ఈడీ, సీబీఐ వాదనలు విన్నాకే బెయిల్‌పై నిర్ణయం
విచారణ ఈ నెల 20వ తేదీకి వాయిదా వేసిన సుప్రీంకోర్టు
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు మరోసారి నిరాశ ఎదురైంది. మధ్యంతర బెయిల్ మంజూరు చేయడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. దర్యాప్తు సంస్థల వాదన విన్నాకే నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేసింది. ఢిల్లీ హైకోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ కవిత దాఖలు చేసిన పిటిషన్‌ను సోమవారం జస్టిస్ బీఆర్.గవాయి, జస్టిస్ కేవీ.విశ్వనాథన్‌లతో కూడిన ధర్మాసనం విచారించింది. కవిత తరఫు సీనియర్ న్యాయవాది ముకుల్‌రోహత్గి వాదనలు వినిపిస్తూ.. కవిత ఐదునెలలుగా జైలులో ఉన్నారని, దర్యాప్తు సంస్థలు కేసులు నమోదు చేసిన సుమారు 500 మంది సాక్షుల్ని విచారించారన్నారు.
ఈ కేసు కూడా ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తదితరుల కేసులాంటిదేనని వారికి సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసిందని పేర్కొన్నారు. కవిత మహిళ కావడంతో పీఎంఎల్‌ఏ సెక్షన్ 45 ఇచ్చే మినహాయింపు వర్తిస్తుందని, ఆమెకు బెయిల్ మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమయంలో ధర్మాసనం కొద్దిసేపు చర్చించుకొని ఈ కేసు పరిశీలిస్తాం అని చెప్పింది. కవిత విద్యావంతురాలు, రాజకీయ నాయకురాలు అని జస్టిస్ బీఆర్. గవాయి వ్యాఖ్యానించారు.
మాజీ ఎంపీ అయినంత మాత్రాన పీఎంఎల్‌ఏ సెక్షన్ 45 ప్రకారం మహిళకు రక్షణ కల్పించడానికి వీలు లేదనడం సరికాదన్నారు. ‘కవిత సాధారణ మహిళ కాదు అని ఢిల్లీ హైకోర్టు తీర్పులో వ్యాఖ్యానించింది కదా’అని జస్టిస్ బీఆర్.గవాయి స్పష్టం చేశారు. ఈ వర్గానికి చెందినవారు, ఆ వర్గానికి చెందిన వారు అని వాస్తవంగా ఎలా వ్యాఖ్యానించగలుగుతామని ముకుల్ రోహత్గి పేర్కొన్నారు. దీంతో ప్రతివాదులైన దర్యాప్తు సంస్థలకు నోటీసులు జారీ చేస్తామని ధర్మాసనం పేర్కొంది.
అయితే మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని రోహత్గి ధర్మాసనానికి విజ్ఞప్తి చేశారు. దర్యాప్తు సంస్థల వాదనలు వినకుండా నిర్ణయం తీసుకోబోమని ధర్మాసనం స్పష్టం చేసింది. అనంతరం దర్యాప్తు సంస్థలకు నోటీసులు జారీ చేసిన ధర్మాసనం తదుపరి విచారణ ఈ నెల 20కు వాయిదా వేసింది.
Comments
Please login to add a commentAdd a comment