డ్రైవింగ్‌ లైసెన్స్‌పై కేంద్రం కీలక నిర్ణయం | No Education Qualification Required for Driving License | Sakshi
Sakshi News home page

డ్రైవింగ్‌ లైసెన్స్‌పై కేంద్రం కీలక నిర్ణయం

Published Tue, Jun 18 2019 6:55 PM | Last Updated on Tue, Jun 18 2019 7:26 PM

No Education Qualification Required for Driving License - Sakshi

సాక్షి: ఇప్పటివరకు డ్రైవింగ్‌ లైసెన్స్‌ కావాలంటే కనీసం 8వ తరగతి వరకు చదివుండాలనే నిబంధన ఉంది. దీనివల్ల డ్రైవింగ్‌లో పూర్తి నైపుణ్యం ఉండి చదువు అంతంత మాత్రంగా వచ్చిన వాళ్లు లైసెన్స్‌  తీసుకోవాలంటే కుదిరేది కాదు. అయితే ఇప్పుడు పరిస్థితులు మారబోతున్నాయి. అలాంటివారి ఇబ్బందులను గమనించిన కేంద్ర ప్రభుత్వం ఇక నుంచి చదువుకోకపోయినా లైసెన్స్‌ ఇవ్వాలనే నిర్ణయానికి వచ్చింది.  దీనికోసం అడ్డుగా ఉన్న మోటార్‌ వెహికల్‌ చట్టం 1989లోని 8వ నిబంధనను తొలగించబోతున్నారు. ఈ నిర్ణయం వల్ల దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న నిరుద్యోగులకు ఉపాధి దొరకడంతో పాటు, రవాణా రంగం ఎదుర్కొంటున్న డ్రైవర్ల సమస్య కూడా  తీరనుంది. దేశంలో వేగంగా విస్తరిస్తున్న రవాణా, లాజిస్టిక్‌ రంగాల్లో దాదాపు 22 లక్షల డ్రైవర్ల అవసరం ఉందని అంచనా.

ఈ విషయం గురించి కేంద్ర రవాణాశాఖ ఉన్నతాధికారి మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో చాలామంది యువతకు డ్రైవింగ్‌లో నైపుణ్యంతో పాటు అనుభవం ఉన్నాకూడా చదువులేదనే నిబంధనతో లైసెన్స్‌కి అనర్హులయ్యేవారు. వారు చదువుకోకపోయినా నిరక్షరాస్యులు మాత్రం కారు. అందుకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. దీనివల్ల ఆర్థికంగా వెనుకబడినవారు, గ్రామీణ ప్రాంతాల్లోని యువత లబ్దిపొందుతారు. ఇదే సమయంలో రోడ్డు భద్రత, ప్రమాణాలు కూడా ముఖ్యమే. అందుకోసం లైసెన్స్‌ ఇచ్చే ముందు వారికి కఠిన పరీక్ష నిర్వహిస్తారు. నెగ్గితేనే లైసెన్స్‌ జారీ చేస్తారు. తర్వాత వారికి రహదారి భద్రత గురించి అవగాహనతో పాటు కొంత శిక్షణనిస్తారు. ఈ విషయంలో మాత్రం ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకోవాలని భావిస్తుందని ఆ అధికారి తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement