వైఎస్‌ వివేకా హత్య కేసులో కీలక మలుపు | Petition Filed On Narreddy Rajasekhara Reddy Siva Prakash Reddy TDP MLC Btech Ravi And Three Others Trial Of YS Vivekananda Reddy | Sakshi
Sakshi News home page

వివేకా హత్య వెనుక ఆయన అల్లుడు, బావమరిది.. రెండో పెళ్లితో రాజుకున్న విభేదాలు!

Published Thu, Feb 24 2022 10:26 PM | Last Updated on Fri, Feb 25 2022 9:51 AM

Petition Filed On Narreddy Rajasekhara Reddy Siva Prakash Reddy TDP MLC Btech Ravi And Three Others Trial Of YS Vivekananda Reddy - Sakshi

సాక్షి, అమరావతి: మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో ఆయన చిన బావమరిది, అల్లుడు కూడా అయిన నర్రెడ్డి రాజశేఖరరెడ్డి, పెద్ద బావమరిది శివ ప్రకాశ్‌రెడ్డి, టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్‌ రవిలతోపాటు మరో ముగ్గురిని నిందితులుగా పేర్కొంటూ వారిని విచారించాలని న్యాయస్థానంలో పిటీషన్‌ దాఖలైంది. నర్రెడ్డి రాజశేఖరరెడ్డి, శివ ప్రకాశ్‌రెడ్డి,  బీటెక్‌ రవిలతోపాటు వివేకానందరెడ్డితో ఆర్థిక, రాజకీయ విభేదాలు ఉన్న కొమ్మా పరమేశ్వరరెడ్డి, వైజీ రాజేశ్వరరెడ్డి, నీరుగట్టు ‍ప్రసాద్‌లను నిందితులుగా చేర్చి దర్యాప్తు చేయాలని ఆ పిటీషన్‌లో కోరారు. ఈ కేసులో అరెస్టైన దేవిరెడ్డి శివ శంకర్‌రెడ్డి భార్య తులసమ్మ ఈమేరకు వైఎస్సార్‌ జిల్లా పులివెందుల న్యాయస్థానంలో ఈ నెల 21న  పిటీషన్‌ దాఖలు చేశారు.

ఆ పిటీషన్‌ కాపీని దేవిరెడ్డి శివ శంకర్‌ రెడ్డి కుమారుడు యశ్వంత్‌ రెడ్డి గురువారం మీడియాకు విడుదల చేశారు. వైఎస్‌ వివేకానందరెడ్డి రెండో వివాహం చేసుకోవడంతో ఆయన కుటుంబంలో తలెత్తిన విభేదాలు, ఆస్తుల పంపకం వ్యవహారాలతోపాటు ఆయన రాజకీయ ప్రత్యర్థులు ఈ హత్యకు కారకులని ఆమె పేర్కొన్నారు. సీబీఐ ఉద్దేశ్యపూర్వకంగానే ఆ విషయాలను పట్టించుకోకుండా కేసును తప్పుదారి పట్టించేలా ఏకపక్షంగా దర్యాప్తు చేస్తోందని కూడా తులసమ్మ తన పిటీషన్‌లో ఆరోపించారు. తన వాదనను బలపరుచుకుంటూ ఆమె న్యాయస్థానం దృష్టికి తీసుకువచ్చిన పలు కీలక అంశాలు ఇలా ఉన్నాయి...

వివేకా రెండో వివాహంతో కుటుంబంలో తీవ్ర విభేదాలు
- వైఎస్‌ వివేకానందరెడ్డికి ఆయన కుటుంబ సభ్యులకు మధ్య కొన్నేళ్లుగా తీవ్ర విభేదాలు ఉన్నాయి. షేక్‌ షమీమ్‌ అనే మహిళను ఆయన 2010లో రెండో పెళ్లి చేసుకున్నారు. వారికి 2015లో ఓ కుమారుడు కూడా జన్మించారు. దాంతో వివేకానందరెడ్డి వైవాహిక జీవితంలోనూ కుటుంబంలోనూ విభేదాలు తలెత్తాయి. కొన్నేళ్లుగా ఆయన భార్య సౌభాగ్యమ్మ హైదరాబాద్‌లో తన కుమార్తె సునీత నివాసంలో ఉంటున్నారు. వివేకానందరెడ్డి ఒక్కరే పులివెందులలో నివసించేవారు. వివేకానందరెడ్డి కుమార్తె సునీత, అల్లుడు నర్రెడ్డి రాజశేఖరరెడ్డి,  ఆయన అన్నయ్య శివ ప్రకాశ్‌ రెడ్డి చాలాసార్లు షేక్‌ షమీమ్‌ను తీవ్రంగా బెదిరించారు.

ఇక వివేకానందరెడ్డి తన రెండో భార్య షమీమ్‌, ఆమె కుమారుడినిక కొంత ఆస్తి రాసివ్వాలని భావించడంతో ఆయన కుటుంబ సభ్యులు తీవ్రంగా వ్యతిరేకించారు. బెంగళూరులో భూ సెటిల్‌మెంట్‌ ద్వారా వచ్చే రూ.2 కోట్లను తన రెండో భార్యకు ఇవ్వాలని ఆయన ప్రకటించడంతో కుంటుంబంలో విభేదాలు మరింతగా తీవ్రమయ్యాయి. అంతేకాదు షమీమ్‌ కుమారుడిని తన వారసుడిగా కూడా ప్రకటిస్తానని ఆయన చెప్పడం కుటుంబ సభ్యులను తీవ్ర ఆందోళనకు గురి చేసింది. ప్రధానంగా  వివేకానందరెడ్డికి రాజకీయ వారసులు కావాలని ఆశిస్తున్న నర్రెడ్డి రాజశేఖరరెడ్డి, శివ ప్రకాశ్‌రెడ్డి ఆయనపై కక్ష పెంచుకున్నారు. 

వివేకా హత్య అనంతరం అనుమాస్పందంగా కుటుంబ సభ్యుల ప్రవర్తన
- ఇక వివేకానందరెడ్డి హత్యకు గురైన తరువాత ఆయన కుటుంబ సభ్యుల ప్రవర్తన సందేహాస్పదంగా ఉంది. వివేకానందరెడ్డి చనిపోయిన విషయాన్ని ఆయన పీఏ కృష్ణారెడ్డి మొదట ఆయన కుటుంబ సభ్యులకే తెలిపారు. రక్తపు మడుగులో పడి ఉన్న ఆయన మృతదేహం, ఆ ప్రదేశాన్ని వివేకానందరెడ్డి అనుచరుడు  ఇనయతుల్లా తన సెల్‌ఫోన్‌ ద్వారా ఫొటోలు, వీడియోలు తీసి నర్రెడ్డి శివ ప్రకాశ్‌ రెడ్డికి ఉదయం 6.27గంటలకు వాట్సాప్‌ చేశారు.

ఆ ఫొటోలు, వీడియోలు చూసిన తరువాత కూడా నర్రెడ్డి శివ ప్రకాశ్‌రెడ్డి ఉదయం 8గంటలకు అప్పటి టీడీపీ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న ఆదినారాయణ రెడ్డికి ఫోన్‌ చేసి వివేకానందరెడ్డి గుండెపోటుతో చనిపోయారని చెప్పారు. అదే విషయాన్ని ఆది నారాయణ రెడ్డి మీడియాకు వెల్లడించారు కూడా. ఆ ఫొటోలు చూస్తే ఆయన హత్యకు గురైనట్టు ఎవరికైనా తెలుస్తుంది. కానీ గుండెపోటుతో చనిపోయినట్టు శివ ప్రకాశ్‌ రెడ్డి ఎందుకు చెప్పారు.

ఇక వివేకానందరెడ్డి మృతదేహం వద్ద ఆయన రాసినట్టు  చెబుతున్న లేఖ, ఆయన సెల్‌ఫోన్‌లను కృష్ణారెడ్డి స్వాధీనం చేసుకున్నారు. ఆ విషయాన్ని వైఎస్‌ వివేకా కుమార్తె, అల్లుడు సునీత, నర్రెడ్డి రాజశేఖర రెడ్డికి వెంటనే తెలిపారు. కానీ తాము వచ్చేవరకూ ఆ లేఖ, సెల్‌ఫోన్‌ పోలీసులకు అప్పగించవద్దని రాజశేఖరరెడ్డి ఆయనతో చెప్పారు. దాంతో పోలీసులకు ఆయన వాటిని ఇవ్వలేదు.

హత్య జరిగిన రోజు మధ్యాహ్నం 1గంటకు వివేకానందరెడ్డి కుటుంబ సభ్యులు పులివెందులకు చేరుకున్న తరువాత వాటిని రాజశేఖర రెడ్డికి అప్పగించారు. ఆ సెల్‌ఫోన్లో ఉన్న మెసేజులు, ఇతర వివరాలను డిలీట్‌ చేసిన తరువాతే సాయంత్రం ఆ సెల్‌ఫోన్‌, లేఖలను పోలీసులకు అప్పగించారు. అలా ఎందుకు చేయాల్సి వచ్చింది? ఇక వివేకానంద రెడ్డి హత్య జరిగిన ప్రదేశానికి వెళ్లి ఆ గదిని తుడిచివేసి, మృతదేహాన్ని బాత్రూమ్‌ నుంచి గదిలోకి తీసుకురావాలని ఎర్ర గంగిరెడ్డికి నర్రెడ్డి శివ ప్రకాశ్‌ రెడ్డే చెప్పారు. ఆ విషయన్ని ఎర్రగంగిరెడ్డి ఒప్పుకున్నారు కూడా.

కాబట్టి నర్రెడ్డి రాజశేఖరరెడ్డి, శివ ప్రకాశ్‌ రెడ్డిలే కుట్ర పన్ని వైఎస్‌వివేకానందరెడ్డిని హత్య చేయించారు.ఈ కేసును సిట్‌ బృందాలు సమగ్రంగా దర్యాప్తు చేస్తుండగా వివేకానందరెడ్డి భార్య సౌభాగ్యమ్మ అడ్డుకున్నారు. కాల్‌ డేటాలు, సీసీ టీవీ ఫుటేజీలు, ఇతర శాస్త్రీయ  ఆధారాలను సిట్‌ బృందాలు సేకరించి కేసును ఓ కొలిక్కి తీసుకువచ్చేందుకు సిద్ధమయ్యాయి. కానీ అదే సందర్భంలో సిట్‌ దర్యాప్తును అడ్డుకుంటూ సౌభాగ్యమ్మ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఆ కేసును సీబీఐకి అప్పగించాలని ఆమె పిటీషన్‌ వేశారు. అలా ఎందుకు చేయాల్సి వచ్చింది? 

వివేకాతో పరమేశ్వరరెడ్డికి ఆర్థిక విభేదాలు
- ఇక వివేకానందరెడ్డికి ఆయన అనుచరుడిగా ఉన్న కొమ్మా పరమేశ్వరరెడ్డికి మధ్య ఆర్థికపరమైన కారణాలతో విభేదాలు తలెత్తాయి. బెంగళూరులోని ఓ భూమి సెటిల్‌మెంట్‌ వ్యవహారంలో తనకు దక్కాల్సిన వాటాను ఇవ్వలేదని పరమేశ్వరరెడ్డి కక్ష పెంచుకున్నారు. దాంతో కొంతకాలంగా అతను వివేకానందరెడ్డితో తీవ్రంగా విభేదిస్తున్నారు. వివేకానందరెడ్డి హత్యకు ముందు ఎలిబీ సృష్టించుకునేందుకే పరమేశ్వరరెడ్డి 2019, మార్చి 13న అనారోగ్యం నెపంతో పులివెందులలోని నాయక్‌ ఆసుపత్రిలో చేరేందుకు ప్రయత్నించారు. కానీ అతన్ని చేర్చుకునేందుకు అక్కడి వైద్యులు సమ్మతించ లేదు.

దాంతో అతను పులివెందులలోని డా.గంగిరెడ్డి ఆసుపత్రిలో చేరేందుకు విఫలయత్నం చేశారు. దాంతో పరమేశ్వరరెడ్డి కడప వెళ్లి అక్కడ సన్‌రైజ్‌ ఆసుపత్రిలోని ఇంటెన్సివ్‌ కేర్‌ యూనిట్‌లో 2019, మార్చి 13న చేరారు.

కానీ పరమేశ్వరరెడ్డి వైద్యులు, ఇతర సిబ్బందికి తెలియకుండా 2019, మార్చి 14 సాయంత్రం ఆసుపత్రి నుంచి బయటకువచ్చి హరిత హోటల్‌లో సాయంత్రం 6.30గంటలకు ఓసారి 7.05గంటలకు మరోసారి టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్‌ రవితో బేటీ అయ్యారు. శ్రీనివాసరెడ్డి అనే అతను కూడా ఈ భేటీలో పాల్గొన్నారు.  ఆ తరువాత కొద్ది రోజులకే శ్రీనివాసరెడ్డి అనుమానస్పదంగా మృతిచెందడం గమనార్హం. 

బీటెక్‌ రవి రాజకీయ ఆధిపత్యానికి వివేకానే అడ్డు
టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్‌ రవికి వివేకానందరెడ్డితో రాజకీయంగా విభేదాలు ఉన్నాయి. వివేకానందరెడ్డి ఉన్నంతకాలం తాను పులివెందుల నియోజకవర్గం, కడప జిల్లాలో రాజకీయంగా ఆధిపత్యం సాధించలేమని ఆయనకు తెలుసు. అందుకే వివేకానందరెడ్డిని అడ్డుతొలగించుకునేందుకు ఆయన హత్యకు సహకరించారు. 

తన ప్రత్యర్థిని వివేకా ప్రోత్సహిస్తున్నారని కక్షగట్టిన వైజీ రాజేశ్వరరెడ్డి
ఇక కడప జిల్లాకే చెందిన వైజీ రాజేశ్వరరెడ్డి వ్యాపారరిత్యా అనంతపురం జిల్లా తాడిపత్రిలో స్థిరపడ్డారు. అతను వైఎస్సార్‌సీపీలో క్రియాశీల కార్యకర్తగా ఉన్నారు. కాగా అతని రాజకీయ ప్రత్యర్థి నారాయణరెడ్డిని వైఎస్సార్‌సీపీలోకి తీసుకురావాలని వైఎస్‌ వివేకానందరెడ్డి భావించారు. దాంతో అతను వివేకానందరెడ్డిపై కక్ష పెంచుకున్నారు. వైఎస్‌ వివేకానందరెడ్డిపై అప్పటికే కక్ష పెంచుకున్న నర్రెడ్డి రాజశేఖరరెడ్డి, శివ ప్రకాశ్‌ రెడ్డి వైజీ రాజేశ్వరరెడ్డితో హైదరాబాద్‌లో కలిసి ఈ కుట్ర పన్నారు.

అప్పటికే ఆర్థిక వ్యవహారాల్లో వివేకానందరెడ్డితో తీవ్రంగా విభేదిస్తున్న కొమ్మా పరమేశ్వరరెడ్డిని వీరు తమ కుట్రతో భాగస్వామిని చేసుకున్నారు. మరోవైపు కొమ్మా పరమేశ్వరరెడ్డి టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్‌ రవితో టచ్‌తో ఉన్నారు. ఈ విధంగా వీరు అయిదుగురు వైఎస్‌వివేకానందరెడ్డి హత్యకు కుట్ర పన్నారు. ఆ కుట్ర అమలులో పులివెందులకు చెందిన నీరుగుట్టు ప్రసాద్‌ కూడా సహకరించారు. 

ఆ రోజు రాత్రి ఇంటి తలుపుతీసి ఉంచిన నీరుగట్టు ప్రసాద్‌
 హత్య జరిగిన రోజు అంటే 2019, మార్చి 14 రాత్రి వివేకానందరెడ్డి పులివెందులలోని తన ఇంటికి వస్తూ మార్గమధ్యంలో ఎర్రగంగిరెడ్డిని ఆయన ఇంటి వద్ద విడిచిపెట్టారు. వివేకానందరెడ్డి తన నివాసానికి చేరుకున్న తరువాత నీరుగుట్టు ప్రసాద్‌ ఆ ఇంటికి ఉత్తరవైపు తలుపుకు లోపల నుంచి గడియపెట్టి వెళ్లిపోతున్నట్టుగా చెబుతారు. కానీ వాస్తవానికి అతను ఉద్దేశ్యపూర్వకంగా తలుపు గడియపెట్టకుండానే వెళ్లిపోయారు. దాంతోనే హంతకులు ఆ రోజు వివేకానందరెడ్డి ఇంటిలోకి ప్రవేశించగలిగారు. 

- వివేకానందరెడ్డి హత్య జరిగిన 2019, మార్చి 14 అర్ధరాత్రి 12.42 నిముషాలకు కొమ్మా పరమేశ్వరరెడ్డి నీరుగుట్టు ప్రసాద్‌తో ఫోన్‌లో మాట్లాడారు. మళ్లీ అర్ధరాత్రి దాటిన తరువాత 2.37గంటలకు ఎర్ర గంగిరెడ్డితో ఫోన్లో మాట్లాడారు. ఆ విధంగా వరుసగా ఫోన్లు చేస్తూ తమ కుట్ర సక్రమంగా అమలవుతోందా లేదా అని పర్యవేక్షించారు. తెల్లవారుజామున 4.43గంటలకు నీరుగుట్టు ‍ ప్రసాద్‌ మరో నిందితుడు వైజీ రాజేశ్వరరెడ్డికి ఫోన్‌ చేశారు.

తెల్లవారు జాము 5.22గంటలకు  వైజీ రాజేశ్వరరెడ్డి అనంతపురం నుంచి పులివెందుల బయలుదేరారు. ఆ తరువాత అతను వివేకానందరెడ్డి ఇంటి చుట్టుపక్కలే తిరిగారు. ఆ తరువాత అతను నీరుగట్టు ప్రసాద్‌కు ఎస్‌ఎంఎస్‌ చేయడంతోపాటు ఉదయం 7.21గంటలకు ఫోన్‌ చేశారు. ఆ విధంగా వారిద్దరూ ఆ రాత్రి నుంచి తెల్లవారే వరకూ ఒకరితో ఒకరు మాట్లాడుతునే ఉన్నారు. ఆ తరువాత కూడా ఈ కేసులో సీబీఐ రెండో నిందితుడిగా చేర్చిన సునీల్‌ యాదవ్‌ సోదరుడు కిరణ్‌ యాదవ్‌, వైజీ రాజేశ్వరరెడ్డి పరస్పరం ఎస్‌ఎంఎస్‌ల ద్వారా చాటింగ్‌ చేసుకున్నారు.  

- వైఎస్‌ వివేకానందరెడ్డి హత్యకేసు దర్యాప్తు చేసిన సిట్‌ బృందాలు కీలక శాస్త్రీయ ఆధారాలు సేకరించాయి. సీసీ టీవీ ఫుటేజీలు, కాల్‌డేటా, ఇతర శాస్త్రీయ ఆధారాలన్నీ కూడా ఈ హత్య కేసుతో ఆ ఆరుగురి పాత్ర ఉందనే చెబుతున్నాయి. అందుకే ఈ హత్యలో తమ పాత్ర బయటపడుతుందనే ఆందోళనలతోనే నిందితులు ఆ కేసు దర్యాప్తును అడ్డుకున్నారు. కాబట్టి ఈ హత్య కేసుకు సంబంధించి సిట్‌ బృందాలు నమోదు చేసిన కేస్‌ డైరీలు రెండింటిని న్యాయస్థానం తెప్పించుకోవాలి. 

- సీబీఐ ఉద్దేశపూర్వకంగానే ఈ కేసు దర్యాప్తును తప్పుదారి పట్టిస్తోంది. హత్యలో స్వయంగా పాల్గొన్న దస్తగిరిని అప్రూవర్‌గా మార్చడం, అతని ముందస్తు బెయిల్‌ను వ్యతిరేకించకపోవడం సీబీఐ దురుద్దేశాలను వెల్లడిస్తున్నాయి. ఈ హత్య కేసులో అసలు నిందితులైన నర్రెడ్డి రాజశేఖరరెడ్డి, శివ ప్రకాశ్‌రెడ్డి, కొమ్మా పరమేశ్వరరెడ్డి, బీటెక్‌ రవి, వైజీ రాజేశ్వరరెడ్డి, నీరుగుట్టు ప్రసాద్‌లను విచారించకుండా... అమాయకులను ఈ కేసులో ఇరికించేందుకు యత్నిస్తోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement