సాక్షి, హైదరాబాద్: రూ.1,730 కోట్ల విద్యుత్ బకాయిలకు సంబంధించి టీఎస్ ట్రాన్స్‌కో వేసిన కేసులో కౌంటర్ దాఖలు చేయాలని కేంద్ర, ఏపీ ప్రభుత్వాలకు హైకోర్టు స్పష్టం చేసింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన తర్వాత ఉద్యోగుల పీఎఫ్, గ్రాట్యుటీ.. తదితరాలపై ఏపీ సర్కార్ తమకు రూ..1,730 కోట్లు బకాయి ఉందని, వాటిని చెల్లించేలా ఉత్తర్వులు ఇవ్వాలని కోరుతూ టీఎస్ ట్రాన్స్‌కో జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ చైర్మన్ సి. శ్రీనివాసరావు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఉద్యోగుల ట్రస్టు(పీఅండ్‌జీ, పీఎఫ్, ఈఎల్, గ్రాట్యుటీ) పెట్టుబడులకు సంబంధించి అసలు రూ.674 కోట్లు, వడ్డీ రూ.38 కోట్లు.. ట్రాన్స్‌మిషన్ అండ్ ఎస్‌ఎల్‌డీసీ చార్జీలకు సంబంధించి అసలు రూ.105 కోట్లు, వడ్డీ రూ.85 కోట్లు.. టీఎస్ డిస్కం బాండ్స్‌కు సంబంధించి అసలు రూ.359 కోట్లు, వడ్డీ రూ.253 కోట్లు.. ఐసీడీస్, డెబిట్ సర్వీసింగ్ తదితరాలకు సంబంధించి.. అసలు రూ.128 కోట్లు, వడ్డీ రూ.87 కోట్లు.. మొత్తంగా అసలు రూ.1,267 కోట్టు, వడ్డీ రూ.463 కోట్లు కలిపి రూ.1,730 కోట్లు ఏపీ బాకీ ఉందని పిటిషన్‌లో పేర్కొన్నారు.
దీనిపై న్యాయమూర్తులు జస్టిస్ పి.నవీన్‌రావు, జస్టిస్ జె.శ్రీనివాస్‌రావు ధర్మాసనం విచారణ చేపట్టింది. తొలుత టీఎస్ ట్రాన్స్‌కో అడ్వొకేట్ వై.రామారావు వాదిస్తూ, ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014 ప్రకారం విద్యుత్ ఉద్యోగుల బకాయిలు ఏపీ ట్రాన్స్‌కో చెల్లించాలే ఉత్తర్వులు ఇవ్వాలన్నారు. షీలా బిండే కమిటీ గైడ్‌లైన్స్ ప్రకారం ఆస్తులు, అప్పుల పంపిణీ జరగాలన్న రూల్స్ అమలు కాలేదన్నారు. వాదనలు విన్న ధర్మాసనం.. కేంద్ర, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలతో పాటు ప్రతివాదులకు కౌంటర్ దాఖలు చేయాలని నోటీసులు జారీ చేసింది. గతంలో వేసిన ఇదే తరహా పిటిషన్‌తో పాటు దీన్ని కలిపి విచారణ చేస్తామని వెల్లడించింది. తదుపరి విచారణను అక్టోబర్ 13కు వాయిదా వేసింది.
Comments
Please login to add a commentAdd a comment