సంచలన విషయాలు బయట పెట్టిన కేసిఆర్
రేవంత్ సర్కారు మనుగడ కష్టమన్న కెసిఆర్
బీజేపీ కుప్పకూల్చుతుందని వ్యాఖ్యలు
వందకు పైగా సీట్లున్నప్పుడే మమ్మల్ని కూల్చే కుట్ర
ఇప్పుడెందుకు బీజేపీ ఆగుతుందన్న కెసిఆర్
కవిత అరెస్ట్‌పై తొలిసారి బహిరంగ స్పందన
మళ్లీ పాత కెసిఆర్‌ను చూడబోతున్నారని ప్రకటన
మేడిగడ్డ పిల్లర్లు కుంగడం ప్రకృతి వైపరీత్యమని వ్యాఖ్య
సాక్షి,హైదరాబాద్ : కేసిఆర్ సంచలన విషయాలు బయట పెట్టారు. హైదరాబాద్‌లో జరిగిన బీఆర్‌ఎస్ విస్తృత స్థాయి సమావేశంలో మాట్లాడిన కెసిఆర్.. పార్లమెంటు ఎన్నికల తర్వాత రేవంత్ సర్కారు మనుగడ కష్టమేనన్నారు. తన వాదనకు కొన్ని ఉదాహరణలను ముందుంచారు. ఈ పార్లమెంటు ఎన్నికల్లో BRSకు కనీసం ఎనిమిది సీట్లు వస్తాయన్నారు కెసిఆర్. 20 మంది ఎమ్మెల్యేలు తమతో టచ్‌లో ఉన్నారన్న సంకేతాలిచ్చారు. ఎన్నికల తర్వాత ఏమైనా జరగొచ్చన్న వ్యాఖ్యలు చేశారు కెసిఆర్.
ముందుంది ముసళ్ల పండగే
రేవంత్ సర్కారుకు ముందుంది ముసళ్ల పండగే అన్న సంకేతాలిచ్చారు కెసిఆర్. "BRS పార్టీ నుంచి కాంగ్రెస్ లోకి వెళ్ళిన వారు బాధపడుతున్నారు. ఓ కీలక సీనియర్ నేత నన్ను సంప్రదించారు. 104 మంది BRS ఎమ్మెల్యేలు ఉన్నప్పుడే BJP వాళ్ళు ప్రభుత్వానికి కూల్చడానికి కుట్రలు చేశారు, 64 మంది ఎమ్మెల్యేలు ఉన్న కాంగ్రెస్‌ను బిజెపి వాళ్లు బతకనిస్తారా?" అని ప్రశ్నించాడు. "రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్‌కు అధికారం వచ్చింది కదా అని BRSని వీడి కాంగ్రెస్‌లోకి వెళ్తే ఇక్కడ అంతా బిజెపి కథ నడుస్తుందని నాతో ఆ నాయకుడు వాపోయాడు" అని కెసిఆర్ చెప్పారు. "ఇప్పటికిప్పుడు 20 మంది ఎమ్మెల్యేలను తీసుకొని రావాలా సార్" అని నన్ను సంప్రదించాడు. కానీ ఇప్పుడే వద్దని నేనే వారించానని కేసీఆర్ చెప్పారు.
ఎంపీ సీట్లు ఎన్ని వస్తాయంటే?
ఇప్పుడున్న పరిస్థితులను సమీక్షిస్తే.. "ఇప్పటి వరకు 8 లోక్ సభ సీట్లలో గెలుస్తాం, మరో మూడింటిలోనూ విజయావకాశాలున్నాయి. బస్సుయాత్ర చేద్దాం. జనం నుంచి పార్టీ పట్ల మంచి స్పందన వస్తోంది. ఇప్పుడున్న రేవంత్ సర్కారుపై వీపరీతమైన వ్యతిరేకత వచ్చింది. దాన్ని బీఆర్‌ఎస్ తనకు అనుకూలంగా మలుచుకోవాలి. ఈ నెల 22 నుంచి రోడ్డు షోలు ప్రారంభిస్తాను. కీలకమైన "వరంగల్ , ఖమ్మం.. మహబూబ్ నగర్ సెంటర్లలో భారీ బహిరంగ సభలు నిర్వహిద్దాం" అని అన్నారు. "బీఆర్‌ఎస్ పార్టీకి ప్రజల్లో మంచి ఆదరణ ఉంది, పదేళ్ల నుంచి లేని కరువు ఈసారి కనిపిస్తోంది, కాంగ్రెస్ పాలన ఎలా ఉంటుందో తెలంగాణ ప్రజలకు తెలిసి వచ్చింది. కొంత మంది బీఆర్‌ఎస్ నాయకులు వెళ్లినంత మాత్రానా.. పార్టీకి వచ్చిన నష్టమేమీ లేదు. మనం ఎవరికి టికెట్ ఇచ్చినా గెలుస్తారు. వెళ్లిన వారి స్థానంలో అంతకంటే గట్టి నాయకులను తయారు చేసుకుందాం" అని పార్టీ శ్రేణుల్లో నైతిక స్థైర్యం పెంచే ప్రయత్నం చేశారు.
మన ఎలక్షన్ ప్లాన్ ఏంటంటే?
"ఒక్కో లోక్ సభ నియోజక వర్గం పరిధిలోని రెండు మూడు అసెంబ్లీ ఏరియాల్లో రోడ్డు షోలు నిర్వహించబోతున్నాం. రోజుకు రెండు మూడు రోడ్‌షోలుంటాయి. సాయంత్రం వేళల్లో రోడ్డు షోలు పెట్టబోతున్నాం. అలాగే కార్నర్ మీటింగ్ లు నిర్వహిస్తాం. ఉదయం పూట రైతుల వద్దకు వెళ్లనున్నట్టు" కెసిఆర్ సూచించారు. "బీఆర్‌ఎస్‌లో ప్రతీ నాయకుడు ఎన్నికల ప్రచారంలో రైతు సమస్యలపై స్పందించాలి. పోస్టు కార్డు ఉద్యమం చేయాలి, ఒక్కోపార్లమెంట్ పరిధిలో లక్ష కార్డులు పోస్ట్ కావాలి, రైతుల కల్లాల దగ్గరకు వెళ్లి అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన రూ.500 బోనస్ పై ప్రశ్నించాలి. రేవంత్ ఇచ్చిన హామీలపై గుర్తు చేయాలి" అని పిలుపునిచ్చారు.
కవిత అరెస్ట్‌పై ఏమన్నారంటే.?
తన కూతురు కవిత అరెస్ట్‌పై తొలిసారి బహిరంగంగా స్పందించారు కెసిఆర్. పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో మాట్లాడిన కెసిఆర్.. తన కూతురు కవితను రాజకీయ కుట్రలో భాగంగానే అరెస్ట్ చేశారని ధ్వజమెత్తారు. హైదరాబాద్‌లో తమ పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు ప్రయత్నించినందుకు బీజేపీ అగ్రనాయుకుడు బీఎల్ సంతోష్‌పై కేసు పెట్టినందుకే కవితపై కేసు పెట్టారన్నారు కెసిఆర్. త్వరలో మళ్లీ పాత కెసిఆర్‌ను చూడబోతున్నారని, ఉద్యమ కాలం నాటి నాయకుడిని చూస్తారని అన్నారు. అలాగే మేడిగడ్డ పిల్లర్లు కుంగడం పైనా స్పందించారు కెసిఆర్. పిల్లర్ల కింద ఉన్న ఇసుకంతా కుంగిపోవడం వల్ల పిల్లర్లు దెబ్బ తిన్నాయని, అంతే తప్ప నిర్మాణంలో లోపాలేవీ లేవన్నారు.
Comments
Please login to add a commentAdd a comment