TSTRANSCO
-
1,730 కోట్లు చెల్లించేలా ఆదేశించండి
సాక్షి, హైదరాబాద్: రూ.1,730 కోట్ల విద్యుత్ బకాయిలకు సంబంధించి టీఎస్ ట్రాన్స్‌కో వేసిన కేసులో కౌంటర్ దాఖలు చేయాలని కేంద్ర, ఏపీ ప్రభుత్వాలకు హైకోర్టు స్పష్టం చేసింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన తర్వాత ఉద్యోగుల పీఎఫ్, గ్రాట్యుటీ.. తదితరాలపై ఏపీ సర్కార్ తమకు రూ..1,730 కోట్లు బకాయి ఉందని, వాటిని చెల్లించేలా ఉత్తర్వులు ఇవ్వాలని కోరుతూ టీఎస్ ట్రాన్స్‌కో జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ చైర్మన్ సి. శ్రీనివాసరావు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఉద్యోగుల ట్రస్టు(పీఅండ్‌జీ, పీఎఫ్, ఈఎల్, గ్రాట్యుటీ) పెట్టుబడులకు సంబంధించి అసలు రూ.674 కోట్లు, వడ్డీ రూ.38 కోట్లు.. ట్రాన్స్మిషన్ అండ్ ఎస్ఎల్డీసీ చార్జీలకు సంబంధించి అసలు రూ.105 కోట్లు, వడ్డీ రూ.85 కోట్లు.. టీఎస్ డిస్కం బాండ్స్‌కు సంబంధించి అసలు రూ.359 కోట్లు, వడ్డీ రూ.253 కోట్లు.. ఐసీడీస్, డెబిట్ సర్వీసింగ్ తదితరాలకు సంబంధించి.. అసలు రూ.128 కోట్లు, వడ్డీ రూ.87 కోట్లు.. మొత్తంగా అసలు రూ.1,267 కోట్టు, వడ్డీ రూ.463 కోట్లు కలిపి రూ.1,730 కోట్లు ఏపీ బాకీ ఉందని పిటిషన్లో పేర్కొన్నారు. దీనిపై న్యాయమూర్తులు జస్టిస్ పి.నవీన్‌రావు, జస్టిస్ జె.శ్రీనివాస్‌రావు ధర్మాసనం విచారణ చేపట్టింది. తొలుత టీఎస్ ట్రాన్స్‌కో అడ్వొకేట్ వై.రామారావు వాదిస్తూ, ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014 ప్రకారం విద్యుత్ ఉద్యోగుల బకాయిలు ఏపీ ట్రాన్స్‌కో చెల్లించాలే ఉత్తర్వులు ఇవ్వాలన్నారు. షీలా బిండే కమిటీ గైడ్‌లైన్స్ ప్రకారం ఆస్తులు, అప్పుల పంపిణీ జరగాలన్న రూల్స్ అమలు కాలేదన్నారు. వాదనలు విన్న ధర్మాసనం.. కేంద్ర, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలతో పాటు ప్రతివాదులకు కౌంటర్ దాఖలు చేయాలని నోటీసులు జారీ చేసింది. గతంలో వేసిన ఇదే తరహా పిటిషన్‌తో పాటు దీన్ని కలిపి విచారణ చేస్తామని వెల్లడించింది. తదుపరి విచారణను అక్టోబర్ 13కు వాయిదా వేసింది. -
విద్యుత్ ఉద్యోగులకు టీకాలు
సాక్షి, హైదరాబాద్: కోవిడ్–19 మహమ్మారి కాలంలో సైతం నిరంతర విద్యుత్ సరఫరా కోసం క్షేత్ర స్థాయిలో విధులు నిర్వహిస్తున్న ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ (ఓఅండ్ఎం) విభాగాల ఉద్యోగులు, ఆర్టిజన్లను ఫ్రంట్‌లైన్ వారియర్లుగా గుర్తించి త్వరితంగా వ్యాక్సినేషన్ నిర్వహించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ను నిర్దేశించారు. ట్రాన్స్‌కో, జెన్కో సీఎండీ డి.ప్రభాకర్‌రావు బుధవారం ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ప్రగతిభవన్‌లో కలిసి విద్యుత్ ఉద్యోగులకు వ్యాక్సినేషన్ నిర్వహించాలని కోరగా, ఆయన సానుకూలంగా స్పందిస్తూ ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. తెలంగాణ ట్రాన్స్‌కో, జెన్కో, టీఎస్ఎస్పీడీసీఎల్, టీఎస్ఎన్పీడీసీఎల్ సంస్థల్లో 30 వేల మంది ఉద్యోగులు, 22 వేల మంది ఆర్టిజన్లు కలిపి మొత్తం 52 వేల మంది ఉన్నారు. పార్ట్‌టైమ్ ఉద్యోగులైన మీటర్ రీడర్లను పరిగణనలోకి తీసుకుంటే ఈ సంఖ్య 55 వేలు అవుతుంది. ముఖ్యమంత్రి సూచనల మేరకు ఓఅండ్ఎం ఉద్యోగులు, ఆర్టిజన్లు కలిపి 40 వేల మందికి ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉచితంగా వ్యాక్సినేషన్ నిర్వహించనున్నారు. మిగిలిన విద్యుత్ ఉద్యోగుల వ్యాక్సినేషన్‌కు విద్యుత్ సంస్థలే ఏర్పాట్లు చేసుకోవాలని సీఎం సూచించారు. ఈ నేపథ్యంలో ఇతర విభాగాల విద్యుత్ ఉద్యోగుల టీకా ఖర్చులను విద్యుత్ సంస్థలే భరించనున్నాయి. ఐదారు రోజుల్లో వ్యాక్సినేషన్: ట్రాన్స్‌కో సీఎండీ డి.ప్రభాకర్‌రావు కరోనా బారినపడిన విద్యుత్ ఉద్యోగులు, ఆర్టిజన్లకు ఎంత ఖర్చయినా భరించి కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఉచిత వైద్యం అందిస్తున్నామని ట్రాన్స్‌కో, జెన్కో సీఎండీ డి.ప్రభాకర్‌రావు తెలిపారు. ఐదారు రోజుల్లో విద్యుత్ ఉద్యోగుల వ్యాక్సినేషన్‌ను ప్రారంభించే అవకాశముందని చెప్పారు. -
నాలుగేళ్లలో విద్యుత్ కొలువులు
14,438 నోటిఫికేషన్ల కోసం సర్కారుకు విద్యుత్ సంస్థల ప్రతిపాదన * 2016-19 మధ్య నాలుగు వరుస ప్రకటనలు * ఇంజనీరింగ్‌తోపాటు ఇతర విభాగాల పోస్టులు సైతం భర్తీ సాక్షి, హైదరాబాద్ వచ్చే నాలుగేళ్లలో విద్యుత్ సంస్థల నుంచి ఏటా ఉద్యోగ నియామక ప్రకటనలు వెలువడనున్నాయి. వరుసగా ఉద్యోగ నియామకాలు చేపట్టేందుకు విద్యుత్ సంస్థలు కసరత్తు చేస్తున్నాయి. ఇప్పటికే 1,427 అసిస్టెంట్ ఇంజనీర్ (ఏఈ) పోస్టుల భర్తీకి రాత పరీక్ష నిర్వహించి ఫలితాలు ప్రకటించిన విద్యుత్ సంస్థలు మరో నెల రోజుల్లో ఆ నియామకాలు పూర్తి చేయనున్నాయి. ఆ వెంటనే 605 సబ్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి ట్రాన్స్‌కో, డిస్కంల నుంచి ప్రకటన విడుదల కానుంది. 2015-16 ఆర్థిక సంవత్సరం ముగిసేలోగా ఈ పోస్టుల భర్తీ ముగియనుండగా మళ్లీ వరుసగా మూడేళ్లపాటు విద్యుత్ సంస్థల నుంచి ఇంజనీర్, నాన్ టెక్నికల్, ఇతర కేటగిరీల పోస్టుల భర్తీకి ప్రకటనలు రానున్నాయి. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని 2016-17, 2017-18, 2018-19లో సైతం వరుసగా ఉద్యోగ నియామక ప్రకటనలు జారీ చేసేందుకు విద్యుత్ సంస్థలు రాష్ట్ర ప్రభుత్వ అనుమతి కోరాయి. రాష్ట్రంలో కొత్త విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల నిర్మాణంతోపాటు విద్యుత్ సరఫరా, పంపిణీ వ్యవస్థల సామర్థ్యాన్ని రెట్టింపు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముమ్మర చర్యలు తీసుకుంటోంది. ఈ నేపథ్యంలో పెరగనున్న జెన్కో, ట్రాన్స్‌కో, డిస్కంలలో సామర్థ్యం మేరకు ఇంజనీరింగ్, ఇతర కేటగిరీల పోస్టులను భర్తీ చేసుకోవాల్సి ఉంది. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని రానున్న నాలుగేళ్లలో భర్తీ చేయాల్సిన ఉద్యోగాల సంఖ్యపై విద్యుత్ సంస్థలు లెక్కలు వేశాయి. ఇంజనీరింగ్, నాన్ టెక్నికల్, ఇతర కేటగిరీల విభాగాల్లో మొత్తం 14,438 పోస్టుల భర్తీ చేయాలని నిర్ణయం తీసుకున్నాయి. విద్యుత్ సంస్థల నుంచి ఇటీవల అందిన ఈ ప్రతిపాదనలు ప్రస్తుతం ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయి. ఇందులో 4,947 ఇంజనీరింగ్, 1,520 నాన్ టెక్నికల్, 7,971 ఇతర విభాగాల పోస్టులున్నాయి. నాన్ టెక్నికల్ కేటగిరీలో జూనియర్ అసిస్టెంట్, జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ తదితర పోస్టులతోపాటు ఇతర కేటగిరీల పోస్టుల్లో జూనియర్ లైన్మెన్, ఫైర్‌మెన్ ఇతరాత్ర పోస్టులను భర్తీ చేయనున్నాయి. ఈ ప్రతిపాదనలకు రాష్ట్ర ఆర్థికశాఖ అనుమతిస్తే ట్రాన్స్‌కో, జెన్కో, డిస్కంల నుంచి వరుసగా నాలుగేళ్లపాటు ఉద్యోగ ప్రకటనలు జారీ కానున్నాయి. 2016-19 మధ్య కాలంలో భర్తీ చేయాల్సిన విద్యుత్ కొలువుల ప్రతిపాదనల వివరాలు విభాగం ట్రాన్స్‌కో జెన్కో ఎన్పీడీసీఎల్ ఎస్పీడీసీఎల్ ఇంజనీరింగ్ 2,243 1,315 872 517 నాన్ టెక్నికల్ 250 220 613 437 ఇతర పోస్ట్‌లు 1,202 1,958 2,007 2,804