KTPS selling old plants scrap, crores of profit to TSGENCO - Sakshi
Sakshi News home page

తుక్కు.. తక్కువేం కాదు..  టీఎస్‌ జెన్‌కోకు రూ.485 కోట్ల ఆదాయం

Published Tue, Feb 21 2023 11:57 AM | Last Updated on Tue, Feb 21 2023 3:48 PM

KTPS Selling Old Plants Scrap Crores Of Profit To TSGENCO - Sakshi

త్వరలో తొలగించనున్న పాత ప్లాంట్‌ కర్మాగారం

సాక్షి , భద్రాద్రి కొత్తగూడెం : కొత్తగూడెం థర్మల్‌ పవర్‌ స్టేషన్‌లో కాలం చెల్లిన, ప్రస్తుతం వినియోగంలో లేని పాత విద్యుత్‌ ఉత్పత్తి యూనిట్లను తుక్కు కింద అమ్మేయడం ద్వారా టీఎస్‌ జెన్కోకు భారీగా ఆదాయం రానుంది. దీంతో పాటు భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా స్థల లభ్యత పెరగనుంది. స్వాతంత్ర్యం వచ్చిన కొత్తలో దేశ పారిశ్రామిక, గృహ అవసరాలను దృష్టిలో ఉంచుకుని థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాల నిర్మాణాలకు అప్పటి ప్రభుత్వాలు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చాయి.

ఈ క్రమంలో 1966 సెప్టెంబర్‌ 4న పాల్వంచలో తొలి థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాన్ని 60 మెగావాట్ల సామర్థ్యంతో నిర్మించారు. ఈ ప్లాంటు నిర్మాణానికి జపాన్‌ సాంకేతిక సహాయం అందించగా రూ.59.29 కోట్లు ఖర్చయింది. ఆ తర్వాత వరుసగా బీ, సీ యూనిట్ల నిర్మాణాన్ని భారత్‌ హెవీ ఎలక్ట్రికల్స్‌ లిమిటెడ్‌ (భెల్‌) సంస్థ చేపట్టింది. మొదటి నాలుగు ప్లాంటు సబ్‌ క్రిటికల్‌ టెక్నాలజీతో నిర్మించారు.

ఈ మూడు ప్లాంట్లను ఆపరేషన్స్‌ అండ్‌ మెయింటెనెన్స్‌(ఓఅండ్‌ఎం)గా పేర్కొనేవారు. పాత టెక్నాలజీ కావడంతో విద్యుత్‌ ఉత్పత్తి సామర్థ్యం తక్కువ పైగా కాలుష్యం ఎక్కువగా ఉండేది. దీంతో పాత ప్లాంట్ల నుంచి విద్యుత్‌ ఉత్పత్తిని క్రమంగా నిలిపేస్తూ వచ్చారు. అలా 2019 ఫిబ్రవరి నుంచి 2020 మార్చి నాటికి ఏ, బీ, సీ యూనిట్ల నుంచి విద్యుత్త్‌ ఉత్పత్తిని ఆపేశారు. 

తుక్కుకు రూ.485 కోట్లు
కేటీపీఎస్‌లోని ఏ, బీ, సీ స్టేషన్లలో విద్యుత్‌ ఉత్పత్తి నిలిచిపోయిన తర్వాత అప్పటి వరకు వినియోగిస్తూ వచ్చిన టర్బైన్లు, ట్రాన్స్‌ఫార్మర్లు, కన్వేయర్‌ బెల్టులు, ఇతర యంత్ర సామగ్రి నిరుపయోగంగా మారాయి. దీంతో వాటిని తుక్కు కింద అమ్మేయాలని జెన్‌కో నిర్ణయం తీసుకుంది. దీంతో మరో కేంద్ర సంస్థ ఎంఎస్‌టీసీ రంగంలోకి దిగింది.

ఏ, బీ, సీ ప్లాంట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించి ఇక్కడ లభించే ఐరన్, కాపర్, ఇతర యంత్ర విడిభాగాల విలువను మదింపు చేసింది. దీన్ని తుక్కు లెక్కన కొనేందుకు టెండర్లను ఆహ్వానించారు. మొత్తం ఐదు కంపెనీలో పోటీ పడగా కేటీపీఎస్‌లోని పాత మూడు ప్లాంట్లను తుక్కు కింద రూ.485 కోట్లకు కొనుగోలు చేసేందుకు ముంబైకి చెందిన హెచ్‌ఆర్‌ కమర్షియల్స్‌ సంస్థ ముందుకొచ్చింది.


కేటీపీఎస్‌ ఓ అండ్‌ ఎంలో విడి భాగాలను తొలగిస్తున్న సిబ్బంది

ముందుగా ‘ఏ’ ప్లాంటు
తొలి దశలో ఏ ప్లాంటును పూర్తిగా తొలగించనున్నారు. ఇందుకుగాను హెచ్‌ఆర్‌ కమర్షియల్స్‌ సంస్థ రూ.144 కోట్లు చెల్లించి రంగంలోకి దిగింది. గత నెలలో పనులు ప్రారంభం కాగా,  ప్రస్తుతం ప్లాంటులోకి బొగ్గు తీసుకొచ్చే కన్వేయర్‌ బెల్ట్‌ తొలగింపు ప్రక్రియ దాదాపుగా పూర్తి కావొచ్చింది. ఎక్కడికక్కడ భారీ కటింగ్‌ యంత్రాలతో కన్వేయర్‌ బెల్ట్‌ లైన్‌ను ముక్కలుగా చేస్తున్నారు. దీనికి తగ్గట్టుగా పని జరిగే ప్రదేశంలో విద్యుత్‌ సరఫరా నిలిపేశారు. భారీ నిర్మాణాలను కటింగ్‌ చేసిన తర్వాత ఇనుము, ఇతర లోహాలను వేరు చేస్తున్నారు.

ఇక్కడి నుంచి లారీల ద్వారా తుక్కును తరలిస్తున్నారు. జూన్‌ వరకు ఏ ప్లాంటు తొలగింపు పనులు సాగనున్నాయి. ఆ తర్వాత వరుసగా బీ, సీ ప్లాంట్లను తొలగిస్తారు. అనంతరం కూలింగ్‌ టవర్లు, చిమ్నీలను తొలగించాల్సి ఉంటుంది. మొత్తంగా మూడేళ్లలో ఏ, బీ, సీ ప్లాంట్లను పూర్తిగా తొలగించడంతో పాటు నేల మొత్తాన్ని చదును చేసి జెన్‌కోకు అప్పగించాలనే ఒప్పందం కుదుర్చుకున్నారు. దీంతో జెన్‌కోకు సుమారు 400 ఎకరాల స్థలం లభించనుంది.

ఇవి కీలకం..
కేటీపీఎస్‌ పాత ప్లాంట్లను తొలగించే పనిలో అత్యంత కీలకమైనది వందల మీటర్ల ఎత్తుతో నిర్మించిన చిమ్నీలు, కూలింగ్‌ టవర్ల తొలగింపు. కాంట్రాక్టు దక్కించుకున్న సంస్థ నాలుగు కూలింగ్‌ టవర్లు, ఒక చిమ్నీని తొలగించాల్సి ఉంటుంది. అయితే జెన్‌కో విధించిన షరతుల ప్రకారం ఈ నిర్మాణాలను నేలమట్టం చేసేందుకు పేలుడు పదార్థాలను వినియోగించడం నిషిద్ధం. దీంతో బ్లాస్టింగ్‌ లేకుండా భారీ నిర్మాణాలను నేలమట్టం చేసేందుకు అనువుగా ఉన్న మార్గాలపై ఇటు జెన్‌కో, అటు హెచ్‌ఆర్‌ కమర్షియల్స్‌ సంస్థలు అన్వేషిస్తున్నాయి.

ప్రస్తుతానికి మన దేశంలో గతంలో చంద్రాపూర్‌లో ఉన్న పాత విద్యుత్‌ కేంద్రాన్ని తుక్కు కింద అమ్మేశారు. అక్కడ ఏ విధానం పాటించారనే అంశాలను పరిశీలిస్తున్నారు. ఆ తర్వాత అందుబాటులో ఉన్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై దృష్టి సారించనున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement