
వాషింగ్టన్: భారత్‌లో 2008నాటి ముంబై ఉగ్రదాడుల ఘటనలో దోషి అయిన పాకిస్తాన్ సంతతి కెనడా వ్యాపారి తహవుర్ రానాను అమెరికాలోని లాస్ ఎంజెల్స్‌లో పోలీసులు మళ్లీ అరెస్టు చేశారు. ఉగ్రదాడుల కేసు నిమిత్తం తమకు అప్పగించాలన్న భారత్ అభ్యర్థన మేరకు రానాను ఈనెల 10న అరెస్ట్‌చేశారు. 59 ఏళ్ళ రానాకు కరోనా సోకిన కారణంగా ఇటీవలే అమెరికా జైలు నుంచి విడుదలచేశారు.
రానాను తమకు అప్పగించాల్సిందిగా భారత్ తాజాగా కోరినట్టు అమెరికా అటార్నీ జాన్ లులేజియన్ కోర్టుకి వెల్లడించారు. 2006 నవంబర్ నుంచి 2008 నవంబర్ మధ్యకాలంలో రానా పాకిస్తాన్‌లోని తన చిన్ననాటి స్నేహితుడు డేవిడ్ కోల్మన్ హెడ్లీ(దావూద్ గిలానీ), మరికొందరితో కలిసి లష్కరే తోయిబా, హరాకత్ ఉల్–జిహాదీ–ఇ ఇస్లామీ ఉగ్ర సంస్థలకు ముంబై దాడుల్లో సహకరించారని అమెరికా ఫెడరల్ ప్రాసిక్యూటర్స్ వెల్లడించారు.