30 నుంచి1వ తేదీ వరకు ఆర్టీఏ సేవలు బంద్
సాక్షి, హైదరాబాద్: ఈ నెల 30వ తేదీ నుంచి జూన్ ఒకటో తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీఏ పౌరసేవలు నిలిచిపోనున్నాయి. లెర్నింగ్, డ్రైవింగ్ లెసైన్స్‌లు, వాహనాల రిజిస్ట్రేషన్లు, బదిలీలు వంటి సేవలన్నింటినీ నిలిపివేయనున్నారు. షోరూమ్‌లలో జరిగే వాహనాల తాత్కాలిక రిజిస్ట్రేషన్లకు కూడా బ్రేకులు పడతాయి. రాష్ట్ర విభజన నేపథ్యంలో రవాణాశాఖ ఉమ్మడి ఖాతాను రెండు రాష్ట్రాలకు విభజించనున్న దృష్ట్యా ఈ మార్పు చోటుచేసుకోనుందని ఆ శాఖ హైదరాబాద్ సంయుక్త కమిషనర్ టి.రఘునాథ్ ‘సాక్షి’తో చెప్పారు.
అప్పటివరకు ఉన్న ఆదాయ, వ్యయాలను రెండు రాష్ట్రాలకు పంపిణీ చేయడం, ఇందుకోసం రెండు రాష్ట్రాలకు ప్రత్యేకంగా ఖాతాలు తెరవడం ప్రక్రియను దృష్టిలో ఉంచుకొని ఈ మూడురోజుల పాటు సెంట్రల్ సర్వర్‌ను డౌన్ చేస్తామని తెలిపారు. దీంతో ఆటోమేటిక్‌గా రాష్ట్రవ్యాప్తంగా రవాణాశాఖ కార్యకలాపాలు ఆగిపోతాయని చెప్పారు. జూన్ 2వ తేదీన తెలంగాణ ఆవిర్భావంతో తిరిగి రెండు రాష్ట్రాల్లో రవాణాశాఖ పౌరసేవలు యథావిధిగా ప్రారంభమవుతాయని, ఈ మార్పులను దృష్టిలో ఉంచుకొని వాహనదారులు ఈ నెల 29వ తేదీ వరకు ఆర్టీఏ పౌరసేవలను పొందే విధంగా స్లాట్‌లు బుక్ చేసుకోవచ్చన్నారు.