
న్యూఢిల్లీ: తాత్కాలిక డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) నియామక పద్ధతికి స్వస్తి పలకాలని దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను సుప్రీం కోర్టు ఆదేశించింది. ఉన్నత స్థాయి నియామకాల్లో పక్షపాతం, బంధుప్రీతి లేకుండా ఉండేందుకు తాజా ఆదేశాలు జారీ చేసినట్టు పేర్కొంది. డీజీపీ, ఎస్పీల పదవీ కాల పరిమితి కచ్చితంగా రెండేళ్లు ఉండాలని ఇచ్చిన మార్గదర్శకాల్లో మార్పులు చేయాలంటూ కేంద్ర ప్రభుత్వం సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
అలాగే 2006లో పోలీసు నియామకాలపై సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పు అమలు కావడం లేదంటూ బీజేపీ నాయకుడు అశ్వనీకుమార్ ఉపాధ్యాయ్ పిటిషన్ దాఖలు చేశారు. వీటిపై మంగళవారం విచారణ జరిపిన భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా, న్యాయమూర్తులు జస్టిస్ ఖన్విల్కర్, జస్టిస్ వైవీ చంద్రచూడ్‌ల ధర్మాసనం పోలీసు సంస్కరణలపై పలు మార్గదర్శకాలు జారీ చేసింది.
యూపీఎస్సీ ద్వారా డీజీపీ ఎంపిక
డీజీపీలు లేదా పోలీస్ కమిషనర్లుగా నియమించదగ్గ సీనియర్ పోలీసు అధికారుల పేర్లను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ)కు ఆ పదవి ఖాళీ అవడానికి మూడు నెలలు ముందుగానే పంపాలని అన్ని రాష్ట్రాలను కోరింది. వారిలో యూపీఎస్సీ ముగ్గురు అర్హులైన అధికారులను ఎంపిక చేస్తుందని.. వీరి నుంచి ఒకరిని పోలీస్ చీఫ్‌గా రాష్ట్రాలు నియమించుకోవచ్చని పేర్కొంది.
డీజీపీగా ఎంపిక చేసే వ్యక్తి రిటైర్ అయిన తర్వాత కూడా కొనసాగవచ్చని అయితే పొడిగించిన కాలవ్యవధి సహేతుకంగా ఉండాలని తెలిపింది. ‘‘కొన్ని రాష్ట్రాలు తాత్కాలిక డీజీపీలను నియమించి, రిటైర్మెంట్ వయస్సు దగ్గర పడే సమయంలో మరో రెండేళ్లు (62 ఏళ్ల వరకు) కొనసాగేందుకు వీలుగా పర్మనెంట్ చేస్తున్నాయని తమ దృష్టికి వచ్చిందని, ఇటువంటి నియామక పద్ధతి మా ఆదేశాల స్ఫూర్తికి విరుద్ధం’’ అని ధర్మాసనం పేర్కొంది.
రెండేళ్ల సర్వీసుండేలా చూసుకోవాలి
యూపీఎస్సీ కూడా డీజీపీ ప్యానల్ పేర్లను ఎంపిక చేసేటప్పుడు వారి పదవీ విరమణకు ఇంకా రెండేళ్ల సర్వీసు మిగిలి ఉందా లేదా అనేది చూసుకోవాలని సూచించింది. అలాగే ప్యానెల్ పేర్ల ఎంపికలో ప్రతిభ, సర్వీసును పరిగణనలోకి తీసుకోవాలని కోరింది.
ఈ సందర్భంగా పోలీసు అధికారుల నియామకానికి సంబంధించిన నిబంధనలు, కేంద్ర, రాష్ట్ర చట్టాలను నిలుపుదల చేస్తున్నట్లు తెలిపింది. పోలీసు సంస్కరణలపై సుప్రీం కోర్టు 2006లో ఇచ్చిన చారిత్రక తీర్పును అనుసరించి తాజా మార్గదర్శకాలు విడుదల చేసినట్లు ధర్మాసనం వివరించింది. తమ ఆదేశాల్లో మార్పులు చేయాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేసుకునే స్వేచ్ఛను రాష్ట్రాలకు ఇచ్చింది.
విచారణ సందర్భంగా అటార్నీ జనరల్ వేణుగోపాల్ మాట్లాడుతూ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, రాజస్తాన్ రాష్ట్రాలు డీజీపీ ఎంపిక కోసం యూపీఎస్సీని సంప్రదించాయని చెప్పారు. 19 రాష్ట్రాలు సుప్రీం ఆదేశాలు ధిక్కరిస్తూ తాత్కాలిక డీజీపీ పద్ధతిని అనుసరిస్తున్నాయని చెప్పారు. పూర్తి వాదనలు విన్న సుప్రీం ధర్మాసనం మంగళవారం తాజా ఆదేశాలు జారీ చేసింది.
నాటి తీర్పులో ఏముంది?
పోలీసు సంస్కరణలపై 2006లో సుప్రీంకోర్టు ఇచ్చిన చరిత్రాత్మక తీర్పు సరిగా అమలుకాకపోవడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఆ తీర్పులో ఏముంది?
♦ ప్రతిభ ఆధారంగా, పారదర్శకంగా సీనియర్ అధికారుల్ని డీజీపీ/ఎస్‌పీలుగా నియమించాలి. వారు కనీసం రెండేళ్లు ఆ పదవిలో కొనసాగేలా పదవీకాలంపై నిర్ణయం తీసుకోవాలి.
♦ ప్రస్తుత డీజీపీ పదవీ విరమణకు మూడు నెలలకు ముందుగానే యూపీఎస్‌సీకి అర్హులైన సీనియర్ అధికారుల జాబితా పంపాలి. యూపీఎస్‌సీ సూచించిన ముగ్గురిలో ఒకరిని డీజీపీగా నియమించుకోవచ్చు.
♦ డీఎస్‌పీ అంతకంటే తక్కువ హోదా ఉన్న పోలీసు అధికారుల బదిలీలు, పోస్టింగ్‌లు, పదోన్నతులు, ఇతర సర్వీసు సంబంధిత విషయాల్లో సిఫార్సుల కోసం పోలీస్ ఎస్టాబ్లిష్‌మెంట్ బోర్డ్‌ను ఏర్పాటు చేయాలి
♦ పోలీసు కస్టడీలో అత్యాచారం, తీవ్రగాయాలు, లాకప్ మరణం వంటి తీవ్రమైన కేసుల్లో.. ఎస్పీ కంటే పై స్థాయి అధికారులపై వచ్చే ఫిర్యాదుల పరిశీలనకు ఫిర్యాదుల అథారిటీని ఏర్పాటు చేయాలి.
♦ కేంద్ర పోలీసు సంస్థ (సెంట్రల్ పోలీస్ ఆర్గనైజేషన్స్)ల అధిపతుల ఎంపిక, నియామకాల కోసం జాతీయస్థాయిలో నేషనల్ సెక్యూరిటీ కమిషన్ ఏర్పాటుచేయాలి
♦ పోలీసులపై అనవసర ఒత్తిళ్లు, ప్రభావం పడకుండా చూసేందుకు స్పష్టమైన మార్గదర్శకాలతో రాష్ట్ర భద్రతా కమిషన్(ఎస్‌ఎస్‌సీ) ఏర్పాటుచేయాలి.
Comments
Please login to add a commentAdd a comment