అటల్‌ జీ అంత్యక్రియలకు టెర్రరిస్టు సోదరుడు!! | David Headley Half-Brother Danyal Gilani Comments On His Presence In Vajpayee Funeral | Sakshi
Sakshi News home page

అటల్‌ జీ అంత్యక్రియలకు టెర్రరిస్టు సోదరుడు!!

Published Mon, Aug 20 2018 1:07 PM | Last Updated on Mon, Aug 20 2018 1:21 PM

David Headley Half-Brother Danyal Gilani Comments On His Presence In Vajpayee Funeral - Sakshi

పాక్‌ అధికారి దన్యాల్‌ గిలాని (ఫేస్‌బుక్‌ ఫొటో)

సాక్షి, న్యూఢిల్లీ : దివంగత మాజీ ప్రధాని అటల్‌ బిహారి వాజ్‌పేయికి కడసారి నివాళులు అర్పించేందుకు భారత్‌కు వచ్చిన పాక్‌ ప్రముఖుల్లో ఉగ్రవాది సోదరుడు కూడా ఉండటంతో సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అటువంటి వ్యక్తులను అటల్‌ జీ అంత్యక్రియలకు ఎలా అనుమతిస్తారంటూ విదేశాంగ శాఖ అధికారులపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలేం జరిగిందంటే... స్మృతి స్థల్‌లో శుక్రవారం జరిగిన వాజ్‌పేయి అంత్యక్రియలకు పాకిస్తాన్‌కు చెందిన ఐదుగురు ప్రతినిధుల బృందం ఢిల్లీకి వచ్చింది. వీరిలో పాకిస్తాన్‌ న్యాయ, సమాచార శాఖ మాజీ మంత్రి సయ్యద్‌ అలీ జాఫర్‌తో పాటుగా, ఆయన డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్న దన్యాల్‌ గిలాని కూడా ఉన్నారు.

కాగా గిలానికి... 26/11 ముంబై ఉగ్రదాడి సూత్రధారి, పాకిస్తానీ అమెరికన్‌ డేవిడ్‌ హెడ్లీ సవతి సోదరుడు కావడంతో, ఆయనపై రాకపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై స్పందించిన భారత విదేశాంగ శాఖ అధికారి ఒకరు మాట్లాడుతూ....విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్‌తో ఏర్పాటు చేసిన సమావేశానికి  హాజరయ్యేందుకు గిలాని భారత్‌కు వచ్చారు. ఆ సమయంలో ఆమె వాజ్‌పేయి అంత్యక్రియల్లో పాల్గొన్నారు. దాంతో గిలాని కూడా అక్కడకు వచ్చారు. ప్రభుత్వాధికారిగా ఉన్న ఆయనను అనుమతించకుండా ఉండేందుకు ఎటువంటి కారణాలు కన్పించలేదు. ఆయన బ్లాక్‌లిస్టులో కూడా లేరు. అందుకే నిబంధనల ప్రకారమే గిలానికి వీసా జారీ చేశామని’ వివరణ ఇచ్చారు.

నేను నా దేశం కోసం పనిచేస్తున్నా..
తన గురించి వస్తున్న విమర్శలకు స్పందించిన గిలాని.. ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ... ‘ఓ ప్రభుత్వాధికారిగా దేశానికి (పాకిస్తాన్‌) సేవ చేయడం నా బాధ్యత. డేవిడ్‌ హెడ్లీ కుటుంబంతో నాకు ఎటువంటి సంబంధాలు లేవు. అయినా ఎవరైనా ఒక వ్యక్తితో బంధుత్వం ఉండటం పాపమేమీ కాదు కదా’  అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. కాగా పాకిస్తాన్‌ సెంట్రల్‌ ఫిల్మ్‌ సెన్సార్‌ బోర్డు చైర్మన్‌గా, పాక్‌ మాజీ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ పత్రికా కార్యదర్శిగా..  ఇలా వివిధ హోదాల్లో గిలాని తన సేవలందించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement