
సాక్షి, హైదరాబాద్: యువజనులు ఎక్కువ సంఖ్యలో ఉన్న మన రాష్ట్రంలో ఉపాధి ఎంతమందికి ఉంది.. నిరుద్యోగులు ఎంత మంది ఉన్నారన్న దానిపై ప్రభుత్వ శాఖలవద్ద స్పష్టమైన లెక్కలు లేవని తెలుస్తోంది. ముఖ్యంగా నిరుద్యోగులు ఎంతమంది ఉన్నారనే దానిపై ప్రభుత్వ శాఖల్లో గందరగోళం నెలకొంది. ఉపాధి కల్పన, శిక్షణ విభాగం వద్ద గణాంకాలున్నప్పటికీ, వాటికీ వాస్తవ పరిస్థితులకు ఎక్కడా పొంతన కుదరడంలేదు. దీంతో ఉపాధి కల్పనపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుందనే దానిపై స్పష్టత కొరవడింది.
అధికారిక లెక్కల్లో 9.26 లక్షలే..
సాధారణంగా నిరుద్యోగిగా ఉన్న ప్రతి వ్యక్తి ఉపాధి కల్పన కార్యాలయాల్లో పేర్లు నమోదు చేసుకుంటారు. ప్రస్తుతం ఎంప్లాయిమెంట్ కార్డు పొందే వారి సంఖ్య భారీగా తగ్గింది. వివిధ కోర్సులు పూర్తి చేసిన వారిలో కనీసం పావువంతు కూడా ఈ కార్డులకోసం దరఖాస్తు చేసుకోవడంలేదు. ఉపాధి కల్పనలో ఈ కార్డుల ప్రాధాన్యం తగ్గిపోవడంతో అభ్యర్థులు వీటిపై దృష్టి సారించడం లేదు. ప్రస్తుతం ఉపాధి కల్పన శాఖ గణాంకాల ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా 9,26,289 మంది నిరుద్యోగులున్నారు. వీరిలో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత దరఖాస్తు చేసుకున్న వారు 4,57,481. రాష్ట్రం ఏర్పాటై నాలుగేళ్లు కావస్తుండటంతో ఏటా సగటున లక్ష మంది అభ్యర్థులు పేర్లు నమోదు చేసుకున్నట్లు స్పష్టమవుతోంది. కార్డులు పొందిన వారిలో అత్యధికంగా పదోతరగతి పూర్తి చేసినవారు 3.28 లక్షలు ఉండగా, ఇంటర్మీడియెట్ చదివినవారు 1.71లక్షలు, గ్రాడ్యుయేట్లు 1.53లక్షలు ఉన్నారు.
ఆన్‌లైన్‌లో కార్డులు..
ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగుల లెక్కలపై అంచనాల కోసం కార్మిక, ఉపాధి కల్పన, శిక్షణ విభాగం చర్యలకు ఉపక్రమించింది. ఇందుకోసం సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటోంది. ఎంప్లాయిమెంట్ కార్డుల కోసం ఆన్‌లైన్ పద్ధతిని ప్రవేశపెట్టింది. ప్రత్యేకంగా వెబ్‌సైట్ రూపొందించి.. దాని ద్వారా దరఖాస్తుల స్వీకరణ మొదలుపెట్టింది. ప్రస్తుతం ప్రారంభ దశలో ఉన్న ఈ ప్రక్రియకు తుదిమెరుగులు దిద్దుతున్నారు. త్వరలో పూర్తిస్థాయిలో అందుబాటులోకి తేనున్నారు. ఆన్‌లైన్ దరఖాస్తు విధానంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న నిరుద్యోగులు.. వారి అర్హతలు, వయసు తదితర పూర్తిస్థాయి సమాచారం లభిస్తుందని భావిస్తున్నారు. ఉపాధికల్పన శాఖ నిరుద్యోగులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న మూడు రోజుల్లోపు కార్డును పొందే వీలు కల్పిస్తోంది. అదనపు కోర్సులు చేసిన తర్వాత దాన్ని అప్‌డేట్ చేసుకునే వీలుంటుంది. ఒక వ్యక్తికి ఒకే ఎంప్లాయిమెంట్ ఐడీ ఉండేలా ఉపాధి కల్పన శాఖ చర్యలు చేపట్టింది. కాగా, అభ్యర్థుల విద్యార్హతలు, నైపుణ్యం ఆధారంగా జాబ్‌మేళాలు నిర్వహించి ఉపాధి కల్పించేందుకు వీలుంటుంది.
నేషనల్ పోర్టల్‌తో వివరాలన్నీ అనుసంధానం..
ఎంప్లాయిమెంట్ వెబ్‌సైట్‌ను అత్యాధునికంగా రూపొందించాం. ఇది కేవలం నిరుద్యోగ నమోదు ప్రక్రియకే పరిమితం కాదు. ఈ వెబ్‌సైట్‌ను నేషనల్ కెరీర్ సర్వీస్ పోర్టల్‌తో అనుసంధానం చేస్తాం. నిరుద్యోగుల నమోదు ప్రక్రియలో వారి మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడీలను తీసుకుంటాం. కొత్తగా ప్రభుత్వ, ప్రైవేటు కంపెనీల్లో ఉపాధి అవకాశాలున్నప్పుడు అర్హతల ఆధారంగా ఆటోమేటిక్‌గా ఆయా అభ్యర్థులకు ఎస్సెమ్మెస్‌లు, ఈమెయిల్స్ వస్తాయి. స్థానికంగా ఉన్న పరిశ్రమలు, సంస్థలకు నియామకాల ప్రక్రియకు ఈ సమాచారం ఎంతో ఉపయోగపడుతుంది.
- కె.వై. నాయక్, సంచాలకుడు, కార్మిక, ఉపాధి కల్పన, శిక్షణ విభాగం
Comments
Please login to add a commentAdd a comment