వాషింగ్టన్: 2008 ముంబై ఉగ్రదాడుల కేసులో నిందితుడు, పాక్ సంతతి కెనడా వ్యాపారవేత్త తహవుర్ రానాకు.. బెయిల్ ఇచ్చేందుకు అమెరికా కోర్టు నిరాకరించింది. ఈ కేసులో తనకు బెయిల్ మంజూరు చేయాల్సిందిగా రానా 1.5 మిలియన్ డాలర్ల బెయిల్ అప్లికేషన్ పెట్టుకున్నాడు. 2008 ముంబై కేసులో అతని కోసం భారత్ ఎదురుచూస్తున్నది. ఈ క్రమంలో అతడికి బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించిన అమెరికా కోర్టు.. రానాను ఫ్లయిట్ రిస్క్‌గా భావించింది. డేవిడ్ కోల్మన్ హెడ్లీ చిన్ననాటి స్నేహితుడైన రానాను జూన్ 10న లాస్ ఏంజిల్స్‌లో అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. 2008 ముంబై ఉగ్రవాద దాడిలో రానాకు ప్రమేయం ఉన్నందున అతడికి అప్పగించాలంటూ భారతదేశం కోరింది. 2008నాటి ఘటనలో ఆరుగురు అమెరికన్లతో సహా 166 మంది మరణించారు. (ముంబై దాడుల దోషి రానా మళ్లీ అరెస్ట్)
లాస్ ఏంజిల్స్ జిల్లా కోర్టు జడ్జి జాక్వెలిన్ చూల్జియన్.. ఈ కేసుకు సంబంధించి ఈ నెల 21న 24 పేజీల తీర్పునిచ్చారు. పారిపోయే అవకాశం ఉన్నందున రానాకు బెయిల్ ఇవ్వడం లేదని పేర్కొన్నారు. ఒకవేళ అతన్ని కెనడా వెళ్లేందుకు అనుమతిస్తే.. అప్పుడు రానా భారత్‌లో శిక్షను తప్పించుకుంటాడని కోర్టు అభిప్రాయపడింది. భారీ మొత్తంపై బెయిల్ ఇచ్చినా.. కోర్టుకు తీసుకువచ్చే గ్యారెంటీ ఉండదని కోర్టు తెలిపింది. అతడి కోసం భారతదేశంలో ఉరి శిక్ష ఎదురు చూస్తుందని.. ఇప్పుడు రానాకు బెయిల్ మంజూరు చేస్తే.. అతడు పారిపోయే ప్రమాదం ఉందని కోర్టు అభిప్రాయపడింది. అంతేకాక రానాకు బెయిల్ మంజూరు చేయడం వల్ల అమెరికా-భారత్ సంబంధాలు దెబ్బతింటాయని అసిస్టెంట్ యుఎస్ అటార్నీ జాన్ జె లులేజియన్ కోర్టుకు తెలిపారు. అయితే రానా వల్ల ఎటువంటి రిస్క్ లేదని, ఆయనపై 1.5 మిలియన్ల డాలర్ల పూచీకత్తు పెడుతున్నామని కోర్టులో అతని తరఫున న్యాయవాది వాదించారు. ('ఆ ఘటన మరిచిపోలేనిది, క్షమించరానిది')
రానాపై భారత్‌లో హత్య అభియోగం కింద కేసులు ఉన్నాయి. లష్కరే తోయిబాకు ఆర్థిక సహాకారం అందిస్తున్న కేసులో.. 2011లో షికాగో పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. వాస్తవానికి అమెరికాలో రానాకు 14 ఏళ్ల జైలు శిక్ష పడింది. ఇప్పుడు అతన్ని భారత్‌కు అప్పగించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. డేవిడ్ కోల్మన్ హెడ్లీ సహకారంతో రానా అమెరికాలో ఉగ్రవాదులకు సాయం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. అయితే ముంబై పేలుళ్ల కేసులో హెడ్లీ కూడా దోషిగా ఉన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment