
భారత్ డ్రైవింగ్ లైసెన్స్‌ను అనుమతించే పది దేశాలు
న్యూఢిల్లీ: విహార యాత్రల కోసం విదేశాలకు వెళ్లినప్పుడు చాలా మంది భారతీయులకు అక్కడి విశాలమైన రోడ్లు, చుట్టూ అందమైన పరిసరాలు, అహ్లాదకరమైన వాతావరణం చూస్తుంటే కారు నడిపించాలనే కోరిక కలగక మానదు. భారత డ్రైవింగ్ లైసెన్స్ అక్కడ చెల్లదనే ఉద్దేశంతో ఆ కోరికను మనసులోనే చంపేసుకుంటారు చాలా మంది. కానీ భారతీయులు తరచుగా వెళ్లే పది దేశాల్లో భారత డ్రైవింగ్ లైసెన్స్‌ను అనుమతిస్తారనే విషయం మనలో ఎంత మందికి తెలుసు? కాకపోతే కొంత కాలం వరకే ఆ అనుమతి మనకు వర్తిస్తుంది. ఈ లోగా మనం చూడాల్సిన వినోద, పర్యాటక ప్రాంతాలను కారులో చుట్టి రావచ్చు. అమెరికాలోని పలు రాష్ట్రాల్లో భారత డ్రైవింగ్ లైసెన్స్‌తో కార్లను నడపొచ్చు. అయితే అక్కడ అడుగుపెట్టిన నాటి నుంచి ఏడాది వరకు మాత్రమే ఆ అనుమతి ఉంటుంది.
ఆ తర్వాత నడపాలంటే కచ్చితంగా స్థానిక డ్రైవింగ్‌ను తీసుకోవాల్సిందే. అలాగే పారిశ్రామికంగా ఎంతో అభివద్ధి చెందిన బ్రిటన్‌లో కూడా అందమైన అనుభూతినిచ్చే లాంగ్ డ్రైవ్‌కు వెళ్లొచ్చు. అక్కడ కూడా ఏడాది వరకు మాత్రమే భారత డ్రివింగ్ లైసెన్స్‌ను అనుమతిస్తారు.
స్విడ్జర్లాండ్‌లో కూడా ఎత్తైన కొండల మధ్య నుంచి పాములాగా సాగే రోడ్లపై పచ్చని ప్రకతి రమణీయతను ఆస్వాదిస్తూ కారులో మనమూ దూసుకుపోవచ్చు. ప్రమాదకరంగా కనిపించే నార్వే రోడ్లపై ధైర్యముంటే మనమూ సాహసాలు చేయవచ్చు. స్విడ్జర్లాండ్‌లో ఏడాదిపాటు నార్వేలో మూడు నెలలు మాత్రమే భారత లైసెన్స్‌ను అనుమతిస్తారు. ఆస్ట్రేలియాలో కూడా మూడు నెలలపాటే అనుమతిస్తారు. న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, ఫ్రాన్స్, ఫిన్‌లాండ్, జర్మనీ దేశాల్లో కూడా భారతీయులు కారు నడుపుతూ పర్యాటక ప్రాంతాల్లో విహరించి రావచ్చు.