నాలుగేళ్లలో విద్యుత్ కొలువులు
14,438 నోటిఫికేషన్ల కోసం సర్కారుకు విద్యుత్ సంస్థల ప్రతిపాదన
* 2016-19 మధ్య నాలుగు వరుస ప్రకటనలు
* ఇంజనీరింగ్‌తోపాటు ఇతర విభాగాల పోస్టులు సైతం భర్తీ
సాక్షి, హైదరాబాద్
వచ్చే నాలుగేళ్లలో విద్యుత్ సంస్థల నుంచి ఏటా ఉద్యోగ నియామక ప్రకటనలు వెలువడనున్నాయి. వరుసగా ఉద్యోగ నియామకాలు చేపట్టేందుకు విద్యుత్ సంస్థలు కసరత్తు చేస్తున్నాయి. ఇప్పటికే 1,427 అసిస్టెంట్ ఇంజనీర్ (ఏఈ) పోస్టుల భర్తీకి రాత పరీక్ష నిర్వహించి ఫలితాలు ప్రకటించిన విద్యుత్ సంస్థలు మరో నెల రోజుల్లో ఆ నియామకాలు పూర్తి చేయనున్నాయి. ఆ వెంటనే 605 సబ్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి ట్రాన్స్‌కో, డిస్కంల నుంచి ప్రకటన విడుదల కానుంది. 2015-16 ఆర్థిక సంవత్సరం ముగిసేలోగా ఈ పోస్టుల భర్తీ ముగియనుండగా మళ్లీ వరుసగా మూడేళ్లపాటు విద్యుత్ సంస్థల నుంచి ఇంజనీర్, నాన్ టెక్నికల్, ఇతర కేటగిరీల పోస్టుల భర్తీకి ప్రకటనలు రానున్నాయి.
భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని 2016-17, 2017-18, 2018-19లో సైతం వరుసగా ఉద్యోగ నియామక ప్రకటనలు జారీ చేసేందుకు విద్యుత్ సంస్థలు రాష్ట్ర ప్రభుత్వ అనుమతి కోరాయి. రాష్ట్రంలో కొత్త విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల నిర్మాణంతోపాటు విద్యుత్ సరఫరా, పంపిణీ వ్యవస్థల సామర్థ్యాన్ని రెట్టింపు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముమ్మర చర్యలు తీసుకుంటోంది. ఈ నేపథ్యంలో పెరగనున్న జెన్‌కో, ట్రాన్స్‌కో, డిస్కంలలో సామర్థ్యం మేరకు ఇంజనీరింగ్, ఇతర కేటగిరీల పోస్టులను భర్తీ చేసుకోవాల్సి ఉంది. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని రానున్న నాలుగేళ్లలో భర్తీ చేయాల్సిన ఉద్యోగాల సంఖ్యపై విద్యుత్ సంస్థలు లెక్కలు వేశాయి. ఇంజనీరింగ్, నాన్ టెక్నికల్, ఇతర కేటగిరీల విభాగాల్లో మొత్తం 14,438 పోస్టుల భర్తీ చేయాలని నిర్ణయం తీసుకున్నాయి. విద్యుత్ సంస్థల నుంచి ఇటీవల అందిన ఈ ప్రతిపాదనలు ప్రస్తుతం ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయి. ఇందులో 4,947 ఇంజనీరింగ్, 1,520 నాన్ టెక్నికల్, 7,971 ఇతర విభాగాల పోస్టులున్నాయి. నాన్ టెక్నికల్ కేటగిరీలో జూనియర్ అసిస్టెంట్, జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ తదితర పోస్టులతోపాటు ఇతర కేటగిరీల పోస్టుల్లో జూనియర్ లైన్‌మెన్, ఫైర్‌మెన్ ఇతరాత్ర పోస్టులను భర్తీ చేయనున్నాయి. ఈ ప్రతిపాదనలకు రాష్ట్ర ఆర్థికశాఖ అనుమతిస్తే ట్రాన్స్‌కో, జెన్‌కో, డిస్కంల నుంచి వరుసగా నాలుగేళ్లపాటు ఉద్యోగ ప్రకటనలు జారీ కానున్నాయి.
2016-19 మధ్య కాలంలో భర్తీ చేయాల్సిన విద్యుత్ కొలువుల ప్రతిపాదనల వివరాలు
విభాగం ట్రాన్స్‌కో జెన్‌కో ఎన్పీడీసీఎల్ ఎస్పీడీసీఎల్
ఇంజనీరింగ్ 2,243 1,315 872 517
నాన్ టెక్నికల్ 250 220 613 437
ఇతర పోస్ట్‌లు 1,202 1,958 2,007 2,804