ఫిట్'లెస్' బడి బస్సులు... విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం | - | Sakshi
Sakshi News home page

ఫిట్'లెస్' బడి బస్సులు... విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం

Published Fri, Jun 23 2023 1:28 AM | Last Updated on Fri, Jun 23 2023 11:30 AM

- - Sakshi

జిల్లా వ్యాప్తంగా రవాణా శాఖ ఆధ్వర్యంలో రిజిస్టర్‌ అయిన స్కూల్‌ బస్సులు 224 ఉన్నాయి. ఒక్కో బస్‌ ఫిట్‌నెస్‌ పరీక్షకు సంవత్సరానికి ఒకసారి రూ.5వేలు ఖర్చవుతుంది. ఆయా పాఠశాలల యాజమాన్యాలు ఒక్కో విద్యార్థి నుంచి నెలకు రూ.వెయ్యి చొప్పున వసూలు చేస్తాయి. ఈ లెక్కన ఒక బస్‌ సీటింగ్‌ కెపాసిటీ ఆధారంగా 40 మందికి నెలకు రూ.40 వేలు వసూలు చేస్తారు. కానీ జిల్లా వ్యాప్తంగా 85 బస్సులు ఇప్పటివరకు ఫిట్‌నెస్‌ చేయించుకోకుండా వారి స్వలాభం కోసం అలాగే నడుపుతున్నారు. ఇష్టారీతిన ఫీజులు వసూలు చేసే స్కూలు యాజమాన్యాలు కేవలం ఫిట్‌నెస్‌ కోసం రూ.5 వేలు ఖర్చు చేయడానికి వెనుకాడుతున్నాయి.

నిర్మల్‌చైన్‌గేట్‌: విద్యా సంవత్సరం ప్రారంభం కాకముందే విద్యార్థులను తరలించే వాహనాలకు యాజమాన్యాలు ఫిట్‌నెస్‌ పరీక్షలు చేయించాలి. కానీ పాఠశాలలు ప్రారంభమై పది రోజులు కావస్తున్నా యాజమాన్యాలు ఫిట్‌నెస్‌ విషయంలో నిర్లక్ష్యం వహిస్తున్నాయి. ఈ నెల 12 వరకు అన్ని బస్సులకు ఫిట్‌నెస్‌ పరీక్షలు పూర్తి చేసుకోవాలని రవాణా శాఖ అధికారులు సూచించారు. అయినా కొన్ని విద్యాసంస్థల యాజమాన్యాలు పట్టించుకోవడం లేదు. జిల్లా వ్యాప్తంగా విద్యా సంస్థలకు చెందిన బస్సులు 224 ఉండగా ఈ నెల 22 వరకు 139 బస్సులకు మాత్రమే ఫిట్‌నెస్‌ పరీక్షలు పూర్తయ్యాయి. ఇంకా 85 బస్సులకు ఫిట్‌నెస్‌ పరీక్షలు చేయాల్సి ఉంది.

విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం
జిల్లాలోని 208 ప్రైవేట్‌ పాఠశాలల్లో సుమారు 35 వేలకు పైబడి విద్యార్థులు చదువుతున్నారు. పిల్లల ను పాఠశాలల నుంచి తీసువెళ్లి, తిరిగి ఇళ్లకు చేర్చేందుకు అవసరమైన ప్రైవేట్‌ పాఠశాలల బస్సుల నిర్వహణ ప్రశ్నార్థకంగా మారింది. వేలకు వేలు ఫీజులు గుంజుతున్న ప్రైవేట్‌ స్కూళ్ల యాజమాన్యాలు ఫిట్‌నెస్‌ లేని వాహనాలను నడుపుతూ విద్యార్థుల ప్రా ణాలతో చెలగాటమాడుతున్నాయి.

జిల్లాలో 224 బ స్సులు ఉండగా 139 బస్సులకు మాత్రమే ఫిట్‌నెస్‌ ధ్రువీకరణ పొందినట్లు సంబంధిత అధికారులు తెలి పారు. పలు ప్రాంతాల్లో కళ్లముందే ప్రమాదాలు కని పిస్తున్నప్పటికీ అటు అధికారులు, ఇటు యాజమాన్యాలు మాత్రం నిర్లక్ష్యం వీడడంలేదు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు ఫిట్‌నెస్‌పై దృష్టి సారించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.

కొనసాగుతున్న దళారుల దందా...
అమ్మానాన్నలకు బైబై చెప్పి బడికి బయలుదేరుతు న్న చిన్నారులను భద్రంగా గమ్యస్థానాలకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రైవేట్‌ స్కూల్‌ యాజమాన్యాలది. ఈ బస్సులకు ‘ఫిట్‌నెస్‌’ జారీ చేయాల్సిన రోడ్డు ట్రాన్స్‌పోర్ట్‌ అథారిటీ(ఆర్టీఏ) కార్యాలయాల్లో దళా రుల దందా జోరుగా సాగుతోంది. ఒక్కో వాహనానికి వేలల్లో మామూళ్లు ఇస్తేనే సర్టిఫికెట్‌ జారీ అవుతోంది. ఇదేమిటని ప్రశ్నిస్తే.. తాము అధికారులకు కమీషన్లు ముట్టజెప్పాల్సి వస్తోందని దళారులు బాహాటంగానే చెబుతున్నారు. చేతులు తడిపిన యా జమాన్యాల వాహనాలకు సర్టిఫికెట్లు జారీచేస్తుండగా కరోనా కష్టాల నుంచి ఇంకా కోలుకోని కొన్ని స్కూల్‌ యాజమాన్యాలు ఏజెంట్లు అడిగినంత ఇవ్వలేక అవస్థలు పడుతున్నాయి. ఫలితంగా బడులు ప్రారంభమైనా ఇప్పటివరకు 85 బస్సులకు ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్లు జారీ కాకపోవడం గమనార్హం.

తనిఖీల జాడేది?
విద్యా సంవత్సరం ప్రారంభమై నేటికి 11 రోజులు గడుస్తున్నా ఆర్టీఏ అధికారులు మాత్రం తనిఖీలు నిర్వహించడం లేదు. దీంతో కొన్ని ప్రైవేట్‌ పాఠశాలల యాజమాన్యాలు బస్సులను ఎటువంటి ఫిట్‌నెస్‌ లేకుండానే యథేచ్ఛగా తిప్పుతున్నాయి. అనుకోని సంఘటన ఏదైనా జరిగితే దీనికి బాధ్యత ఎవరు వహిస్తారని తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు.

ఇవీ నిబంధనలు..
వాహనాలకు ఫిట్‌నెస్‌ పరీక్ష చేయించాలనుకుంటే ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. పాఠశాలకు సంబంధించిన వివరాలు, డిజిగ్నీషన్‌, సెల్‌ నంబర్‌, బస్సు మోడల్‌, డ్రైవర్‌ వివరాలు, అటెండెంట్‌, ఫొటోలు, బస్సు నడిచే మార్గం, సీట్ల పరిమితి, తదితర విషయాలను నమోదు చేయాలి. ప్రభుత్వ నిబంధనలకు అనుకూలంగా వాహనంలో మెడికల్‌ కిట్లు, గాలి, వెలుతురు వచ్చేలా కిటికీలు, సీట్ల మధ్య రాడ్లు అమర్చి ఉండాలి. విద్యార్థులు బస్సులో ఎక్కేందుకు, దిగేందుకు అనుకులంగా 325 మి.మీ ఎత్తు ఉండేలా బస్సు మెట్లు ఉండాలి.

● ఆపద సమయంలో బయటకు దిగేందుకు అత్యవసర ద్వారం తప్పకుండా ఏర్పాటు చేసి ఉండాలి.

● విద్యార్థులు బస్సు దిగేటప్పుడు, ఎక్కేటప్పుడు డ్రైవర్‌కు కనబడేలా రెండు వైపులా సైడ్‌ అద్దాలు, అన్ని కిటికీలను కలుపుతూ ఇనుప జాలి అమర్చి ఉండాలి.

● వాహనం టైర్లు, బ్రేక్‌లు నాణ్యతతో ఉండేలా చూసుకోవాలి. బస్సుపై ఏ పాఠశాలకు చెందిందో తెలిపేలా పూర్తి వివరాలు రాసి ఉంచాలి.

● పాఠశాల వాహనాలు నడిపే డ్రైవర్లకు క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు నిర్వహించాలి.

● రాత్రి వేళల్లో బస్సులను గుర్తుపట్టేలా నాలుగు వైపులా రేడియం స్టిక్కర్లను ఏర్పాటు చేయాలి.

ఫిట్‌నెస్‌ లేకుంటే చర్యలు
అనుమతులు లేకుండా పాఠశాల యాజమాన్యాలు స్కూల్‌ బస్సులు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటాం. స్కూల్‌ యాజమాన్యాలు వారి వాహనాలకు ఫిట్‌నెస్‌ చేయించుకోవాలి. అనుభవం ఉన్న వారిని డ్రైవర్‌గా నియమించుకోవాలి. నిబంధనలు పాటించకుంటే కేసులు నమోదు చేస్తాం.
– అజయ్‌కుమార్‌, జిల్లా రవాణాశాఖ అధికారి

No comments yet. Be the first to comment!
Add a comment
1
1/1

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement