TSGENCO
-
తెలంగాణ జెన్కో ఎగ్జామ్ వాయిదా
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కొత్త ప్రభుత్వం కొలువుదీరాక తొలి పరీక్ష వాయిదా పడింది. జెన్కో రాత పరీక్షను వాయిదా వేస్తూ మంగళవారం సాయంత్రం ఒక ప్రకటన వెలువడింది. ఈ నెల 17వ తేదీన పరీక్ష జరగాల్సి ఉండగా.. అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు వాయిదా వేసినట్లు మంగళవారం సదరు ప్రకటనలో జెన్కో తెలిపింది. తెలంగాణ రాష్ట్ర విద్యుత్ ఉత్పత్తి సంస్థ, అసిస్టెంట్ ఇంజనీర్, కెమిస్ట్ పోస్టుల భర్తీ కోసం ఈ ఏడాది అక్టోబర్ 4వ తేదీన నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నెల 17వ తేదీన రాత పరీక్ష నిర్వహించాలనుకుంది. కానీ, అదే రోజు మరికొన్ని పరీక్షలు ఉన్నాయి. దీంతో పరీక్ష వాయిదా వేయాలని అభ్యర్థుల నుంచి జెన్కోకు విజ్ఞప్తులు వచ్చాయి. అదే సమయంలో తాజాగా కొందరు అభ్యర్థులు డిప్యూటీ సీఎం భట్టి దృష్టికి కూడా ఈ విషయం తీసుకెళ్లారు. దీంతో పరీక్ష వాయిదా వేసేందుకే జెన్కో మొగ్గు చూపింది. అయితే తిరిగి పరీక్ష ఎప్పుడు నిర్వహించేది స్పష్టత ఇవ్వలేదు. కానీ, జెన్కో వెబ్సైట్లో షెడ్యూల్‌ను పెడతామని పేర్కొంది. -
చర్చలు మళ్లీ విఫలం.. రోజువారీ సమీక్షల బహిష్కరణకు పిలుపు
సాక్షి, హైదరాబాద్: విద్యుత్ ఉద్యోగుల వేతన సవరణ, ఇతర డిమాండ్ల పరిష్కారానికి తెలంగాణ స్టేట్ పవర్/ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ జేఏసీలతో, విద్యుత్ ఉద్యోగ సంఘాల జేఏసీలతో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జి.జగదీ‹శ్‌రెడ్డి ఆదివారం తన కార్యాలయంలో నిర్వహించిన చర్చలు విఫలమయ్యాయి. 6శాతం ఫిట్మెంట్తో పీఆర్సీ అమలుకు క్రితం సారి జరిగిన చర్చల్లో విద్యుత్ సంస్థల యాజమాన్యాలు ప్రతిపాదించగా, ఉభయ జేఏసీలు తిరస్కరించాయి. మరోశాతం పెంచి 7శాతం ఫిట్మెంట్తో పీఆర్సీ అమలు చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారని, దీనికి అంగీకరించి 17 నుంచి తలపెట్టిన సమ్మెను విరమించుకోవాలని తాజాగా జరిపిన చర్చల్లో విద్యుత్‌శాఖ మంత్రి ప్రతిపాదించగా, ఇందుకూ జేఏసీలు తిరస్కరించాయి. దీంతో విద్యుత్ జేఏసీలతో ఏడో దఫా చర్చలు సైతం విఫలమయ్యాయి. 17నుంచి సమ్మె పిలుపులో మార్పు లేదు: గతంలో జరిగిన చర్చల్లో 30శాతానికి తగ్గకుండా ఫిట్మెంట్తో పీఆర్సీ అమలుకి పట్టుబట్టామని, తాజాగా కనీసం 25శాతం ఫిట్‌మెంట్‌తోనైనా అమలు చేయాలని కోరామని పవర్ ఎంప్లాయిస్ జేఏసీ నేతలు సాయిబాబు వెల్లడించారు. ఇప్పటికే ప్రకటించిన విధంగా ఈ నెల 17 నుంచి సమ్మె ప్రారంభిస్తామని, ఈ విషయంలో ఎలాంటి మార్పులేదని ప్రకటించారు. సోమవారం నుంచి జిల్లాల్లో సమ్మె సన్నాహక సమావేశాలు యధావిధిగా కొనసాగుతాయన్నారు. ట్రాన్స్‌కో, జెన్కో, డిస్కంలలో రోజువారీగా నిర్వహించే సమీక్ష సమావేశాలను సోమవారం నుంచి బహిష్కరించాలని పిలుపునిచ్చారు. చర్చల్లో యాజమాన్యాల తరఫున ట్రాన్స్‌కో, జెన్కో సీఎండీ డి.ప్రభాకర్ రావు, ఉత్తర/దక్షిణ డిస్కంల సీఎండీలు ఎ.గోపాల్‌రావు, జి.రఘుమారెడ్డి, పవర్ ఎంప్లాయిస్ జేఏసీ నేతలు పి.రత్నాకర్ రావు, శ్రీధర్, బీసీ రెడ్డి పాల్గొన్నారు. -
ట్రూఅప్ చార్జీలను అనుమతించొద్దు
వినియోగదారుల నుంచి ట్రూఅప్ చార్జీలు వసూలు చేసేందుకు రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లను అనుమతించరాదని విద్యుత్‌రంగ నిపుణులు, పారిశ్రామిక, రైతు, వినియోగదారుల సంఘాలు విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ)కి విజ్ఞప్తి చేశాయి. డిస్కంలు 2019–20, 2020–21, 2021–22 సంవత్సరాలకు సంబంధించిన వార్షిక ఆదాయ అవసరాల నివేదిక (ఏఆర్ఆర్), టారిఫ్ ప్రతిపాదనలను సమర్పించలేదని, అందువల్ల వాటికి సంబంధించిన ట్రూఅప్ చార్జీల వసూళ్లకు నిబంధనలు అనుమతించబోవని స్పష్టం చేశాయి. 2016–17 నుంచి 2022–23 మధ్య కాలానికి రూ. 12,015 కోట్ల పవర్ పర్చేజ్ ట్రూఅప్ చార్జీలు, 2006–21 కాలానికి రూ. 4,092 కోట్ల డి్రస్టిబ్యూషన్ ట్రూఅప్ చార్జీలు కలిపి మొత్తం రూ.16,107 కోట్ల ట్రూఅప్ చార్జీల భారాన్ని మోపాలని డిస్కంలు చేసిన ప్రతిపాదనలను అనుమతించరా దని ఈఆర్సీకి విజ్ఞప్తి చేశాయి. డిస్కంల ఏఆర్ఆర్ నివేదిక, టారిఫ్ ప్రతిపాదనలు 2023–24తోపాటు ట్రూఅప్ చార్జీల ప్రతిపాదనలపై శుక్రవారం ఈఆర్సీ చైర్మన్ టి.శ్రీరంగారావు, సభ్యులు ఎండీ. మనోహర్‌రాజు, బండారు కృష్ణయ్య బహిరంగ విచారణ నిర్వహించగా టీఎస్ఎస్పీడీసీఎల్ సీఎండీ జి.రఘుమారెడ్డి పాల్గొని వక్తలు లేవనెత్తిన అంశాలకు వివరణ ఇచ్చారు. ఎవరేమన్నారంటే... అసమర్థ విధానాలతోనే నష్టాలు... అసమర్థ ఆర్థిక నిర్వహణ, తొందరపాటు నిర్ణయాలతోనే డిస్కంలు తీవ్ర నష్టాల్లో ఉన్నాయి. ఆ భారాన్ని ప్రజలు భరించాల్సి వస్తోంది. ఛత్తీస్‌గఢ్, సెమ్‌కాబ్ విద్యుత్ ఒప్పందాలపై తీవ్ర అభ్యంతరాలను వ్యక్తం చేసినా రాష్ట్ర ప్రభుత్వం మొండిగా ముందుకెళ్లింది. ధరల వివాదంతో ఛత్తీస్‌గఢ్ విద్యుత్ సరఫరా బంద్ కాగా, సెమ్‌కాబ్ విద్యుత్ ధర యూనిట్‌కు రూ. 8.33కి పెరిగింది. విద్యుత్ కేంద్రాల నిర్మాణ వ్యయాన్ని పెంచుకొనేందుకు వీలు కల్పిస్తూ ఈఆర్సీ జారీ చేసిన ‘రెగ్యులేషన్ 1 ఆఫ్ 2019’ను ఉపసంహరించుకోవాలి. విద్యుత్‌రంగం ప్రైవేటీకరణ కోసమే ప్రీపెయిడ్ మీటర్లను, ఆదానీ కోసమే ఎగుమతి చేసిన బొగ్గు వినియోగాన్ని కేంద్రం తప్పనిసరి చేసింది. – సెంటర్ ఫర్ పవర్ స్టడీస్ కన్వీనర్ ఎం.వేణుగోపాల్‌రావు అందరికీ విద్యుత్ చార్జీలు పెంచాలి ప్రతి ఇంట్లో ఒక్కో వ్యక్తి నెలకు రూ. 300 చొప్పున సెల్‌ఫోన్ బిల్లుకు, లీటర్ పెట్రోల్‌కు రూ.100 చొప్పున ఖర్చు చేస్తున్నారు. ఈ లెక్కన విద్యుత్ చార్జీలు ఎందుకు పెంచకూడదు? డిస్కంల నష్టాల నేపథ్యంలో రాష్ట్రంలో అందరికీ విద్యుత్ బిల్లులు పెంచాలి. కార్పొరేట్ బడులు, ఆస్పత్రులకు మరింత ఎక్కువగా పెంచాలి. వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ సరఫరా అవసరం లేదు. విద్యుత్ టవర్ల కింద భూములు కోల్పోయిన రైతులకు ప్రభుత్వం పరిహారం చెల్లించట్లేదు. క్షేత్రస్థాయిలో లైన్మెన్ నుంచి ఏడీఈ వరకు అధికారులు రైతులపట్ల దురుసుగా ప్రవర్తిస్తున్నారు. – బీజేపీ కిసాన్‌మోర్చా అధ్యక్షుడు శ్రీధర్‌రెడ్డి సబ్సిడీ సొమ్ము తీసుకున్నాకే డిస్కంలు ఉచిత విద్యుత్ ఇవ్వాలి రాష్ట్ర ప్రభుత్వం నుంచి డిస్కంలు ముందుగా సబ్సిడీ నిధులు తీసుకున్న తర్వాతే వ్యవసాయం, సెలూన్లు, లాండ్రీలు, ఎస్సీ, ఎస్టీల ఇళ్లకు ఉచిత విద్యుత్ అందించాలి. నేను బతికుండగానే కొడంగల్ డివిజన్లోని మా హస్నాబాద్‌లో సబ్‌స్టేషన్ వస్తే సంతోషంగా చనిపోతా. లో వోల్టేజీ సమస్యతో ఆరేళ్ల నుంచి అడుగుతున్నా స్పందన లేదు. – స్వామి జగన్మాయనంద ప్రైవేటు ఆస్పత్రులను ఎల్టీ–2 కమర్షియల్ కేటగిరీ నుంచి ప్రభుత్వ ఆస్పత్రులుండే ఎల్టీ–7 జనరల్ కేటగిరీకి మార్చాలని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తరఫున డాక్టర్ సంపత్ రావు విజ్ఞప్తి చేశారు. ఐఐటీ హైదారాబాద్‌కు ప్రతి నెలా రూ.1.1 కోట్ల వరకు విద్యుత్ బిల్లులు వస్తున్నాయని, హెచ్‌టీ–2 కేటగిరీ నుంచి కొత్త కేటగిరీకి మార్చాలని సంస్థ తరఫున సూపరింటెండింగ్ ఇంజనీర్ రవీంద్ర బాబు విజ్ఞప్తి చేశారు. అదనంగా యూనిట్‌కు 66 పైసలు చెల్లించి కొనుగోలు చేస్తున్న గ్రీన్ ఎనర్జీకి సంబంధించిన సర్టిఫికెట్లను ప్రతినెలా జారీ చేయాలని ఇన్ఫోసిస్ విజ్ఞప్తి చేసింది. ఏఆర్ఆర్, టారిఫ్ ప్రతిపాదనలు సమర్పించకుండానే ట్రూఅప్ చార్జీల వసూళ్లకు డిస్కంలు అనుమతి కోరడంపై ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ చాంబర్స్ ఆప్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ అభ్యంతరం తెలిపింది. కరెంట్ ఫెన్సింగ్ పెట్టుకొనే వారిపై హత్యానేరం కేసులు: ఈఆర్సీ చైర్మన్ పంట పొలాలకు ఏర్పాటు చేసిన విద్యుత్ ఫెన్సింగ్‌తో ఇటీవల రాష్ట్రంలో ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. విద్యుత్‌తో ఫెన్సింగ్ వేసే వారిపై గతంలో అక్రమ కనెక్షన్ ఆరోపణలపై రెండేళ్లలోపు జైలుశిక్ష వర్తించే సెక్షన్ 304ఏ కింద కేసు పెట్టేవారు. కానీ ఇకపై హత్యానేరం కింద (సెక్షన్304) కేసులు నమోదు చేయాలని ఆదేశించాం. – ఈఆర్సీ చైర్మన్ శ్రీరంగారావు -
తుక్కు.. తక్కువేం కాదు.. టీఎస్ జెన్కోకు రూ.485 కోట్ల ఆదాయం
సాక్షి , భద్రాద్రి కొత్తగూడెం : కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్లో కాలం చెల్లిన, ప్రస్తుతం వినియోగంలో లేని పాత విద్యుత్ ఉత్పత్తి యూనిట్లను తుక్కు కింద అమ్మేయడం ద్వారా టీఎస్ జెన్కోకు భారీగా ఆదాయం రానుంది. దీంతో పాటు భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా స్థల లభ్యత పెరగనుంది. స్వాతంత్ర్యం వచ్చిన కొత్తలో దేశ పారిశ్రామిక, గృహ అవసరాలను దృష్టిలో ఉంచుకుని థర్మల్ విద్యుత్ కేంద్రాల నిర్మాణాలకు అప్పటి ప్రభుత్వాలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయి. ఈ క్రమంలో 1966 సెప్టెంబర్ 4న పాల్వంచలో తొలి థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని 60 మెగావాట్ల సామర్థ్యంతో నిర్మించారు. ఈ ప్లాంటు నిర్మాణానికి జపాన్ సాంకేతిక సహాయం అందించగా రూ.59.29 కోట్లు ఖర్చయింది. ఆ తర్వాత వరుసగా బీ, సీ యూనిట్ల నిర్మాణాన్ని భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ (భెల్) సంస్థ చేపట్టింది. మొదటి నాలుగు ప్లాంటు సబ్ క్రిటికల్ టెక్నాలజీతో నిర్మించారు. ఈ మూడు ప్లాంట్లను ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్(ఓఅండ్ఎం)గా పేర్కొనేవారు. పాత టెక్నాలజీ కావడంతో విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం తక్కువ పైగా కాలుష్యం ఎక్కువగా ఉండేది. దీంతో పాత ప్లాంట్ల నుంచి విద్యుత్ ఉత్పత్తిని క్రమంగా నిలిపేస్తూ వచ్చారు. అలా 2019 ఫిబ్రవరి నుంచి 2020 మార్చి నాటికి ఏ, బీ, సీ యూనిట్ల నుంచి విద్యుత్త్ ఉత్పత్తిని ఆపేశారు. తుక్కుకు రూ.485 కోట్లు కేటీపీఎస్‌లోని ఏ, బీ, సీ స్టేషన్లలో విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయిన తర్వాత అప్పటి వరకు వినియోగిస్తూ వచ్చిన టర్బైన్లు, ట్రాన్స్ఫార్మర్లు, కన్వేయర్ బెల్టులు, ఇతర యంత్ర సామగ్రి నిరుపయోగంగా మారాయి. దీంతో వాటిని తుక్కు కింద అమ్మేయాలని జెన్కో నిర్ణయం తీసుకుంది. దీంతో మరో కేంద్ర సంస్థ ఎంఎస్టీసీ రంగంలోకి దిగింది. ఏ, బీ, సీ ప్లాంట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించి ఇక్కడ లభించే ఐరన్, కాపర్, ఇతర యంత్ర విడిభాగాల విలువను మదింపు చేసింది. దీన్ని తుక్కు లెక్కన కొనేందుకు టెండర్లను ఆహ్వానించారు. మొత్తం ఐదు కంపెనీలో పోటీ పడగా కేటీపీఎస్‌లోని పాత మూడు ప్లాంట్లను తుక్కు కింద రూ.485 కోట్లకు కొనుగోలు చేసేందుకు ముంబైకి చెందిన హెచ్ఆర్ కమర్షియల్స్ సంస్థ ముందుకొచ్చింది. కేటీపీఎస్ ఓ అండ్ ఎంలో విడి భాగాలను తొలగిస్తున్న సిబ్బంది ముందుగా ‘ఏ’ ప్లాంటు తొలి దశలో ఏ ప్లాంటును పూర్తిగా తొలగించనున్నారు. ఇందుకుగాను హెచ్ఆర్ కమర్షియల్స్ సంస్థ రూ.144 కోట్లు చెల్లించి రంగంలోకి దిగింది. గత నెలలో పనులు ప్రారంభం కాగా, ప్రస్తుతం ప్లాంటులోకి బొగ్గు తీసుకొచ్చే కన్వేయర్ బెల్ట్ తొలగింపు ప్రక్రియ దాదాపుగా పూర్తి కావొచ్చింది. ఎక్కడికక్కడ భారీ కటింగ్ యంత్రాలతో కన్వేయర్ బెల్ట్ లైన్‌ను ముక్కలుగా చేస్తున్నారు. దీనికి తగ్గట్టుగా పని జరిగే ప్రదేశంలో విద్యుత్ సరఫరా నిలిపేశారు. భారీ నిర్మాణాలను కటింగ్ చేసిన తర్వాత ఇనుము, ఇతర లోహాలను వేరు చేస్తున్నారు. ఇక్కడి నుంచి లారీల ద్వారా తుక్కును తరలిస్తున్నారు. జూన్ వరకు ఏ ప్లాంటు తొలగింపు పనులు సాగనున్నాయి. ఆ తర్వాత వరుసగా బీ, సీ ప్లాంట్లను తొలగిస్తారు. అనంతరం కూలింగ్ టవర్లు, చిమ్నీలను తొలగించాల్సి ఉంటుంది. మొత్తంగా మూడేళ్లలో ఏ, బీ, సీ ప్లాంట్లను పూర్తిగా తొలగించడంతో పాటు నేల మొత్తాన్ని చదును చేసి జెన్కోకు అప్పగించాలనే ఒప్పందం కుదుర్చుకున్నారు. దీంతో జెన్కోకు సుమారు 400 ఎకరాల స్థలం లభించనుంది. ఇవి కీలకం.. కేటీపీఎస్ పాత ప్లాంట్లను తొలగించే పనిలో అత్యంత కీలకమైనది వందల మీటర్ల ఎత్తుతో నిర్మించిన చిమ్నీలు, కూలింగ్ టవర్ల తొలగింపు. కాంట్రాక్టు దక్కించుకున్న సంస్థ నాలుగు కూలింగ్ టవర్లు, ఒక చిమ్నీని తొలగించాల్సి ఉంటుంది. అయితే జెన్కో విధించిన షరతుల ప్రకారం ఈ నిర్మాణాలను నేలమట్టం చేసేందుకు పేలుడు పదార్థాలను వినియోగించడం నిషిద్ధం. దీంతో బ్లాస్టింగ్ లేకుండా భారీ నిర్మాణాలను నేలమట్టం చేసేందుకు అనువుగా ఉన్న మార్గాలపై ఇటు జెన్కో, అటు హెచ్ఆర్ కమర్షియల్స్ సంస్థలు అన్వేషిస్తున్నాయి. ప్రస్తుతానికి మన దేశంలో గతంలో చంద్రాపూర్‌లో ఉన్న పాత విద్యుత్ కేంద్రాన్ని తుక్కు కింద అమ్మేశారు. అక్కడ ఏ విధానం పాటించారనే అంశాలను పరిశీలిస్తున్నారు. ఆ తర్వాత అందుబాటులో ఉన్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై దృష్టి సారించనున్నారు. -
యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌కు... రుణాల నిలుపుదలపై కోర్టుకు!
సాక్షి ప్రత్యేక ప్రతినిధి, హైదరాబాద్: యాదాద్రి థర్మల్ విద్యుత్ ప్లాంట్ నిర్మాణానికి రుణం ఇస్తామని అంగీకరించి మధ్యలో నిధులివ్వకుండా ఆపేయడంపై గ్రామీణ విద్యుదీకరణ సంస్థపై (ఆర్ఈసీ) రాష్ట్ర విద్యుదుత్పాదన సంస్థ (టీఎస్ జెన్కో) ఆగ్రహంగా ఉంది. ఒప్పందాన్ని ఉల్లంఘించి ఏకపక్షంగా నిధులు ఆపేయడంపై న్యాయస్థానాన్ని ఆశ్రయించాలన్న నిర్ణయానికి వచ్చినట్లు విశ్వసనీయంగా తెలిసింది. గత నాలుగు నెలలుగా దాదాపు రూ. 500 కోట్ల రుణంవిడుదల చేయకుండా ఆపేయడంతో ప్రాజెక్టు నిర్మాణ వ్యయం విపరీతంగా పెరగడమే కాకుండా సకాలంలో ప్రాజెక్టు అందుబాటులోకి రాని పరిస్థితి తలెత్తిందని జెన్కో పేర్కొంటోంది. కేంద్రం, రాష్ట్రం మధ్య అగాధం నేపథ్యంలో దాదాపు రూ. 30 వేల కోట్ల వ్యయంతో 4,000 మెగావాట్ల యాదాద్రి థర్మల్ విద్యుత్ ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతోంది. ఈ ప్రాజెక్టు పూర్తయితే మిగులు విద్యుత్ రాష్ట్రంగా మారుతుందని, విద్యుత్ సమస్య లేకుండా సాఫీగా సరఫరాకు వీలవుతుందని జెన్కో వర్గాలు చెబుతున్నాయి. ఆర్ఈసీ నుంచి రూ. 17,200 కోట్లు, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ (పీఎఫ్సీ) నుంచి రూ. 3,800 కోట్ల రుణాన్ని తీసుకోవడానికి జెన్కో ఒప్పందం చేసుకుంది. తీసుకున్న రుణాన్ని తిరిగి చెల్లించే సామర్థ్యం, సంస్థ పనితీరు, రుణాలు ఎగేసిన ఉదంతాలున్నాయా వంటి అంశాలన్నీ పరిశీలించాకే రుణం ఇవ్వడానికి ఆ సంస్థలు అంగీకరించాయి. ఇందులో పీఎఫ్సీ నుంచి ఒప్పందం మేరకు జెన్కో దాదాపు మొత్తం రుణాన్ని తీసుకున్నట్లు సమాచారం. ప్రధాన రుణదాత అయిన ఆర్ఈసీ మాత్రం తాను అంగీకరించిన దాంట్లో కేవలం 50 శాతం నిధులనే విడుదల చేసింది. ఇటీవల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య పెరిగిన అగాధం నేపథ్యంలో ఇవ్వాల్సిన రుణ విడుదలను ఆపేసింది. దీనిపై జెన్కో అధికారులు పలుమార్లు ఆర్ఈసీని సంప్రదించినా స్పందించకపోవడంతో ప్రాజెక్టు నిర్మాణం ప్రశ్నార్థకంగా మారింది. ఈ నేపథ్యంలోనే న్యాయస్థానాన్ని ఆశ్రయించేందుకు జెన్కో సిద్ధమైనట్లు సమాచారం. ఈ డిసెంబర్‌కు విద్యుత్ ప్రాజెక్టును సిద్ధం చేయాలని భావించినా నిధుల సమస్యతో వచ్చే ఏడాది డిసెంబర్ వరకు పొడిగించాల్సిన పరిస్థితి ఏర్పడిందని జెన్కో వర్గాలు తెలిపాయి. రుణాల కోసం ప్రయత్నిస్తుంటే వాణిజ్య బ్యాంకుల నుంచి కూడా నిధులు రాకుండా కేంద్రంలోని పెద్దలు అడ్డుపడుతున్నారన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. రంగంలోకి బీహెచ్ఈఎల్... యాదాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతను జెన్కో కేంద్ర నవరత్న కంపెనీల్లో ఒకటైన భారత భారీ విద్యుత్ పరికరాల సంస్థ (బీహెచ్ఈఎల్)కు అప్ప గించింది. ఇప్పుడు జెన్కోకు రుణ ఇబ్బందుల నేపథ్యంలో బీహెచ్ఈఎల్కు కూడా నిధుల సమస్య తలెత్తుతోందని ఓ అధికారి వివరించారు. ఈ నేపథ్యంలో ఆర్ఈసీ నుంచి రుణాల విడుదలకు కేంద్ర భారీ పరిశ్ర మల మంత్రిత్వ శాఖ కూడా ఒత్తిడి పెంచుతున్నట్లు సమాచారం. అయితే డిస్కంలతో కొనుగోలు ఒప్పందం, విద్యుత్, పర్యా వరణ మంత్రిత్వ శాఖల అనుమతితోపాటు రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి ఆమోదం ఉన్న ఈ ప్రాజెక్టుకు రుణాలు నిలుపుదలను జెన్కో కక్షసాధింపుగానే భావిస్తోంది. ప్రాజెక్టు నిర్మాణం మధ్యలో నిలిచిపోవడంతో సాగునీటి ప్రాజెక్టులకు, పరిశ్రమలకు అవసరమైన విద్యుత్ ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తమవుతోంది. ఆర్థికంగా కొంత ఇబ్బందులున్నా జెన్కో ఎప్పటికప్పుడు చెల్లింపులు చేపడుతోందన్న విషయాన్ని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టుకు విద్యుత్ వినియోగానికి సంబంధించి రూ. 1,500 కోట్ల మేర ప్రభుత్వం నుంచి జెన్కోకు రావాల్సి ఉందని సమాచారం. -
విద్యుదుత్పత్తి పునరుద్ధరణకు రూ.కోటి
సాక్షి, దోమలపెంట (అచ్చంపేట): టీఎస్ జెన్కో పరిధిలోని శ్రీశైలం ఎడమగట్టు భూగర్భజలను విద్యుత్తు కేంద్రంలో 1, 2వ యూనిట్ల పునరుద్ధరణకు రూ.కోటిలోపే ఖర్చయిందని విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్వరెడ్డి చెప్పారు. సోమవారం ఈ రెండు యూనిట్లను మంత్రి పునఃప్రారంభించారు. ఆగస్టు 20న షార్ట్ సర్క్యూట్ వల్ల భూగర్భ జలవిద్యుత్ కేంద్రంలో మంటలు చెలరేగి 9 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. యూనిట్ల పునరుద్ధరించిన అనంతరం మంత్రి జగదీశ్వర్‌రెడ్డి మాట్లాడారు. అగ్ని ప్రమాదంతో విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయిందని, దీంతో సుమారు 100 కోట్ల రూపాయల నష్టం ఏర్పడిందన్నారు. 15 నుంచి 20 రోజుల్లోనే విద్యుదుత్పత్తి చేపట్టాలనుకున్నా.. జెన్కో అధికారులకు కరోనా సోకడంతో ఆలస్యమైందన్నారు. మరో నాలుగు నెలల్లోనే 3, 5, 6వ యూనిట్లను పునరుద్ధరిస్తామని తెలిపారు. 4వ యూనిట్ పునరుద్ధరణకు మరికొంత సమయం పడుతోందని, ఇందులోనే ఎక్కువ నష్టం జరిగిందని పేర్కొన్నారు. అంతకుముందు ఈగలపెంటలో జెన్కో అతిథిగృహం కృష్ణవేణి వద్ద మంత్రికి జెన్కో సీఎండీ ప్రభాకర్‌రావు పూల మొక్కను ఇచ్చి సాదరంగా స్వాగతం పలికారు. కార్యక్రమంలో సందీప్ సుల్తానియా, జెన్కో హైడెల్ డైరెక్టర్ వెంకటరాజం, భూగర్భ కేంద్రం సీఈ ప్రభాకర్‌రావు, ఎస్ఈ సద్గుణరావు తదితరులు పాల్గొన్నారు. కాగా, ఈ కేంద్రంలో మొత్తం ఆరు యూనిట్లు ఒక్కొక్కటి 150 మెగావాట్ల విద్యుదుత్పత్తి సామర్థ్యం కలిగి ఉన్నాయి. ప్రస్తుతం రెండు యూనిట్ల ద్వారా 300 మెగావాట్ల ఉత్పత్తిని చేపట్టారు. -
టీఎస్ జెన్కోలో కొత్తగా 148 పోస్టులు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర విద్యుదుత్పత్తి సంస్థ (టీఎస్జెన్కో)లో కొత్తగా 148 పోస్టులను సృష్టిస్తూ ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు శుక్రవారం ఉత్తర్వులిచ్చారు. డెప్యుటేషన్‌పై వీటి భర్తీకి అవకాశమిచ్చారు. ఈ ఉద్యోగులను హోంశాఖ నుంచి స్థానికత ఆధారంగా తీసుకునేలా ఆ శాఖకు సూచించారు. ఇందులో ఒక డీఎస్పీ, 10 అసిస్టెంట్ కమాండెంట్, ఒక సివిల్ ఇన్స్పెక్టర్ (సివిల్), 11 ఇన్‌స్టెక్టర్ (రిజర్వ్), ఒక సబ్ ఇన్స్పెక్టర్ (ఆర్ఎస్ఐ), 13 సబ్ ఇన్స్పెక్టర్ (సివిల్), 36 హెడ్ కానిస్టేబుల్, 31 పోలీస్ కానిస్టేబుల్, 44 మహిళా కానిస్టేబుల్ పోస్టులున్నాయి. టీఎస్ఎస్పీడీసీఎల్కు ఒక ఇన్స్పెక్టర్ పోస్టు దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్ఎస్పీడీసీఎల్) ఆధ్వర్యంలో సిద్దిపేటలో ఏర్పాటు చేయనున్న విద్యుత్ చౌర్యం నిర్మూలన పోలీస్ స్టేషన్లో డెప్యుటేషన్ ప్రాతిపదికన భర్తీ చేసేలా ఒక పోలీస్ ఇన్స్పెక్టర్ (సివిల్) పోస్టును సృష్టిస్తూ ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు శుక్రవారం ఉత్తర్వులిచ్చారు. హోంశాఖ అనుమతితో ఈపోస్టు భర్తీకి చర్యలు తీసుకోవాలన్నారు. -
ఏ రాష్ట్ర ఉద్యోగులు ఆ రాష్ట్రంలోనే పని చేయాలి
సాక్షి, హైదరాబాద్: స్థానికత ప్రతిపాదికన ఏ రాష్ట్ర ఉద్యోగులను ఆ రాష్ట్రంలోనే కొనసాగించాలని, ఒక వేళకాదని ఆంధ్ర ఉద్యోగులను తెలంగాణ విద్యుత్ సంస్థల్లో విలీనం చేయాలని చూస్తే మలిదశ తెలంగాణ పోరాటానికి కూడా వెనుకాడబోమని తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఇంజనీర్స్ అసోసియేషన్, తెలంగాణ స్టేట్ పవర్ ఇంజనీర్స్ అసోసియేషన్, తెలంగాణ విద్యుత్ ఎకౌంట్ ఆఫీసర్స్ అసోసియేషన్లు కోరాయి. సమస్య జటిలం కాకముందే ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ విషయంపై తుది నిర్ణయానికి రావాలని అల్టిమేటం జారీ చేశాయి. ఈ మేరకు తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఇంజనీర్స్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు ఎన్. శివాజీ, మధుసూదన్ రెడ్డి, తెలంగాణ ఎలక్ట్రికల్ ఎకౌంట్స్ ఆఫీసర్స్ అసోసియేషన్ నాయకుడు అంజయ్య సంయుక్తాధ్వర్యంలో బుధవారం ఎర్రగడ్డ జెన్కో ఆడిటోరియంలో సర్వసభ్య సమావేశం జరిగింది. ఇదే అంశంపై తెలంగాణ స్టేట్ పవర్ ఇంజనీర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు పి.రత్నాకర్‌రావు, కార్యదర్శి సదానందం అధ్యక్షతన ఆ సంఘం సర్వసభ్య సమావేశం నిర్వహించి, తీర్మా నం ప్రతిని జెన్కో సీఎండీ ప్రభాకర్‌రావుకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయా సంఘాల ప్రతినిధు లు వేర్వేరుగా విలేకరులతో మాట్లాడారు. ఏపీ విద్యుత్ సంస్థల్లో పని చేస్తున్న ఆంధ్ర ఉద్యోగులను ఆప్షన్ల పేరుతో తెలంగాణ విద్యుత్ సంస్థల్లోకి తెచ్చే కుట్ర జరుగుతోందని, ఏపీ ప్రతిపాదనను తెలంగాణ విద్యుత్ ఉద్యోగులు ఎట్టిపరిస్థితుల్లోనూ అంగీకరించబోరని వారు స్పష్టం చేశారు. ఏపీ విద్యుత్ సంస్థల్లో పని చేస్తున్న 229 మంది తెలంగాణ ఉద్యోగులను తెలంగాణ సంస్థల్లో చేర్చుకున్నట్లే.. ఆంధ్ర స్థానికత గల 1157 మంది విద్యుత్ ఉద్యోగులను ఏపీ విద్యుత్ సంస్థల్లో చేర్చుకోవాలన్నారు. తమ అభీష్టానికి విరుద్ధంగా ముఖ్యమంత్రులు వ్యవహరిస్తే..వారికి వ్యతిరేకంగా ఆందోళనలు చేపట్టడానికి కూడా వెనుకాడబోమని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో కిరణ్‌కుమార్, వెంకటనారాయణ, జనప్రియ, కిషోర్ తదితరులు పాల్గొన్నారు. -
18 రోజులు.. 500 మి.యూ. విద్యుదుత్పత్తి!
దోమలపెంట (అచ్చంపేట): శ్రీశైలం ప్రాజెక్టులోని ఎడమ గట్టు విద్యుదుత్పత్తి కేంద్రం చరిత్ర సృష్టించింది. శ్రీశైలం జలాశయంలోకి సరిపడా నీటి వనరులు ఉండటంతో జూలై 23 నుంచి ఈ నెల 2వ తేదీ ఆదివారం వరకు టీఎస్జెన్కో పరిధిలోని శ్రీశైలం ఎడమగట్టు భూగర్భ విద్యుత్తు కేంద్రంలోని 6 యూనిట్లలో విద్యుదుత్పత్తి ప్రారంభించారు. ఒక్కో యూనిట్ నుంచి 150 మెగావాట్ల చొప్పున మొత్తం 900 మెగావాట్లతో 500 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేసినట్లు కేంద్రం చీఫ్ ఇంజనీర్ మంగేశ్‌కుమార్, ఎస్ఈ శ్రీనివాసరావు మంగళవారం తెలిపారు. భూగర్భ కేంద్రం నిర్మాణం తర్వాత నిర్విరామంగా 18 రోజులు పాటు 6 యూనిట్లు ఆగకుండా విద్యుదుత్పత్తి చేయడం ఇదే మొదటిసారని పేర్కొన్నారు. ప్రస్తుతం నిర్విరామంగా ఉత్పత్తి చేయడానికి సిద్ధంగా ఉన్నా.. లోడ్ డిస్పాచ్‌లో డిమాండ్ లేనందున అడిగినప్పుడే విద్యుదుత్పత్తి చేస్తున్నామన్నారు. ఈ సందర్భంగా ఉద్యోగులు, కార్మికులను అభినందించిన సీఈ, ఎస్ఈలు కేక్ కట్ చేశారు. కార్యక్రమంలో ఈఈ రవీందర్, డీఈలు శ్రీకుమార్‌గౌడ్, చంద్రశేఖర్, ఆనంద్, వెంకటేశ్వర్‌రెడ్డి, ఏవో రామకృష్ణ, ఏడీఈలు కుమారస్వామి, మదన్‌మోహన్‌రెడ్డి, కృష్ణదేవ్ తదితరులు పాల్గొన్నారు. -
టీఎస్ జెన్కో నోటిఫికేషన్ జారీ
సాక్షి, హైదరాబాద్: అసిస్టెంట్ జనరల్ మేనేజర్ (హెచ్ఆర్) 33 ఖాళీలు, జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ (జేఏఓ) 42 ఖాళీల భర్తీకి టీఎస్జెన్కో శుక్రవారం నోటిఫికేషన్ జారీ చేసింది. అసిస్టెంట్ జనరల్ మేనేజర్ (హెచ్ఆర్) పోస్టులకు ఎంబీఏ(హెచ్ఆర్)/ఎంఎస్‌డబ్ల్యూ/పర్సనల్ మేనేజ్మెంట్/హ్యూమన్ రైట్స్/లా కోర్సులో 2 సంవత్సరాల డిప్లొమా డిగ్రీ అర్హత కలిగి ఉండి, 8సంవత్సరాల అనుభవం ఉండాలి. జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ పోస్టులకు గుర్తింపు పొందిన ఏదేని యూనివర్సిటీ నుంచి ఎంకాం ప్రథమ శ్రేణి ఉత్తీర్ణత/బీకాం ప్రథమ శ్రేణి ఉత్తీర్ణత/ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంట్స్ ఆఫ్ ఇండియా నుంచి ఇంటర్మీడియట్ పూర్తిచేసి ఉండాలి. ఈ రెండు కేటగిరీలకు ఏప్రిల్ 13 నుంచి ఆన్‌లైన్‌ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తారు. ఫీజు చెల్లింపునకు మే 9 చివరితేది. దరఖాస్తుల స్వీకరణకు చివరితేది మే 10. హాల్‌టికెట్‌ను మే 20వతేదీ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. మే 27న పరీక్ష నిర్వహించనున్నారు. వివరాలకు వెబ్సైట్ www.tsgenco.co.in లో సంప్రదించవచ్చు. -
నాలుగేళ్లలో విద్యుత్ కొలువులు
14,438 నోటిఫికేషన్ల కోసం సర్కారుకు విద్యుత్ సంస్థల ప్రతిపాదన * 2016-19 మధ్య నాలుగు వరుస ప్రకటనలు * ఇంజనీరింగ్‌తోపాటు ఇతర విభాగాల పోస్టులు సైతం భర్తీ సాక్షి, హైదరాబాద్ వచ్చే నాలుగేళ్లలో విద్యుత్ సంస్థల నుంచి ఏటా ఉద్యోగ నియామక ప్రకటనలు వెలువడనున్నాయి. వరుసగా ఉద్యోగ నియామకాలు చేపట్టేందుకు విద్యుత్ సంస్థలు కసరత్తు చేస్తున్నాయి. ఇప్పటికే 1,427 అసిస్టెంట్ ఇంజనీర్ (ఏఈ) పోస్టుల భర్తీకి రాత పరీక్ష నిర్వహించి ఫలితాలు ప్రకటించిన విద్యుత్ సంస్థలు మరో నెల రోజుల్లో ఆ నియామకాలు పూర్తి చేయనున్నాయి. ఆ వెంటనే 605 సబ్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి ట్రాన్స్‌కో, డిస్కంల నుంచి ప్రకటన విడుదల కానుంది. 2015-16 ఆర్థిక సంవత్సరం ముగిసేలోగా ఈ పోస్టుల భర్తీ ముగియనుండగా మళ్లీ వరుసగా మూడేళ్లపాటు విద్యుత్ సంస్థల నుంచి ఇంజనీర్, నాన్ టెక్నికల్, ఇతర కేటగిరీల పోస్టుల భర్తీకి ప్రకటనలు రానున్నాయి. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని 2016-17, 2017-18, 2018-19లో సైతం వరుసగా ఉద్యోగ నియామక ప్రకటనలు జారీ చేసేందుకు విద్యుత్ సంస్థలు రాష్ట్ర ప్రభుత్వ అనుమతి కోరాయి. రాష్ట్రంలో కొత్త విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల నిర్మాణంతోపాటు విద్యుత్ సరఫరా, పంపిణీ వ్యవస్థల సామర్థ్యాన్ని రెట్టింపు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముమ్మర చర్యలు తీసుకుంటోంది. ఈ నేపథ్యంలో పెరగనున్న జెన్కో, ట్రాన్స్‌కో, డిస్కంలలో సామర్థ్యం మేరకు ఇంజనీరింగ్, ఇతర కేటగిరీల పోస్టులను భర్తీ చేసుకోవాల్సి ఉంది. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని రానున్న నాలుగేళ్లలో భర్తీ చేయాల్సిన ఉద్యోగాల సంఖ్యపై విద్యుత్ సంస్థలు లెక్కలు వేశాయి. ఇంజనీరింగ్, నాన్ టెక్నికల్, ఇతర కేటగిరీల విభాగాల్లో మొత్తం 14,438 పోస్టుల భర్తీ చేయాలని నిర్ణయం తీసుకున్నాయి. విద్యుత్ సంస్థల నుంచి ఇటీవల అందిన ఈ ప్రతిపాదనలు ప్రస్తుతం ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయి. ఇందులో 4,947 ఇంజనీరింగ్, 1,520 నాన్ టెక్నికల్, 7,971 ఇతర విభాగాల పోస్టులున్నాయి. నాన్ టెక్నికల్ కేటగిరీలో జూనియర్ అసిస్టెంట్, జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ తదితర పోస్టులతోపాటు ఇతర కేటగిరీల పోస్టుల్లో జూనియర్ లైన్మెన్, ఫైర్‌మెన్ ఇతరాత్ర పోస్టులను భర్తీ చేయనున్నాయి. ఈ ప్రతిపాదనలకు రాష్ట్ర ఆర్థికశాఖ అనుమతిస్తే ట్రాన్స్‌కో, జెన్కో, డిస్కంల నుంచి వరుసగా నాలుగేళ్లపాటు ఉద్యోగ ప్రకటనలు జారీ కానున్నాయి. 2016-19 మధ్య కాలంలో భర్తీ చేయాల్సిన విద్యుత్ కొలువుల ప్రతిపాదనల వివరాలు విభాగం ట్రాన్స్‌కో జెన్కో ఎన్పీడీసీఎల్ ఎస్పీడీసీఎల్ ఇంజనీరింగ్ 2,243 1,315 872 517 నాన్ టెక్నికల్ 250 220 613 437 ఇతర పోస్ట్‌లు 1,202 1,958 2,007 2,804 -
ఒప్పందాలు ముగిస్తే లాభమే
* విద్యుత్‌రంగంపై తెలంగాణ ఇంధనశాఖ నివేదిక * 2019తో ముగియనున్న పలు ఒప్పందాలు సాక్షి, హైదరాబాద్: ప్రస్తుతం అమల్లో ఉన్న విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు ముగిసిపోతే తెలంగాణ ఎక్కువగా లాభపడుతుందని రాష్ట్ర ఇంధన శాఖ అంచనా వేసింది. ప్రస్తుతం టీఎస్ జెన్కో, ఏపీ జెన్కో విద్యుత్ ప్రాజెక్టుల నుంచి తెలంగాణకు 53.89 శాతం విద్యుత్ పంపిణీ అవుతోంది. చాలా విద్యుత్ కేంద్రాల్లో ఒప్పందాల గడువు అయిదేళ్లలో ముగిసిపోనుంది. అప్పుడు ఏపీ జెన్కో ప్లాంట్ల నుంచి విద్యుత్ వాటా నిలిచిపోతుంది. అదే సమయంలో టీఎస్ జెన్కో ప్రాజెక్టులలో ఉత్పత్తి అయ్యే విద్యుత్ నూరు శాతం తెలంగాణ సొంతమవుతుంది. దీంతో విద్యుత్ కొనుగోలు వ్యవహారాల్లో రాష్ట్రానికి దాదాపు రూ.275 కోట్లు ఆదా అవుతుందని ఇంధన శాఖ లెక్కలేసింది. రెండు రాష్ట్రాల మధ్య ఇప్పుడున్న విద్యుత్ లభ్యత వివరాలను.. 2019 మార్చి 31 నాటితో ముగిసే ఒప్పందాల అనంతరం ఉండే విద్యుత్ పరిస్థితిని ఇటీవలి టాస్క్‌ఫోర్స్ నివేదికలో ఇంధనశాఖ ప్రత్యేకంగా పొందుపరిచింది. ప్రస్తుతం టీఎస్జెన్కో పరిధిలో థర్మల్, హైడల్ కేంద్రాల్లో మొత్తం 3,058 మెగావాట్ల విద్యుత్‌కు ఒప్పందాలు అమల్లో ఉన్నాయి. దీంతో తెలంగాణకు కేవలం 1,648 మెగావాట్ల కరెంటు అందుతోంది. ఒప్పందాల గడువు ముగిసిపోతే మొత్తం 3,058 మెగావాట్లు దక్కుతుంది. పీపీఏల ప్రకారం ఇప్పుడు లభ్యమవుతున్న విద్యుత్‌తో పోలిస్తే 1,410 మెగావాట్లు అదనంగా అందుబాటులోకి వస్తుందని అంచనా వేసింది. అదే సమయంలో ఒప్పందాలు ముగియటం వల్ల ఏపీ జెన్కో 1,757 మెగావాట్లు కోల్పోతుందని ఇంధన శాఖ లెక్కగట్టింది. దీనికి తోడు టీఎస్ జెన్కో పరిధిలోని విద్యుత్ కేంద్రాల్లో ఉత్పత్తి ఖర్చుతో పోలిస్తే.. ఏపీ జెన్కో విద్యుత్ కేంద్రాల్లో ఉత్పత్తి వ్యయం ఎక్కువగా నమోదవుతోంది. బొగ్గు గనులు అందుబాటులో లేకపోవటం, రవాణా భారం ఉత్పాదక వ్యయంలో యూనిట్‌కు 52 పైసల తేడా ఉంటుందని ఇంధన శాఖ గుర్తించింది. ఒక యూనిట్ విద్యుత్ ఉత్పత్తికి తెలంగాణ ప్లాంట్లలో రూ.2.84 చొప్పున ఖర్చు అవుతుండగా... అదే యూనిట్‌కు ఏపీ జెన్కో పరిధిలో రూ.3.36 ఖర్చు అవుతుందని పోల్చి చెప్పింది. ఒప్పందాల గడువు ముగిసిపోతే తెలంగాణ ప్లాంట్ల నుంచి తక్కువ ఖర్చుతో వచ్చే విద్యుత్తును ఏపీ కోల్పోతుందని.. దీంతో అయిదు శాతం ఖర్చు అదనంగా భరించాల్సి వస్తుందని.. అదే సమయంలో తెలంగాణకు రూ.275 కోట్లు ఆదా అవుతుందని అంచనా వేసింది. కొత్తగూడెం, రామగుండం(బి) థర్మల్ ప్లాంట్లు, నార్ల తాతారావు థర్మల్ ప్లాంట్, ఆర్టీపీపీ స్టేజీ వన్, అప్పర్ సీలేరు, శ్రీశైలం కుడి కాల్వ, ఎడమ కాల్వ, నాగార్జునసాగర్ మెయిన్ కెనాల్, కుడి కాల్వ, తమిళనాడులోని నైవేలి ప్లాంట్లతో ఇప్పుడున్న పంపిణీ ఒప్పందాలు 2019 మార్చి 31తో ముగియనున్నాయి.