వాలీబాల్ ఆడేద్దాం రండి..!
శ్రీకాకుళం న్యూకాలనీ: మన దేశంలో ఎక్కువ మంది ఆడే క్రీడల్లో వాలీబాల్ ఒకటి. రాష్ట్రంతో పాటు మన జిల్లాలో వాలీబాల్కున్న క్రేజ్ ఇంతా అంతా కాదు. గ్రామీణ ప్రాంతాల్లో అయితే క్రికెట్ కంటే వాలీబాల్‌కే యువత అధిక ప్రాధాన్యమిస్తారు. వాలీబాల్‌తో శరీరదారుఢ్యం సిద్ధిస్తుంది. ఆట ఉత్సాహభరితంగా ఉంటుంది. 12 మంది క్రీడాకారులు ఉంటే సరిపోతుంది. గ్రామీణ ప్రాంత యువకులు ప్రతిరోజు సాయంత్రం వాలీబాల్ ఆడుతూనే ఉంటారు.
వాలీబాల్‌తో ఉపయోగాలు...
* శారీరక వ్యాయామం లభిస్తుంది.
* శారీరక కండరాలు పఠుత్వంతోపాటు పొడవు పెరిగేందుకు చక్కటి మార్గం.
* కాళ్లు, చేతులు దృఢంగా తయారవుతాయి.
* మానసిక ప్రశాంతత లభిస్తుంది.
* పోటీతత్వం అలవడుతుంది.
జిల్లాపై ఓ లుక్కేద్దాం...
జిల్లాలో గత 30 ఏళ్ల కిందటే వాలీబాల్ సంఘాన్ని ఏర్పాటు చేశారు. జిల్లాలో వాలీబాల్ క్రీడకు గుర్తింపు తీసుకొచ్చింది టి.రామజోగినాయుడు, ధర్మాన కృష్ణదాస్, పి.సుందరరావు తదితరులు. జాతీయ, రాష్ట్రస్థాయి పోటీలకు ప్రాతినిధ్యం వహించి పతకాల పంట పండించారు. వాలీబాల్ క్రీడా సర్టిఫికెట్లతో ఉద్యోగాలు, వర్సిటీల్లో పలు కోర్సుల్లో సీట్లు సాధించిన వారు ఉన్నారు. జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ (డీఎస్ఏ) ఎప్పటి లాగే ఈ ఏడాది కూడా జిల్లాలో వాలీబాల్ క్రీడకు అధిక ప్రాధాన్యమిస్తున్నట్టు తెలుస్తోంది. కనీసం పది కేంద్రాలకు తక్కువ కాకుండా శిక్షణ శిబిరాలు నిర్వహించాలని యోచిస్తున్నారు.
వాలీబాల్‌కు క్రేజీ
జిల్లాలో వాలీబాల్‌కు ఉన్న క్రేజీ మరే క్రీడకు లేదు. యుక్తవయసు వారి నుంచి వెటరన్ వరకు అంతా ఆసక్తి చూపిస్తుంటారు. ఉదయం, సాయంత్రం వేళల్లో వాలీబాల్ ఆడితే ఫిజికల్ ఫిట్నెస్ కూడా మెరుగుపడుతుంది.
- వై.పోలినాయుడు, జిల్లా వాలీబాల్ సంఘ ప్రతినిధి, జిల్లా పీఈటీ సంఘ అధ్యక్షుడు