పింఛన్ కోసం ఎదురు చూస్తున్న వృద్ధురాలు
సాక్షి, హుస్నాబాద్: ప్రభుత్వం ఎన్నికల ముందు ఆసరా పింఛన్ల అర్హత వయస్సును 65 సంవత్సరాల నుంచి 57 వరకు తగ్గించి పథకం వర్తింప చేస్తామని చెప్పింది. రూ.1000 పింఛన్‌ను రూ.2,016లకు పెంచుతామని ప్రజలకు సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఓటరు జాబితాల ఆధారంగా ఐకేపీ సిబ్బందితో 57 నుంచి 65 మధ్య వయస్సు ఉన్న జాబితాను అందించాలని చెప్పడంతో గ్రామాల వారిగా సర్వే చేసి జాబితాలను సిద్ధం చేశారు.
ఇటీవల పెంచిన ఫించన్లు అమలు చేస్తూ.. ప్రభుత్వం ఉత్తర్వులు చేసి ఆసరా పింఛన్‌దారులకు మంజూరు పత్రాలను అందజేసింది. ఆసరా ఫింఛన్లకు వయస్సును తగ్గించడంతో మాకు కూడా అందుతాయని ఆశపడ్డ లబ్ధిదారులకు నిరాశే ఎదురవుతోంది. కొత్త ఆసరా పింఛన్లపై ప్రభుత్వం ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వకపోవడంతో వారి ఎంపిక అధికారులకు స్పష్టత లేకుండా పోయింది. ప్రభుత్వం వీటిపై మళ్లీ నిర్ణయం తీసుకునేవరకు ఆశావాదులు నిరీక్షించక తప్పడం లేదు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 8 నెలలు గడిచినా కొత్త ఆసరా లబ్ధిదారుల ఎంపికపై నిర్ణయం తీసుకోకపోవడంతో ప్రజల్లో అసంతృప్తి నెలకొంది.
ఆసరాకు అర్హులెవరు?
ప్రభుత్వం ఆసరా పథకానికి 65 నుంచి 57 సంవత్సరాలకు వయస్సు తగ్గించడంతో చాలా మంది రైతులు, వ్యవసాయ కూలీలకు ప్రయోజనం చేకూరనుంది. ప్రభుత్వ ఉద్యోగులు మినహా తెల్లరేషన్‌కార్డు ఉన్న వారికి 57 సంవత్సరాలు ఉంటే ఆసరా పథకానికి అర్హలవుతారు. కుటుంబంలో ఎవరికి ప్రభుత్వ ఉద్యోగం ఉండకూడదు. ఆసరాకు దరఖాస్తు చేసుకునే వారికి ఆధార్‌కార్డు, ఓటరు గుర్తింపు కార్డు తప్పనిసరిగా ఉండాలి. వీరందరూ ఆయా గ్రామ పంచాయతీల్లో దరఖాస్తు చేసుకుంటే వాటిని అధికారులు పరిశీలించి ఎంపిక చేసే అవకాశం ఉంది. ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వెలువడగానే అధికారులు కొత్త ఆసరా లబ్ధిదారుల ఎంపికపై కసరత్తు చేయనున్నారు.
కొత్తగా 4,207 మంది అర్హులు..
హుస్నాబాద్, అక్కన్నపేట మండలాల్లోని 49 గ్రామ పంచాయతీల్లో గతంలోనే స్వశక్తి సంఘాల అధ్వర్యంలో ఓటరు జాబితలను అధారంగా ఐకేపీ అధికారులు గ్రామాల వారిగా సర్వే చేయించారు. అప్పటి వరకు 57 నుంచి 64 సంవత్సరాల మధ్య వయస్సు గల వారిని సర్వే చేసి గ్రామ పంచాయతీల వారిగా జాబితలను ఉన్నతాధికారులకు పంపించారు. అక్కన్నపేట మండలంలోని 32 గ్రామ పంచాయతీల్లో 2,939, హుస్నాబాద్ మండలంలోని 17 పంచాయతీల్లో 1,268 మంది ఉన్నట్లు సర్వే చేశారు. వీరందరూ ప్రభుత్వం కొత్తగా ఇచ్చే ఆసరా ఫించన్లకు అర్హులుగా అధికారులు గుర్తించారు. ఇందులో ప్రభుత్వ ఉద్యోగుల తల్లిదండ్రులు, ఉద్యోగ విరమణ చేసి ఫించన్ పొందేవారు కూడ ఇదే జాబితాలో ఉన్నారు. అయితే వారిని తొలగించి అర్హతగల వారికి ఆసరా పింఛన్లు అందించుటకు ప్రభుత్వ అధికారులు చర్యలు తీసుకోవాల్సి ఉంది. ప్రభుత్వం నుంచి ఎలాంటి ఉత్తర్వులు రాకపోవడంతో కొత్త ఆసరా పింఛన్ల మంజూరుకు మరికొంత సమయం పట్టనుంది.
ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు రాలేదు
కొత్త ఆసరా పథకం అమలుకు వయస్సును 65 నుంచి 57 సంవత్సరాలకు తగ్గించారు. ఓటరు జాబితాల ఆధారంగా సర్వే చేసి గ్రామాల వారీగా జాబితాలను సిద్ధం చేశాం. కొత్త వారిని ఎంపిక చేయాలని ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదు. ప్రభుత్వ నుంచి ఉత్తర్వులు వెలువడగానే ఎంపికపై కసరత్తు చేస్తాం. అర్హులకు అందేలా చూస్తాం.
– ఉదయ్‌భాస్కర్, ఇన్‌చార్జి ఎంపీడీఓ, అక్కన్నపేట
Comments
Please login to add a commentAdd a comment