KTPC
-
తుక్కు.. తక్కువేం కాదు.. టీఎస్ జెన్కోకు రూ.485 కోట్ల ఆదాయం
సాక్షి , భద్రాద్రి కొత్తగూడెం : కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్లో కాలం చెల్లిన, ప్రస్తుతం వినియోగంలో లేని పాత విద్యుత్ ఉత్పత్తి యూనిట్లను తుక్కు కింద అమ్మేయడం ద్వారా టీఎస్ జెన్కోకు భారీగా ఆదాయం రానుంది. దీంతో పాటు భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా స్థల లభ్యత పెరగనుంది. స్వాతంత్ర్యం వచ్చిన కొత్తలో దేశ పారిశ్రామిక, గృహ అవసరాలను దృష్టిలో ఉంచుకుని థర్మల్ విద్యుత్ కేంద్రాల నిర్మాణాలకు అప్పటి ప్రభుత్వాలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయి. ఈ క్రమంలో 1966 సెప్టెంబర్ 4న పాల్వంచలో తొలి థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని 60 మెగావాట్ల సామర్థ్యంతో నిర్మించారు. ఈ ప్లాంటు నిర్మాణానికి జపాన్ సాంకేతిక సహాయం అందించగా రూ.59.29 కోట్లు ఖర్చయింది. ఆ తర్వాత వరుసగా బీ, సీ యూనిట్ల నిర్మాణాన్ని భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ (భెల్) సంస్థ చేపట్టింది. మొదటి నాలుగు ప్లాంటు సబ్ క్రిటికల్ టెక్నాలజీతో నిర్మించారు. ఈ మూడు ప్లాంట్లను ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్(ఓఅండ్ఎం)గా పేర్కొనేవారు. పాత టెక్నాలజీ కావడంతో విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం తక్కువ పైగా కాలుష్యం ఎక్కువగా ఉండేది. దీంతో పాత ప్లాంట్ల నుంచి విద్యుత్ ఉత్పత్తిని క్రమంగా నిలిపేస్తూ వచ్చారు. అలా 2019 ఫిబ్రవరి నుంచి 2020 మార్చి నాటికి ఏ, బీ, సీ యూనిట్ల నుంచి విద్యుత్త్ ఉత్పత్తిని ఆపేశారు. తుక్కుకు రూ.485 కోట్లు కేటీపీఎస్‌లోని ఏ, బీ, సీ స్టేషన్లలో విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయిన తర్వాత అప్పటి వరకు వినియోగిస్తూ వచ్చిన టర్బైన్లు, ట్రాన్స్ఫార్మర్లు, కన్వేయర్ బెల్టులు, ఇతర యంత్ర సామగ్రి నిరుపయోగంగా మారాయి. దీంతో వాటిని తుక్కు కింద అమ్మేయాలని జెన్కో నిర్ణయం తీసుకుంది. దీంతో మరో కేంద్ర సంస్థ ఎంఎస్టీసీ రంగంలోకి దిగింది. ఏ, బీ, సీ ప్లాంట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించి ఇక్కడ లభించే ఐరన్, కాపర్, ఇతర యంత్ర విడిభాగాల విలువను మదింపు చేసింది. దీన్ని తుక్కు లెక్కన కొనేందుకు టెండర్లను ఆహ్వానించారు. మొత్తం ఐదు కంపెనీలో పోటీ పడగా కేటీపీఎస్‌లోని పాత మూడు ప్లాంట్లను తుక్కు కింద రూ.485 కోట్లకు కొనుగోలు చేసేందుకు ముంబైకి చెందిన హెచ్ఆర్ కమర్షియల్స్ సంస్థ ముందుకొచ్చింది. కేటీపీఎస్ ఓ అండ్ ఎంలో విడి భాగాలను తొలగిస్తున్న సిబ్బంది ముందుగా ‘ఏ’ ప్లాంటు తొలి దశలో ఏ ప్లాంటును పూర్తిగా తొలగించనున్నారు. ఇందుకుగాను హెచ్ఆర్ కమర్షియల్స్ సంస్థ రూ.144 కోట్లు చెల్లించి రంగంలోకి దిగింది. గత నెలలో పనులు ప్రారంభం కాగా, ప్రస్తుతం ప్లాంటులోకి బొగ్గు తీసుకొచ్చే కన్వేయర్ బెల్ట్ తొలగింపు ప్రక్రియ దాదాపుగా పూర్తి కావొచ్చింది. ఎక్కడికక్కడ భారీ కటింగ్ యంత్రాలతో కన్వేయర్ బెల్ట్ లైన్‌ను ముక్కలుగా చేస్తున్నారు. దీనికి తగ్గట్టుగా పని జరిగే ప్రదేశంలో విద్యుత్ సరఫరా నిలిపేశారు. భారీ నిర్మాణాలను కటింగ్ చేసిన తర్వాత ఇనుము, ఇతర లోహాలను వేరు చేస్తున్నారు. ఇక్కడి నుంచి లారీల ద్వారా తుక్కును తరలిస్తున్నారు. జూన్ వరకు ఏ ప్లాంటు తొలగింపు పనులు సాగనున్నాయి. ఆ తర్వాత వరుసగా బీ, సీ ప్లాంట్లను తొలగిస్తారు. అనంతరం కూలింగ్ టవర్లు, చిమ్నీలను తొలగించాల్సి ఉంటుంది. మొత్తంగా మూడేళ్లలో ఏ, బీ, సీ ప్లాంట్లను పూర్తిగా తొలగించడంతో పాటు నేల మొత్తాన్ని చదును చేసి జెన్కోకు అప్పగించాలనే ఒప్పందం కుదుర్చుకున్నారు. దీంతో జెన్కోకు సుమారు 400 ఎకరాల స్థలం లభించనుంది. ఇవి కీలకం.. కేటీపీఎస్ పాత ప్లాంట్లను తొలగించే పనిలో అత్యంత కీలకమైనది వందల మీటర్ల ఎత్తుతో నిర్మించిన చిమ్నీలు, కూలింగ్ టవర్ల తొలగింపు. కాంట్రాక్టు దక్కించుకున్న సంస్థ నాలుగు కూలింగ్ టవర్లు, ఒక చిమ్నీని తొలగించాల్సి ఉంటుంది. అయితే జెన్కో విధించిన షరతుల ప్రకారం ఈ నిర్మాణాలను నేలమట్టం చేసేందుకు పేలుడు పదార్థాలను వినియోగించడం నిషిద్ధం. దీంతో బ్లాస్టింగ్ లేకుండా భారీ నిర్మాణాలను నేలమట్టం చేసేందుకు అనువుగా ఉన్న మార్గాలపై ఇటు జెన్కో, అటు హెచ్ఆర్ కమర్షియల్స్ సంస్థలు అన్వేషిస్తున్నాయి. ప్రస్తుతానికి మన దేశంలో గతంలో చంద్రాపూర్‌లో ఉన్న పాత విద్యుత్ కేంద్రాన్ని తుక్కు కింద అమ్మేశారు. అక్కడ ఏ విధానం పాటించారనే అంశాలను పరిశీలిస్తున్నారు. ఆ తర్వాత అందుబాటులో ఉన్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై దృష్టి సారించనున్నారు. -
కేటీపీపీ అగ్నిప్రమాద ఘటనలో ఒకరి మృతి
భూపాలపల్లి జిల్లా/హైదరాబాద్: జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలంలోని కాకతీయ థర్మల్ విద్యుత్ కేంద్రం మొదటి దశ 500మెగావాట్ల ప్లాంట్‌లో సోమవారం జరిగిన ప్రమాదంలో ఒకరు మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ ఆర్టిజన్ కార్మికుడు కేతిరి వీరస్వామి హైదరాబాద్ యశోద హాస్పిటల్లో చికిత్స పొందుతూ బుధవారం మరణించారు. మృతుడు వీరస్వామి స్వస్థలం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పాల్వంచ. వీరస్వామికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. ప్రమాదంలో గాయపడిన వీరస్వామి మృతిచెందడంతో కేటీపీసీలో విషాదం అలుముకుంది. రెండు రోజుల క్రితం జరిగిన ప్రమాదంలో ఏడుగురికి గాయాలు అయ్యాయి. యశోద ఆస్పత్రిలో ప్రస్తుతం జూనియర్ ప్లాంట్ అసిస్టెంట్ వెంకటేశ్వర్లు, కాంట్రాక్ట్ కార్మికుడు సీతారాములు చికిత్స పొందుతున్నారు. హనుమకొండ అజార ఆస్పత్రిలో మరో నలుగురు కార్మికులు చికిత్స పొందుతున్నారు. ఈ ప్రమాదంపై విచారణ కొనసాగుతోందని అధికారులు పేర్కొన్నారు. సీఈ సిద్దయ్య నిర్లక్ష్యంపై చర్యలు తీసుకునే పనిలో జెన్కో అధికారులు ఉన్నారు. చదవండి: తంజావూరు రథయాత్రలో అపశ్రుతి.. కరెంట్ షాక్‌తో పది మందికిపైగా భక్తుల దుర్మరణం -
కొంగొత్త ఆశలతో.. ఈ ఏడాదిలో
పాల్వంచరూరల్: కోటి ఆశలతో కొంగొత్త సంవత్సరం ప్రవేశించింది. జిల్లా ప్రజలు ఎన్నెన్నో ఆశలు పెట్టుకుంటున్నారు. ఇటీవల కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వ కార్యాచరణ నిత్య నూతనం కావాలని కోరుకుంటున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆవిర్భవించిన తర్వాత జిల్లా ఎంతో ప్రత్యేకత సంతరించుకుంది. రాష్ట్రంలోనే భద్రాద్రి జిల్లా పరిశ్రమల్లో ద్వితీయస్థానంలో ఉంది. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఒక వైపు సింగరేణి బొగ్గు గనులు, మరో వైపు పాల్వంచలో కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్(కేటీపీఎస్), ఎన్ఎండీసీ, సారపాక ఐటీసీ, అశ్వాపురంలో భారజల కర్మాగారం, అశ్వారావుపేట పామాయిల్ ఫ్యాక్టరీలు జిల్లా సొంతం. ఇంకో వైపు పర్యాటక ప్రాంతాలూ ఉన్నాయి. కొత్త సంవత్సరంలో ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టులు సీతారామ, మిషన్ భగీరథ ఫలాలు దక్కనున్నాయి. వంద కోట్ల పెట్టుబడితో భారజల కర్మాగారంలో సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటు, మణుగూరులో నిర్మిస్తున్న 1080 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం కలిగిన భద్రాద్రి పవర్ ప్లాంట్ ఈ యేడాదిలో పూర్తికానున్నాయి. ఈ క్రమంలో దాదాపు 3వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కలుగనున్నాయి. కొత్తగూడెంలో 1978లో ఏర్పాటైన మైనింగ్ ఇంజనీరింగ్ కళాశాల విశ్వవిద్యాలయంగా రూపాంతరం చెందాలని జిల్లా ప్రజలు ఆశ పడుతున్నారు. జిల్లా కేంద్రానికి 60 కిలోమీటర్ల దూరంలో మైలారం, రేగళ్ల అటవీ ప్రాంతంలో 850 ఎకరాల విస్తీర్ణంలో విమానాశ్రయ ఏర్పాటుకు కేంద్రం నుంచి కూడా గ్రీన్‌సిగ్నల్ లభించింది. విమానాశ్రయం నిర్మాణం జరిగితే జిల్లాకు మణిహారంగా మారనుంది. 30వ నంబర్ జాతీయ రహదారి సారపాకనుంచి రుద్రంపూర్ వరకు నిర్మిస్తున్నారు. ఇప్పటివరకు 80శాతం పనులు పూర్తయ్యాయి. మిగిలి 20శాతం పనులు కూడా నూతన సంవత్సరంలో పూర్తికానున్నాయి. గోదావరి జలాలతో మాగాణిని పావనం చేయాలనే లక్ష్యంతో నిర్మిస్తున్న సీతారామ ప్రాజెక్టు పూర్తయితే జిల్లాలో సాగునీటి ఢోకా ఉండదు. ఇంటింటికీ గోదావరి జలాలను అందించేందుకు రూ.2.242 కోట్ల వ్యయంతో చేపట్టిన మిషన్ భగీరథ ఇంట్రావిలేజ్ పనులు పూర్తయ్యే అవకాశం ఉంది. దీంతో ప్రతి ఇంటికీ గోదావరి జలాలు అందనున్నాయి. దక్షిణ అయోధ్యగా కీర్తి గడించిన భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయాభివృద్ధికి రూ.100 కోట్లు ఇస్తామని ప్రభుత్వం పలుమార్లు ప్రకటించింది. ఈ నూతన సంవత్సరలోనైనా నిధులు మంజూరు కావాలని భక్తులు ఆశగా ఎదురుచుస్తున్నారు. పోడు సాగుచేసుకున్న వందలాది మంది రైతులు ఆర్ఓఎఫ్ఆర్ పట్టాల కోసం ఆశగా నిరీక్షిస్తున్నారు. పండిన పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించే విషయంలో ప్రభుత్వం చర్యలు తీసుకుంటే రైతులు అప్పుల ఊబిలోనుంచి ఈ ఏడాది గట్టెక్కే అవకాశాలు ఉన్నాయి. ఉపాధి శాఖ గణంకాల ప్రకారం జిల్లాలో లక్షమందికిపైగా నిరుద్యోగులు ఉన్నారు. నూతన సంవత్సరంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలతో అభివృద్ధిలో మరింత ముందుకు సాగాలని జిల్లా ప్రజలు ఆకాంక్షిస్తున్నారు. -
కేటీపీఎస్‌లో విద్యుదుత్పత్తికి అంతరాయం
ఖమ్మం జిల్లా పాల్వంచలోని కేటీపీఎస్ 5వ దశ 9వ యూనిట్లో సోమవారం మధ్యాహ్నం 250 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి అంతరాయం కలిగింది. యూనిట్‌లోని బాయిలర్ ట్యూబ్ లీకేజీ సమస్య తలెత్తడంతో ఉత్పత్తి నిలిపేశారు. వెంటనే సీఈ ఎం.సిద్ధయ్య నేతృత్వంలో మరమ్మతులు చేపట్టారు. మంగళవారం ఉదయం నాటికి ఉత్పత్తి పునరుద్ధరించే అవకాశం ఉన్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.