
అక్కడికక్కడే ముగ్గురి మృతి
మృతులు నంద్యాల జిల్లా వాసులుగా గుర్తింపు
ఇద్దరికి తీవ్ర గాయాలు
ఒంటిమిట్ట/నంద్యాల: వైఎస్సార్ కడప జిల్లా ఒంటిమిట్ట మండలంలోని కడప–చెన్నై జాతీయ రహదారి సోమవారం నెత్తురోడింది. స్కార్పియో, బస్సు ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మరణించారు. పోలీసులు తెలిపిన వివరాలివీ.. తిరుపతి నుంచి నంద్యాలకు వెళ్తున్న స్కార్పియో(ఏపీ31 cw 7479) వాహనం ఒంటిమిట్ట మండల పరిధిలోని నడింపల్లి వద్దనున్న కడప–చెన్నై జాతీయ రహదారిపైకి రాగానే తిరుపతికి వెళ్తున్న ఏపీఎస్ ఆర్‌టీసీ ఎలక్ట్రిక్ బస్సు(ఏపీ 39 యుఎం 9771)ను వేగంగా ఢీకొంది.
స్కార్పియో పల్టీకొట్టి ఎలక్ట్రిక్ బస్సు వెనుక వస్తున్న పెట్రోలింగ్ వాహనాన్ని కూడా ఢీ కొట్టింది. ప్రమాదంలో స్కార్పియోలోని నలుగురిలో తేజనాయుడు(19), ధర్మారెడ్డి(26), వినోద్(25)లు అక్కడికక్కడే మరణించారు. మహానంది పోలీసు స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పని చేస్తున్న సునిల్‌నాయుడుకి తీవ్రగాయాలు అయ్యాయి. ఇతనితో పాటు పెట్రోలింగ్ వాహనం నడుపుతున్న కానిస్టేబుల్ రఘురాంరెడ్డి కూడా తీవ్రంగా గాయపడ్డాడు.
మృతుడు ధర్మారెడ్డిచేత మద్యం మాన్పించేందుకు తిరుపతికి నాటుమందు కోసమని వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. విషయం తెలుసుకున్న సీఐ బాబు, ఎస్‌ఐ శివప్రసాద్‌రెడ్డి ఘటనా స్థలానికి చేరుకొని గాయపడిన వారిని 108లో కడప రిమ్స్‌కు తరలించారు. ప్రమాదం జరిగిన సమాచారాన్ని కడప డీఎస్పీ వెంకటేశ్వర్లకు చేరవేయడంతో ఆయన సంఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాలను పరిశీలించి, ప్రమాదానికి కారణాలు తెలుసుకున్నారు. ఘటనపై రోడ్డు రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
మృతుల వివరాలు
⇒ తేజనాయుడు స్వస్థలం నంద్యాలలోని హౌసింగ్ బోర్డు కాలనీ. తల్లిదండ్రులు భద్ర, రాజేశ్వరి. ఇతను పట్టణంలోని ఓ కళాశాలలో ఐటీఐ చదువుతున్నాడు.
⇒వినోద్ స్వస్థలం బండిఆత్మకూరు మండలంలోని సోమయాజులపల్లె. తల్లిదండ్రులు వెంకటలక్ష్మమ్మ, వెంకటరాముడు. టవర్ల వద్ద జనరేటర్ మెకానిక్‌గా పనిచేస్తున్నాడు.
⇒ ధర్మారెడ్డి స్వస్థలం చాగలమర్రి మండలం డి.కొత్తపల్లె. తండ్రి శివశంకర్‌రెడ్డి వ్యవసాయం చేస్తుండగా, తల్లి అన్నమ్మ ఉన్నారు. నంద్యాలలోని జియో కంపెనీలో పనిచేస్తున్నాడు. ఇటీవల అక్క జ్యోతి వివాహం కాగా, తమ్ముడు శ్రీనివాసరెడ్డి ట్రాన్స్‌ఫారం కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు.
స్కార్పియో మితిమీరిన వేగమే కారణం
రోడ్డు ప్రమాద స్థలాన్ని కడప ఆర్‌టీసీ ఆర్‌ఎం పి.గోపాల్‌రెడ్డి పరిశీలించారు. అక్కడ ఉన్న పరిస్థితిని చూస్తే స్కార్పియో వాహనం నడిపిన వారిదే తప్పుగా తెలుస్తోందన్నారు. మితిమీరిన వేగంతో బస్సు మోటును ఢీకొట్టడంతో స్పీడ్ మీదు తిరుగుకుంటూ వెళ్లి బస్సు వెనుక వైపు వస్తున్న పెట్రోలింగ్ వాహనాన్ని ఢీకొట్టి ఉంటారన్నారు. పూర్తిగా తెలుసుకునేందుకు ఎలక్ట్రిక్ బస్సుకు ఉన్న సీసీ ఫుటేజీని పరిశీలిస్తామని తెలిపారు.