అందని ‘ఉపకారం’! | Telangana Rs 3250 Crore College Fee Payment Over Three Years | Sakshi
Sakshi News home page

అందని ‘ఉపకారం’!

Published Wed, May 18 2022 12:35 AM | Last Updated on Wed, May 18 2022 8:27 AM

Telangana Rs 3250 Crore College Fee Payment Over Three Years - Sakshi

నల్లగొండ జిల్లా మర్రిగూడెంకు చెందిన మణికేశవ్‌ ఇబ్రహీంపట్నం సమీపంలోని ప్రఖ్యాత కళాశాలలో బీటెక్‌ (కంప్యూటర్‌ సైన్స్‌) ఫైనలియర్‌ చదువుతున్నాడు. కన్వీనర్‌ కోటాలో సీటు సాధించిన ఇతనికి ట్యూషన్‌ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. కానీ ప్రభుత్వం సకాలంలో ఫీజు నిధులు ఇవ్వకపోవడంతో యాజమాన్యం తీవ్ర ఒత్తిడి చేసింది.

రెండు, మూడో సంవత్సరం ట్యూషన్‌ ఫీజు చెల్లిస్తేనే సెమిస్టర్‌ పరీక్షలకు అనుమతిస్తామని తేల్చిచెప్పింది. ప్రభుత్వం నుంచి రీయింబర్స్‌మెంట్‌ వచ్చిన తర్వాత తీసుకోవచ్చని స్పష్టం చేసింది. దీంతో మణికేశవ్‌ తండ్రి నరసింహారావు రూ.1.20 లక్షలు అప్పు చేసి ట్యూషన్‌ ఫీజు చెల్లించారు. తర్వాతే మణికేశవ్‌ సెమిస్టర్‌ పరీక్షలు రాశాడు. తండ్రి తెచ్చిన అప్పుకు 4 నెలల నుంచి వడ్డీ పెరుగుతున్నా... ప్రభుత్వం మాత్రం ఇంకా ఫీజు రీయింబర్స్‌మెంట్‌ నిధులు విడుదల చేయలేదు. 

ఇది ఒక్క మణికేశవ్‌ పరిస్థితి మాత్రమే కాదు.. చాలా కాలేజీల్లో యాజమాన్యాలు ఇదే తరహాలో విద్యార్థుల నుంచి వ్యక్తిగతంగా ఫీజులు కట్టించుకుంటున్నాయి. కళాశాల నిర్వహణ భారమవుతోందని విద్యార్థులపై ఒత్తిడి చేస్తున్నాయి. ఫలితంగా విద్యార్థుల తల్లిదండ్రులు అప్పులు చేయాల్సిన పరిస్థితి వస్తోంది. 

సాక్షి, హైదరాబాద్‌: పోస్టుమెట్రిక్‌ విద్యార్థుల కోసం అమలవుతున్న ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకాలకు నిధుల విడుదలలో తీవ్ర జాప్యం జరుగుతోంది. ఉపకార వేతన నిధులు విడుదల కాక, రీయింబర్స్‌మెంట్‌ నిధులు సైతం ఏళ్లుగా నిలిచిపోవడంతో బకాయిలు కుప్పలు తెప్పలుగా పేరుకుపోతున్నాయి. 2019–20 నుంచి 2020–21, 2021–22 వార్షిక సంవత్సరానికి సంబంధించిన బకాయిలు మొత్తంగా రూ.3,271.15 కోట్లు ఉన్నట్లు సంక్షేమ శాఖల గణాంకాలు చెబుతున్నాయి.

సంక్షేమ శాఖలు దరఖాస్తులను పరిశీలించి బడ్జెట్‌ అంచనాలను రూపొందించి బిల్లులను ఖాజానా శాఖకు సమర్పిస్తాయి. ఈ క్రమంలో ఈ సంవత్సర దరఖాస్తుల పరిశీలన పూర్తయితే డిమాండ్‌ మరింత పెరిగే అవకాశం ఉందని సంక్షేమ శాఖలు చెబుతున్నాయి. 

బకాయిలు అంతకంతకు.. 
కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఆర్థిక పరిస్థితి గాడి తప్పడం.. నిధుల విడుదలపై తీవ్ర ప్రభావం పడింది. ఈ క్రమంలో ఏటా చేయాల్సిన చెల్లింపులు నిలిచిపోయాయి. ఏడాదిన్నరగా ఈ పథకాలకు నిధులను ప్రభుత్వం పెద్దగా విడుదల చేయలేదు. దీంతో బకాయిలు పెరుగుతూ వస్తున్నాయి. 2019–20, 2020–21 వార్షిక సంవత్సరాలకు సంక్షేమ శాఖలు దరఖాస్తుల పరిశీలన పూర్తి చేసి చాలా కాలమైంది.

ఇక 2021–22 విద్యా సంవత్సరానికి దరఖాస్తుల స్వీకరణ ఈ ఏడాది మార్చి 31 వరకు జరిగింది. కొన్ని రకాల కోర్సుల్లో ప్రవేశాల కౌన్సెలింగ్‌ ఆలస్యం కావడంతో ప్రస్తుతం ఈనెల 21 వరకు కూడా దరఖాస్తులను స్వీకరించనున్నట్లు ప్రభుత్వం స్పష్టంచేసింది. ఈ దరఖాస్తుల స్వీకరణ పూర్తయితే 2021–22 ఏడాది డిమాండ్‌పై స్పష్టత వస్తుంది.  

విద్యార్థులు సతమతం.. 
‘ఫీజు’చెల్లింపులు సకాలంలో విడుదల చేయకపోవడంతో విద్యార్థుల చదువుపై ప్రభావం పడుతోంది. ఫీజు చెల్లిస్తేనే సెమిస్టర్‌ పరీక్షలకు అనుమతిస్తామని, కోర్సు పూర్తి చేసిన వారికి సర్టిఫికెట్లు ఇవ్వడం కుదరదని.. ఇలా కాలేజీ యాజమాన్యాలు రకరకాల నిబంధనలు పెడుతున్నాయి. చదువు కొనసాగాలంటే ఫీజు చెల్లించాలనే డిమాండ్‌ పెడుతున్న యాజమాన్యాలు.. ‘ఫీజు’రాకుంటే కాలేజీ నిర్వహణ భారమవుతుందని విద్యార్థులను ఆందోళనకు గురిచేస్తున్నాయి.

యాజమాన్యాలు చేస్తున్న ఒత్తిడితో విద్యార్థులు పరీక్షలకు సన్నద్ధం కాలేక సతమతమవుతున్నారు. ఈ క్రమంలో విద్యార్థులు వారి తల్లిదండ్రులపై ఒత్తిడి చేస్తున్నారు. ఫలితంగా తల్లిదండ్రులు అప్పు చేసి ఎంతో కొంత ఫీజు చెల్లించి బతిమాలుకుంటున్న సంఘటనలు కాలేజీల్లో కనిపిస్తున్నాయి. 

నిర్వహణ భారంగా మారింది 
గ్రామీణ ప్రాంతాల్లో సరిపడా ప్రభుత్వ కాలేజీలు లేకపోవడంతో పేదలు ప్రైవేట్‌ కళాశాలలను ఆశ్రయిస్తున్నారు. కార్పొరేట్‌ కాలేజీలు మినహాయిస్తే.. ఇతర ప్రైవేట్‌ కాలేజీల్లో ప్రభుత్వం నిర్దేశించిన ఫీజులే తీసుకుంటున్నారు. చాలామంది పేదలు ‘ఫీజు’పథకం ద్వారా అందే సాయాన్నే నమ్ముకుని చదువుతున్నారు.

ప్రభుత్వం సకాలంలో నిధులు విడుదల చేయకపోవడంతో ఈ పథకంపై ఆధారపడిన కాలేజీల నిర్వహణ మరింత భారంగా మారింది. ప్రభుత్వం వెంటనే ఫీజు బకాయిలను పూర్తిస్థాయిలో విడుదల చేస్తేనే కాలేజీల నిర్వహణ సక్రమంగా సాగుతుంది. 
–గౌరి సతీశ్, కన్వీనర్, తెలంగాణ ప్రైవేట్‌ కాలేజీల సంఘం 

సింహభాగం బీసీ విద్యార్థులవే..
ప్రస్తుతమున్న బకాయిల్లో అత్యధికంగా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖకు సంబంధించినవే. ఈ శాఖ ద్వారా బీసీ విద్యార్థులకు ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇస్తుండగా.. ఈబీసీలకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ మాత్రమే ఇస్తున్నారు. ఇప్పటివరకున్న మొత్తం బకాయిల్లో ఈ విద్యార్థులవే సింహభాగం.

ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ప్రత్యేక అభివృద్ధి నిధి(ఎస్‌డీఎఫ్‌) నుంచి నిధులు సర్దుబాటు చేస్తున్నా.. బీసీ విద్యార్థులకు సకాలంలో చెల్లింపులు చేయకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అలాగే మైనార్టీ విద్యార్థులకు సంబంధించిన బకాయిలు కూడా పెద్ద మొత్తంలోనే ఉన్నాయి.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement