నిరుద్యోగుల విషయంలో కాంగ్రెస్ వైఖరి డొల్ల: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: నిరుద్యోగులు, విద్యార్థి సంఘాల నేతలు, విద్యార్థులపై పోలీసుల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం అణచివేత చర్యలకు పాల్పడుతోందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శాంతియుతంగా నిరసన తెలిపే ప్రయత్నం చేసిన యువకులు, నిరుద్యోగులను అరెస్టు చేయడాన్ని కేటీఆర్ ఒక ప్రకటనలో తప్పుపట్టారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో నిరుద్యోగులతో రాహుల్‌గాంధీ ములాఖత్‌లు జరిపారని, కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచి్చన తర్వాత అణచివేసే ప్రయత్నం చేస్తోందన్నారు.
ఎన్నికలకు ముందు భావోద్వేగాలు రెచ్చగొట్టి, నిరుద్యోగులను కాంగ్రెస్ వాడుకుందని చెప్పారు. కానీ ప్రస్తుతం వారి న్యాయమైన డిమాండ్లపై ప్రభుత్వం నోరు మెదపడం లేదన్నారు. ప్రజాపాలన అంటూ పదేపదే చెబుతూ..నిరసన తెలిపే అవకాశం కూడా ఇవ్వకుండా నియంతృత్వంతో వ్యవహరిస్తుందని దుయ్యబట్టారు. కాంగ్రెస్ పార్టీ చెప్పిన జాబ్ కేలండర్ తేదీల గడువు ఇప్పటికే తీరిపోయిందని తెలిపారు. నిరుద్యోగులు చేపట్టే అన్ని నిరసన కార్యక్రమాలకు బీఆర్‌ఎస్ అండగా ఉంటుందని, అరెస్టు చేసిన వారిని బేషరతుగా విడుదల చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.
డిమాండ్లు పరిష్కరించేంతవరకు వదలం: హరీశ్‌రావు
నిరుద్యోగుల సమస్యల పరిష్కారంతోపాటు డిమాండ్లు సాధించే వరకు ప్రభుత్వాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదని మాజీమంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు స్పష్టం చేశారు. విద్యార్థులు, నిరుద్యోగుల తరఫున గొంతెత్తి నిరంతర పోరాటం చేస్తామన్నారు. టీజీపీఎస్సీ వద్ద నిరసన తెలిపేందుకు వెళ్లిన నిరుద్యోగులు, విద్యార్థి సంఘ నేతలను అరెస్టు చేయడాన్ని ఖండించారు. శాంతియుత నిరసన తెలిపేందుకు వెళ్లిన వారిని నిర్బంధించడం హేయమైన చర్యగా పేర్కొన్నారు. ప్రజాపాలనలో శాంతియుతంగా నిరసన తెలియజేసే హక్కు కూడా నిరుద్యోగులకు లేదా అని ప్రశ్నించారు. నిరుద్యోగులకు జరిగే అన్యాయంపై బీఆర్‌ఎస్ పార్టీ గొంతెత్తుతుందని హరీశ్‌రావు స్పష్టం చేశారు.
అరెస్టులపై బీఆర్‌ఎస్ ఖండన
ఏడు నెలలుగా నిరుద్యోగ సమస్యలను రేవంత్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మాజీమంత్రి ఎస్.నిరంజన్‌రెడ్డి, డాక్టర్ ఎర్రోళ్ల శ్రీనివాస్ వేర్వేరు ప్రకటనల్లో ఖండించారు. కాంగ్రెస్‌పాలనలో అప్రకటిత ఎమర్జన్సీ అమలవుతోందని నిరంజన్‌రెడ్డి అన్నారు. నిరుద్యోగుల సమస్యలను వినేందుకు ప్రభుత్వం తరపున ఎవరూ అందుబాటులో లేరని ఎర్రోళ్ల శ్రీనివాస్ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment