సాక్షి, న్యూఢిల్లీ : ఈ ఏడాది జనవరి 2న శబరిమల ఆలయంలోకి ప్రవేశించి హిందూ సంస్ధల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదుర్కొన్న ఇద్దరు మహిళలు కనకదుర్గ, బిందు అమ్మిని తమకు 24 గంటల పోలీసు రక్షణ కల్పించాలని కోరుతూ దాఖలు చేసిన ఉమ్మడి పిటిషన్‌లను సుప్రీం కోర్టు శుక్రవారం విచారించనుంది. కన్నూర్ జిల్లాకు చెందిన వీరిద్దరూ అయ్యప్ప ఆలయంలోకి ప్రవేశించడాన్ని నిలువరిస్తూ హిందూ సంఘాలకు చెందిన నిరసనకారులు అడ్డుకున్నారు. అయ్యప్ప ఆలయంలోకి తమను అనుమతించాలని డిమాండ్ చేస్తూ వీరు నిరవధిక దీక్షకు దిగడం కలకలం రేపింది.
మరోవైపు శబరిమల ఆలయంలోకి ప్రవేశించడంపై ఆగ్రహిస్తూ కనక దుర్గపై ఆమె అత్త కర్రతో దాడి చేసింది. దీనిపై ఐపీసీ సెక్షన్ 341, 324 కింద పోలీసులు కేసు నమోదు చేశారు. శబరిమల ఆలయంలోకి అన్ని వయసుల మహిళలను అనుమతించాలని సుప్రీం కోర్టు తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. కాగా అయ్యప్ప ఆలయంలోకి ఇరువురు మహిళలు దుర్గ, బిందులు ప్రవేశించడంతో ఆలయ ప్రధాన పూజారి ఆలయాన్ని మూసివేసి శుద్ధి చేయడం వివాదాస్పదమైంది.
Comments
Please login to add a commentAdd a comment