‘లిక్కర్‌’ కేసులో తీవ్ర చర్యలొద్దు | Do not take drastic action in Delhi liquor scam case | Sakshi
Sakshi News home page

‘లిక్కర్‌’ కేసులో తీవ్ర చర్యలొద్దు

Published Thu, Mar 16 2023 1:24 AM | Last Updated on Thu, Mar 16 2023 1:24 AM

Do not take drastic action in Delhi liquor scam case - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్‌ పాలసీ కుంభకోణం కేసులో తనపై తీవ్ర చర్యలు తీసుకోవద్దని ఈడీని ఆదేశించాలంటూ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈడీ విచారణ పారదర్శకతపై అనుమానాలు వస్తున్నాయని.. నిందితులు/సాక్షులపై థర్డ్‌ డిగ్రీ చర్యలకు పాల్పడుతున్న పరిస్థితి కనిపిస్తోందని పేర్కొన్నారు. అధికారులు చట్ట విరుద్ధంగా తన ఫోన్‌ను సీజ్‌ చేశారని కోర్టుకు తెలిపారు.

కేంద్రంలోని అధికార పార్టీ కుట్రతో కావాలనే ఇబ్బంది పెడుతోందని ఆరోపించారు. అందువల్ల ఈ నెల 11 నాటి విచారణకు సంబంధించిన తదుపరి చర్యలపై, 16న జరగాల్సిన విచారణపై స్టే ఇవ్వాలని కోరారు. ఈ మేరకు సుప్రీంకోర్టులో సీనియర్‌ న్యాయవాది వందన సెహగల్‌ బుధవారం కవిత తరఫున అభ్యర్థనలను చీఫ్‌ జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ ధర్మాసనానికి విన్నవించారు. ఈ తరహా కేసుల్లో గతంలో కోర్టులు ఇచ్చి న తీర్పులను పిటిషన్‌లో ప్రస్తావించారు. కవిత పిటిషన్‌లోని అంశాలివీ.. 

‘‘పిటిషనర్‌ తెలంగాణ సీఎం చంద్రశేఖర్‌రావు కుమార్తె, ఉన్నత విద్యావంతురాలు, మహిళా ఎమ్మెల్సీ. గతంలో లోక్‌సభ సభ్యురాలిగా ఉన్నప్పుడు పార్లమెంటులో పలు కమిటీల్లో పనిచేశారు. ఎన్నో సామాజిక, సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కానీ ఈడీ ఉద్దేశ పూర్వకంగా ఇండోస్పిరిట్స్‌ తదితరుల కేసులో ఆమెను విచారిస్తోంది. 2022 ఆగస్టు 17న సీబీఐ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌లో పిటిషనర్‌ పేరు లేదు. కొందరు వ్యక్తుల నిర్దిష్ట వాంగ్మూలం ఆధారంగా మాత్రమే ఈ కేసులో ఇంప్లీడ్‌ చేశారు.

కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ నేతలు ఢిల్లీ ఎక్సైజ్‌ పాలసీ కుంభకోణంలో పిటిషనర్‌ పేరును కావాలనే ప్రస్తావిస్తున్నారు. అంతేకాదు ఈడీ దాఖలు చేసిన రిమాండ్‌ అప్లికేషన్‌లో పిటిషనర్‌ వ్యక్తిగత వివరాలు పొందుపరిచింది. అలా చేయాల్సిన అవసరం లేదు. ఈ విధంగా పిటిషనర్‌పై కేంద్రంలోని అధికారపార్టీ కుట్రలో భాగంగా ఈడీ పనిచేస్తోంది. న్యాయస్థానం జోక్యంతోనే పిటిషనర్‌పై రాజకీయ కుట్ర ఆగుతుంది. 

విచారణకు సహకరించినా కూడా.. 
సీబీఐ 2022 డిసెంబర్‌ 2న పిటిషనర్‌కు నోటీసులు జారీ చేసింది. అదే నెల 11న పిటిషనర్‌ నివాసంలో సుమారు ఏడు గంటలపాటు విచారించింది. అయితే ఈ ఏడాది మార్చి 10న జంతర్‌మంతర్‌ వద్ద నిరసన దీక్ష చేస్తామని పిటిషనర్‌ మార్చి 2న ప్రకటించారు.

కానీ దీక్షకు ఒకరోజు ముందు (9న) విచారణకు హాజరుకావాలంటూ 7న ఈడీ నోటీసులు జారీ చేసింది. పిటిషనర్‌ విజ్ఞప్తి చేయడంతో 11న విచారణ చేపట్టి.. మళ్లీ 16న హాజరుకావాలని నోటీసులు ఇచ్చి ంది. ఇంటి వద్ద విచారించాలని కోరినా అనుమతించలేదు. 

చట్ట విరుద్ధంగా ఫోన్‌ సీజ్‌.. 
ఈ నెల 7న ఈడీ మనీలాండరింగ్‌ చట్టం సెక్షన్‌ 50(2), 50(3) ప్రకారం సమన్లు ఇచ్చింది. అంటే వ్యక్తిగతంగా విచారణకు హాజరుకావాలి. కానీ ఫోన్‌ ఇవ్వాలని అందులో పేర్కొనలేదు. విచారణకు హాజరయ్యాక ఫోన్‌ ఇవ్వాలని అధికారులు కోరగా.. పిటిషనర్‌ ఫోన్‌ తెప్పించి అందజేశారు.

కానీ ఈడీ అధికారులు చట్టవిరుద్ధంగా ఫోన్‌ను సీజ్‌ చేశారు. ఎందుకు అలా చేస్తున్నారని అడిగినా వివరణ ఇవ్వలేదు. పైగా ఫోన్‌ను పిటిషనరే స్వయంగా అందజేశారని ఈడీ పేర్కొంది. ఇక పిటిషనర్‌ను నివాసంలో విచారించాలని కోరినా ఈడీ తిరస్కరించిన నేపథ్యంలో అరెస్టు చేస్తారన్న భావన వ్యక్తమైంది. అలా జరగలేదు. కానీ రాత్రి సుమారు 8.30 గంటలకు వరకూ విచారణ కొనసాగింది.  

ఆ స్టేట్‌మెంట్లలో విశ్వసనీయత కనిపించట్లేదు 
పిటిషనర్‌పై ఎలాంటి కేసు లేదు. కొందరు ఇచ్చి న స్టేట్‌మెంట్ల ఆధారంగా ఈడీ విచారిస్తోంది. కానీ తన స్టేట్‌మెంట్‌ను ఉపసంహరించుకుంటున్నానని అరుణ్‌ పిళ్లై కోర్టులో పిటిషన్‌ వేయడాన్ని చూస్తే.. ఆ స్టేట్‌మెంట్లు బలవంతంగా సేకరించినట్లు స్పష్టమవుతోంది. ఈడీ చెప్తున్న స్టేట్‌మెంట్లపై విశ్వసనీయత కనిపించడం లేదు. 

ఈడీ ఆఫీసులో విచారణ పిటిషనర్‌కు హానికరం! 
ఈడీ విచారణలో భాగంగా థర్డ్‌ డిగ్రీ వంటి తీవ్ర చర్యలకు పాల్పడుతోందని శరత్‌చంద్రారెడ్డి విచారణ సమయంలో గాయపడిన చందన్‌రెడ్డిని చూస్తే అర్థమవుతుంది. పిటిషనర్, ఇతర నిందితులకు ఎదురైన పరిణామాలు చూస్తుంటే శారీరకంగా, మానసికంగా ఈడీ బాధించినట్టు తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో మరోసారి ఈడీ కార్యాలయంలో విచారించడం పిటిషనర్‌కు హానికరమే. పిటిషనర్‌ తన నివాసంలో విచారణకు సహకరించడానికి సిద్ధంగా ఉన్నారు. పూర్తి పారదర్శకత కోసం పిటిషనర్‌ను న్యాయవాది సమక్షంలో విచారించాలి’’అని పిటిషన్‌లో పేర్కొన్నారు. 

అత్యవసర విచారణకు నో..
ఈడీ దర్యాప్తుపై స్టే ఇవ్వాలంటూ ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్‌పై అత్యవసరంగా విచారణ జరపాలని కవిత తరఫు న్యాయవాది సుప్రీంకోర్టును కోరారు. ఈ మేరకు బుధవారం సీజేఐ జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ ధర్మాసనానికి విజ్ఞప్తి చేశారు. కానీ అత్యవసర విచారణకు నిరాకరించిన సీజేఐ.. ఈ నెల 24న జాబితాలో చేర్చాలని రిజిస్ట్రీని  ఆదేశించారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement