న్యూఢిల్లీ: బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత శుక్రవారం సుప్రీంకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ కుంభకోణానికి సంబంధించిన ఈడీ, సీబీఐ కేసులలో బెయిల్ ఇవ్వాలని కోరుతూ కవిత దాఖలు చేసిన పిటిషన్‌పై సోమవారం(ఆగష్టు 12) సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. న్యాయమూర్తులు జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ విశ్వనాథ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారించనుంది.
ఢిల్లీ లిక్కర్ కేసులో ఇప్పటికే కవితకు ట్రయల్ కోర్టు, హైకోర్టు బెయిల్ నిరాకరించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఢిల్లీ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఆమె సుప్రీంను ఆశ్రయించారు.
కాగా, ఢిల్లీ మద్యం పాలసీకి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో కవితను మార్చి 15న హైదరాబాద్‌లో ఈడీ అధికారులు అరెస్టు చేశారు. ఆ తర్వాత ఇదే కేసులో సీబీఐ అధికారులు కూడా విచారించారు. ఏప్రిల్ 11వ తేదీన ఢిల్లీ లిక్కర్ కేసులో కవితను సీబీఐ అరెస్ట్ చేసింది. ఈ రెండు కేసుల్లో ఆమెకు బెయిల్ తిరస్కరిస్తూ.. న్యాయస్థానాలు జ్యుడీషియల్ కస్టడీ పొడిగిస్తూ వస్తున్నాయి.
ఇదిలా ఉండగా లిక్కర్ కేసులోనే ఆప్ నేత మనీష్ సిసోడియాకు శుక్రవారం సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. దాదాపు 17 నెలల జైలు జీవితం అనంతరం నేడు సాయంత్రం తిహార్ జైలు నుంచి ఆయన విడుదలయ్యారు. ఇక ఇదే కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, మరో నేత సత్యేంద్ర జైన్ ఇంకా జైలులోనే ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment