సాక్షి, హైదరాబాద్: పోస్టుమెట్రిక్ విద్యార్థుల కోసం అమలవుతున్న ఉపకారవేతన, ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాలకు నిధుల విడుదలలో తీవ్ర జాప్యం కనిస్తోంది. ఏళ్లు గడుస్తున్నా పూర్తిస్థాయిలో నిధులు విడుదల కాకపోవడంతో క్రమంగా బకాయిలు పెరిగిపోతున్నాయి. 2020–21, 2021–22 విద్యా సంవత్సరాలకు సంబంధించిన ఫీజు నిధుల విడుదలకు ప్రభుత్వం తాత్సారం చేయడంతో బకాయిలు ఏకంగా రూ.2,117.66 కోట్లకు పేరుకుపోయాయి.
తాజాగా 2022–23 విద్యా సంవత్సరానికి సంబంధించి దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. మంగళవారం వరకు గడువుండగా, ఆ తర్వాత దరఖాస్తుల పరిశీలన మొదలుపెట్టి అర్హతను నిర్ధారిస్తారు. అనంతరం తాజా విద్యా సంవత్సర చెల్లింపులు ప్రారంభించాల్సి ఉంటుంది. అయితే ఇప్పటికే రెండేళ్లుగా బకాయిలు పెండింగ్‌లో ఉండడంతో ప్రస్తుత విద్యా సంవత్సరానికి సంబంధించిన చెల్లింపులు కూడా ఆలస్యం అయ్యే సూచనలు కన్పిస్తున్నాయి.
‘బీసీ’ నిధులు భారీగా పెండింగ్..
గత విద్యా సంవత్సరం వరకు ఉన్న రూ.2117.6 కోట్ల బకాయిల్లో బీసీ సంక్షేమ శాఖకు చెందినవే ఎక్కువగా ఉన్నాయి. ఈ శాఖకు సంబంధించి రూ.1,376.36 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయి. ఇందులో 2020–21కు సంబంధించి రూ.322.25 కోట్లు, 2021–22కు చెందిన రూ.1,054.11 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయి. ఎస్సీ ప్రత్యేక అభివృద్ధి నిధి, ఎస్టీ ప్రత్యేక అభివృద్ధి నిధి ఉండడం, ఆ మేరకు అందుబాటులో ఉన్న నిధులను సర్దుబాటు చేస్తుండడంతో ఆయా శాఖలకు సంబంధించిన బకాయిలు తక్కువగా ఉన్నాయి. మరోవైపు ఈబీసీ, మైనార్టీ విద్యార్థులకు సంబంధించిన బకాయిలు కూడాపెద్ద ఎత్తున పెండింగ్‌లో ఉన్నట్లు ఆయా శాఖలు చెబుతున్నాయి.
ఖజానా శాఖకు అనుమతులు లేక...
ఉపకారవేతనాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్ కో సం వచ్చిన దరకాస్తులను పరిశీలించి వాటిని ఆమోదిస్తున్న సంక్షేమ అధికారులు.. జిల్లా స్థాయిలో వాటికి బిల్లులు రూపొందించి నిధుల విడుదల కోసం ఖజానా విభాగానికి పంపిస్తున్నారు. అలా పంపిన బిల్లులు సంక్షేమ శాఖల్లో పరిష్కరించినట్లు రికార్డు చూపిస్తున్నప్పటికీ.. ఖజానాల్లో నిలిచిపోతున్నాయి. ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చిన బిల్లులను మాత్రమే ఖజానా అధికారులు క్లియర్ చేస్తున్నారు. ప్రతి నెల ఉద్యోగుల వేతనాలు, పెన్షన్ నిధులు మాత్రమే సకాలంలో పరిష్కరిస్తుండగా... మిగతా ఎలాంటి బిల్లులకు ఆమోదం లభించడం లేదని అధికారులు చెబుతున్నారు.
ఈ ఏడాది పరిశీలనతోనే సరి!
2022–23కు సంబంధించి ఇప్పటివరకు దాదాపు 11 లక్షల దరఖాస్తులు వచ్చాయి. చివరి తేదీ జనవ రి 31 నాటికి 12.5 లక్షల దరఖాస్తులు వస్తాయని సంక్షేమ శాఖల అధికారులు అంచనా వేస్తున్నారు. స్వీకరించిన దరఖాస్తులను ఆన్‌లైన్ పరిశీలన పూర్తి చేసేందుకు దాదాపు రెండు నెలల సమయం పట్టే అవకాశం ఉంది. కాగా ప్రస్తుతం వచ్చిన దరఖాస్తుల సంఖ్యను బట్టి చూస్తే 2022–23 విద్యా సంవత్సరానికి సంబంధించిన డిమాండ్ రూ.2,350 కోట్లు ఉండే అవకాశం ఉందని అధికారుల అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుత సంవత్సరంలో కేవలం దరఖాస్తుల పరిశీలనతోనే సరిపెట్టి, పాత బకాయిలు క్లియర్ చేసేందుకు ప్రభుత్వ ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలిసింది.
ఖాజీపేటకు చెందిన రాఘవేంద్ర కుమార్ కూకట్‌పల్లి సమీపంలోని ఓ కాలేజీలో ఎంబీఏ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. సెమిస్టర్ పరీక్ష ఫీజు సమయంలో మొదటి సంవత్సరానికి సంబంధించిన ట్యూషన్ ఫీజు చెల్లించాలని కాలేజీ యాజమాన్యం మెలిక పెట్టింది. ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం అర్హులు సైతం ట్యూషన్ ఫీజులు చెల్లించాలని, ప్రభుత్వం నుంచి నిధులు విడుదలయ్యాక వారికి తిరిగి చెల్లిస్తామని స్పష్టం చేసింది. ట్యూషన్ ఫీజు రశీదు ఇచ్చిన విద్యార్థుల నుంచే సెమిస్టర్ పరీక్ష ఫీజు స్వీకరిస్తుండడంతో విధిలేని పరిస్థితుల్లో రాఘవేంద్రకుమార్ డబ్బులు వడ్డీకి తెచ్చి ట్యూషన్ ఫీజు, సెమిస్టర్ ఫీజు చెల్లించాడు.
Comments
Please login to add a commentAdd a comment