Vehicles registrations
-
ఆన్లైన్లో వాహనాల రిజిస్ట్రేషన్స్
నెల్లూరు రూరల్ : వాహనాల రిజిస్ట్రేషన్స్ ఆన్లైన్లో నిర్వహిస్తున్నట్లు ఉప రవాణా శాఖ కమిషనర్ శివరాం ప్రసాద్ తెలిపారు. కనుపర్తిపాడు ప్రియదర్శిని ఇంజనీరింగ్ కళాశాల్లో ఆన్లైన్ వాహనాల రిజిస్ట్రేషన్‌పై రవాణా శాఖ అధికారులు, సిబ్బంది, ఆటోమొబైల్స్ డీలర్లకు గురువారం ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. శిక్షణకు హాజరుకానీ డీలర్ల వద్దకు నేరుగా తమ సిబ్బంది వెళ్లి శుక్రవారం వారికి అవగాహన కల్పిస్తారన్నారు. నెల్లూరు భార్గవి ఆటోమొబైల్ షోరూమ్‌లో ఈనెల 15వ తేదీన ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కార్యక్రమాన్ని జిల్లా మంత్రి నారాయణ ప్రారంభిస్తారన్నారు. ఈ కార్యక్రమంలో మోటారు తనఖీ అధికారులు, పరిపాలనాధికారులు, సీనియర్, జూనియర్ సహాయకులు, డీబీఏలు, డీలర్లు పాల్గొన్నారు. -
జీవో 3పై విచారణ 12 కు వాయిదా
సాక్షి, హైదరాబాద్: ప్రజాప్రయోజనాల నిమిత్తమే తాము వాహనాల రిజస్ట్రేషన్ల నంబర్ మార్పిడి జీవో 3 జారీ చేశామని తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది బి.మహేందర్‌రెడ్డి మంగళవారం హైకోర్టుకు నివేదించారు. రిజిస్ట్రేషన్ల నంబర్ల మార్పిడిలో ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా ముందుగానే అభ్యంతరాలు స్వీకరించేందుకు ఆ జీవో జారీ చేశామన్నారు. గడువిస్తే కౌంటర్ దాఖలు చేస్తామని తెలిపారు. ఇందుకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కల్యాణ్‌జ్యోతి సేన్‌గుప్తా, న్యాయమూర్తి జస్టిస్ పి.వి.సంజయ్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం అంగీకరించి విచారణను ఈ నెల 12కు వాయిదా వేసింది. తెలంగాణ రాష్ట్ర పరిధిలో ఆంధ్రప్రదేశ్ (ఏపీ) పేరుతో ఉన్న వాహనాల నంబర్ ప్లేట్లను తెలంగాణ రాష్ట్రం (టీఎస్)కి మార్చుకోవాలన్న ఆదేశాలతో తెలంగాణ ప్రభుత్వం జూన్ 17న జారీ చేసిన జీవో 3 ను సవాలుచేస్తూ జె.రామ్మోహన్ చౌదరి హైకోర్టులో పిల్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. -
30 నుంచి1వ తేదీ వరకు ఆర్టీఏ సేవలు బంద్
సాక్షి, హైదరాబాద్: ఈ నెల 30వ తేదీ నుంచి జూన్ ఒకటో తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీఏ పౌరసేవలు నిలిచిపోనున్నాయి. లెర్నింగ్, డ్రైవింగ్ లెసైన్స్‌లు, వాహనాల రిజిస్ట్రేషన్లు, బదిలీలు వంటి సేవలన్నింటినీ నిలిపివేయనున్నారు. షోరూమ్‌లలో జరిగే వాహనాల తాత్కాలిక రిజిస్ట్రేషన్లకు కూడా బ్రేకులు పడతాయి. రాష్ట్ర విభజన నేపథ్యంలో రవాణాశాఖ ఉమ్మడి ఖాతాను రెండు రాష్ట్రాలకు విభజించనున్న దృష్ట్యా ఈ మార్పు చోటుచేసుకోనుందని ఆ శాఖ హైదరాబాద్ సంయుక్త కమిషనర్ టి.రఘునాథ్ ‘సాక్షి’తో చెప్పారు. అప్పటివరకు ఉన్న ఆదాయ, వ్యయాలను రెండు రాష్ట్రాలకు పంపిణీ చేయడం, ఇందుకోసం రెండు రాష్ట్రాలకు ప్రత్యేకంగా ఖాతాలు తెరవడం ప్రక్రియను దృష్టిలో ఉంచుకొని ఈ మూడురోజుల పాటు సెంట్రల్ సర్వర్‌ను డౌన్ చేస్తామని తెలిపారు. దీంతో ఆటోమేటిక్‌గా రాష్ట్రవ్యాప్తంగా రవాణాశాఖ కార్యకలాపాలు ఆగిపోతాయని చెప్పారు. జూన్ 2వ తేదీన తెలంగాణ ఆవిర్భావంతో తిరిగి రెండు రాష్ట్రాల్లో రవాణాశాఖ పౌరసేవలు యథావిధిగా ప్రారంభమవుతాయని, ఈ మార్పులను దృష్టిలో ఉంచుకొని వాహనదారులు ఈ నెల 29వ తేదీ వరకు ఆర్టీఏ పౌరసేవలను పొందే విధంగా స్లాట్లు బుక్ చేసుకోవచ్చన్నారు.