‘ముంబై’ ఘాతుకానికి ఆరేళ్లు
అమరవీరులకు ప్రధాని నివాళి ముంబైలో 26/11 సంస్మరణ కార్యక్రమాలు
ముంబై/న్యూఢిల్లీ: ముంబైపై ఉగ్రవాదుల ఘాతుకానికి ఆరేళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా బుధవారం ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆ దాడుల్లో మృతి చెందిన వారికి శ్రద్ధాంజలి ఘటించారు. ‘ముంబై దాడుల ఘటన ఇంకా వెంటాడుతూనే ఉంది. ఆ బాధను భారతీయులు అనుభవిస్తూనే ఉన్నారు. ఆ రోజు ప్రజల ప్రాణాల రక్షణ కోసం తమ ప్రాణాలు కోల్పోయిన అమరవీరులకు దేశం సాల్యూట్ చేస్తోంది. వారే నిజమైన హీరోలు’ అని ఒక ప్రకటనలో నివాళులర్పించారు. ముంబై దాడులను గుర్తు చేస్తూ.. ఉగ్రవాద భూతాన్ని తుదముట్టించేం దుకు కలసికట్టుగా పోరాడాలని, అందుకు అంతా మరోసారి కంకణబద్ధులు కావాల్సిన సమయమిదని కఠ్మాండులో సార్క్ దేశాధినేతలకు భారత ప్రధాని పిలుపునిచ్చారు. కాగా, పాకిస్తాన్‌లో జరుగుతున్న 26/11 దాడుల విచారణ మందగతిన కొనసాగుతుండటంపై భారత ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది.
విచారణను వేగవంతం చేసి, సాధ్యమైనంత త్వరగా దోషులను శిక్షించాలని హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ డిమాండ్ చేశారు. ఉగ్రవాదులతో పోరులో వీర మరణం పొందిన వారికి ముంబైలో పలువురు పుష్పాంజలి ఘటించారు. రాష్ట్రపతి పర్యటన సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉన్నందున మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ ఈ కార్యక్రమాలకు హాజరు కాలేదు. కానీ, ముంబై దాడుల అమర వీరులకు నివాళులర్పిస్తూ ఒక ప్రకటన విడుదల చేశారు. మహారాష్ట్ర భద్రత, రాష్ట్ర ప్రజల రక్షణ కోసం మరింత కట్టుదిట్టమైన చర్యలు చేపడతామన్నారు. అలాగే, ఉగ్ర దాడులు జరిగిన తాజ్ హోటల్ తదితర ప్రాంతాల్లో సంస్మరణ కార్యక్రమాలు నిర్వహించారు.
ముంబై దాడుల మృతులకు బాలీవుడ్ నటులు అమితాబ్ బచ్చన్, అనుపమ్ ఖేర్, మాధుర్ భండార్కర్, ఫర్హాన్ అఖ్తర్, అర్జున్ కపూర్, నటి దియామీర్జా తదితరులు ట్వీటర్‌లో నివాళులర్పించారు. ముంబై దాడుల సంస్మరణ సందర్భంగా, మరోసారి ఇలాంటి దాడులు జరిగితే ఎదుర్కొనే సంసిద్ధతపై భద్రతాబలగాలు సమీక్ష జరిపాయి. తీర గస్తీదళాన్ని బలోపేతం చేయాలని, 2020 నాటికి 150 నౌకలను, 100 విమానాలను సమకూర్చుకోవాలని నిర్ణయిం చాయి. ఆరేళ్ల క్రితం సముద్ర మార్గంలో ముం బైలో ప్రవేశించిన 10 మంది లష్కరే తోయిబా ఉగ్రవాదులు ముంబైలోని పలు చోట్ల మారణాయుధాలతో విరుచుకుపడిన ఘటనలో విదేశీయులు, భద్రత సిబ్బంది సహా 166 మంది చనిపోయిన విషయం తెలిసిందే. ఏటీఎస్ అధినేత హేమంత్ కర్కరే, ఆర్మీ మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్, ముంబై అదనపు పోలీస్ కమిషనర్ అశోక్ ఖామ్తె, సీనియర్ పోలీస్ అధికారి విజయ్ సలాస్కర్ తదితరులు ఉగ్రవాదులతో పోరులో ప్రాణాలర్పించారు. భద్రతాబలగాల ప్రతిదాడుల్లో ఉగ్రవాదుల్లో 9 మంది చనిపోగా, అజ్మల్ కసబ్‌ను ప్రాణాలతో పట్టుకుని 2012లో ఉరితీశారు.