస్యులు మాత్రం కారు. అందుకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. దీనివల్ల ఆర్థికంగా వెనుకబడినవారు, గ్రామీణ ప్రాంతాల్లోని యువత లబ్దిపొందుతారు. ఇదే సమయంలో రోడ్డు భద్రత, ప్రమాణాలు కూడా ముఖ్యమే. అందుకోసం లైసెన్స్ ఇచ్చే ముందు వారికి కఠిన పరీక్ష నిర్వహిస్తారు. నెగ్గితేనే లైసెన్స్ జారీ చేస్తారు. తర్వాత వారికి రహదారి భద్రత గురించి అవగాహనతో పాటు కొంత శిక్షణనిస్తారు. ఈ విషయంలో మాత్రం ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకోవాలని భావిస్తుందని ఆ అధికారి తెలిపారు. -
పరీక్ష లేకుండానే పాస్
సాక్షి, అనంతపురం : అనంతపురంలోని రవాణాశాఖ అధికారుల నిర్వాకం కారణంగా ఒక్కో వాహనదారుడి నుంచి అధికారులు రూ. 50 వేలు అదనంగా వసూలు చేస్తున్నారు. పరీక్షలు నిర్వహించకుండానే లెర్నింగ్ లైసెన్స్‌లు జారీ చేస్తూ అక్రమాలకు పాల్పడుతున్నారు. గడిచిన మూడు నెలల కాలంగా 30 వేలకు పైగా అక్రమ లైసెన్స్‌లు జారీ చేసినట్లు పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. టీడీపీ ఎమ్మెల్యేల కనుసన్నుల్లో ఎల్ఎల్ఆర్ మేళాను నిర్వహిస్తున్నారు. అధికారుల అవినీతి కారణంగా ఇప్పటి వరకు 15 లక్షల రూపాయాలు చేతులు మారినట్లు సమాచారం. రవాణాశాఖ ఇష్టారాజ్యం వల్ల రోడ్డు భద్రత ప్రశ్నార్ధకంగా మారింది. అనర్హులకు లైసెన్స్ మంజూరు చేయడం మూలంగా రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్నాయని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రవాణా శాఖ అధికారుల అవినీతి తారాస్థాయికి పెరుగుతున్నా దీనిపై స్పందించడానికి జిల్లా డిప్యూటీ ట్రాన్స్‌పోర్టు కమిషన్ సుందర్ నిరాకరించడం గమనార్హం. -
భారత్ డ్రైవింగ్ లైసెన్స్‌ను అనుమతించే పది దేశాలు
న్యూఢిల్లీ: విహార యాత్రల కోసం విదేశాలకు వెళ్లినప్పుడు చాలా మంది భారతీయులకు అక్కడి విశాలమైన రోడ్లు, చుట్టూ అందమైన పరిసరాలు, అహ్లాదకరమైన వాతావరణం చూస్తుంటే కారు నడిపించాలనే కోరిక కలగక మానదు. భారత డ్రైవింగ్ లైసెన్స్ అక్కడ చెల్లదనే ఉద్దేశంతో ఆ కోరికను మనసులోనే చంపేసుకుంటారు చాలా మంది. కానీ భారతీయులు తరచుగా వెళ్లే పది దేశాల్లో భారత డ్రైవింగ్ లైసెన్స్‌ను అనుమతిస్తారనే విషయం మనలో ఎంత మందికి తెలుసు? కాకపోతే కొంత కాలం వరకే ఆ అనుమతి మనకు వర్తిస్తుంది. ఈ లోగా మనం చూడాల్సిన వినోద, పర్యాటక ప్రాంతాలను కారులో చుట్టి రావచ్చు. అమెరికాలోని పలు రాష్ట్రాల్లో భారత డ్రైవింగ్ లైసెన్స్‌తో కార్లను నడపొచ్చు. అయితే అక్కడ అడుగుపెట్టిన నాటి నుంచి ఏడాది వరకు మాత్రమే ఆ అనుమతి ఉంటుంది. ఆ తర్వాత నడపాలంటే కచ్చితంగా స్థానిక డ్రైవింగ్‌ను తీసుకోవాల్సిందే. అలాగే పారిశ్రామికంగా ఎంతో అభివద్ధి చెందిన బ్రిటన్‌లో కూడా అందమైన అనుభూతినిచ్చే లాంగ్ డ్రైవ్‌కు వెళ్లొచ్చు. అక్కడ కూడా ఏడాది వరకు మాత్రమే భారత డ్రివింగ్ లైసెన్స్‌ను అనుమతిస్తారు. స్విడ్జర్లాండ్‌లో కూడా ఎత్తైన కొండల మధ్య నుంచి పాములాగా సాగే రోడ్లపై పచ్చని ప్రకతి రమణీయతను ఆస్వాదిస్తూ కారులో మనమూ దూసుకుపోవచ్చు. ప్రమాదకరంగా కనిపించే నార్వే రోడ్లపై ధైర్యముంటే మనమూ సాహసాలు చేయవచ్చు. స్విడ్జర్లాండ్‌లో ఏడాదిపాటు నార్వేలో మూడు నెలలు మాత్రమే భారత లైసెన్స్‌ను అనుమతిస్తారు. ఆస్ట్రేలియాలో కూడా మూడు నెలలపాటే అనుమతిస్తారు. న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, ఫ్రాన్స్, ఫిన్లాండ్, జర్మనీ దేశాల్లో కూడా భారతీయులు కారు నడుపుతూ పర్యాటక ప్రాంతాల్లో విహరించి రావచ్చు. -
ఆ లైసెన్స్‌లతో దేశాలు చుట్టేయెచ్చు!
లండన్: ప్రపంచవ్యాప్తంగా ఆంక్షలు లేని డ్రైవింగ్ లైసిన్స్ లు కలిగిన దేశాలుగా యూకే, ఫ్రాన్స్ తొలిస్థానంలో నిలిచాయి. ఈ రెండు దేశాల్లో వాహనాదారుల డ్రైవింగ్ లైసెన్స్‌లు ఇతర దేశాల్లో చెల్లుబాటు అవుతాయట. ఇతరదేశాలతో పోలిస్తే ఈ దేశాల్లో డ్రైవింగ్ లైసెన్స్‌లకు ఆంక్షలు ఉండవట. ఆ దేశ వాహనాదారులు తమ డ్రైవింగ్ లైసెన్స్‌లతో ప్రపంచంలో ఏ దేశంలోనైనా ప్రయాణించడానికి క్షణాల్లో అనుమతి లభిస్తుందంట. ఇతరదేశాల్లో పోలిస్తే.. యూకే, ప్రాన్స్ దేశాల డ్రైవిగ్ లైసెన్స్‌లకు మాత్రమే ఈ సౌలభ్యం ఉంది. కొన్ని దేశాల్లో మాత్రం ఈ దేశాల డ్రైవర్లకు లైసెన్స్‌లు మార్చుకోవడానికి అదనపు పరీక్షలు అవసరం లేదు కానీ, మరొకొన్ని దేశాల్లో మాత్రం కొత్త లైసెన్స్‌లు పొందాలంటే తప్పనిసరిగా డ్రైవింగ్ లైసెన్స్ పరీక్షలో నెగ్గాల్సిందే. ప్రపంచ పటంలోని 22 దేశాలతో కలిపితే ఫ్రాన్స్, యూకే జంటగా ముందంజలో ఉన్నాయి. ఈ దేశాల డ్రైవింగ్ లైసెన్స్‌లకు మాత్రం కొన్ని దేశాల్లో మాత్రం ఆంక్షలు వర్తిస్తాయి. వీటితో పాటు అమెరికా ఏడో స్థానంలో ఉండగా, రష్యా దేశానికి మాత్రం ప్రతి దేశంలోనూ డ్రైవింగ్ లైసెన్స్‌లకు ఆంక్షలు వర్తిస్తాయట. చైనా దేశంలో డ్రైవింగ్ లైసెన్స్‌లకు ఆ దేశంలో మాత్రమే చెల్లుబాటు అవుతాయి. కానీ ప్రస్తుతం 21 దేశాల్లో చైనా డ్రైవింగ్ లైసెన్స్‌లు చెల్లుబాటు అవుతున్నాయి. -
'మద్యం తాగి డ్రైవింగ్ చేస్తే లైసెన్స్ రద్దు'
హైదరాబాద్: మద్యం తాగి డ్రైవింగ్ చేస్తే లైసెన్స్‌లను రద్దు చేస్తామని తెలంగాణ రవాణా మంత్రి మహేందర్ రెడ్డి చెప్పారు. ఆదివారం పీపుల్ ప్లాజాలో రోడ్డుభద్రతపై అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు. ఈ సదస్సులో తెలంగాణ హోం మంత్రి నాయిని నర్సింహరెడ్డి, మంత్రి మహేందర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయిని మాట్లాడుతూ.. మహిళల భద్రతపై షీ టీమ్స్‌తో నిఘా తీవ్రతరం చేస్తామని తెలిపారు. -
డ్రైవింగ్ లైసెన్స్‌కూ ఆధార్ తప్పనిసరి?
-
30 నుంచి1వ తేదీ వరకు ఆర్టీఏ సేవలు బంద్
సాక్షి, హైదరాబాద్: ఈ నెల 30వ తేదీ నుంచి జూన్ ఒకటో తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీఏ పౌరసేవలు నిలిచిపోనున్నాయి. లెర్నింగ్, డ్రైవింగ్ లెసైన్స్‌లు, వాహనాల రిజిస్ట్రేషన్లు, బదిలీలు వంటి సేవలన్నింటినీ నిలిపివేయనున్నారు. షోరూమ్‌లలో జరిగే వాహనాల తాత్కాలిక రిజిస్ట్రేషన్లకు కూడా బ్రేకులు పడతాయి. రాష్ట్ర విభజన నేపథ్యంలో రవాణాశాఖ ఉమ్మడి ఖాతాను రెండు రాష్ట్రాలకు విభజించనున్న దృష్ట్యా ఈ మార్పు చోటుచేసుకోనుందని ఆ శాఖ హైదరాబాద్ సంయుక్త కమిషనర్ టి.రఘునాథ్ ‘సాక్షి’తో చెప్పారు. అప్పటివరకు ఉన్న ఆదాయ, వ్యయాలను రెండు రాష్ట్రాలకు పంపిణీ చేయడం, ఇందుకోసం రెండు రాష్ట్రాలకు ప్రత్యేకంగా ఖాతాలు తెరవడం ప్రక్రియను దృష్టిలో ఉంచుకొని ఈ మూడురోజుల పాటు సెంట్రల్ సర్వర్‌ను డౌన్ చేస్తామని తెలిపారు. దీంతో ఆటోమేటిక్‌గా రాష్ట్రవ్యాప్తంగా రవాణాశాఖ కార్యకలాపాలు ఆగిపోతాయని చెప్పారు. జూన్ 2వ తేదీన తెలంగాణ ఆవిర్భావంతో తిరిగి రెండు రాష్ట్రాల్లో రవాణాశాఖ పౌరసేవలు యథావిధిగా ప్రారంభమవుతాయని, ఈ మార్పులను దృష్టిలో ఉంచుకొని వాహనదారులు ఈ నెల 29వ తేదీ వరకు ఆర్టీఏ పౌరసేవలను పొందే విధంగా స్లాట్లు బుక్ చేసుకోవచ్చన్నారు. -
45 నిమిషాల్లో డ్రైవింగ్ లెసైన్స్
సాక్షి, ముంబై: కేవలం 45 నిమిషాల్లోనే డ్రైవింగ్ లెసైన్సుల జారీ ! ఇదేదో విదేశాల్లో ఉన్న సదుపాయం కాదు. వడాలా ప్రాంతీయ రవాణా కార్యాలయం (ఆర్టీఓ) ఇక నుంచి 45 నిమిషాల్లోనే లెసైన్సులు ఇవ్వనుంది. అయితే అంధేరీ ఆర్టీఓ గత రెండు నెలల్లోనే డ్రైవింగ్ నేర్చుకున్న 12 వేల మందికి లెసైన్సులను జారీ చేసింది రికార్డు సృష్టించింది. కేవలం 15 నిమిషాల వ్యధిలోనూ లెసైన్సులను జారీ చేసిన ఘనత దక్కించుకుంది. దీనిబాటలోనే వడాలా ఆర్టీఓలోనూ మరికొన్ని రోజుల్లో ఇదే విధానాన్ని అనుసరించనుంది. ఇక నుంచి డ్రైవింగ్ లెసైన్స్ పొందాలనుకునేవారు తమ వివరాలను తనిఖీ చేయించుకునేందుకు ఒక శాఖ నుంచి మరో శాఖకు పరుగులు తీయాల్సిన అవసరం లేదు. ఫారాలు నింపడం, ఇతర రుసుములు చెల్లించాల్సిన అవసరం ఉండదు. ఇప్పుడు అమల్లో ఉన్న ఈ సుదీర్ఘ ప్రక్రియల కారణంగా డ్రైవింగ్ లెసైన్సులను జారీకి అధికం సమయం పడుతోంది. కొత్త ప్రక్రియను ప్రారంభించిన తర్వాత డ్రైవింగ్ లెసైన్సును అదేరోజు కేవలం 45 నిమిషాల్లోనే పొందవచ్చని ఆర్టీఓ అధికారి ఒకరు వెల్లడించారు. ఈ కొత్త విధానాన్ని అమలు చేసేందుకు ఆర్టీఓ అధికారులు గత నాలుగు నెలలుగా కృషి చేస్తున్నారని అధికారి తెలిపారు. ఈ కొత్త విధానంలో లెసైన్సులు పొందడం చాలా సులువుగా ఉంటుందన్నారు. లెసైన్స్ పొందదలచిన వ్యక్తి దరఖాస్తు కోసం రుసుమును చెల్లించాల్సి ఉంటుంది. తర్వాత అతని పేరు, చిరునామా తదితర వివరాలు కంప్యూటర్లో పొందుపరుస్తారు. ఈ సమాచారాన్ని, ఒరిజినల్ పత్రాలను మరో అధికారి తనిఖీ చేస్తారు. తదనంతరం దరఖాస్తుదారుడి నుంచి బయోమెట్రిక్ వేలిముద్రలను సేకరిస్తారు. ఈ ప్రక్రియలో అభ్యర్థి ఫోటోను కూడా తీస్తారు. అంతేగాకుండా రహదారిని గుర్తించే చిహ్నాలు, సిగ్నల్స్‌కు సంబంధించిన పరీక్షలను కార్యాలయంలోనే నిర్వహిస్తారు. ఈ ప్రక్రియ నిర్వహించేందుకు కేవలం 45 నిమిషాల వ్యవధి మాత్రమే పడుతుందని అధికారి తెలిపారు. లెసైన్సులను త్వరగా జారీ చేయడానికి కార్యాలయంలోని ఓ హాలును అత్యాధునిక సాంకేతిక సదుపాయాలతో తీర్చిదిద్దారు. వడాలా ఆర్టీఓలో మున్ముందు అభ్యర్థులకు కంప్యూటరైజ్డ్ పరీక్షలు నిర్వహించే సదుపాయం కల్పించనున్నట్లు రాష్ట్ర రవాణాశాఖ కమిషనర్ వి.ఎన్.మోరే తెలిపారు. ఈ పరీక్ష ఫలితాలను ప్రింటర్‌తో అనుసంధానం చేస్తారు. దీంతో లెసైన్సులను జారీ చేసే సమయం మరింత తగ్గనుంది. రాష్ట్రంలోని మిగతా ఆర్టీఓలో కార్యాలయాల్లోనూ డ్రైవింగ్ లెసైన్సుల జారీ చేసే ప్రక్రియను వేగవంతం చేస్తామని రవాణాశాఖ అధికారులు చెబుతున్నారు.